Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
5. సోమ విశిష్టుడగు ఇంద్రుడు అమిత మహిమలు కలవాడు. అతడు తన మహిమశక్తి వలన ద్యావాపృథ్వులను పూరించినాడు. ఇంద్రుడు సమస్త భువనములను సృష్టించినాడు. ఇంద్రుని మహిమ సమస్త భువనములను మించినది.
6. మానవులకు హితకరమగు వృష్ట్యాది కార్యములను ఇంద్రుడు ఎరుంగును. అభిలాషకారులు, మిత్రభూతులగు మరుత్తుల కొఱకు జలవర్షము కురిపించినాడు.
మరుత్తులు వచనరూప ధ్వనితో పర్వతములను విదీర్ణము చేసినారు. ఆ మరుత్తులు ఇంద్రుని కొఱకు గోపూర్ణ గోశాలను ఆచ్చాదితము చేసినారు.
7. ఇంద్రా ! నీ వజ్రము లోకపాలకము. అది 'జలావరక' మేఘమును ప్రేరేపించినది. చేతనావతి భూమి నీతో సహవాసము చేసినది. వర్షము కలిగించు ఇంద్రా ! నీవు స్వబలమున లోకపాలకుడవు అయినావు.
ఇంద్రా ! సముద్ర సంబంధ జలమును, ఆకాశమున ఉన్న జలమును ప్రేరేపించుము.
8. ఇంద్రా ! నీవు బహుజన ఆహూతుడవు. నీవు వర్షము కలిగించుటకు మబ్బులను కొట్టినావు. అప్పుడు దేవతల కుక్క 'సరమ' పణులు దొంగిలించి దాచిన గోవులను కనబరచినది. అంగిరులు నిన్ను స్తుతింతురు. నీవు మాకు విశేష అన్నము అందింతువు. మమ్ము ఆదరింతువు.
9. ఇంద్రా ! నీవు ధనవంతుడవు. మానవులు నిన్ను ఆదరింతురు. ధనము ప్రసాదించుటకు నీవు కుత్సునివద్దకు వెళ్లినావు. అతడు నిన్ను యాచించినాడు. నీవు అతనికి ఆశ్రయదానము చేసినావు. శత్రువుల ఉపద్రవములనుండి అతనిని రక్షించినావు. కపట ఋత్విక్కుల కార్యములను ఎరిగినావు. కుత్సుని ధనలోభ శత్రువులను నష్టపరచినావు.
(బ్రాహ్మణ రూపమున ఉన్న కపట దస్యులగు ఋత్విక్కులు- కపట ఋత్విక్కులు. "ఆ బ్రహ్మాదస్యుః" అని వేదము)
10. ఇంద్రా ! నీవు మనసున శత్రువును వధించ సంకల్పించినావు. కుత్సుని గృహమునకు చేరినావు. కుత్సుడు సహితము నీతో మైత్రి చేయుటకు ఎంతో ఉత్సాహము కనపరచినాడు. అప్పుడు మీరిద్దరు ఒకేస్థానమునకు చేరినారు. నీ సత్యదర్శిని భార్య 'శచి' మీ ఇద్దరిని ఒకే రూపమున చూచి సంశయించినది.
ఇంద్రుడు, కుత్సుడు ఒకే రూపము వారని ఇచట చెప్పినాడు. దీనికి సంబంధించిన వృత్తాంతము శాయణుడు వివరించలేదు. "an absurd story" అని ఒక ఆంగ్ల వ్యాఖ్యాత. ఒకే రూపము వారు ఇద్దరు ఉండుట అసంభవముకాదు. ఇంద్రుడు ఆకారణముననే కుత్సునితో స్నేహము చేసినను చేసి ఉండవచ్చును.
11. కుత్సుడు ప్రాజ్ఞుడు. సాధించవలసిన అన్నము కొఱకువలె సాగినాడు. అశ్వద్వయమును రధమున పూన్చినాడు. ఉపద్రవమును ఎదిరించుటకు సన్నద్ధుడు అయినాడు. అదిగో ఆరోజే నీవు కుత్సుని రక్షించదలచినావు. కుత్సునివెంట అతని రథముమీద సాగినావు.
ఇంద్రా ! నీవు శత్రునాశకుడవు. వాయువువంటి అశ్వములకు అధిపతివి.
12. ఇంద్రా ! నీవు కుత్సుని కొఱకు సుఖరహితుడగు 'శిష్టు'ని వధించినావు. అనేక పరిజనులతోకూడి అప్పుడే శత్రువులను దునుమాడినావు. సంగ్రామమున నీవు సూర్యుని చక్రమును ముక్కలు చేసినావు.
13. ఇంద్రా ! నీవు 'పిప్రు' 'మృగయ' నామక అసురులను కడ తేర్చినావు. 'విధీథ' పుత్రుడు ఋజాశ్వుని పట్టి బంధించినావు. ఏబదివేల కృష్ణవర్ణ రాక్షసులను హతమార్చినావు. వార్థక్యము రూపమును చెరచినట్లు శంబరుని నగరములను ధ్వంసము చేసినావు.
14. ఇంద్రా ! నీవు మరణ రహితుడవు. నీవు సూర్యుని వద్ద నిలిచినపుడు ప్రకాశవంతుడవు అగుదువు. సూర్యునిముందు అందరి రూపములు ఒకే తీరు అగును. కాని ఇంద్రుడు మరింత ప్రకాశవంతుడు అగును.
ఇంద్రా ! నీవు మెకమువలె శత్రువును కూల్చెదవు. ఆయుధముదాల్చి సింహమువలె భయంకరుడవగుదువు.
15. రాక్షసుల వలన కలిగిన భయనివారణకుగాను ఇంద్రుని ఉపాసించువారు ఉందురు. ధనమును కోరిన ఇంద్రుని ఉపాసించువారు ఉందురు. అట్టివారు యుద్ధసదృశ యజ్ఞమున ఇంద్రుని అన్నము యాచింతురు. ఉక్థలతో స్తుతింతురు. ఇంద్రుని వద్దకు చేరుదురు. ఆ సమయమున ఇంద్రుడు స్తోతలకు నివాస స్థానమువంటి వాడగుమ. రమణీయము, దర్శనీయమగు లక్ష్మీ రూపమున ఉండును.
16. ఇంద్రుడు మానవులకు హితకరములగు అనేక ప్రసిద్ధకార్యములు చేసినాడు. అతడు ధన విశిష్టుడు. అతడు మావంటి స్తోతలకు సాధించదగిన అన్నమును సులభముగా అందించును.
యజమానులారా ! మేము స్తోతలము. ఆ ఇంద్రుని మీ కొఱకు ఆహ్వానించుచున్నాము.
17. మేము మానవులము. ఏ యుద్ధమునందయినను మా మధ్య భయంకర పిడుగు పడవచ్చును. శత్రువులతో మాకు ఘోర యుద్ధము జరుగవచ్చును. ఇంద్రా ! నీవు శూరుడవు. అట్టితరి మా దేహములను రక్షింపుము.
18. ఇంద్రా ! నీవు వామదేవుని యజ్ఞకార్యమును రక్షింపుము. నీవు హింసారహితుడవు. యుద్ధమున మాకు సఖుడవు అగుము. నీవు మతిమంతుడవు. మేము నీదరికి చేరుదుము. నీవు సర్వదా స్తోత్రకారులను ప్రశంసించుము.
19. ఇంద్రా ! నీవు ధనికుడవు. శత్రువులను జయించుటకుగాను, మేము అన్ని యుద్ధములందు నిన్నే కోరుదుము. అభిలషింతుము. ధనికుడు ధనమున దీప్తివంతుడగును. హవ్యయుక్తులమయి, పుత్ర పౌత్రాది పరిజన సహితులమయి మేమును అట్లే దీప్తివంతులము అగుదుము. శత్రువులను పరాభవింతుము. రాత్రులందును సంపూర్ణ సంవత్సరమున నిన్ను స్తుతింతుము.
20. ఇంద్రునితో మా సఖ్యత చెడరాదు. తేజస్వి, శరీరపాలక ఇంద్రుడు మమ్ము రక్షించవలెను. ఇంద్రునకు మేము అందుకు తగిన పరిచర్యలు చేసెదము. నిపుణుడగు రథనిర్మాత రమణీయమగు రథమును నిర్మించును. అట్లే అభీష్టవర్షి, నిత్యయవ్వన ఇంద్రునకు స్తోత్రములు రచింతుము.
21. ఇంద్రా ! నిన్ను పూర్వ ఋషులు స్తుతించినారు. మేమును స్తుతించుచున్నాము. మా స్తుతులకు ప్రసన్నుడవగుము. జలములు నదిని పూరించినట్లు స్తోతల అన్నమును అభివృద్ధిపరచుము. హరివిశిష్ట ఇంద్రా ! మేము అభినవ స్తుతులు రచించెదము. అందువలన మేము రథవంతులమయి సర్వదా నీసేవ చేయగలము.
పదిహేడవ సూక్తము
ఋషి-వామదేవుడు, దేవత-ఇంద్రుడు ఛందస్సు - 15 విరాట్ - మిగిలినవి త్రిష్టుప్.
1. ఇంద్రా ! నీవు గొప్పవాడవు. మహత్వయుక్తమగు పృథ్వి నీ బలమును ఆమోదించినది. ద్యులోకము నీ బలమును ఆమోదించినది. లోకములను ఆవృతము చేసిన వృత్రుని నీ బలమున సంహరించినావు. వృత్రుడు గ్రస్తము చేసిన నదులను నీవు విముక్తము చేసినావు.
2. ఇంద్రా ! నీవు ద్యుతిమంతుడవు. నీవు పుట్టగనే నీ కోపభయమున ద్యులోకము కంపితమయినది. భూమి గడగడలాడినది. అభ్యుదయమునకుగాను బృహత్ మేఘ సమూహము నీకు కట్టువడినది. ఈ మేఘములు ప్రాణుల దాహము తీర్చినవి. మరు భూములందు జలములు కలిగించినవి.
3. ఇంద్రుడు శత్రుపరాభవ కర్త. అతడు తన తేజో ప్రకాశమునకు బలమైన వజ్రము విసరియు పర్వతములను విదీర్ణము చేసినాడు. సోమపానమున హృష్టుడయిన ఇంద్రుడు వృత్రుని వధించినాడు. వృత్రుడుపోగా జలము అనావృతమయినది. వేగమున ప్రవహించినది.
4. ఇంద్రా ! నీవు అత్యంత స్తుతియోగ్యుడవు. వజ్ర విశిష్టుడవు. స్వర్గమందు వినాశరహితుడవు. మహిమాన్వితుడవు. మిమ్ము సృష్టించిన ద్యుతిమంత ప్రజాపతులు తమను సుందర పుత్రవంతులుగా భావించినారు. ఇంద్రుని సృష్టించిన ప్రజాపతి కార్యము అత్యంత శోభనీయము.
5. ఇంద్రుడు సంపూర్ణ ప్రజకు ప్రభువు. బహుజన ఆహూతుడు. దేవతలలో ఏకమాత్ర ప్రధాని శత్రుభయ వినాశకుడు. ద్యుతిమంతుడు. ధనవంతుడు. బంధువు. సమస్త యజమానులు వాస్తవముగా ఇంద్రుని స్తుతింతురు.
6. సోమము సాంతము నిజముగా ఇంద్రునకు చెందినది. మదకారకముగా సోమము నిజముగా ఇంద్రునకు హర్షకారకమగును.
ఇంద్రా ! నీవు ధనపతివి. పశుపతివి. ధనముకొఱకుగాను నిజముగా నీవు సమస్త ప్రజలను ధరింతువు.
7. ఇంద్రా ! నీవు ధనవంతుడవు. నీవు ముందే జన్మించినావు. వృత్రునివల్ల భయభీతులయిన ప్రజలను భరించినావు. ఉదకవంతమగు దేశము కొఱకుగాను ఉదక నిరోధక వృత్రుని తొలగించినావు.
8. ఇంద్రుడు అనేక శత్రుహంతకుడు. అత్యంత దుర్ధర్ష శత్రు నివారకుడు. నాశరహితుడు. అభీష్టవర్షి. శోభన వజ్ర విశిష్టుడు. అట్టి ఇంద్రుని మేము స్తుతింతుము.
వృత్రహంత ఇంద్రుని, అన్నదాత ఇంద్రుని, శుభప్రద ధనయుక్త ఇంద్రుని, ధనదాత ఇంద్రుని మేము స్తుతింతుము.
9. ఇంద్రుడు ధనవంతుడు. యుద్ధమున అద్వితీయుడు. అట్లని వాడుక. అతడు సంఘటిత, విశాల శత్రుసేనను నష్టపరచును. అతడు యజమానికి ఇచ్చిన అన్నమునే తాను స్వీకరించును. ఇంద్రునితో మా మైత్రి ప్రియము కావలెను. "ప్రియాసః సఖ్యేస్యామ"
10. ఇంద్రుడు శత్రుహింసకుడు. శత్రుంజయుడు. అందుకు అతడు సర్వత్ర ప్రఖ్యాతుడు. అతడు శత్రువులనుండి పశువులను గుంజి తెచ్చును. ఇంద్రుడు నిజముగా కోపించినపుడు స్థావర జంగమాత్మకమగు సమస్త లోకములు గడగడలాడును.
11. ధనవంతుడగు ఇంద్రుడు అసురులను జయించినాడు. శత్రువుల రమణీయ ధనమును జయించినాడు. అశ్వ సమూహములను జయించినాడు. అనేక శత్రు సేనలను జయించినాడు. ఇంద్రుడు సర్వసమర్థుడు. నేతృశ్రేష్ఠుడు. స్తోతలు స్తుతించువాడు పశవుల విభాజకుడు. ధనములను ధరించువాడు.
12. ఇంద్రుడు తన తల్లినుండి ఎంత బలము పొందినాడు? తండ్రినుండి ఎంత బలము పొందినాడు? ఇంద్రుడు తన తండ్రి ప్రజాపతి దగ్గర ఉండి దృశ్యమానమయిన సమస్త జగమును సృష్టించినాడు. ఆ ప్రజాపతి దగ్గర ఉండియే మరల మరల జగములకు బలము సమకూర్చినాడు. ఇంద్రుడు గర్జనశీల మేఘ ప్రేరితవాయువువలె ఆహుతుడు అగును.
13. ఇంద్రుడు ధనవంతుడు. అతడు ఒక్కొక్క ధనశూన్యుని ధనవంతుని చేయును. అంతరిక్షము వజ్రయుక్తము. ఇంద్రుడును అట్టివాడగును. అతడు ఘనీభూత పాపములను పారద్రోలును. స్తోతలకు ధనము ప్రదానము చేయును.
14. ఇంద్రుడు సూర్యుని ఆయుధమును ప్రేరేపించినాడు. యుద్ధమునకు సాగు "ఏతశు"ని నివారించినాడు. తేజమునకు మూలభూతము, జలస్థాన స్వరూపము అంతరిక్షము. అక్కడ ఉన్న ఇంద్రుని కుటిలగతిగల కృష్ణవర్ణ మేఘము అభిషిక్తుని చేసినది.
15. ఎట్లనగా యజమాని రాత్రులందు సోమము ద్వారా అగ్నిని అభిషేకించినట్లు.
(స్వశ్వుడనువాడు పుత్రార్థియై సూర్యుని ఉపాసించినాడు. సూర్యుడు తన రూపముగల పుత్రుని ప్రసాదించినాడు. అతడు ఏతశుడు, అను ఋషితో యుద్ధము చేసినాడు. ఏతశుడు ఇంద్రుని ప్రార్థించినాడు. సూర్యసంబంధమున ఇంద్రుడు యుద్ధము నివారించినాడు.)
(15వ మంత్రము ఏకపదవిరాజితము. ఇది పూర్వమంత్రము అనుబంధమగును)
16. మేము మేధావులమగు స్తోతలము. గోవులను కోరుచున్నాము. అశ్వములను కోరుచున్నాము. అన్నములను కోరుచున్నాము. స్త్రీని కోరుచున్నాము. మేము ఇంద్రునితో సఖ్యత కొఱకు కోరికలు తీర్చువాడు, భార్యాప్రదుడు, సర్వదారక్షకుడగు ఇంద్రునిముందు బావినుండి నీరు తోడుటకు వంగినట్లు అవనతులము అగుదుము.
17. ఇంద్రా ! నీవు ఆప్తుడవు. సకలజన సంరక్షకుడవు. మాకు రక్షకుడవగుము. నీవు సోమయోగ్య యజమానుల కోర్కెలు తీర్చెదవు. సుఖములను ఇచ్చెదవు. నీది ప్రజాపతులతో సమానఖ్యాతి. నీవు పాలకుడవు. పాలకులందు శ్రేష్ఠుడవు. నీవు పితరుల స్రష్టవు. స్వర్గాభిలాషులగు స్తోతలకు అన్నప్రదుడవు అగుము.
18. ఇంద్రా ! మేము నీ మైత్రిని అభిలషించుచున్నాము. నీవు మాకు రక్షకుడవగుము. నీవు స్తుతియోగ్యుడవు. మాకు మిత్రుడవగుము. నీ స్తోతలకు అన్నము అనుగ్రహించుము.
19. ఇంద్రా ! మేము బాధల మధ్యన ఉన్నను స్తుతి రూపమున నిన్ను పూజింతుము. నిన్ను ఆహ్వానింతుము.
ఇంద్రుడు మా స్తుతులను అందుకున్నపుడు వంటరిగనే అనేక శత్రు సేనలను పరిమార్చును. ఇంద్రుని శరణునందున్న స్తోతమ దేవతలుగాని మానవులుగాని ఎదిరించజాలరు. ఆ ఇంద్రునకు స్తోత ప్రియుడగును.





