Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
తరవాత నవాబు చబ్బన్ గారి జాడ తెలియదు. అది జరిగిన నాలుగైదు రోజుల తరవాత నవాబు ఉంగరం బజారులో ఎవరో అమ్ముతుంటే పట్టుబడింది. అమ్మేవాణ్ణి అలీ రజాబేగ్ కోత్వాల్ ( పోలీసు అధికారి) దగ్గరికి తీసికేళ్ళారు. అతడు ఇమామ్ బక్ష్ సాఖీ కొడుకు అమ్మవలసిందని తనకు ఇచ్ఛాడన్నాడు. అతణ్ణి పిలిపిస్తే దొరకలేదు. ఇమామ్ బక్ష్ సాఖీని పట్టి తెప్పించారు. ముందు తనకేమీ తెలియదని బొంకాడు. కొత్వాల్ అదిరించి బెదిరించిం తరవాత ఒప్పుకున్నాడు.
ఇమామ్ బక్ష్ : హుజూర్! ఏటీ ఇనుప వంతెన దగ్గర హుక్కా అమ్ముతాను. ఏటికి ఈతకు వచ్చేవాళ్ళు బట్టలు నా దగ్గర పెట్టి నదిలో దూకుతారు. అయిదు రోజుల క్రితం సంగతి, ఒక గోప్పవంశం వారి బిడ్డ వచ్చాడు. వయసు ఇరవై రెండేళ్ళు ఉంటుంది. ఎర్రగా అందంగా ఉంటాడు. సాయంకాలం వచ్చి బట్టలు నా దగ్గర ఉంచీ లుంగీ తీసుకొని నదిలో దూకాడు. కొంతసేపు ఈదినట్లు కనిపించాడు. తరవాత కంటికి కనిపించలేదు. ఈతకు వచ్చిన వాళ్ళంతా నది నుండి బయటికి వచ్చి బట్టలు కట్టుకొని వెళ్ళిపోయారు. ఆ దొర రాలేదు. ఈదుతూ ఎటో వెళ్ళి పోయి ఉంటాడని అతని కోసం చూస్తూ కూర్చున్నాను. జాము రాత్రి వరకూ అక్కడే ఉన్నాను. మునిగి పోయి ఉంటాడని నిశ్చయించుకున్నాను. ఈ విషయం తెలియజేస్తే జగడాల్లో ఇరుక్కుంటాను అనుకోని మెదలకుండా బట్టలు తీసుకొని ఇంటికి వచ్చేశాను. జేబులో ఈ ఉంగరం కనిపించింది. ఇంకో ఉంగరం కూడా ఉంది. దాని మీద ఏదో వ్రాసి ఉంది. భయంతో దాన్ని ఎవరికీ చూపలేదు. ఈ ఉంగరాన్ని కూడా అమ్మేవాణ్ణి కాదు. నా కొడుకు దుడుకుతనం ఎత్తుకొచ్చాడు.
మిర్జా రాజా అలీబేగ్ కొత్వాలీ (పోలీసు స్టేషను లాంటిది) నుండి ఇద్దరు జవానులను వెంట పంపి మరొక ఉంగరమూ , బట్టలు తెప్పించాడు. అది ముద్ర ఉంగరం. మిర్జారజా అలీబేగ్ పెద్ద నవాబుకు ఈ వార్త పంపి బట్టలు, ఉంగరాలు పంపించాడు. ఇమామ్ బక్ష్ ను శిక్షించాడు.
బిస్మిల్లా : హా! హా! చబ్బన్ మునిగిపోయారు! ఈ హత్య అమ్మజాన్ చేతుల ,మీదుగా జరిగిపోయింది !!
నేను : ఆ రోజే పసికట్టాను. నచ్చ చెపుదామని లేచాను. అంతలోనే మెట్లు దిగిపోయారు.
బిస్మిల్లా : చావు నెత్తి మీదికి వచ్చింది. పెద్ద నవాబు ఆస్తి నుంచి తొలగించుకపొతే చచ్చేవాడు కాడు.
నేను : ఆ తల్లి స్థితి ఎలా ఉందో భగవంతునికే తెలియాలి.
బిస్మిల్లా : పాపం పిచ్చిదై పోయిందట.
నేను : కాక ఏమౌతుంది ? ఒక్కడే కొడుకు. మొదలే విధవ. పైగా ఇది నెత్తిన పడింది. ఇక ఆ ఇంట్లో దీపం వెలగదు!
రుస్వా : అయితే నవాబు చబ్బన్ ను ముంచి చంపారు. సరే, ఒక విషయం అడగనా?
నేను: అడగండి.
రుస్వా : నవాబుగారికి ఈత వచ్చా?
నేను : ఏమో, తెలియదు, అయినా ఎందుకు ఆ విషయం ?
రుస్వా : ఏం లేదు. ఈత వచ్చినవాడు తనంత తాను మునగలేదు.
9
నా వలపులోతు లేరుగుట వానివంతు కాదు,
అబలను బాధించి తృప్తి చెందు టతని పని!
రుస్వాగారూ ! మీరు ఎవరినైనా ప్రేమించారా?
రుస్వా : జీ నహీఁ అల్లా క్షమించుగాక! తాము వందలమందిని వలపించి ఉంటారు. ఆ విషయాలు చెప్పండి. అవి వినాలనే మా ఆతృత కాని మీరు చెప్పరు.
ఉమ్రావ్ : మాది వేశ్య వృత్తి . మాకది ఉగ్గుతో పెట్టిన విద్య. ఎవరిని వలలో వేయాలనుకుంటే వాడి మీద పడి చస్తాం. చావడంలో మాకన్న నిపుణులు ఉండరు. నిట్టూర్పులు వదలడం మాటమాటకు ఏడవడం, రెండు రోజులు తిండి మానేయడం , కాళ్ళు నూతిలో వేసి కూర్చోవడం, విషం లాంటివి తినడం -- ఇవి మా విద్యలు. ఎంత రాతి గుండెవాడైనా మా ఉచ్చులో పడాల్సిందే , కాని మీతో సత్యం చెపుతున్నాను -- నేను వలచటం గాని, వలపించటం గాని చేయలేదు. ఈ విషయంలో మహారాజ్ఞి బిస్మిల్లా జాన్. మామూలు మనుషుల సంగతి సరే గాని మహామహులు సైతం ఆమె వలపు వల నుండి తప్పించుకో లేకపోయేవారు. ఆమెకు ప్రేమికులు వేలమంది. ఆమె వేలమందికి ప్రియురాలు. అసలు ప్రియుల్లో ఒక మౌల్వీగారు ఉండేవారు. మాములు పండితుడు కారు. గొప్ప గొప్ప అరబ్బీ గ్రంధాలు అవగాహన చేసుకున్నవారు. వారి దగ్గరికి దూరదూరాలనుంచి చదువుకోవడానికి వచ్చేవారు. జ్ఞానవిషయాలలో వారిని మించినవారు లేరు. అప్పటికి వారికి దేబ్బాయికి తక్కువ ఉండవు. తేజో వంతమైన వదనము, తెల్లని గడ్డము, నున్నని తల, తలగుడ్డ, జోగులు జుబ్బా , బెత్తము . వారిని చూస్తె ఒక సొగసులాడి మొగసాలలో అలా పడి ఉంటారని అనుకోవడానికి వీలుండదు.
ఒకనాటి సంగతి విన్నవిస్తాను. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఉన్నదున్నట్లు చెపుతున్నాను. మీ మిత్రులు కీర్తి శేషులు మీర్ గారు కూడా అక్కడే ఉన్నారు. వారికీ దిల్ రుబాజాన్ తో సంబంధం ఉండేది. స్వయంగా కవి, మంచి కవిత అంటే ప్రాణాలిచ్చేవారు. ఆ సందర్భంలోనే అందాన్ని ఆరాధించే ఆసక్తి కలిగింది. నగరంలో పేరుగల వేశ్యల్లో వారు దూరని వేశ్య ఇల్లు లేదు.
రుస్వా : అవును. బాగా తెలుసు , చెప్పండి.
ఉమ్రావ్ : మీకు గుర్తుండవచ్చు. బిస్మిల్లా తల్లితో పోట్లాడి కొన్నాళ్ళు బట్టల కోట్ల వెనుక భాగంలో మకాం పెట్టింది.
రుస్వా : నేను ఆ ఇంటికి ఎప్పుడూ వెళ్ళలేదు.
ఉమ్రావ్ : సరి. బిస్మిల్లాను చూడ్డానికి , తల్లీ కూతుళ్ళకు రాజీ కుదిరించడానికీ నేను తరచు వెళ్ళుతుండేదాన్ని. ఒకనాటి సాయంకాలం ఆవరణలో బల్ల పీట మీద బాలీసుకు అనుకోని కూర్చుని ఉంది. మీర్ గారు దగ్గర కూర్చున్నారు. మౌల్వీ మహాశయుడు దూరంగా కూర్చున్నారు. అప్పటి వారి ముఖం మరువలేను. పాపం, ఎంత నిరాశ! ఎంత ఉదాసీనత! జపమాల మాత్రం మౌనంగా తిప్పుతూనే ఉన్నారు. నేను వెళ్ళాను. బిస్మిల్లా నా చేయి పట్టుకొని కూర్చోబెట్టింది. మీర్ గారికి, మౌల్వీ గారికీ సలాము చేసి కూర్చూన్నాను. బిస్మిల్లా చెవిలో ఊదింది. "తమాషా చూస్తావా ?" అని. నేను ఆశ్చర్యంగా "తమాషా ఏమిటి?" అని అడిగాను.
బిస్మిల్లా "చూడు" అని ముంగిలిలో ఉన్న పాత వేపచెట్టు ఎక్కవలసిందని మౌల్వీ గారిని ఆజ్ఞాపించింది.
మౌల్వీగారు భిన్నుడైనారు. గడగడ వణకారు. నాకు నవ్వు వచ్చింది. మీర్ గారు ముఖం తిప్పుకొని కూర్చున్నారు . పాపం, మౌల్వీ గారు ఒకసారి ఆకాశాన్ని మరొకసారి బిస్మిల్లాను చూస్తున్నారు. "వెంటనే " రెండవ ఉత్తర్వు "ఎక్కమంటున్నాను" మూడవ ఆదేశం.
మౌల్వీ గారు "బిస్మిల్లా" అని లేచారు. బిస్మిల్లా వైపు చూచారు. ఆమె తీవ్రంగా "ఊ" అన్నది.
మౌల్వీ గారు పైజమా పైకేక్కించి చెట్టు ఎక్కసాగారు. కొంతదూరం ఎక్కి బిస్మిల్లా వైపు చూచారు. చాలా, ఇంకా ఎక్కాలా అని అడుగుతుంది అ చూపు.
బిస్మిల్లా "ఇంకా" అన్నది.
మౌల్వీ గారు మరికొంత ఎక్కి మళ్ళీ చూచారు. "ఇంకా" అన్నది బిస్మిల్లా. చివరి దాకా ఎక్కి మళ్ళీ చూచారు. తరవాత లేత కొమ్మలు మాత్రమే. బిస్మిల్లా "ఇంకా" అంటే మౌల్వీ గారు క్రిందపడటం ,అల్లాకు అతిధి కావడం జరిగిపోయేది. నేను బిస్మిల్లా కాళ్ళు పట్టుకున్నాను. మీర్ గారు బ్రతిమిలాడి సిఫారసు చేశారు. అప్పుడు "దిగు" అనే శాసనం వెలువడింది. మౌల్వీ గారు ఎక్కడానికి ఎక్కారు గాని దిగడం మా చెడ్డ కష్టం అయింది. ఎప్పుడు పడిపోతారో అనిపించింది నాకు. కాని భగవంతుని దయవల్ల క్షేమంగా దిగి వచ్చారు. ఒడలంతా చెమట పట్టింది. శ్వాస వేగంగా సాగింది. పడిపోయేవారే కాని సంభాళించుకొని పాకోళ్ళు తొడుక్కొని బల్ల దగ్గరికీ వచ్చారు. కూర్చొని జపం సాగించారు. కూర్చోవడం కూర్చున్నారు గాని పైజామాలో చీమలు దూరడం వల్ల చిరాకు పడుతున్నారు.
రుస్వా : వాహ్! బిస్మిల్లా చాల చతుర వేశ్యలా ఉంది.
ఉమ్రావ్ : అదా చతురత్వం? ఆ పాషాణం మెదలకుండా కూర్చుంది. కనీసం పెదవుల మీద చిరునవ్వు లేదు. మీర్ గారికీ, నాకూ పొట్టచేక్కలు అవుతుంది.
ప్రియుని కఠోరపరీక్షల క్రాగి వేగినాను
నింక ఇడుముల పేర్కొననేలా! అదేమి లెక్క?
రుస్వా : ఈ ఒక్క వాక్యం చాలు జీవితాంతం నవ్వడానికి. అయితే భావన కావాలి. మీరు చెపుతున్నప్పుడు నా కళ్ళ ముందు బిస్మిల్లా, మౌల్వీ గారి పవిత్రవదనం , మీర్ గారు వేపచెట్టు అన్నీ బొమ్మ గీసినట్లు కనిపించాయి. ఇది వెంటనే నవ్వు వచ్చే వృత్తాంతమూ కాదు. కాస్త యోచించండి. నవ్వుతారు. నాకు నవ్వు కాదు, మౌల్వీ గారి మూర్ఖత్వం చూచి ఏడుపు వస్తుంది. బిస్మిల్లా, అబ్బ ఎంత అసాధ్యురాలు! డెబ్బయి ఏండ్ల ముసలివాణ్ణి చెట్టెక్కమన్నది. అతడు ఎక్కాడు. అంతా అయోమయం .చిక్కు సమస్య.





