Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
పదునాలుగవ సూక్తము
ఋషి - అసితదేవలుడు, దేవత పవమానసోమము, ఛందస్సు - గాయత్రి.
1. నదీ తరంగములను ఆశ్రయించిన కవిసోముడు అనేకుల అభిలషణీయ శబ్దము చేయుచు రాలుచున్నాడు.
2. అయిదు దేశముల పరస్పర మిత్రులగు మానవులు కర్మాభిలాషచే ధీరక సోమమును స్తుతులతో అలంకరించినప్పుడు.
3. అప్పుడు సోమమును ఆవుపాలలో కలిపినపుడు - అప్పుడు సమస్త దేవగణములు సోమరసపు మత్తులో పడిపోవుదురు.
4. దశాపవిత్రపు యజ్ఞద్వారము విడిచిన సోముడు నిన్ను ప్రదేశమునకు పరుగులిడును. మిత్రుడగు ఇంద్రుని కలసికొనును.
5. వయసు గుఱ్ఱమును చేతితో రుద్దుదురు. అట్లే సోమము గవ్యము కలుపుకోని పరిచర్యచేయు పౌత్రులగు అంగుళులతో మార్జించబడును.
6. అంగుళులతో అభిషుతమైన సోమము గవ్యముతో కలియుటకు శబ్దము చేయుచు సాగును. నేను సోమమును పొందగలను.
7. పరిమార్జనము చేయు అంగుళులు - అన్నపతి సోమునితో కలియును. అది బలిష్ఠసోముని వీపుపైన ఎక్కినవి.
8. సోమమా ! నీవు స్వర్గీయ, పార్థివ ధనములను అందుకొనుము. మమ్ము కోరి మా వైపురమ్ము.
పదునైదవ సూక్తము
ఋషి - అసిత దేవలుడు, దేవత - పవమానసోమము, ఛందస్సు - గాయత్రి.
1. ఈ సోముడు విక్రాంతుడు. అంగుళులచే అభిషుతుడు. కర్మబలమున వేగవంత రథమును ఎక్కినాడు. ఇంద్రుడు నిర్మించిన స్వర్గమునకు సాగినాడు.
2. ఏ విశాల యజ్ఞమున దేవతలుందురో ఆ యజ్ఞమున సోముడు అనేక కర్మములు ఆశించును.
3. ఈ సోమము హవిర్ధానమున స్థాపించబడును. తదుపరి ఆహవనీయ ప్రదేశమున హవ్యవర్తి సోమవంత మార్గమున అర్పించ బడినపుడు అధ్వర్యులకు సహితము ప్రాప్తించును.
4. ఈ సోమపు శృంగము - పైభాగము కంపించును. అతని శృంగము ఆబోతు శృంగము వంటిది. అతడు స్వబలమున మా కొరకు ధనము తెచ్చును.
5. ఈ సోమము వేగవంతము. శుభ్రఅంశ యుక్తము. అతడు ప్రవహించు సకల రసములకు స్వామియై సాగును.
6. కప్పివేయు వారును, పీడించు రాక్షసులను ఈ సోముడు తన అంశమున లంఘించి వారిని తెలిసి కొనును.
7. మానవులు మార్జనీయమగు సోమమును ద్రోణకలశమున వడకట్టు చున్నారు. సోమము ఎన్నోరసములను ఇచ్చునది.
8. పది అంగుళాలును, ఏడుగురు ఋత్విక్కులును శోభన ఆయుధమునువలె మాదక సోమమును పరిమార్జింతురు.
పదునారవ సూక్తము.
ఋషి - అసితదేవలుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు -గాయత్రి.
1. సోమమా! ద్యావాపృథ్వులు నిన్ను అభిషవించువారు. ఆరెంటిమధ్య నున్న శత్రువును ఓడించవలసి ఉన్నది. అందుకు నీవు ఉత్సాహము కలిగింతువు. అశ్వము వలె సాగుదువు.
2. సోమము బలములనేత, జలముల ఆచ్ఛాదకుడు. అన్న సహిత వర్తమానుడు. గోరక్షకుడు. మేము కర్మము ద్వారా వ్రేళ్ళతో సోమమును కలుపుదుము.
3. సోమము శత్రువులకు అందనిది. అంతరిక్షమున ఉండునది. అపరాజితము. సోమమును దశాపవిత్రమున ఉంచండి. ఇంద్రుని పానము కొరకు సిద్ధము చేయండి.
4. స్తుతులతో పవిత్రమగు పదార్థము సోమము. అతడు దశాపవిత్రమునకు వెళ్లును. పిదప కర్మబలమున ద్రోణ కలశమున ఆసీనుడగును.
5. ఇంద్రా! నమస్కారయుత స్తుతులకు సోమము బలము పెంచుకొనును. పిదప మహాయుద్ధము చేయ నీవద్దకు చేరును.
6. అవ్యయ రూపవస్త్రమున శోధితమై, సకల శోభాయుతమై సోమము గోప్రాప్తికొరకు వీరుడగును.
7. అంతరిక్షమందలి జలము క్రిందకు రాలినట్లు బలకారకము, అభిషుత సోమము ఆనందపరచు ధారతో దశాపవిత్రమున పడును.
8. సోమమా! మనుష్యులందు నీవు స్తోతలను రక్షింతువు. వస్త్రమున శోధితమై మేషలోమమువైపు సాగుదువు.
పదిహేడవ సూక్తము
ఋషి - అసితదేవలుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు - గాయత్రి.
1. నదులు పల్లపు నేలకు సాగును. శత్రువిఘాతక, శీఘ్రగామి, వ్యాప్తసోమము ద్రోణకలశము వైపుసాగును.
2. వర్షము నేలపై రాలును. అభిషుత సోమము ఇంద్ర ప్రాప్తికి రాలును.
3. సోమము అత్యంతప్రవృద్ధము. మదకరము. రాక్షసులను నాశము చేయును. దేవాభిలాషి అగును. దశాపవిత్రమునకు చేరును.
4. సోమము కలశమున చేరును. దశాపవిత్రమున సిక్తమగును. ఉక్థమంత్రములతో వర్థిల్లును.
5. సోమమా! నీవు మూడు లోకములను లంఘింతువు. పైకి ఆరోహింతువు. స్వర్గమును ప్రకాశవంతము చేయుదువు. సూర్యునకు ప్రేరణ కలిగింతువు.
6. విప్రస్తోతలు అభిషవదివసమున సేవకులు అగుదురు. సోమమును ప్రేమింతురు - స్తుతింతురు.
7. సోమమా! విప్రులు అన్నాభిలాషులు అగుదురు. కర్మద్వారా యజ్ఞము కొరకు అన్నవంతుడవగు నిన్ను సంస్కరిస్తారు.
8. సోమమా! నీవు మధురధారవై ప్రవహింపుము. తీవ్రత చెందుము. అభిషవస్థానమున కూర్చుండుము. యజ్ఞమందు పానయోగ్యుడవై నిలువుము.
పద్దెనిమిదవ సూక్తము
ఋషి - అసితదేవలుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు -గాయత్రి.
1. సోమమా! నీవు దశాపవిత్రమున పడుదువు. సవనమందు ప్రస్తరమున నిలుతువు. "మదేషు స్వధాఅసి" మాదకములందు సర్వశ్రేష్ఠుడవగుదువు.
2. సోమమా! నీవు విప్రుడవు. కవివి. అన్నమున పుట్టిన మధుర రసమవు. "మదేషు స్వధాఅసి"
3. దేవతలందరు నిన్ను ఒకే తీరుగ ప్రేమింతురు. నిన్ను పానము చేయుదురు. "మదేషు స్వధాఅసి"
4. సోమము - సకలవరణీయ ధనములను స్తోతల చేతికి అందించును. "మదేషు స్వధాఅసి"
5. ఒక బిడ్డకు ఇద్దరు తల్లులవలె - నీవు ద్యావాపృథ్వుల దోహనము చేతువు. "మదేషు స్వధాఅసి"
6. ఈసోమము అన్నముతో ద్యావా పృథ్వులను వ్యాప్తము చేయును. "మదేషు స్వధాఅసి"
7. సోమము బలవంతము. శోధించునపుడు - చిలుకునపుడు - కలశమున ధ్వనిచేయును. "మదేషు స్వధాఅసి"
పందొమ్మిదవ సూక్తము
ఋషి - అసితదేవలుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు -గాయత్రి.
1. స్తుత్యము, పార్థివము, స్వర్గీయము, విచిత్రమగు ధనమును ణీ శోధన సమయమున మాకు తెచ్చి ఇమ్ము.
2. సోమమా! నీవు, ఇంద్రుడు అందరకు స్వాములు. గోవులు పాలకులు - ఈశ్వరులు. మీరు మా కర్మలను వర్థిల్ల చేయండి.
3. సోమము అభిలాషప్రదాత. అతడు శోధించబడును. మానవులతో పలుకును. హరిత వర్ణుడగును. కుశలపై - తన స్థానమున - కూర్చుండును.
4. సోమము పుత్రుడు. తల్లి వసతీవరి జమము. బిడ్డ తల్లి పాలుత్రాగును. బిడ్డ వర్థిల్లుటకుగాను తల్లి తన పాలు మరిమరి త్రాగవలెనని ఆశించును.
5. మిశ్రమము చేయునపుడు - సోమపు శ్రేయోభిలాషి - జలము గర్భము ధరించును. సోమము ఈ మాతృరూప జలముల పాలు త్రావును.
(జలము గర్భము దాల్చుట సోమము వలన కాదు - సోమము కొరకు తల్లి మరిన్ని పాలు త్రావించదలచి మరల గర్భవతి అయినది)
6. పవమాన సోమమా ! మా అభిమత ఫలము దూరమునందున్నచో - దగ్గర చేయుము. శత్రువులతో బుగులు పుట్టించుము. వారి ధనమును తెలిసి కొనుము.
7. సోమమా !నీవు దూరమందున్నను దగ్గరలో ఉన్నను శత్రువుయొక్క వర్షణ బలమును నాశము చేయుము. శోషింప చేయగల శత్రువు తేజమును నాశము చేయుము.
ఇరువదవ సూక్తము
ఋషి - అసితదేవలుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు - గాయత్రి.
1. కవిసోముడు దేవతల పానమునకు మేషలోమము ద్వారా వెళ్లును. శత్రువులను పరాభవించు సోముడు హింసకులను వధించును.
2. పవమాన సోముడే స్తోతలకు గోయుక్తమగు సహస్ర సంఖ్యాల్ అన్నమును ప్రదానము చేయును.
3. సోముడా! నీవు మనసా సకల ధనములను దానము చేసెదవు. అట్టి నీవే మాకు అన్నమును అందించుము.
4. సోముడా! నీవు మహత్తర కీర్తి వైపుసాగుము. హవ్యదాతకు నిశ్చిత ధనము నిమ్ము. స్తోతలకు అన్నము ప్రసాదించుము.
5. సోముడా! నీవు సుకర్ముడవు. పవిత్రుడవగుము. మహారాజువలె మా స్తుతులను స్వీకరించుము. నీవు అద్భుతుడవు. మహామహుడవు.
6. అతడు సోమవాహకుడు. అంతరిక్షమున ఉన్నవాడు. అతనిని గట్టిగా చేతులతో రుద్దగా పాత్రలందు చేరును.
7. సోమా! నీవు క్రీడా పరాయణుడవు. ధనేచ్ఛ గలవాడవు. స్తోతకు మంచి బలమునిచ్చి దానసమయమగు దశాపవిత్రమునకు సాగుదువు.
ఇరువది ఒకటవ సూక్తము
ఋషి - అసితదేవలుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు - గాయత్రి.
1. దీప్తము, అభిభవ కారకము, మదకరము, లోకపాలకమగు సోమము ఇంద్రుని వైపు సాగును.
2. సోమము విశేషముగా అభిషమును ఆశ్రయించును. అందరితో కలియును. అభిభవకారులకు ధనము నిచ్చును. స్తోతలకు అన్నము ప్రసాదించును.
3. సరళముగా క్రీడించు సోమము నీటిలో పడి ఏకమాత్ర కలశమున క్షరితమగును.
4. సోమము సంశోధితమై - రథమునకు కట్టిన అశ్వములవలె సకల వరణీయ ధనములకు వ్యాప్తి కలిగించును.
5. ఈ యజమాని ఋత్విక్కులమగు మాకు పెదవి కదపక దానము చేయును. ఇతనికిగల వివిధకోరికలు తీరు నట్లు సోమమా! అతనికి ధనమునిమ్ము.
6. ఋభువు రథవాహకునకును, ప్రశస్య సారధికిని ప్రజ్ఞాదానము చేయును. సోమా! అట్లే ఈ యజమానికి ప్రజ్ఞాదానము చేయుము. జలములందు దీప్తుడవగుము.
7. ఈ సోమలు యజ్ఞము చేయవలెనను కొనుచున్నారు. అన్నవంత సోములు నివాస స్థానములు ఏర్పరచినారు. బలశాలులగు సోములు యజమాని బుద్ధుని చురుకు చేసినారు.
ఇరువది రెండవ సూక్తము
ఋషి - అసిత దేవలుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు -గాయత్రి
1. యుద్ధమున కంపు రథము, అశ్వమువలె అధ్వర్యులు సోమమును అమర్చి దశాపవిత్రమునకు చేర్చెదరు.
2. మహావాయువు, మేఘము, అగ్నిశిఖవలె సోమము సర్వత్ర వ్యాపించును.
3. ఈ సోమము శుద్ధము, దధియుక్తమై ప్రాజ్ఞబలమున మాకు వ్యాప్తి కలిగించును.





