Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    7. అగ్నీ ! నీవు సత్యవంతుడవు. యజమానుల ద్వారా నిర్మితుడవు. అయినను చిరంజీవివి. యజమానుల పాపములను నిశ్చయముగా దూరము చేతువు.

    8. అగ్నీ ! నీవు ద్యుతిమంతుడవు. మా విషయమున నీ సఖ్యత, భ్రాతృభావము మంగళప్రదములు. అట్టి సఖ్యత్వభ్రాతృ భావములు దేవస్థానమునను సంపూర్ణయజ్ఞములందును మాకు ప్రియంకరములు కావలెను.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత మూడవ అష్టకము, నాల్గవ మండలమున మొదటి అనువాకము సమాప్తము)


    పదకొండవ సూక్తము            రెండవ అనువాకము

        ఋషి - వామదేవుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్నీ ! నీవు బలవంతుడవు. నీ తేజస్సు భజనీయము. సూర్యుని సమీపపు పగటియందును అది నలుదిశల దీప్తిమంతము అగును. నీదు సుందర, దర్శనీయ తేజము రాత్రులందు దేదీప్యమానమగును. రూపవంతుడగు నీవలన స్నిగ్ధము, దర్శనీయమగు అన్నము అధికముగా లభించును.

    2. అగ్నీ ! నీవు బహుజన్మలవాడవు. నిన్ను యజమానులు స్తుతించుచున్నారు. వారికొఱకు పుణ్యలోక ద్వారము విముక్తము చేయుము. సుందర తేజో విశిష్టుడవగు అగ్నీ ! దేవతలతోసహ యజమానులకు నీవు ధనమును ప్రసాదింతువు. మాకు సహితము అట్టి విశేష అభీష్టధనమును ప్రసాదించుము.

    3. అగ్నీ ! హవిర్వహనము, దేవతానయనాది కార్యములు నీవలననే ఉత్పన్నమైనవి. స్తుతిరూప వచనములు నీ వలననే ఉత్పన్నమైనవి. సత్యకర్ముడు, హవ్యదాత యజమాని కొఱకు వీర్యయుక్త రూపము, ధనము సహితము నీవలననే ఉత్పన్నమైనవి.

    4. అగ్నీ ! బలవంతుడు, హవ్యవాహనుడు, మహాయజ్ఞకారి, సత్యబల విశిష్టుడగు పుత్రుడు నీవలననే ఉత్పన్నమైనాడు. దేవప్రేరిత సుఖప్రద ధనము నీ వలననే ఉత్పన్నమైనది. శ్రీఘ్రగామి, గతివిశిష్ట, వేగవంతమగు అశ్వము నీవలననే ఉత్పన్నమైనది.

    5. అమరాగ్నీ ! మానవులు దేవాభిలాషులు. వారు స్తుతుల ద్వారా నీకు పరిచర్యలు చేయుదురు. నీవు దేవతలందు ఆదిదేవుడవు. ప్రకాశవంతుడవు. నీ జిహ్వదేవతలను తృప్తిపరచునది అగును. నీవు పాపములను వేరు చేయువాడవు. రాక్షసులను అణచివేయు కోరికగలవాడవు. గృహపతివి.

    6. హేబలపుత్రా ! అగ్నీ ! నీవు రాత్రులందు శుభంకరుడవు. దీప్తిమంతుడవు. అట్లయి మాకు మంగళము కలుగుటకు సేవింపబడుదువు. నీవు యజమానులను ప్రత్యేకముగ పోషించెదవు. అట్లే మానుంచి కుమతిని దూరము చేయుము. పాపములను దూరము చేయుము. సమస్త దుర్మతులను దూరము చేయుము.

                            పన్నెండవ సూక్తము

        ఋషి - వామదేవుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్నీ ! స్రుక్కును సంయతముచేసి నిన్ను ప్రదీప్తునిచేయు యజమాని, నీకు త్రిసవనములందు హవిరన్నము అర్పించు వ్యక్తి నీకు సంతృప్తి కలిగించు కార్యములద్వారా నీయొక్క ప్రసహమాన తేజమును తెలిసికొని ధనద్వారమున శత్రువులను పరాజితులను చేయగలడు.

    2. అగ్నీ ! ఒకడు నీకొఱకు హోమసాధన కాష్ఠముల సేకరించును. ఒకడు కాష్ఠాన్వేషణమున అలసి నీ తేజమునకు పరిచర్య చేయును. ఒకడు రాత్రింబవళ్ళు నిన్ను ప్రదీప్తుని చేయును. అట్టి యజమాని ప్రజావంతుడు, పశువంతుడగును. శత్రువులను నష్టపరచును. ధనమును ఆర్జించును.

    3. అగ్ని మహాబలములకు ఈశ్వరుడు. ఉత్కృష్ట అన్నవంతుడు. ధనములకు స్వామి. యువతముడు. అతడు తనకు పరిచర్యలు చేయు యజమానులకు రమణీయ ధనము ప్రసాదించును.

    4. యువతమాగ్నీ ! నీ పరచారకుల మధ్య అజ్ఞానవశమున మేము పాపములు చేసి ఉండవచ్చును. అట్లయినను నీవు భూమిమీదగల మమ్ము పూర్తిగా నిష్పాపూలను చేయుము. సర్వత్ర దృశ్యమానములగు మా పాపములను వదలగొట్టుము.

    5. అగ్నీ ! నీవు మాకు మిత్రుడవు. మేము ఇంద్రాది దేవతలవద్దగాని మానవుల వద్దగాని పాపములుచేసి ఉండవచ్చును. ఆ మహాపాపములు, విస్తృత పాపములు మాకు ఎట్టి విఘ్నములు కలిగించకుండవలెను. మాపుత్ర పౌత్రాదులను పాపరూప ఉపద్రవములనుండి శాంతులను చేయుము. వారికి సుకృతజనిత సుఖములను ప్రసాదించుము.

    6. అగ్నీ ! నీవు పూజార్హుడవు. నివాసప్రదుడవు. నీవు కాళ్లు కట్టబడిన గౌరీగోవును విముక్తము చేసినావు. అట్లే మమ్ము పాపములనుండి విముక్తులను చేయుము.

    అగ్నీ ! మా ఆయువు నీ వలన ప్రవర్థములగును. నీవు దానిని మరింత ప్రవృద్ధము చేయుము.

                          పదమూడవ సూక్తము

        ఋషి -వామదేవుడు, దేవత-అగ్ని, ఛందస్సు-త్రిష్టుప్.

    1. అగ్ని శోభన నమస్కుడు. తమోనివారిణి ఉష ప్రకాశింపకముందే అగ్ని ప్రవృద్ధుడు అగును. అశ్వద్వయమా ! మీరు యజమాని ఇంటికి సాగుడు. ఋత్విగాదులకు ప్రేరకుడు సూర్యుడు. అతడు తన తేజమున ఉషఃకాలమున ఆవిర్భవించును.

    2. సవిత ఉన్ముఖ కిరణములను ప్రసరింపచేయును. బలిష్ఠమగు ఆబోతు ఆవులమీది కోరికతో, దుమ్ములేపుచు ఆవులవెంట పడును. అట్లే కిరణములు సూర్యుని ద్యులోకమునకు ఎత్తినపుడు వరుణుడు, మిత్రుడు మున్నగు అనేకులు దేవతలు తమ తమ కార్యములకు సాగుదురు.

    3. సృష్టికారకులగు దేవతలు లోక కార్యములు పరిత్యజింపక సర్వతో భావమున అంధకారమును దూరముచేయు సూర్యుని సృష్టించినారు. సూర్యుడు సమస్తప్రాణి సమూహముల విజ్ఞాత. హరినామక సప్తాశ్వములు ఆ సూర్యుని వహించును.

    4. ద్యుతిమంతుడవగు సూర్యుడా ! జగన్నిర్వాహక రసమును గ్రహించుటకు దారపురూపముగల కిరణములను విస్తృత పరచెదవు. నలుపురంగు రాత్రిని వెనుకకు నెట్టెదవు. అత్యంత వహన సమర్థ అశ్వములమీద పయనింతువు. కదలాడు సూర్యకిరణములు అంతరిక్ష మధ్యమున ఉన్న చర్మమువంటి చీకటిని దూరము చేయును.

    5. ప్రత్యక్ష లభ్యమానుడగు సూర్యుని ఎంతటివాడును బంధింపజాలడు. అధోముఖ సూర్యుడు ఏవిధముగను హింసింపబడడు. అతడు ఏ బలమున ఊర్ధ్వముఖ గమనము చేయుచున్నాడు? ద్యులోకమున నిలిచిన స్తంభమువంటి సూర్యుడు స్వర్గమును పాలించును దీనిని గ్రహించిన వాడెవడు?

                    (ఈ తత్త్వమును గ్రహించినవాడు లేడని భావము)

                           పదునాలుగవ సూక్తము

        ఋషి-వామదేవుడు, దేవత-అగ్ని, ఛందస్సు-త్రిష్టుప్.

    1. జాతవేద అగ్నీ ! తేజమున దేదీప్యమానమయి ఉష ప్రవృద్ధమయినది. విశేషగమనశీల అశ్వద్వయమా ! మీరు రథముతో మా యజ్ఞమునకు అభిముఖులుకండు.

    2. సవిత సమస్త భువనములను ఆలోచించును. తదుపరి ఉన్ముఖ కిరణుడు అగును. సమస్తమును వివరముగా చూచు సూర్యుడు తన కిరణములతో ద్యావాపృథ్వులను నింపును.

    3. ఉష ధనమును ధరించినది. అరుణవర్ణ. జ్యోతిమతి. రశ్మిచిత్రిత. విదుషీమణి. ఉషవచ్చినది. ప్రాణులను జాగృతము చేసినది. సుయోజిత రథమును అధిరోహించినది. సుఖప్రాప్తికొఱకు సాగినది.

    4. ఉష ఉదయించినది. అత్యంత వహనక్షమగలవి, గమనశీలములగు అశ్వములు ఈ యజ్ఞమునకు రావలెను. ఇది మీ కొరకయిన సోమము. ఈ సోమపానము చేయుడు. సంతుష్ట మనస్కులగుడు.

    5. ప్రత్యక్ష లభ్యమానుడగు సూర్యుని ఎంతటివాడును బంధింపజాలడు. అధోముఖ సూర్యుడు ఏవిధముగను హింసింపబడడు. అతడు ఏ బలమున ఊర్ధ్వముఖ గమనము చేయుచున్నాడు? ద్యులోకమున నిలిచిన స్తంభమువంటి సూర్యుడు స్వర్గమును పాలించును. దీనిని గ్రహించిన వాడెవడు?

    (13వ సూక్తమున 5వ మంత్రము పునరావృతమయినది. అర్థభేదము సహితము లేదు. "ఇయమృక్పూర్వం వ్యాఖ్యాతం" అన్నాడు శాయణాచార్యులు)

                               పదిహేనవ సూక్తము

 ఋషి-వామదేవుడు, దేవత 1-6 అగ్ని, 7-8 సోమడు, 9-10 అశ్వినులు,
                          ఛందస్సు-గాయత్రి.

    1. హోమ నిష్పాదకులగు దేవతలమధ్య దీపించు, యజ్ఞార్హమగు అగ్ని మా యజ్ఞమునకు వడినడకల గుఱ్ఱమునువలె తీసికొని రాబడును.

    2. అగ్ని దేవతలకొఱకు అన్నము ధరించును. నిత్యము మూడుమారులు రథమువలె యజ్ఞమునకు వెళ్లును.

    3. అగ్ని అన్నపాలకుడు. మేధావి. అతడు హవి అందించు యజమానులకు రమణీయ ధనమును ప్రసాదించును. హవ్యమును నలుదిశల వ్యాపింప చేయును.

    4. సృంజయుడు దేవపుత్రుడు. అగ్ని అతని కొఱకు తూర్పుదిక్కున నిలిచినాడు. అగ్ని ఉత్తరవేదిన సమిధాయుక్తుడు అగును. శత్రునాశకారి అగ్ని దీప్తియుక్తుడు కావలెను.

    5. అగ్నిని వీరమానవులు స్తుతింతురు. తీక్ష్ణ తేజోవంతుడు, అభీష్టవర్షి, గమనశీల అగ్నిమీద మానవుడు తన ఆధిపత్యమును పెంచవలెను.

    (అగ్నిమీద మానవుని ఆధిపత్యమే శాస్త్రవృద్ధి. అణువిస్పోటకమున సహితము అగ్నియే ఆవిర్భవించును)

    6. అగ్ని అశ్వమువంటి హవ్యవాహుడు. ద్యులోక పుత్రుడు. సూర్యునివలె దీప్తిమానుడు. భజనీయుడు. యజమానులు అట్టి అగ్నికి తేపతేప పరిచర్యలు చేసెదరు.

    7. సహదేవ పుత్రుడు సోమకుడు. అతడు మాకు అశ్వద్వయమును ఇచ్చెదను అన్నాడు. అప్పుడు మేము అతని వద్దకు వెళ్లినాము. గుర్రములను తెచ్చుకున్నాము.

    8. సహదేవ పుత్రుడు సోమకుని నుండి ఆరోజే ఆ పూజనీయ అశ్వములను తెచ్చుకున్నాము.

    9. కాంతిమంతులగు అశ్వినులారా ! మీ ఉభయులకు తృప్తి కలిగించిన సహదేవ పుత్రుడు సోమకుడు నిండునూరేళ్లు జీవించవలెను.

    10. కాంతిమంతులగు అశ్వినీ కుమారులారా ! సహదేవ పుత్రుడు సోమకునకు దీర్ఘాయువు ప్రసాదించండి.

                          పదహారవ సూక్తము

    ఋషి-వామదేవుడు, దేవత-ఇంద్రుడు, ఛందస్సు-త్రిష్టుప్.

    1. సోమవంతుడు, సత్యవంతుడగు ఇంద్రుడు మావద్దకు విచ్చేయవలెను. అతని అశ్వములు మావద్దకు రావలెను. అభిషవించెదము. అతడు మా స్తుతులు అందుకొనవలెను. మా కోరికలు తీర్చవలెను.

    2. ఇంద్రా ! నీవు శత్రువులను పరాజితులను చేయువాడవు. దారిముగిసిన తరువాత గుఱ్ఱమును వదలినట్లు ఈ మధ్యాహ్న సవనమున మమ్ము విముక్తులను చేయుము. అందువలన మేము మీకు సంతృప్తి కలిగించగలము.

    ఇంద్రా ! నీవు సర్వవిదుడవు. అసుర సంహారకుడవు. యజమానులు నీ కొఱకు మనోహర ఉక్థములు ఉచ్ఛరించెదరు.

    3. విద్వాంసులు నిగూఢార్థములను గ్రహింతురు. అట్లే అభీష్టవర్షి ఇంద్రుడు కార్యములను గ్రహించును. ఇంద్రుడు మాదక సోమమును అధికముగ సేవించి హృష్టుడు అయినపుడు ద్యులోకము నుండి సప్తసంఖ్యక కిరణములను వాస్తవముగ ఉత్పన్నము చేయును. స్తోత్రయోగ్యములగు కిరణములు పగలు సహితము మానవుల జ్ఞానమును పెంపొందించును.

    4. ద్యులోకము విశాలము. జ్యోతిస్స్యరూపము. కిరణములు ద్యులోకమును మరింత దర్శనీయము చేసినవి. అప్పుడు దేవతలు స్వర్గమున నివసించుటకు ఉత్సాహపడినారు.

    సూర్యుడు నేతలందు శ్రేష్ఠుడు. అతడు ఘనీభూతమగు అంధకారమును పారద్రోలినాడు. మానవులు సమస్తము చూచుటకు సాయపడినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.