Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
నవాబు గారు కూర్చున్నారు. నేనూ అక్కాడే ఉన్నాను. నవాబుగారు , బిస్మిల్లా సంభాషణలోకి దిగారు. ఇంతలో బిస్మిల్లా గది గుమ్మం దగ్గర నుంచొని ఖానమ్ గారు "మేము రావచ్చా?" అని అడిగింది. బిస్మిల్లా నవాబుతో "కొంచెం జరిగి కూర్చోండి, అమ్మ వస్తుంది" అని ఖానమ్ తో "రండి' అంది.
ఖానమ్ గదిలో ప్రవేశించి మూడు సార్లు సలాములు చేసింది. ఇంత వినయంగా ఖానమ్ సలాము చేయడం నేను అంతకుముందు ఎన్నాడూ చూడలేదు.
ఖానమ్ : సర్కారు శరీరం ఎలా ఉంది ?
నవాబు : (తల వంచి) అల్హ మ్దులిల్లా.
ఖానమ్ : అల్లా ఆనందంగా ఉంచుగాక ! మీ సంపద వేయి రెట్లు పెరగాలని ప్రార్ధించేవాళ్ళమే. మేము ఎంతకంటే ఉంటాం. మళ్ళీ మీ ముందు చేయి చాచవలసినవాళ్ళమే. అల్లా తమను అమీరును చేశాడు. ప్రస్తుతం తమ వద్దకు ఒక విన్నపంతో వచ్చాను. అల్లా దయవల్ల బిస్మిల్లా మీవద్ద సంవత్సరం నుంచి కొలువు చేస్తుంది. అయినా ఎప్పుడూ తమకు శ్రమ ఇవ్వలేదు. హుజూర్ కు సలాము చేయడానికి వచ్చే అవకాశం ఏర్పడలేదు. ప్రస్తుతం అలాంటి అవసరం వచ్చింది. వచ్చాను. మన్నించాలి.
ఖానమ్ మాట్లాడుతుంటే అర్ధం కాక బిస్మిల్లా ఆవిడ ముఖం చూస్తూ ఉండిపోయింది. ఆ మాటల అంతర్యం కొంతవరకు నాకు అర్ధం అయింది. నవాబు పరిస్థితి అగమ్యంగా ఉంది. ముఖం మీద క్షణానికి ఒక రంగు మారుతుంది. కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. అయినా మౌనంగా కూర్చున్నారు.
ఖానమ్ : అయితే విన్నవించనా?
నవాబు : (కష్టంగా) చెప్పండి.
ఖానమ్ : (నాతొ) కాస్త బువాహుసేనీని పిలువు.
నేను వెళ్ళి బువాహుసేనీని పిలిచి వచ్చాను.
ఖానమ్ : (బువాహుసేనీతో) ఆ శాలువల జత తీసుకురా. అవే నిన్న అమ్మకానికి వచ్చినవి.
"అమ్మకానికి వచ్చినవి. అనే పదం పిడుగులా పడిగింది మీద. అయినా స్టైర్యంగా కూర్చున్నారు. బువాహుసేనీ శాలువలు తెచ్చింది. జరీపని చేసినవి. అలాంటివి తరచుగా కనిపించవు.
ఖానమ్ : (శాలువలు నవాబుకు చూపి) ఇవి నిన్న అమ్మకానికి వచ్చాయి. వర్తకుడు రెండు వేలు అంటున్నాడు. పదిహేను వందల వరకు కొనేవాళ్ళు సిద్దంగా ఉన్నారు. అతడు ఇవ్వడం లేదు. నా కంటికి పదిహేడు పద్దెనిమిది వందలు చేస్తుందనిపిస్తుంది. సర్కారు దయ తలచినట్లయితే ఈ ముసలితనంలో ఒక శాలువ కప్పుకుంటాను.
నవాబు మౌనంగా కూర్చున్నారు. బిస్లిల్లా ఏదో చెప్పబోతుండగానే ఖానమ్ "అగు పిల్లా, నువ్వు మధ్యన రాకు. రోజూ కోరికలు కోరుతూనే ఉంటావు. నాది ఒక్కటే కోరిక . ప్రభువులు మాట్లాడ్డం లేదు. శలవివ్వండి. మౌనంతో ఈ దాసీకి తృప్తి కలుగదు. శలవివ్వండి. అవునని, కాకుంటే కాదని , నా మనసులోని కోరిక దూరమన్నా అవుతుంది."
అప్పటికీ నవాబు పలుకలేదు.
ఖానమ్ : హుజూర్ ! జవాబివ్వండి. నేనంత ? నా అంతస్తేంత ? బజారుదాన్ని తమలాంటి వాళ్ళు ఇచ్చిన గౌరవమే. ఈ పిల్లల ముందు ముసలిదాన్ని వంచించకండి.
నవాబు కళ్ళు చెమ్మగిల్లాయి. "ఖానమ్ గారు! శాలువ ఒక లెక్క కాదు. కాని నా పరిస్థితి మీకు తెలియనట్లుంది. బిస్మిల్లా జాన్ ఏమీ చెప్పలేదా ? ఉమ్రావ్ జాన్ కూడా ఆరోజు అక్కడే ఉంది !" అన్నారు.
ఖానమ్ : నాకు ఎవరూ ఏమీ చెప్పలేదు. ఏమి? క్షేమమేగా!
బిస్మిల్లా మళ్ళీ చెప్పబోతే ఖానమ్ కనుసైగ చేసింది. ఆమె మాట మింగి ఇటూ అటూ చూచింది.
నవాబు : ప్రస్తుతం మేము మీ కోరిక తీర్చే స్థితిలో లేము.
ఖానమ్ : "మీ పగవాళ్ళు ఆ స్థితిలో లేకపోవాలి! రోజూ అదీ ఇదీ కావాలనే తుచ్చు రాలీని కాను. కావాలన్నా వద్దన్నా బిస్మిల్లాకు తగు! నేను ముసలిముండను. నా కోరిక ఎంత నేనెంత?" అని ఒక నిట్టుర్పు విడిచి " నా రాత ఇలా ఉంది. పెద్ద పెద్ద అమీర్లు కాస్త గుడ్డ పీలిక కోసం ముఖం చాటు చేస్తున్నారు."
ఖానమ్ మాట్లాడుతున్న ఒక్కొక్క మాట నవాబు గుండెలో ఒక్కొక్క బాణంలా గుచ్చుకుంటుండడం నేను గమనిస్తూనే ఉన్నాను.
నవాబు : మీ అర్హత విషయం కాదు! మీ కోరిక తీర్చడానికి నిజానికి నా పరిస్థితి బావుండలేదు. తరవాత తాను ఆ స్థితికి రావడానికి గల కారణం సంగ్రహంగా చెప్పారు.
ఖనమ్ : ఈ వెధవ కోరిక తీర్చే అర్హత లేనప్పుడు ఈ దాసీదాని కొంపకు రావలసిన అవసరం ఏముంది? హుజూర్! చావుకు కూడా నాలుగు పైసలు కావాలి. బోగంది ఎవరి పెళ్లాం? అనే సామెత వినలేదా సర్కార్? మొహమాటానికి పొతే మా కడుపెలా నిండాలి? ఆ అలా వస్తానంటారా మీ ఇల్లు కాదనను. కాని మీ మానమర్యాదల విషయం గురుండాలి.
ఆ మాటలని వెంటనే గదిలోంచి వెళ్ళిపోయింది.
నవాబు : "వాస్తవంగానే తప్పు చేశాను. ఇక ముందు రాను" అని లేస్తుండగానే బిస్మిల్లా చేయి పట్టి కూర్చోబెట్టింది.
బిస్మిల్లా : సరి, ఈ కడియాల జత విషయం ఏమంటారు?
నవాబు : ( కాస్త పరుషంగా ) "నాకు తెలియదు" అన్నారు.
బిస్మిల్లా : అరే వాహ్ . కోపమే వచ్చిందే వెళ్ళే దేక్కడికి ? ఉండండి.
నవాబు : కాదు బిస్మిల్లా జాన్. వెళ్ళనీ. ఆపకు. రావడం నాదే తప్పు. మంచిరోజులు వస్తే చూద్దాం. అయినా ఇంకా మంచిరోజు లేమొస్తాయిలే.
బిస్మిల్లా : ఊహు. వెళ్ళనివ్వను.
నవాబు : మీ అమ్మతో చెప్పు దెబ్బలు తినిపించాలని ఉందా?
బిస్మిల్లా : నిజమే ఉమ్రావ్ అక్కా! ఏమైందీ ముసలిదాని కివ్వాళ? ఎన్నో సంవత్సారాల నుంచి గదిలోకి తొంగైనా చూడలేదు. ఇవ్వాళే వచ్చింది. ప్రళయం తెచ్చింది. అమ్మకు కోపం రానీ, ఏమైనా కానీ నేను నవాబును విడువనబ్బా! ఇవ్వాళ వారికేం లేదు. రేపు వస్తుంది. మరీ ఏం చేస్తున్నామా? ఎంతైనా నవాబు కదా! వేల రూపాయలు వచ్చాయి వారి దగ్గరి నుంచి, ఇప్పుడు గడ్డు కాలం వచ్చిందనుకో. అంతమాత్రంతో ఇంటి నుంచి వెళ్ళగొట్టటమేనా? వీల్లేదు అక్కా! అమ్మ మరీ బలవంతం చేసిందనుకో (నవాబు చేయి పట్టుకొని) లేచిపోతా. విన్నావా? మనసులో మాట చెప్పేశాను.
నాకు బిస్మిల్లా ధోరణి తెలుసు. ఆవిడ అన్నదాని కల్లా ఔనంటూ విన్నాను.
బిస్మిల్లా : అచ్చా నవాబ్, నీ మకాం ఎక్కడ ?
నవాబు : ఎక్కడని చెప్పను?
బిస్మిల్లా ; ఎక్కడో ఉండాలిగా ?
నవాబు : తహసీన్ గంజ్ లో - మక్దూమ్ బక్ష్ ఇంట్లో ఉంటున్నాను. మక్దూమ్ అంత విశ్వాసం గలవాడని తెలుసుకోలేకపోయినందుకు విచారిస్తున్నాను. సిగ్గుగా కూడా ఉంది.
నేను : మీ తండ్రిగారి వద్ద కొలువున్నవాడేగా. మీరే కాదూ అతణ్ణి కొలువు లోంచి తీసివేసింది ?
నవాబు : "అవును ఆ మక్దూమ్ బక్ష్. అతడే పనికి వచ్చాడు! అల్లా తలచుకుంటే ......" అని ఆగిపోయాడు.
నవాబు కళ్ళ నుండి టపటప కన్నీరు రాలింది. తరవాత నవాబు బిస్మిల్లాను విడిపించుకొని గది నుండి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయెప్పుడు నవాబుతో మాట్లాడుదామను'కొని లేచాను. కాని వేగంగా మెట్లు దిగి వెళ్ళిపోయారు. ఖానమ్ మాటలు నవాబు మనసును తీవ్రంగా గాయపరచాయి. ఆవిడ మాటలు దేనికి ఉపోద్ఘాతమో గ్రహించాను. నాకు మాత్రం ఎందుకో కలవరం కలిగింది. విషం గిషం ఏమైనా .... ఇంకేమన్నా ఉందా?
సాయంకాలం నేనూ , బిస్మిల్లా డోలీ ఎక్కి తహసీన్ గంజుకు వెళ్ళాం. మక్దూమ్ బక్ష్ ఇల్లు దొరకడం కష్టమైంది. డోలీ మనుషులు గుమ్మం ముందు నుంచుని కేక వేశారు. ఒక చిన్న అమ్మాయి బయటికి వచ్చింది. మక్దూమ్ బక్ష్ ఇంట్లో లేడని తెలిసింది. నవాబును గురించి తెలుసుకుంటే ఉదయం వెళ్ళి ఇంకా రాలేదని చెప్పారు. రెండు గంటలు ఎదురు చూచాం. ఇద్దరిలో ఎవరూ రాలేదు. నిరాశచెంది ఇంటికి తిరిగి వచ్చాం.
రెండవరోజు నవాబును వెదుకుతూ మక్దూమ్ బక్ష్ వచ్చాడు. రాత్రికి కూడా ఇంటికి రాలేదని చెప్పాడు. నవాబు తల్లి దగ్గరి నుంచి ముసలది ఏడుస్తూ మొత్తుకుంటూ వచ్చింది. బేగం గారు ఏడ్చీ ఏడ్చీ పిచ్చిదానిలా అయిపోయారు. పెద్ద నవాబు అదోలా అయిపోయారని తెలిసింది.





