Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
3. అభీష్టవర్దక, సత్య, హింసాశూన్య, ప్రధాన సోమము యజ్ఞగృహము వైపున జలసహితమై నినదించును.
4. కవులు సోమధనము కావ్యములు రచించినపుడు స్వర్గమున ఇంద్రుని బలము ప్రకాశించును.
5. కర్త ఈ సోమమును ప్రేరేపించినపుడు పవమాన సోముడు - రాజువలె యజ్ఞవిఘ్నకారకుల మీదకు పోవును.
6. హరిత వర్ణము ప్రియ సోమము నీట కలిసి అభిషవ సమయమున ధ్వనించుచు స్తుతిని సేవించును.
7. సోమపు ఈ కర్మకు ప్రసన్నుడైనవానికి వాయు, ఇంద్ర, అశ్వినులు మదసహితులై లభింతురు.
8. ఏ యజమాని యొక్క సోమతరంగములు మిత్ర, వరుణ, భగుల వైపు సాగునో అతనికి సోమజ్ఞానము కలుగును - సుఖములు ప్రాప్తించును.
9. ద్యావాపృథ్వులారా ! మదకర సోమరూప అన్న ప్రాప్తికిగాను మాకు అన్నము, ధనము, పశువులు మున్నగునవి ప్రసాదించండి.
ఎనిమిదవ సూక్తము
ఋషి - అపిత దేవలుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు -గాయత్రి.
1. ఈ సోమము ఇంద్రుని శౌర్యమును పెంచును. ఇది అతడు కోరినదియు అతనికి ప్రీతికర రసమును వర్షించును.
2. సోమము అభిషుతమగును. చమసమున నిలుచును. వాయువు, అశ్వద్వయము వద్దకు వెళ్లును. వాయువు మున్నగు దేవతలు మాకు మంచి బలమును ప్రసాదించవలెను.
3. సోమమా ! నీవు అభిషుతవగుము. మనిజ్ఞవమగుము. ఇంద్రుని ఆరాధించుటకు యజ్ఞస్థానమున ఉండుము. ఇంద్రునకు ప్రేరణ కలిగించుము.
4. సోమమా! పది అంగుళులు నిన్ను సేవించును. ఏడుగురు హోతలు నిన్ను ప్రసన్నుని చేయుదురు. విప్రులు నిన్ను ఉన్మత్తుని చేయుదురు.
5. నిన్ను మేక వెంట్రుకలు, నీటితో చేయుదురు. దేవతలకు మత్తు కలుగుటకుగాను అందు పెరుగుమున్నగునవి కలుపుదుము.
6. అభిషుత, కలశమున తడిసిన హరితవర్ణసోమము - వస్త్రమువలె పెరుగు మున్నగువానిని ఆచ్ఛాదించును.
7. సోమమా! మేము ధనికులము. నీవు మాముందు క్షరితవగుము. సకల శత్రువులను నాశము చేయుము. మిత్రుడగు ఇంద్రుని అందుకొనుము.
8. సోమమా! ద్యులోకమునుండి నేలమీద వర్షము కురిపించుము. ధనమును కలిగించుము. యుద్ధమున మాకు స్ధానము కలిగించుము.
9. సోమమా! నీవు నేతల దర్శకుడవు. సర్వజ్ఞుడవు. ఇంద్రుడు నిన్ను పానము చేసిన తదుపరి మేము పానము చేయుదుము. మాకు అన్నము, సంతానము కలుగవలెను.
తొమ్మిదవ సూక్తము
ఋషి - అసిత దేవలుడు, దేవత - పవమాన సోముడు, ఛందస్సు -గాయత్రి.
1. సోమము మేధావి. క్రాంతదర్శి. అభిషవప్రస్తరమున ఉండి, అభిషుతమై ద్యులోకపు అత్యంత ప్రియ పక్షులవద్దకు చేరును.
2. నీవు నివాసభూతుడవు. ద్రోహము ఎరుగని వాడవు. స్తోతలగు మానవులకు పర్యాప్తుడవు. అన్నవంతమగు ధారతో విచ్చేయుము.
3. ఉత్పన్న, పవిత్ర మహాసోమరూప పుత్రుడు యజ్ఞవర్ధమిత్ర, జనమిత్రి, మాత ద్యావాపృథ్వులను ప్రదీప్తము చేయును.
4. అక్షయము, ముఖ్యమగు సోమమును నదులు వర్థిల్ల చేసినవి. అవి హస్తములందు పెరిగినవి. ద్రోహశూన్యలగు ఏడు నదులను ప్రసన్నములను చేసినవి.
5. ఇంద్రా! నీ కర్మములందు ఆ అంగుళులు హస్తములు అహింసిత, వర్తమానసోమమును కర్మకొరకు దాల్చినవి.
6. హహ్నులును, అమరులగు దేవతలకు తృప్తినిచ్చు సోమము సప్తనదులను దర్శించును. అది కూపరూపమున పూర్ణమై నదులకు తృప్తి కలిగించును.
7.సోమపురుషా ! కల్పనీయ దినములందు మమ్ము. రక్షింపుము. పవమాన సోమా! మేము యుద్ధము చేయవలసిన రాక్షసులను హతమార్చుము.
8. సోమమా! నవీనము, స్తుత్యమగు స్తోత్రము కొరకు యజ్ఞపథమున విచ్చేయుము. ముందటవలెనే దీప్తిని ప్రకాశింప చేయుము.
9. పవమానసోమమా ! మాకు పుత్రవంతమగు అన్నమును, గోవులను, అశ్వములను దానము చేయుము. మేము కోరినవన్నియు. మాకు అందించుము.
పదవ సూక్తము
ఋషి - అసిత దేవలుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు -గాయత్రి
1. సోమము రథము, అశ్వమువలె శబ్దము చేయును. అతడు అన్నము కోరి యజమాని ధనము కొరకు వచ్చినాడు.
2. సోమము - రథమువలె - యజ్ఞమువైపు సాగును. బరువులు మోయువాడు భుజముల మీద మోసినట్లు ఋత్విక్కులు సోమమును బుజముల మీద మోయుదురు.
3.స్తోత్రమునకు రాజు సంతుష్టడగును. ఏడుగురు హోతలు యజ్ఞమును సంస్కరింతురు. గవ్యముతో సోమము సంస్కరింపబడును.
4. అభిషుత సోమము మహాస్తుతులతో అభిషుతమగును. మత్తు కలిగించుటకు ధారగాపడును.
5. సోమము ఇంద్రుని మదగోష్ఠిరూపము. ఉషస్సునకు భాగ్య ఉత్పాదకము. సోమము పడునప్పుడు ధ్వనించును.
6. స్తోతలు, ప్రాచీనులు అభీష్టవర్ధక సోమమును సేవించు మానవులు - యజ్ఞద్వారములను తెరిచెదరు.
7. ఉత్తములగు ఏడుగురు బంధువులవంటివారు. సోమస్థానమును పూరించువారగు ఏడుగురు హోతలు యజ్ఞమున ఆసీనులు అగుదురు.
8. సోమము యజ్ఞమునకు నాభి. నేను దానిని నా నాభిప్రదేశమున దాల్చెదను. నా చక్షువులు సూర్యుని కలియును. నేను కవిని. సోమ ప్రభావమున పూరింతును.
9. ఇంద్రుడు గమన పరాయణుడు. దీప్తుడు. సోమము అతని హృదయమున నిహితము. అది అతనికి ప్రియతమము. హృదయస్థానమును ఇంద్రుడు తన కంటితో చూడగలడు.
పదకొండవ సూక్తము
ఋషి - అసిత దేవలుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు -గాయత్రి.
1. నేతలారా ! ఇది క్షరణశీల సోమము. ఇది దేవయజ్ఞము చేయదలచినది. అందుకు పాటలు పాడండి.
2. సోమమా! అథర్వఋషులు నీదు దీప్తము, దేవాభి లాహిరసమున - ఇంద్రుని కొరకు పాలు కలిపి సంస్కరించినారు.
3. సోమారాజా! మా గోవులకు సుఖములు కురిపించుము. మా పుత్రాదులకు సుఖము కురిపించుము. అశ్వములకు సుఖములు కురిపించుము. ఓషధులకు సుఖములు కలిగించుము.
4. సోమము పింగళవర్ణము. బలస్వరూపము. అరుణ వర్ణము స్వర్గమును తాకునది స్తోతలారా ! అట్టి సోమము కొరకు వెంటనే గాథలు ఉచ్చరించండి.
5. ఋత్విక్కులారా ! అభిషవశిలలందు అభిషుత సోమమును చేతులతో పవిత్రము చేయండి. మదకర సోమమున పాలు కలపండి.
6. నమస్కరించండి. సోమము వద్దకు వెళ్లండి. అందులో పెరుగు కలపండి. ఇంద్రునకు అందించండి.
7. సోమమా! నీవు శత్రువినాశకుడవు. విచక్షణపరుడవు. దేవతల కోరికలు తీర్చువాడవు మా గోవు కొరకు సరళముగా క్షరితుడవగుము.
8. సోమా! నీవు మనసు ఎరిగినవాడవు. మనసునకు ప్రభువవు. ఇంద్రుడు ఉన్మత్తుడగుటకుగాను నిన్ను పాత్రలలో నింపుదురు.
9. తడిసి రాలుచున్న సోమమా! ఇంద్రుని సహితునివై నీవు మాకు వీర్యయుక్త ధనమును ప్రసాదించుము.
పన్నెండవ సూక్తము
ఋషి - అసితదేవలుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు - గాయత్రి.
1. అభిషుతము, అత్యంతమధుర సోమము ఇంద్రుని కొరకు యజ్ఞగృహమునకు తరలుచున్నది.
2. ఆవు దూడను తన ముందుకు పిలుచును. అట్లే విప్రులు శబ్దములతో ఇంద్రుని సోమపానమునకు పిలుతురు.
3. మదస్రాని సోమము నదీతరంగములందు ఉండును. విద్వాంసుడగు సోముడు వాక్కును ఆశ్రయించును.
4. సోముడు సుందర ప్రజ్ఞ, క్రాంతి కర్మ, సూక్ష్మదర్శకుడు. అతడు అంతరిక్షపు నాభిస్వరూప మేషలోమమున పూజితుడగును.
5. సోమము కుండలో ఉన్నది. దశాపవిత్ర మధ్యమున ఉన్నది. సోమదేవుడు వానిలో తన అంశమున ప్రవేశించును.
6. సోమము మదస్రాని మేఘమును ప్రసన్నము చేయును. అంతరిక్షమును నిలిపి ఉంచుచోట శబ్దము చేయును.
7. నిత్యము స్తోత్రవంతము, అమృతమును పిదుకు వనస్పతి - సోమము - మానవుల కొరకు ఏకదినకర్మ మధ్యమున ప్రసన్నుడై విరాజిల్లును.
8. కవియగు సోముడు అంతరిక్షమునుండి పంపబడినాడు. విప్రుల కొరకు ధారగా ప్రియస్థానమున చేరినాడు.
9. పవమాన - క్షరణశీల - సోమమా ! మాకు బహుదీప్తివంత, సుందర గృహయుక్త ధనమును ప్రసాదించుము.
(ఇప్పటికి గడిచిన ఎనిమిది మండలములలో ఏడు అగ్నిసూక్తముతోనూ, ఎనిమిదవది ఇంద్ర సూక్తముతోనూ ప్రారంభమైనవి. ప్రస్తుతపు తొమ్మిదవ మండలము ఇంద్రాగ్నుల సూక్తముతోకాక "స్వారిష్ఠయామాదిష్ఠయా పవస్వ సోమధారయా - ఇంద్రాయ పాతవేసుతః" అను సోమసూక్తముతో ప్రారంభమైనది. ఇది గమనించ తగినది)
(ఆంధ్ర వచన ఋగ్వేద సంహిత తొమ్మిదవ మండలము ఆరవ అష్టకమున ఏడవ అధ్యాయము సమాప్తము.)
ఓం సతామినన్తిమాయినో నధీరావ్రతా దేవానాం ప్రథమాద్రవాణి
నరోదసీ అద్రుహా వేద్యాభిర్న పర్వతానినమేస్థివాంసః
ఎనిమిదవ అధ్యాయము పదమూడవ సూక్తము
ఋషి - అసిత దేవలుడు, దేవత - పవమానసోమము, ఛందస్సు - గాయత్రి.
ఓమ్ సోమః పునానో అర్షతి సహస్ర ధారో అత్యవిః
వాయోరిన్ద్రస్య నిష్కృతమ్
1.అనంతధారల పవిత్ర సోమము దశాపవిత్రమును లంఘించి ఇంద్ర, వాయువుల పానమునకు సంస్కృతమై పాత్రలో ప్రవేశించును.
2. రక్షణాభిలాషులారా ! విప్రులవలె పవిత్రమై, దేవతల పానము కొరకు అభిషుతమైన సోమము వైపు సాగండి.
3. బహుబలదాత, స్తూయమానుడగు సోముడు యజ్ఞసిద్ధియు, అన్నలాభము కొరకు క్షరితుడగును.
4. సోమమా! మా అన్నలాభమునకుగాను, దీప్తిమతి, సుందర వీర్యవతి, మహతి, రసధారను వర్షింపుము.
5. ఆ అభిషుత సోమదేవుడు సహస్ర సంఖ్యక ధనమును చక్కని బలమును ఇవ్వవలెను.
6. సంగ్రామమున కంపిన అశ్వము పగిది ప్రేరకులచే ప్రేరితుడైన సోముడు - అన్న ప్రాప్తికిగాను - దశాపవిత్రమును లంఘించి పోవుచున్నాడు.
7. ఆవులు అంబారావములతో దూడలవైపు వెళ్లినట్లు సోమము సహితము ధ్వని చేయుచు పాత్రవైపు సాగును. ఋత్విక్కులు సోమమును చేతులందు ధరింతురు.
8. సోమము ఇంద్రునకు ప్రియకరము - మదకరము. పవమాన సోమమా! నీవు నినదించి సకల శత్రువులను నాశము చేయుము.
9. పవమాన సోమా! నీవు దానము చేయని వారికి హింసకుడవు. సర్వదర్శకుడవు. యజ్ఞస్థలమున ఆసీనుడవగుము.





