Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    15. అగ్ని సమిద్ధుడు. అభీష్టవర్షి. నివాసప్రదుడు, అతని తేజోపుంజమున యజ్ఞగృహమున దీప్తమగును. యజమాని మేలు కొఱకు తన దీప్తతేజమును కప్పుకొనును. అందువలననే అతని రూపము రమణీయము. అశ్వాది ధనములతో రాజు వెలుగొందినట్లు అగ్ని అనేకులగు యజమానుల అనేక స్తుతులతో వెలుగొందును.

                              ఆరవ సూక్తము

        ఋషి - వామదేవుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్నీ ! నీవు యజ్ఞహోతవు. శ్రేష్ఠయాజ్ఞికుడవు. నీవు మాకన్న ఊర్ధ్వ స్థానమున ఉన్నావు. నీవు శత్రువుల సంపూర్ణ ధనమును గెలువుము. స్తోతల స్తుతులను వర్థిల్ల చేయుము.

    2. అగ్ని ప్రగల్భుడు. హోమ నిష్పాదకుడు. హర్షయుత. ప్రకృష్ట జ్ఞాన విశిష్టుడు. అగ్ని యజ్ఞమున ప్రజల మధ్యన స్థాపితుడు అగును. అతడు ఉదయ సూర్యునివలె ఊర్ధ్వముఖుడు అగును. స్తంభమువలె ద్యులోకముమీద ధూమము ధరించును.

    3. సంయతము, పురాతనమగు జుహువు ఘృతపూర్ణమయినది. యజ్ఞమును పొడిగించుఆధ్వరగణములవారు ప్రదక్షిణ చేయుచున్నారు. ఆక్రమకారియు, పదునైనదియునగు కుఠారము పశువులవద్దకు సాగుచున్నది.

    4. కుశములు విస్తృతములయినపుడు అగ్ని సమిద్ధమయినపుడు ఉభయులను సంప్రీతులను చేయుటకు అధ్వర్యులు నిలిచెదరు. హోమ నిష్పాదకుడు, పురాతన అగ్ని స్వల్పహవ్యమును కూడ బోలెడు చేయును. పశుపాలకులవలె పశువుల చుట్టు మూడు మారులు తిరుగుదురు.

    5. అగ్ని హోత, హర్షదాత, అభీష్టవర్షి, యజ్ఞవంతుడు. అగ్ని పరిమిత గతులతో పశువుల నాలుగువైపులు తిరుగును. అగ్ని దీప్తి సమూహము. అశ్వమువలె నలువైపుల పరువులిడును. అగ్ని ప్రదీప్తుడయినపుడు సమస్త భూతములు గడగడలాడును.

    6. హే సుందర జ్వాలా విశిష్ట అగ్నీ ! నీవు భీతి జనకుడవు. సర్వత్ర వ్యాపకుడవు. నీ మనోహరమగు కళ్యాణమూర్తి చక్కగా దర్శనమిచ్చును. రాత్రి తన అంధకారబలమున నీ తేజస్సును నివారింపజాలదు. రాక్షసాదులు నీ దేహమున పాపమును ఉంచజాలరు.

    7. వర్షము కలిగించు వైశ్వానరా ! నీ వెలుగులను ఎంతటివాడును నివారింపజాలడు. మాతా పితృస్వరూపలగు ద్యావాపృథ్వులు అగ్నిని పంపుటలో అంత సమర్థులుకారు. అట్టి అగ్ని  శోధకుడయి, తృప్తుడయి మానవుల మధ్యన ప్రదీప్తుడు అగుచున్నాడు.

    8. మానవుని చేతి పదివ్రేళ్లు-స్త్రీ ప్రసవించిబిడ్డను కన్నట్లు అగ్నిని ఆవిర్భవింప చేయును. అట్టి అగ్ని ఉషఃకాలమున వెలిగిహవ్యభాజియై, దీప్తిమంతుడయి, సుందర వదనమున పదునైన గొడ్డలివలె శత్రురూపరాక్షసులను హతమార్చును.

    9. అగ్నీ ! నీ అశ్వములను మా యజ్ఞమునకు ఆహ్వానించుచున్నాము. వాటి ముక్కులనుండి నురుగులు వచ్చుచున్నవి. అవి లోహిత వర్ణులు, అకుటిలులు, సుందరగాములు, దీప్తిమంతులు, వయస్కులు, సంఘటితులు, దర్శనీయులు.

    10. అగ్నీ ! నీ కిరణములు శత్రువులను పరాభవించునవి. గమన శీలములు. దీప్తములు. పూజనీయములు. అవి మరుత్తులవలె మరింత ధ్వనిచేయును. అవి అశ్వములవలె గమ్యస్థానమునకు ధ్వని చేయును. చేరును.

    11. సమిద్ధ అగ్నీ ! మేము నిన్ను స్తుతించినాము. హోతలు ఉక్థలు ఉచ్చరించినారు. యజమానులు నిన్ను యజించినారు. కావున నీకు మాకు ధనమును ప్రసాదించుము. మానవులు ప్రశంసించు హోత, అగ్నిని పూజించుటకు ఋత్విక్కులు మున్నగువారు పశ్వాది ధనమును కోరుచు కూడినారు.

                                  ఏడవ సూక్తము

 ఋషి - వామదేవుడు, దేవత - అగ్ని ఛందస్సు - 1 జగతి, 2-6 అనుష్టుప్ మిగిలినవి త్రిష్టుప్.

    1. అప్నవానాది భృగువంశీయులు అరణ్యమధ్యమున దావాగ్నిరూప దర్శనీయుడు, సమస్తలోకములకు ఈశ్వరుడగు అగ్నిని ప్రజ్వరిల్ల చేసినారు. అగ్ని హోత. యాజ్ఞిక శ్రేష్ఠుడు. స్తుతి భాజనుడు. దేవ శ్రేష్ఠుడు. అతడు యజ్ఞకారుల ద్వారా స్థాపించబడినాడు.

    2. అగ్నీ ! నీవు దీప్తిమంతుడవు. మానవులకు స్తుతియోగ్యుడవు. నీవెలుగులు ఎప్పుడు ప్రసవించును? మర్త్యులు నిన్ను అందుకొందురు.

    3. అగ్ని మాయారహితుడు. విజ్ఞుడు. నక్షత్ర పరివృత ద్యులోకమువంటి వాడు. సమస్త యజ్ఞవర్ధకుడు. అట్టి అగ్నిని దర్శించి ఋత్విక్కులు మున్నగువారు యజ్ఞగృహమున అందుకొందురు.

    4. అగ్ని ప్రజారక్షకుడు. శీఘ్రగామి. యజమానియొక్క దూత. కేతుస్వరూపుడు. దీప్తిమంతుడు. అట్టి అగ్నిని మానవులు సమస్త ప్రజల కొఱకు ఆరాధింతురు.

    5. అగ్ని రమణీయుడు. పవిత్ర దీప్తి విశిష్టుడు. యాజ్ఞిక శ్రేష్ఠుడు. సప్త తేజోయుక్తుడు. అట్టి హోత, విద్వాంసుడగు అగ్నిని అధ్వర్యు మున్నగు మానవులు యథాస్థానమున ప్రవేశపెట్టినారు.

    6. అగ్ని మాతృస్వరూప జలసమూహమున, వృక్ష సమూహమున విరాజిల్లువాడు. కమనీయుడు. దాహ భయమున ప్రాణులచే ఆ సేవితుడు విచిత్రుడు. గుహనిహితుడు, విజ్ఞుణ సర్వత్ర హవ్యగ్రాహి. అట్టి అగ్నిని అధ్వర్యు మున్నగు మానవులు ప్రతిష్ఠింతురు.

    7. దేవగణములు నిద్రావిముక్తులయి ఉషఃకాలమున జలస్థాన స్వరూప సమస్త యజ్ఞమున అగ్నిని స్తోత్రాదుల ద్వారా ప్రసన్నుని చేయుదురు. మహామహుడు, సత్యవంతుడగు అగ్ని నమస్కారపూర్వకముగ సమర్పించిన హవిని స్వీకరించును. అతడు యజమాని చేయు యజ్ఞములను సర్వదా గ్రహించును.

    8. అగ్నీ ! నీవు విద్వాంసుడవు. దేవదూత. కార్యజ్ఞాతవు. ఈ ద్యావాపృథ్వులమధ్యనున్న అంతరిక్షమును నీవు ఎంతో బాగుగా ఎరుంగుదువు. పురాతనుడవు. నీవు కొద్ది హవ్యమును మరింత చేయగలవాడవు. నీవు దేవతలకు హవి అందించుటకు స్వర్గారోహణ స్థానమునకు చేరుదువు.

    9. అగ్నీ ! నీవు దీప్తిమంతుడవు. నీవు సాగు మార్గము నల్లనిది, మసితో కూడినది. నీ దీప్తి పునరావర్తనమగునది. సంచరణశీలమగు నీ తేజము సమస్తతేజములందు శ్రేష్ఠము. నిన్ను పొందలేని యజమానులు నీ ఉత్పత్తి కారణస్వరూపమగు కర్రను ధరింతురు. ఉత్పన్నుడవయిన వెంటనే యజమాని దూతవగుదువు.

    10. అరణి మంథనమున ఉత్పన్నమయిన అగ్ని తేజమును ఋత్విక్కుల ద్వారా చూడనగును. అగ్ని శిఖను వాయువు వహించినపుడు అగ్ని వృక్షజాలములను జ్వాలామయము చేయును. అన్నరూపమగు కాష్ఠాదులను భక్షించును.

    11. అగ్ని శీఘ్రగాములగు తన రశ్మిసమూహములతో అన్నరూపమగు కాష్ఠాదులను చిటికెలో కాల్చికూల్చును. కాష్ఠములను కాల్చిన అగ్ని వాయుబల సమన్వితుడగును. అశ్వవాహకుడు తన అశ్వమును బలముగల దానిగా చేసినట్లు గమనశీలుడగు అగ్ని తనకిరణములను బలవర్థకముగచేసి, వానిని ప్రేరేపించును.


                          ఎనిమిదవ సూక్తము

        ఋషి - వామదేవుడు, దేవత - అగ్ని, ఛందస్సు - గాయత్రి

    1. అగ్నీ ! నీవు సకల ధనముల స్వామివి. సర్వజ్ఞుడవు. దేవతల హవ్యవాహనుడవు. మరణరహితుడవు. అతిశయ యజన శీలుడవు. దేవదూతవు. మేము స్తుతులతో నిన్ను వర్థిల్ల చేయుదుము.

    2. అగ్ని యజమానుల అభీష్ట ఫలదాయక ధనదానమును ఎరుగును. అతడు మహాహనుడు. అతడు దేవలోక ఆరోహణ స్థానము ఎరుగును. అతడు ఇంద్రాది దేవతలను యజ్ఞమునకు పిలుచును.

    3. అగ్ని ద్యుతిమంతుడు. ఇంద్రాది దేవతలకు యజమానుల ద్వారా నమస్కరింపచేయుట ఎరుగును. అతడు యజ్ఞ గృహమున యజ్ఞాభిలాషి యజమానునకు అభీష్ట ధన దానము చేయును.

    4. అగ్ని హోత. అతనికి దూతకార్యము తెలియును. స్వర్గారోహణ స్థానము తెలియును. అగ్ని ద్యావాపృథ్వుల మధ్య సంచరించును.

    5. యజమాని హవ్యదానము చేయును. అగ్నిని ప్రసన్నుని చేయును. అతనిని వర్థిల్ల చేయును. కాష్ఠము ద్వారా అతనిని ప్రదీప్తుని చేయును. మేము సహితము ఆ యజమానివలె ఆచరింతుము.

    6. అగ్నికి పరిచర్యలు చేయు యజమాని అగ్నిని భజించి ఆ యజమాని ధనమూలమున విఖ్యాతుడు అగును. పుత్ర పౌత్రాదుల ద్వారా ప్రసిద్ధుడు అగును.

    7. ఋత్విగాదుల ద్వారా ధనము పొందుటకు మేము నిత్యము యజమానుల వద్దకు వెళ్లుదుము. యజ్ఞకార్యమునకు మాకు అన్నము లభించవలెను.

    8. అగ్ని మేధావి. అతడు తన బలమున మానవులకు వినాశకారకమగు పాపమును వినాశము చేయును.

                          తొమ్మిదవ సూక్తము

        ఋషి - వామదేవుడు, దేవత - అగ్ని, ఛందస్సు - గాయత్రి

    1. అగ్నీ ! నీవు మహాహనుడవు. దేవతలను వాంఛించువాడవు. యజమానివద్ద కుశాసనముపై కూర్చుండుటకు విచ్చేతువు. నీవు మాకు సుఖములను ప్రసాదించుము.

    2. అగ్నిని రాక్షసాదులు హింసించలేరు. అతడు మానవలోకమునకు ప్రకటరూపమున విచ్చేయును. మృత్యువర్జితుడు. సమస్త దేవతలకు దూత.

    3. ఋత్విగాదులు అగ్నిని తెచ్చెదరు. అగ్ని యజ్ఞమున స్తుతియోగ్యుడు అగును. అతడు 'పోత' అయి యజ్ఞగృహమున ప్రవేశించును.

    4. యజ్ఞమున అగ్నిదేవపత్ని అగును. అధ్వర్యుడగును. గృహపతి అగును. 'బ్రహ్మ' నామక ఋత్విక్కు అగును. యజ్ఞమున ప్రవేశించును.

    5. మానవులు యజ్ఞాభిలాషులు. అగ్ని వారి హవ్యము కోరును. అగ్ని అధ్వర్యుమున్నగు సకల కర్మములు ఎరిగిన బ్రహ్మ, అగ్ని యజ్ఞకర్మముల అవికల ఉపద్రష్ట.

    6. అగ్నీ ! నీవు హవ్యము వహించుటకు యజమాని యజ్ఞమును సేవింతువు. అతని దౌత్యకార్యమును వాంఛింతువు.

    7. అంగిరాగ్నీ ! నీవు మా యజ్ఞమును సేవింపుము. మా హవ్యము స్వీకరించుము. ఆహ్వానకారుడయిన స్తోత్రను వినుము.

    8. అగ్నీ ! నీ రథము సమస్త దిశలందు తిరిగి హవి అందించు యజమానిని రక్షించును. అదే అహింసనీయ రథము. యజమానిని అయిన నాకు నలువైపుల వ్యాపించవలెను.

                                 పదవ సూక్తము

 ఋషి - వామదేవుడు, దేవత - అగ్ని ఛందస్సు - 1-3 పదపంక్తి, 4.6,7 పదపంక్తి
                      రుష్ణిక్, 5 మహాపదపంక్తి, 8 శ్రోణిక్.

    1. అగ్నీ ! మేము ఋత్విక్ గణములము. ఇంద్రాదుల స్తుతిద్వారా నిన్ను వర్థిల్ల చేతుము. గుఱ్ఱము రౌతును మోయును. అట్లే నీవు హవ్యవాహకుడవు. నీవు యజ్ఞకర్తవలె ఉపకారకుడవు, భజనీయుడవు, అతిశయ ప్రియడువు.

    2. మా యజ్ఞము భజనీయము, ప్రవృద్ధము, అభీష్టఫలప్రదము, సత్యభూతము, మహంతము. అగ్నీ ! నీవు మా యజ్ఞమునకు నేతవు.

    3. అగ్నీ ! నీవు జ్యోతిర్మయ సూర్యునివంటి వాడవు. సమస్త తేజోయుక్తుడవు. పరిశుద్ధ అంతఃకరణుడవు. మా అర్చనీయ స్తోత్రములద్వారా ప్రసన్నుడవు అగుము. మాకు అభిముఖముగా విచ్చేయుము.

    4. అగ్నీ ! నేడు మేము మా ఋత్విక్కుల వచనములచే నిన్ను స్తుతించుచున్నాము. హవ్యప్రదానము చేయుచున్నాము. సూర్యరశ్మివలె శోధించునట్టి నీ జ్వాల ప్రసరించును. మేఘమువలె నీ జ్వాల శబ్దము చేయును.

    5. అగ్నీ ! నీ దీప్తి ప్రియతమము. అహర్నిశల అలంకారమువంటిది. అది పదార్థములను ఆశ్రయించును పదార్థసమీపమున శోభిల్లును.

    6. అగ్నీ ! నీవు అన్నవంతుడవు. నీ విగ్రహము పరిశుద్ధ ఘృతము వంటిది, పాపరహితము. నీ పరిశుద్ధ రమణీయ తేజము అలంకారమువంటి దీప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.