Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    బిస్మిల్లా : యా అల్లా! మేమేం దొంగలమా? నమిలి మింగేస్తామా ? సాదా గాజులున్నాయి చేతికి. అమ్మను కడియాలు కావాలని అడుగుతాను. ఎలాంటివి? అంటుంది. ఇదిగో ఇలాంటివి అని చూపిస్తాను. రేపు తీసికెళ్ళు.
    హస్నూ : ఇచ్చేయండి. నావి కావు. నావే అయితే మీరు అడగడమూ నేను కాదనడమూనా ?
    బిస్మిల్లా : అయితే మీ తల్లిగారివేమో! ఆవిడ పొయిం తరవాత కూడా మీవి కాలేదా ?
    హస్నూ : చూపించాను, అంతే. సరుకు నాది కాదు.
    బిస్మిల్లా : నాకు తెలియదన్నట్లు, ఆ రోజు కుదువ పెట్టడానికి నవాబు ఇచ్చిన కడియాలు కావూ ఇవి ? నా ముందే కదా ఇచ్చింది !
    హస్నూ : ఆఁ అఁ . అదెప్పుడూ?
    బిస్మిల్లా : "ఉమ్రావ్ అక్క కచేరీ కావాలన్నాడు నవాబు. పూర్తి వంద కావాలంది అక్క. నవాబు దగ్గర డబ్బు లేకుండే. నా ముందే పెట్టె తెరచి ఈ కడియాలు విసిరాడు " అని, "చూచావా అక్కా, ఇవే కావూ ఆ కదియాలూ ?" అని నన్ను అడిగింది.
    నేను : నన్నెందుకు అడుగుతావు? నువ్వేం అబద్దాలు చెపుతావా?
    బిస్మిల్లా : అదిగో ఆవాలు తిన్నాడు. ఇవి నవాబు'వని తెలిసిపోయింది. ఇక తిరిగి రావు.
    హస్నూ : బాగుంది. మేమిచ్చిన డబ్బు ?
    బిస్మిల్లా : డబ్బెక్కడ నుంచి వచ్చింది ? అదీ నవాబు సోమ్మేగా?
    హస్నూ : బావుంది. సావుకారు దగ్గర వడ్డీకి తెచ్చి ఇస్తేనూ?
    బిస్మిల్లా : అయితే సాహుకారునే పంపించండి. మీకెందుకు శ్రమ. వారికి ముట్ట చెపుతాం. తాము దయచేయవచ్చు.
    హస్నూ : కడియాలు తీసుకోకుండా కదలను.
    బిస్మిల్లా : నేనివ్వను.
    హస్నూ : అయితే దౌర్జన్యమా ?
    బిస్మిల్లా : దౌర్జన్యమే. మెదలకుండా జారుకోండి.
    హస్నూ: సరే. ఉండనివ్వండి. రేపు ఇవ్వండి.
    బిస్మిల్లా : "రేపటి సంగతి చూతాం. " తీవ్రంగా అనేసింది. హస్నూ మెదలకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది.
    నవాబు బాబాయి చబ్బన్ గారు నౌకర్ల ద్వారా లెక్కలు సరి చూపించారు. సరుకులు ఎవరెవరి మారీ పుత్తున ఉన్నాయో అవి విడిపించారు. కదియలను గురించి హస్నూను అడిగితే తనద్వారా కుదువ పెట్టలేదని స్పష్టంగా చెప్పేశాడు. అందుకే హస్నూ మియా కు బుగులు.
    హస్నూ వెళ్ళిపోయిన తరవాత బిస్మిల్లా నాతొ అన్నది " చూచావా అక్కా! వీడు వట్టి తుచ్చుడు. నవాబు ఇల్లంతా గుల్ల చేశాడు. ఈ దొంగను పట్టడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పుడు దొరికాడు. ఇంక ఈ కడియాలు ఇస్తానా? ఏం చేస్తాడు? అసలే దొంగ సొమ్ము ."
    నేను : ఇవ్వనే ఇవ్వవద్దు. ఇస్తే నవాబుకు ఇవ్వు. మేలు చేసినట్లు అవుతుంది.
    బిస్మిల్లా : నవాబుకు కూడా ఇవ్వను. అక్కా! పదకొండు వందల జత రెండువందల పాతికకు కొట్టేశాడు. ఆ రెండు వందల పాతిక పారేస్తాను. కాకుంటే పది, ఇరవై వడ్డీ అవుతుంది.
    నేను : సాహుకారు ఎందుకలా చేశాడు ?
    బిస్మిల్లా: సాహుకారు లేడు , గీవుకారు లేడు, వీడే డబ్బిచ్చాడు. పెద్ద నవాబు అడిగితే బొంకాడు. మరేమన్నా అంటే ఠాణా చూస్తాడు.
    ఇంతలో నవాబు వచ్చారు. ఒంటరిగా కాలి నడకన. ముఖం ఉదాసీనంగా ఉంది. కళ్ళలో నీరు నిండి ఉంది. ఆ ఠీవి లేదు. ఆ దర్పం లేదు. ఆ గౌరవం లేదు. మర్యాద లేదు. వచ్చి మౌనంగా కూర్చున్నారు.
    వాస్తవానికి నా కళ్ళకు నీళ్ళు వచ్చాయి. నిగ్రహించాను. వాహ్ బిస్మిల్లా బోగందంటే అలా ఉండాలి. రావడం రావడమే కడియాల కధ మొదలు పెట్టింది.
    బిస్మిల్లా : నవాబ్! చూడు ఆ రోజు కుదువ పెట్టడానికి హస్నూకు ఇచ్చిన కడియాలే కాదూ ఇవి?
    నవాబు : అవును. అవే. తాను కుదువ పెట్టలేదనీ నీల్గాడే?
    బిస్మిల్లా : ఎంతకు పెట్టారు ?
    నవాబు : గుర్తులేదు . బహుశా రెండువందల యాభై కో, రెండు వందల పాతికకో అయి ఉండవచ్చు.
    బిస్మిల్లా ; వడ్డీ ఎంత?
    నవాబు : వడ్డీ విషయం ఆలోచించిందేవరు ? కుదవకు పోయింది, విడిపించే గతి వస్తేగా వడ్డీ లెక్కలు.
    బిస్మిల్లా : అయితే నేను తీసుకోనా ?
    నవాబు : తీసుకో.
    బిస్మిల్లా: మీరు ఊఁ అంటే హస్నూ మియాఁ ను ఠాణా కు పంపుతాను.
    నవాబు ; వద్దు, నాతోడు. అతడు "సయ్యదు" (మహామ్మదీయులలో ఒక తెగ)
    బిస్మిల్లా : వాడు సయ్యదా! తండ్రి ఎవడో తెలియదూ ?
    నవాబు ; ఏమైనా కానీ. అతడు చెప్పుకునేది అది.
    నవాబు ధైర్యాన్ని మనసులోనే మెచ్చుకున్నాను. ఎంత ఔదార్యం ? ఎంతైనా నవాబుల సంప్రదాయం.
    ఎంత కఠీనురాలు బిస్మిల్లా! చట్టన్ పిలుస్తూందనే  మిషతో నవాబును త్వరగా పంపించేసింది. ఎవరికి మాట ఇచ్చిందో ఆ భగవంతుడికే తెలియాలి.
    తరవాత రెండు మూడు రోజులకు నేను ఖానమ్ దగ్గర కూర్చుని ఉన్నాను. ఒక ముసలది వచ్చి వంగి ఖానమ్ కు సలామ్ చేసింది. ఖానమ్ కూర్చోవలసిందని సంజ్ఞ చేసింది. కూర్చుంది.
    ఖానమ్ : ఎక్కడ్నుంచి వచ్చావు ?
    ముసలది : ఎక్కడి నుంచి వచ్చింది ఏం చెప్పను ? ఇక్కడ ఎవరూ లేరు కదా ?
    ఖానమ్ : అవ్వా! ఇక్కడేవరున్నారు. నేనున్నాను. నువ్వున్నావు. ఇది చిన్నపిల్ల. అర్ధం చేసుకునేంత శక్తి లేదు. చెప్పు.
    ముసలాది : నన్ను నవాబ్ ఫఖ్రున్నిసా బేగమ్ పంపారు.
    ఖానమ్ : ఎవరు ? పఖ్రున్నిసా బేగం గారా?
    ముసలాది: మీకు తెలీదా ? నవాబు చబ్బన్ గారి.....
    ఖానమ్ :అర్ధమైంది చెప్పు.
    ముసలది : నన్ను బేగమ్ గారు పంపారు. బిస్మిల్లా జాన్ తల్లిగారు మీరేనా ?
    ఖానమ్ : అవును సంగతేమిటి?
    ముసలది: బేగం గారు ఇలా చెప్పారు. "చబ్బన్ నాకు ఏకైక పుత్రుడు. నాకు అతడంటే ప్రాణం. తండ్రి కూడా ప్రాణాలిచ్చేవాడు. బాబాయి కూడా శత్రువు కాడు. తన బిడ్డలా చూసుకుంటాడు. వారికి ఒక్కతే కూతురు. చబ్బన్ తో ప్రదానం జరిగింది. చబ్బన్ పెండ్లి చేసుకోనన్నాడు. దాంతో మందిపోయారు. నేను జోక్యం కలిగించుకోలేదు. బెదిరించడానికే ఇదంతా చేసింది. మీ అమ్మాయి జీవితాంతం కొలువుంటుంది. అబ్బాయి ఇచ్చే జీతం కంటే పది ఎక్కువ ఇస్తాను. అతణ్ణి పెళ్ళికి ఒప్పించండి. ఈ ఇల్లు పాడవకుండా మాత్రం చూడండి. ఇందులో మీకూ మాకూ మేలు జరుగుతుంది. తరవాత మీ ఇష్టం ."
    ఖానమ్ :బేగం గారికి నా తరపున సలాములు చెప్పి ఇలా విన్నవించు. "అల్లా తలచుకుంటే అంతా తాము శలవిచ్చినట్లే జరుగుతుంది. నేను జీవితాంతం తమ దాసీని. ఏమాత్రం విరుద్దంగా ప్రవరించను నమ్మండి."
    ముసలది ; ఈ విషయం చబ్బన్ కు తెలియరాదని బేగం గారు అన్నారు. మంకు మనిషి తెలిస్తే ఒప్పుకోడు.
    ఖానమ్ : ఎవరి కంత ధైర్యం ? (నన్ను చూచి) ఎవరి ముందూ పోక్కరాదూ.
    తరువాత ముసలది ఖానమ్ ను నేరుగా తీసికెళ్ళి ఏదో గుసగుస చెప్పింది. నేను వినలేదు. కాని ముసలది వెళ్ళిపోయేప్పుడు ఖానమ్ "మేము ఎంతో కాలం నుండి మీ ఉప్పు తింటున్నాం. దీని అవసరం ఏమొచ్చింది అని బేగం గారికి విన్నవించు" అనడం విన్నాను.
    వృద్దురాలు వెళ్ళి పొయిం తరువాత ఖానమ్ బిస్మిల్లాను పిలిపించింది. చెవిలో ఏదో మంత్రం ఊదింది. మరుసటి సారి నవాబు గారు విచ్చేసినప్పుడు కొలువుకాలంలో కూడా జరుగనంతటి గౌరవమర్యాదలు జరిగాయి నవాబుకు.    




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.