Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    11. మేధాతిథి మొదలగువారు యజ్ఞము ద్వారా గోనిరోధక పర్వతమును కొట్టి పారవేసినారు. గోవులతో కలిసి పోయినారు. కర్మలనేతలు అంగిరోగణము సులభముగా ఉషను కనుగొన్నారు. తదనంతరము అగ్ని మంథనమున అగ్ని కలిగిన తరువాత సూర్యుడు ఉదయించినాడు.

    12. అగ్నీ ! మరణరహితము, విఘ్నశూన్యలు, మధురజలయుతములగు నదీదేవేరులు యజ్ఞమున ప్రేరితులయి పరిగెత్తుటకు ప్రోత్సహించిన అశ్వమువలె సర్వదా ప్రవహించుచుందురు.

    13. అగ్నీ ! మమ్ము హింసించువాని యజ్ఞమునకు ఎన్నటికిని వెళ్లకుము. దుష్టబుద్ధిగల పొరుగువాని యజ్ఞమునకు వెళ్లకుము. మమ్ము వదిలి ఇతర బంధువుల యజ్ఞములకు వెళ్లవద్దు. కుటిల చిత్తుడగు భ్రాత హవిని కోరకుము. మేము సహితము మిత్రుడు లేక శత్రువు ఇచ్చిన ధనమును అనుభవించము. కేవలము నీవు ప్రసాదించిన ధనమునే వినియోగింతుము.

    14. సుయజ్ఞా ! అగ్నీ ! నీవు మా రక్షకుడవు. నీవు మా హవ్యమున ప్రీతుడవు అగుము. ఆశ్రయదానము చేయుము. మమ్ము రక్షింపుము. మమ్ము ప్రదీప్తులను చేయుము. మాకుగల గట్టి పాపములను నాశము చేయుము. వర్తమాన రాక్షసుని నాశము చేయుము.

    15. అగ్నీ ! మా ఈ అర్చనీయ వస్త్రమున నీవు ప్రీతుడవగుము. శూరా ! మేము సమర్పించు స్తోత్రసహిత అన్నమును గ్రహింపుము. హవిరన్నగ్రహీతా ! అగ్నీ ! నీవు మంత్రములను సేవించుము. దేవతలను ఉద్దేశించిన స్తుతి నీకు సంబంధించవలెను.

    16. విధాతా ! అగ్నీ ! నీవు కర్మజ్ఞాతవు. ఉత్కృష్ట ద్రష్టవు. మేము ప్రాజ్ఞులము, కవులము. నిన్ను ఉద్దేశించి ఫలప్రాపకము, గూఢము. అతిశయవక్తవ్యము, కవిగ్రధితమగు ఈ సమస్త వాక్యమును స్తోత్ర, శస్త్రములతో ఉచ్చరించుచున్నాము.

                          నాలుగవ సూక్తము

        ఋషి - వామదేవుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.

    1. అగ్నీ ! నీవు నీ తేజః పుంజమును విస్తరించుకొనుము. అది వేటకాడు తనవలను విస్తరించిన రీతి అగును. మంత్రి సహితముగా రాజు ఏనుగు మీద పయనించినట్లు నీవు నీ తేజోసమూహములతో పయనించుము. నీవు శీఘ్రముగా సేన వెంటసాగి శత్రుసేనను హింసించుము. శత్రువును నష్టపరచుము. అత్యంత తీక్ష్ణ తేజమున రాక్షస భేదనము చేయుము.

    2. అగ్నీ ! నీ కిరణములు భ్రమరకారిణులు. శీఘ్రగామినులు. సర్వత్ర ప్రసూతములు. నీవు అత్యంత దీప్తిమంతుడవు. పరాభవ సమర్థుడవు. నీ తేజోరాశితో శత్రువును దగ్ధము చేయుము. శత్రువులు నిన్ను నిరోధించలేరు. నీవు జుహువు ద్వారా తాపశీల విస్ఫులింగమును, ఉల్కను సర్వత్ర వికీర్ణము చేయుము.

    3. అగ్నీ ! నీవు అత్యంత వేగవంతుడవు. శత్రువులను బాధించు కిరణములను శత్రువుమీద ప్రయోగింపుము. ఎంతటివాడును నిన్ను బాధింపజాలడు. దూరమునుండిగాని దగ్గరనుండిగాని అనిష్టము తలపెట్టినవానినుండి సకల ప్రజలను రక్షింపుము. మేము నీవారము. అందువలన ఎంతటి శత్రువయినను మమ్ము పరాభవింపలేడు.

    4. తీక్ష్ణ జ్వాలాజ్వలిత అగ్నీ ! ఉత్తిష్ఠ లెమ్ము. రాక్షసులను వధించుటకు తరలుము. శతృవులమీద జ్వాలాజాలము విసరుము. తేజోరాశితో శత్రువులను భస్మము చేయుము. సమిద్ధ అగ్నీ ! మాతో శత్రుత్వముగలవానిని ఎండుకట్టెవలె కాల్చివేయుము.

    5. అగ్నీ ! నీవు రాక్షసులను హతమార్చుటకు సిద్ధమగుము. మమ్ము మించిన బలవంతులను ఒక్కొక్కరిగా అందరిని పరిమార్చుము. నీ దేవ సంబంధ తేజమును ఆవిష్కరించుము. ప్రాణులను బాధించువారి ధనువును జ్యాశూన్యము చేయుము. ఇంతకుముందు పరాజితులయిన, పరాజితులుకాని శత్రువులను దునుమాడుము.

    6. యువతమా అగ్నీ ! నీవు గమనశీలుడవు. ప్రధానుడవు. నిన్ను స్తుతించువాడు నీ అనుగ్రహ పాత్రుడు అగును. నీవు యజ్ఞస్వామివి. నీవు అతని కొఱకు శోభన దినములను, ధనములను, రత్నములను గ్రహించుము. నీవు అతని ఇంట విరాజిల్లుము.

    7. అగ్నీ ! నిత్య సంకల్పిత హవ్యము, ఉక్థమంత్రముల ద్వారా నిన్ను ప్రీతుని చేయువాడు సౌభాగ్యశాలి, సుదాత అగును. అతనికి దుర్లభ ప్రాప్యమగు వంద ఏళ్ల ఆయువు కలుగును. ఆ యజమానికి దినములన్నియు సుదినములు అగును. అతడు యజ్ఞఫలసాధక సమర్థుడు కావలెను.

    8. అగ్నీ ! మేము నీ అనుగ్రహ బుద్ధిని పూజింతుము. నిన్ను గురించి ఉచ్ఛరించిన వాక్యము ప్రతిధ్వనించి నిన్ను స్తుతించవలెను. మేము పుత్ర పౌత్రాదులతో ఉత్తమ రథ, ఉత్తమ అశ్వయుక్తులమయి నీ పరిచర్యలు చేసెదము. నీవు మా కొఱకు నిత్యము ధనము దాల్చుము.

    9. అగ్నీ ! నీవు రాత్రింబవళ్లు ప్రదీప్తుడవు అగుదువు. ఈ లోకమున పురుషులు ప్రతిదినము నీ వద్ద నీ పరిచర్య చేయుదురు. మేము సహితము శత్రుధనమును మా ధనము చేసికొని, పుత్రపౌత్రాదులతో విహరించుచు ప్రసన్న పూర్వకముగా నీ పరిచర్య చేసెదము.

    10. అగ్నీ ! సుందర అశ్వయుక్తుడయి, యాగయోగ్యధన సంపన్నుడయి, వ్రీహి ఆది ధనసంయుక్త రథముతో నీ వద్దకు వచ్చువానిని నీవు రక్షింతువు. యథావిధిగా నీకు అతిథి పూజలు అందించువానికి నీవు మిత్రుడవు అగుదువు.

    11. అగ్నీ ! నీవు హోతవు. యువతముడవు. ప్రజ్ఞావంతుడవు. స్తోత్రములద్వారా నీతో బంధుత్వము ఏర్పడినది. ఆ శక్తితో మహా రాక్షసరూప శత్రువులను భంగపరచగలము. ఈ స్తోత్రాత్మక వచనము పితృపాదులు గోతముని వద్దనుండి మా వద్దకు వచ్చినది. నీవు శత్రువినాశకుడవు. నీవు మా స్తుతి వచనములను గ్రహింపుము.

    12. హే సర్వజ్ఞ అగ్నీ ! నీ కిరణములు నిరంతర జాగరూకములు, సర్వదా గమన శీలములు, సుఖాన్వితములు, ఆలస్యరహితములు, అహింసితములు, ఆశ్రాంతములు, పరస్పర సంగతములు, రక్షణ క్షమలు. అవి ఈ స్థానమున నిలిచి మమ్ము రక్షించవలెను.

    13. అగ్నీ ! నీ కిరణములు రక్షాకవచములు. అవి దయదలచి మమతా, పుత్రుడు, నేత్రహీనుడు దీర్ఘతముని శాపము నుండి రక్షించినవి. నీవు సర్వప్రజ్ఞావంతుడవు. నీవు ఆదరపూర్వకముగ ఆ కిరణములను కాపాడుము. నీ శత్రువులు నిన్ను నష్టపరచదలతురు. కానివారికి అది అసాధ్యమగును.

    14. అగ్నీ ! నీ గమనము లజ్జారహితము. స్తోతలమగుమేము నీ అనుగ్రహమున సమానధనవంతులము అగుదుము. నీ రక్షణలు పొందుదుము. నీ ప్రేరణవలన మాకు అన్నము లభించవలెను. సత్యవిస్తారక, పాపనాశక అగ్నీ ! సమీపస్థ, దూరస్థ శత్రువులను నష్టపరచుము. క్రమానుసారముగా సమస్త కార్యములు నిర్వహింపుము.

    15. అగ్నీ ! ఈ ప్రదీప్త స్తుతులతో మేము నీ పరిచర్య చేయుదుము. మా ఈ స్తోత్రమును గ్రహించుము. స్తుతిహీనులగు రాక్షసులను భస్మము చేయుము. మిత్రులకు పూజనీయుడవగు అగ్నీ ! నిందకుల పరివాదము నుండి మమ్ము రక్షింపుము.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత మూడవ అష్టకము, నాల్గవ మండలమున నాలుగవ అధ్యాయము సమాప్తము)


    ఓం వతామివవ్తి మాయివో వధీరావ్రతాదెహవాం ప్రథమా ధ్రువాణి |
    వరోదపీ అద్రువో వీద్యాభిర్న పర్వతావి వమేత స్థివాంసః ||

    అయిదవ అధ్యాయము             అయిదవ సూక్తము

    ఋషి - వామదేవుడు, దేవత - వైశ్వావరాగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.

    1. మేము యజమానులము. మేము సమానరూపమున ప్రీతియుక్తులము అయినాము. మేము అభీష్ట వర్షి, దీప్తియుక్తుడు అగు వైశ్వానరాగ్నికి హవ్యము ఇవ్వదలచినాము. అది ఎట్లు? స్తంభము ఇంటికప్పును భరించినట్లు ఆ వైశ్వానరాగ్ని తన బృహత్ శరీరమున ద్యులోకమును భరించుచున్నాడు.

    2. హోతలారా ! అగ్ని హవ్యయుక్తుడయి మరణశీలుడు, పరిపక్వబుద్ధిగల యజమానులకు ధనము ప్రదానము చేయును. అతనిని నిందించకండి. అగ్నిమేధావి. అమరుడు. ప్రజ్ఞావంతుడు. వైశ్వానరుడు. నేతృశ్రేష్ఠుడు.
మహాహనుడు.

    3. అగ్ని మధ్యమ, ఉత్తమరూపముల స్థానద్వయమున పరివ్యాప్తుడు అగువాడు. తీక్ష్ణ తేజోవిశిష్టుడు. మహాసారవంతుడు. అభీష్టవర్షి. ధనవంతుడు. అత్యంతగుప్త గోపదమువలె రహస్యుడు. అతడు జ్ఞాతవ్యుడు. విద్వాంసులు అతని మహా స్తోత్రమును గ్రహించి మాకు తెలుపవలెను.

    4. మిత్రావరుణుల యొక్క ప్రియమును, స్థిరమును అయిన తేజస్సును ద్వేషించి, హింసించు విద్వాంసులను సుందర ధనవిశిష్టుడు, తీక్ష్ణ వంతుడగు అగ్ని తన అత్యంత సంతాపకర తేజమున దగ్ధము చేయును.

    5. సోదరులు లేనిది, చెడు నడతలది, పతిని ద్వేషించునది, దుష్టచారిణి అగు స్త్రీలవలె యజ్ఞహీనుడు, అగ్నిద్వేషి, సత్యరహితుడు, సత్యవచన శూన్యుడగు పాపి నరక స్థానమును పుట్టించువాడు అగుచున్నాడు.

    6. అగ్నీ ! నీవు శోధకుడవు. మేము నీకర్మను పరిత్యజించము. క్షుద్రుడు మోయుటకుగాను ఎక్కువ బరువు ఇవ్వబడును. అట్లే నీవు నాకు విశేష ధనమును ప్రసాదించుము. ఆ ధనము శత్రుపీడకము, అన్నయుక్తము, ఇతరులకు అవగాహముకానిది, మహాస్పర్శయోగ్యము, ఏడువిధములది కావలెను.

    (సప్తగ్రామ్యాపశవః సప్తారణ్యా ఇతి శృతేః అని శాయణుడు. ఏడుగ్రామ సంబంధ, ఏడు అరణ్య సంబంధ పశువులని శృతి)

    7. ఈ స్తుతి సుయోగ్యము. సర్వుల విషయమున సమాన భావము కలది. ఇది ఉపయుక్త పూజా విధాన సహితమయి వైశ్వానరుని వద్దకు త్వరగా సాగవలెను. అది ఆ స్తుతి వైశ్వానరుని ఆరోహణకాని, దీప్తమండల పృథ్వివద్దనుంచి అచల ద్యులోకము పైన సంచరించుటకుగాను తూర్పుదిక్కున ఎక్కుచున్నది.

    8. దోగ్ధగణము, జలమువలె పితికిన పాలను వైశ్వానరుడు గుహలో దాచిఉంచును అని లోకోక్తి. వైశ్వానరుడు విస్తీర్ణ పృథ్వియొక్క ప్రియము మరియు శ్రేష్ఠ స్థానమును పరిరక్షించును. నా ఈ వాక్యమునకన్న చెప్పదగినది ఏమున్నది?

    9. పాలిచ్చు ఆవు అగ్ని హోత్రాది కర్మలలో ఎవనిని సేవించునో ఎవడు అంతరిక్షమున దీప్తిమంతుడయి ఉన్నాడో ఎవడు గుహలో నిహితుడయి ఉన్నాడో ఎవడు శీఘ్ర స్పందమానుడో ఎవడు శీఘ్రగమన కారియో ఎవడు పూజ్యుడో అట్టి సూర్యమండలాత్మక వైశ్వానరుని మేము ఎఱుంగుదుము.

    10. ద్యావాపృథ్వులు పితా-మాతా స్వరూపులు. వాటి నడుమ దీప్తిమంతుడగు వైశ్వానరుడు వ్యాపించి ఉన్నాడు. ఆవుచన్నులందు రమణీయ దుగ్ధములు దాగి ఉన్నవి. వైశ్వానరుడు తననోటితో పాలు త్రాగుటకు ప్రబోధితుడు కావలెను. వైశ్వానరుడు అభీష్టవర్షి. దీప్తుడు. ప్రియతముడు. అతడు గోమాత చన్నులందలి పాలు త్రాగు కోరికగలవాడు కావలెను.

    11. మమ్ము యజమాని అడిగినాడు. మేము నమస్కార పూర్వకముగా సత్యము పలుకుచున్నాము. జాతవేదా ! నీకు సంబంధించిన ఈ స్తుతిద్వారా మాకు ధనము లభించవలెను. నీవు ఈ ధనపు స్వామివి అగుము. నీవు సంపూర్ణ ధనముల స్వామివి అగుము. పృథ్వియందలి ధనములన్నింటికి ద్యులోకమునందున్న ధనములన్నింటికి నీవే స్వామివి.

    12. ఈ ధనమునకు సాధనభూతమగు ధనము ఏది? జాతవేదా ! అది నీకు తెలియును. మాకు చెప్పుము. ఈ ధనమును పొందదగు మార్గము. అందుకగు నిగూడ, ఉత్కృష్ట ఉపాయము చెప్పుము. ఆ మార్గము నిందితము కారాదు.

    (ధనము ప్రసాదించమని ప్రార్థనకాదు. ధనార్జనకు గల సన్మార్గమును ఉపదేశించమనుచున్నాడు)

    13. తూర్పునకు హద్దు ఏది? పదార్థ జ్ఞానము ఏమిటి? రమణీయ పదార్థ సమూహము ఏమిటి? శీఘ్రగమనముగల అశ్వము సంగ్రామమున అభిముఖముగా సాగును. అట్లే మేము అన్నింటిని అధిగమింతుము. ద్యుతిమతి, మరణరహిత, ఆదిత్యపత్ని, ప్రసవిత్రి, ఉష ఎప్పుడు మా కొఱకు ప్రకాశమానమగును? వ్యాపించును?

    14. అగ్నీ ! ఈ మనిషి అన్నరహితుడు. ఉక్థమంత్రము. ఆరోపణీయ అల్పాక్షర వచనములతో అతృప్తుడు. వాడు ఈ లోకమున నీతో ఏమి చెప్పగలడు? హవిలేని మాట వ్యర్థము. హవిరాది సాధ్యహీనులు దుఃఖములు పాలగుదురు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.