Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
సోమమా! ఋతపు రక్షణకు నిన్ను భజించుచున్నాను. ఋతపు బాహుళ్యమునకు నిన్ను భజించుచున్నాను. ఋతపు ధారణకు నిన్ను భజించుచున్నాను. ఋతపు వాస్తవము కొరకు నిన్ను భజించుచున్నాను. ఋతపు ప్రకాశమునకు నిన్ను భజించుచున్నాను.
(ఋతము సత్యమగును. యజ్ఞమగును.)
2. ప్రజాపతి 'విరాట్' ఛందస్సును ఆవిష్కరించినాడు. అతడు ఆ విరాట్టుచే సర్వమును సృష్టించినాడు. అందు కొంత భూతముగను, కొంత భవిష్యత్తుగను విభజించినాడు. కాని ఆ విరాట్టును గురించి ఋషులకు తెలియపరచలేదు.
జమదగ్ని తపస్సు చేసినాడు. విరాట్ ఛందస్సును దర్శించినాడు. దానిచే ధేనుస్వరూప భోగములను కల్పించినాడు. అందువలన పృశ్నినామక మంత్రములకు పృశ్నిత్వము కలిగినది.
(పృశ్ని - కామధేనువు.)
3. యజమాని పృశ్ని నామక మంత్రములను గ్రహించినచో కామధేను సదృశభోగములను అనుభవించును.
4. 'వాయురసి' అను మంత్రముచే ప్రాణ, అపానములను పోషించుచున్నాడు.
5. 'చక్షురసి' అను మంత్రము వలన కన్నులు, చెవుల స్థిరత్వ హేతువగు ఆయువును పొందుచున్నాడు.
6. 'రూపమసి' అను మంత్రముచే చక్కని సంతతిని పొందుచున్నాడు.
7. 'ఋతమసి' అను మంత్రముచేత క్షాత్ర సంపత్తిని పొందుచున్నాడు.
8. 'భూతమసి' అను మంత్రమున పశువులను పొందుచున్నాడు. పశువు నీరు, ఓషధులకు మూలము కదా!
9. ప్రాణ, అపాన, ఆరోగ్యము నుంచి పశుప్రాప్తి వరకు అయిదు మంత్రములచే చెప్పబడినది. యజమాని ఆ ఫలములను అన్నింటిని అందుకొనుచున్నాడు.
10. 'సోమమా! ఋతపు రక్షణకు నిన్ను భజించుచున్నాను' అని చెప్పబడినది. ఈ భూమియే ఋతమునకు రక్షణయగును. అట్లనుట వలన యజమాని భూమినే జయించుచున్నాడు.
'సోమమా! ఋతపు బాహుళ్యమునకు నిన్ను భజించుచున్నాను' అని చెప్పబడినది. అంతరిక్షమే ఋతపు బాహుళ్యమగును. అట్లనుట వలన యజమాని అంతరిక్షమును జయించుచున్నాడు.
'సోమమా! ఋతపు ధారణకు నిన్ను భజించుచున్నాను' అని చెప్పబడినది. ద్యులోకము ఋతపుధారణ అగుచున్నది. అట్లనుట వలన యజమాని ద్యులోకమును జయించుచున్నాడు.
సోమమా! నిన్ను ఋతపు వాస్తవము కొరకు భజించుచున్నాను అని చెప్పబడినది. దిశలే ఋతపు వాస్తవమునకు రూపములు. అట్లనుటచే యజమాని దిశలను జయించుచున్నాడు.
'సోమమా! నిన్ను ఋతపు ప్రకాశము కొరకు భజించుచున్నాను' అని చెప్పబడినది. స్వర్గమే ఋతమునకు ప్రకాశమగును. అట్లనుటచే యజమాని స్వర్గమునే జయించుచున్నాడు.
దేవలోకములు ఇంతటివే. యజమాని ఆలోకములను అన్నింటిని జయించుచున్నాడు - వశపరచుకొనుచున్నాడు.
11. వాయురసీత్యాది మంత్రములు పది. విరాట్ ఛందస్సు పది అక్షరములది. విరాట్టు అన్న స్వరూప. యజమాని అన్నస్వరూపమగు విరాట్ ఛందస్సునందే ప్రతిష్ఠించబడుచున్నాడు.
ఆరవ అనువాకము
1. దేవతలు యజ్ఞము చేసియు ఫలములను పొందలేక పోయినారు. అట్టి ఫలములను 'పర' నామక గ్రహములచే పొందినారు. అందువలననే పరనామక గ్రహములకు 'పరత్వము' కలిగినది.
2. యజ్ఞము వలన ఫలము లభించనపుడు ఆ ఫలము పర అతిగ్రాహ్యగ్రహములను అందుకొనుట వలన పొందవచ్చును.
3. యజమాని ప్రథమ అతిగ్రాహ్యగ్రహమును గ్రహించవలెను. అందువలన అతడు మొదటిదయిన భూలోకమును జయించును. అతడు రెండవ అతిగ్రాహ్యగ్రహమును గ్రహించవలెను. అందువలన అతడు అంతరిక్షమును జయించును. మూడవ అతిగ్రాహ్యగ్రహమును గ్రహించినచో అతడు స్వర్గలోకమును జయించును. మూడు లోకములను జయించుటకు గాను యజమాని మూడు అతిగ్రాహ్య గ్రహములను గ్రహించవలెను.
4. విషువదహస్సునకు ఉత్తరములైన మూడు అహస్సులలో మూడవ అహస్సు నుండి వ్యుత్ర్కమముగ నున్న గ్రహములను గ్రహించవలెను. అందువలన యజమాని పృథివి, అంతరిక్ష, ద్యులోకములను జయించి తిరిగి ద్యులోకము నుండి భూలోకమునకు దిగివచ్చును.
5. విషువదహస్సునకు పూర్వాహస్సులందు ఆరోపణక్రమమున మూడు గ్రహములను గ్రహించినందున వరుసగా భూలోక, అంతరిక్షలోకములు పొందదగినవి అగును.
విషువదహస్సునకు ఉత్తరములైన మూడు అహస్సులందు అవరోహణ క్రమమున మూడు గ్రహములను గ్రహించినచో వరుసగా ద్యులోకము, అంతరిక్షము, భూలోకములు పొందదగినవి అగును.
అందువలన మానవులు అక్షయసారములు గల లోకములను ఆశ్రయించి జీవించుచున్నారు.
6. లోకమున నీటినుండి ఓషధులు పుట్టుచున్నవి. నరులకు ఓషధులు అన్నముగా ఏర్పడుచున్నవి. ప్రజలు ప్రజాపతిని అనుసరించి పుట్టుచున్నారు. ఈ మూడింటికి కారణము లేమి? అని కొందరు వేదవిదులు ప్రశ్నించినారు.
అందుకు ఒక విద్వాంసుడు అందుకు మూడు అతిగ్రాహ్య గ్రహములు కారణములని సమాధానము చెప్పినాడు.
7. ప్రథమ అతిగ్రాహ్యగ్రహమా! నిన్ను ఓషధుల కొరకని నీటివద్దనుండి గ్రహించుచున్నానని ప్రథమ అతిగ్రాహ్యగ్రహమును గ్రహించవలెను. అందువలన జలముల నుండి ఓషధులు సంభవించుచున్నవి.
8. ద్వితీయ అతిగ్రాహ్య గ్రహమా! నిన్ను ప్రజల కొరకు ఓషధుల వద్దనుండి గ్రహించుచున్నానని ద్వితీయ అతిగ్రాహ్యగ్రహమును గ్రహించవలెను. అందువలన ఓషధులు నరులకు ఆహారము అగుచున్నవి.
9. తృతీయ అతిగ్రాహ్య గ్రహమా! నిన్ను ప్రజల, ప్రజాపతి కొరకు గ్రహించుచున్నాను అని తృతీయ అతిగ్రాహ్యగ్రహమును గ్రహించవలెను. అందువలన ప్రజలు ప్రజాపతిని అనుసరించి పుట్టుచున్నారు.
ఏడవ అనువాకము
1. ప్రజాపతి దేవతలను సృష్టించినాడు. అసురులను సృష్టించినాడు. వారిని అనుసరించి యజ్ఞమును సృష్టించినాడు, ఛందస్సును సృష్టించినాడు.
దేవతలు ఐకమత్యమును కోల్పోయినారు. వివిధ రీతులవారయినారు. వివిధ దేశములకు పోయినారు. అట్లగుటచే వారినుండి యజ్ఞము తొలగిపోయినది. ఛందస్సు తొలగిపోయినది. అసురులు ఐశ్వర్యములు అనుభవించుచున్నారు.
అప్పుడు దేవతలు ఒకచోట కూడినారు. తమ తమ బాధలు చెప్పుకున్నారు. అందరు ఒక్కటిగా ప్రజాపతి వద్దకు వెళ్లినారు. తమను గురించి విన్నవించుకున్నారు. ప్రజాపతి వారు చెప్పినది విన్నాడు. వైదిక మంత్రముల సారము తీసి వారికి ఇచ్చెదను అన్నాడు. అన్నట్లు వైదిక మంత్రముల సారమును దేవతలకు ఇచ్చినాడు. వైదిక మంత్రసారమును అనుసరించి ఛందస్సులు అసురుల నుండి తొలగినవి. అవి దేవతలను చేరినవి. ఛందస్సులను అనుసరించి యజ్ఞము దేవతలను చేరినది. అప్పుడు దేవతలు విజయులు అయినారు. అసురులు పరాజితులు అయినారు.
2. 1. ఆశ్రావయ 2. అస్తుశ్రేషట్ 3. యజ 4. యేయజామహే 5. వషట్కారః అను మంత్రపంచకమే వైదిక మంత్రసారము. ఈ విషయములు తెలిసి అనుష్టించినవాడు స్వయముగా విజయుడు అగుచున్నాడు. అతని శత్రువులు పరాజితులు అగుచున్నారు.
3. ఎందుకొరకు అధ్వర్యుడు ఆశ్రావణము చేయుచున్నాడని వేదవిదులు అడిగినారు. ఛందస్సుల సారము కొరకు అని సమాధానము చెప్పబడినది.
ఆశ్రావయ, అస్తుశ్రేషట్, యజ, యేయజామహే, వషట్కారః అను మంత్ర పంచకమే వైదిక మంత్ర సారము అగుచున్నది.
4. ఏ యజమాని ఈ విషయములు గ్రహించి ఏ కొంచెము పూజించినను సారసహిత వేదమంత్రముల చేత పూజించినవాడు అగుచున్నాడు.
5. బ్రహ్మవాదులు ఇట్లు ప్రశ్నించినారు:-
ఇంద్రుడు వృత్రుని వధించినాడు. అందువలన అతనికి పాపము కలిగినది. అది యజ్ఞార్హము కానిది. ఇంద్రుడు యతులను సాలవృకములకు వప్పగించినాడు. అందువలన అతనికి పాపము కలిగినది. అదియు యజ్ఞార్హము కాకున్నది. అట్టిస్థితిలో యజ్ఞము సమాప్తి పర్యంతము ఇంద్ర సంబంధి ఎట్లయినది?
యజ్ఞమే ఇంద్రుని యజ్ఞార్హమగు దేహము అగుచున్నది. అందువలననే ఆ దేహమును గూర్చి యజ్ఞము చేయుచున్నారు అనునది సమాధానమగును.
(ఇంద్రునకు రాజసి, సాత్త్వికి అను రెండు రూపములు ఉన్నవి. రాజసి యజ్ఞార్హము కాదు. సాత్త్వికి యజ్ఞార్హమగును.)
6. ఈ విషయము గ్రహించిన యజమానిని యజ్ఞము అనుసరించుచున్నది.
(యజ్ఞఫలము లభించును అని అర్థము.)
ఎనిమిదవ అనువాకము
1. అగ్నీ! నీవు హవిస్సును సేవించువాడవు. ఘృతప్రతీకవు. ఘృతమే మూలమైన వాడవు. యజమానికి ఆయువును కల్పించుము.
నీవు మధురము, నిర్మలమగు ఘృతమును ఆరగించుము. తండ్రి పుత్రుని రక్షించిన విధమున ఈ యజమానిని అంతటను రక్షింపుము.
2. యజమాని ఆహవనీయ, గార్హపత్యాగ్ను లందు హవిస్సును వండి నీటివద్దకు అవభృథమునకు పోవుట అపరాధము అగుచున్నది. ఆ అపరాధమునకు గాను యజమాని అగ్నులనుండి విచ్చిన్నుడు అగుచున్నాడు.
ఆ దోష నివారణమునకుగాను అవభృథమునకు పోవునపుడు "ఆయుర్దాఅగ్నే" ఇత్యాది మంత్రములచేత హోమము చేయవలెను. ఇందువలన యజమాని అగ్నులను శాంతింపచేయుచున్నాడు. దుఃఖమును పొందడు.
3. నేను యమునకు రుణపడి ఉన్నాను. దానిని ఈ జన్మయందే - ఈ యజ్ఞ ప్రదేశము నందే - నిశ్శేషముగ తీర్చుకొనుచున్నాను. అగ్నీ! అందువలన అప్పులు ఇచ్చు యముని నుండి నేను రుణ విముక్తుడను అగుచున్నాను.
4. సమస్త పాపనివారకమగు సక్త్వంజలీ! సర్వపాపదాహకమగు దావాగ్ని ముఖమున నిన్ను హోమము చేయుచున్నాను. అగ్నులు ముగ్గురు. 1. దొరికినది తినువాడు 'అగ్ధాత్' 2. హోమరహితమును తినువాడు 'అహుతాత్' 3. సమస్తమును తినువాడు 'సమసనాత్'. ఈ హోమమున వారు ముగ్గురు సంతుష్టులు కావలెను. వారు మాకు ఆహారమును, బలమును, ఆవాసమును, ధనమును కలిగింతురుగాత.
5. మా ముందు అగ్ని ఉన్నది. అతడు తేజస్సున వర్థిల్లవలెను - గృహములను దగ్ధము చేయకుండవలెను. మమ్ము రక్షించవలెను. అగ్ని యొక్క రక్షణలందు మాకు మరిన్ని గృహములు కలుగునుగాక.
6. వాయుదేవా! నీవు ఆకాశపాలకుడవు. ప్రసిద్ధుడవు. అనుగ్రహించుము. మాకు అన్నాది రసమును ప్రసాదించుము. మా వలన నష్టము కలిగిన అన్నాది రసములను మరల కలిగించుము. అంతేకాక మాకు - మేము కోరిన ధనములను - ప్రసాదించుము.





