Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
7. ఆదిత్యదేవా! నీవు అభ్యుదయుడవు. వేలసంఖ్యలో పశువులకు, ధనములకు ప్రభువువు. మాకు దారిద్ర్యము లేకుండునట్లును, ధనపుష్టి, సంతానవృద్ధి కలుగునట్లును, సంవత్సరములందు శుభములను కలిగించుము.
8. యముడే అగ్ని. వేదభూమి యమసంబంధి. యజమాని వేదిని ఆచ్చాదించుచున్నాడు. అందువలన అతడు యముని నుండి - వడ్డి వలన - వచ్చిన ధనమునే స్వీకరించినవాడు అగును.
వేదిని దగ్ధము చేయక ప్రయాణమై వెడలినచో యమభటులు అతని మెడకు పాశము వేసి పరలోకమునకు చేర్చెదరు.
9. తాను తీర్చని రుణము కొరకు యజమాని వేదిని దగ్ధము చేయవలెను. అట్లు చేయుటవలన అతడు ఈ జన్మముననే, ఈ యజ్ఞప్రదేశముననే యముని రుణము తీర్చిన వాడగుచున్నాడు. అప్పుడు రుణము తీర్చినవాడై స్వర్గమునకు చేరును.
10. యజమాని యజ్ఞాంగ సముదాయమును సంకీర్ణముగా అనుష్ఠించరాదు. అందువలన సాంకర్య దోషము కలుగును. దానిని నివారించుటకు దోసెడు పేలపు పిండిని హోమము చేయవలెను. ఆ అగ్నియే వైశ్వానరము. అతడు పేలపు పిండి హోమమున సంతుష్టుడగును. యజమానిని సాంకర్య దోషరహితుని చేయును.
11. ఆహ్నిక కర్మలు మాఘకృష్ణ అష్టమినాడు ప్రారంభింతురు.
ఒక పనిసాధించదలచినవాడు ఆనాడు నాలుగు మూకుళ్ల ద్రవ్యముచే అపూపము చేయవలెను. మరసటిరోజు ఉదయము ఆ అపూపము చేత పొదను కాల్చవలెను. పొద పూర్తిగా కాలినచో కార్యసిద్ధి అగును. కాలకున్న కార్యసిద్ధి కలుగకుండును.
12. పూర్వము ఋషులు పొదను కాల్చు విజ్ఞానము చేతనే దీర్ఘకాలిక కర్మలను ప్రారంభించినారట.
13. ఉపద్రష్టను, ఉపశ్రోతను, అనుఖ్యాతను తెలిసికొని యాగము చేయువాడు స్వర్గఫలమును అనుభవించును.
అగ్నియే ఉపద్రష్ట. వాయువు ఉపశ్రోత. ఆదిత్యుడు అనుఖ్యాత. ఇది తెలిసి యజించిన యజమాని స్వర్గఫలమును పొందుచున్నాడు.
14. 'అయంనోనభసా' అను మంత్రము అగ్నియే తేజోయుతుడని చెప్పినది. అందువలన నమస్కరించువాడు 'నా కర్మఫలమును రక్షింపుము' అని అగ్నినే ప్రార్థించినవాడు అగుచున్నాడు.
'సత్వంనో నభస్పతే' అను మంత్రము వాయువే ఆకాశపాలకుడని చెప్పబడినది. 'అసౌ ఆదిత్యదేవః' అనుమంత్రము ఆదిత్యుడే అభ్యుదయకారుడు అని చెప్పినది. అందువలన నా కర్మఫలమును రక్షించుమని ప్రార్థించినట్లగును.
తొమ్మిదవ అనువాకము
(వృషాలాంభ కర్మ.)
1. గోవులారా! మీకు మంచి వయసులో ఉన్న ఆబోతును ఇచ్చుచున్నాను. ఆ ప్రియునితో మీరు క్రీడించండి. జన్మతోనే మీరు సమవిభక్త అవయవములు కలవారు. మమ్ము శపించకండి. తరుణ వృషభమును ఇచ్చినాము కదా - అనుగ్రహించండి. అందువలన మాకు ధనపుష్టియు, అన్న పుష్టియు కలుగునుగాత.
2. ప్రజాపతీ! నీవు దేవతలకు పితరుడవు. నీ మహిమకు, జ్ఞానమునకు నమస్కరించుచున్నాను. నేను చెప్పుచున్నాను. నీవు వినుము. అంగీకరించుము. నేను శోభన యజ్ఞసాధనమగు వృషభముచే యజ్ఞము చేయుదును. ఈ వృషభ రూప హవ్యము దేవతలకు ప్రియము అగునుగాక.
3. ఈ వృషభము దేవతలకు ప్రీతికరమైనది. అందుకే కట్టివేయు బడినది. హుతమైనది. అది మేఘముల గర్భములందు జలమైనది. ఆకసమునుండి ఆధోరూపముగా ఓషధుల మీద కురియుచున్నది.
సూర్యుడు చంద్ర సంబంధియగు జలములను తన కిరణములచే పీల్చినాడు. అవియే పర్వత సదృశమగు మేఘరూపము దాల్చినవి.
4. ఈ వృషభము గోవులకు, దూడలకు తండ్రి. గోవులకు భర్త. గంభీర ధ్వని గల ఆబోతులకు తండ్రి. ఇదియే గోవుల పొట్టలో ఉన్న పిండము. పాలముంత యందలి పాలు. ఆవుల పొదుగునందలి అమృతసమక్షీరము. పాలవిరుగుడు. వెన్న. ఆజ్యము. ఇవన్నియు వృషభ సంబంధ సారరూప పరిణామములు.
5. వృషభమా! గోవులు వారి రాజ్యమునకు నిన్నే రాజునుగా వరించినవి. దేవతలు పూజనీయులు. వారు నిన్ను హవిస్సుగా ఆహ్వానించుచున్నారు. నీవు క్షత్రియుల దేహములందు నిలిచిన దానవు. అందువలన నీవు మాకు, మా శత్రువుల ధనమును పంచి ఇమ్ము.
6. ఈ అనువాకము నందలి మంత్రములచే యజించనట్టి యజమాని ముసలి పశువుతోనే యాగము చేసినవాడు అగుచున్నాడు. ఈ మంత్రములచే యజించినట్టి యజమాని వయసులో ఉన్న పశువుచే యజించినవాడు అగుచున్నాడు.
పదవ అనువాకము
(పశు ప్రాయశ్చిత్తము.)
1. మేకా! సూర్యదేవర దేవతల అభ్యుదయము కొరకు, బ్రహ్మక్షత్రియుల అభ్యుదయమునకు - బృహస్పతి ప్రజాపతి ప్రాప్తి కొరకు - తేజస్వంతమగు నిన్ను హోమము చేయును గాత.
2. మేకా! నీ గర్భము సారరహితమైనది. యోని నిస్సారమైనది. నీ అవయవములు సడలినవి. అట్టి నిన్ను దేవతలలో కలుపుచున్నాను.
3. గర్భప్రవర్తకదేవా! ఈ మేకగర్భమును ప్రవర్తింప చేయుము. గర్భమును నివర్తింపచేయు దేవా! ఈ మేక గర్భమును నివర్తింపచేయుము. గర్భమును శబ్దింపచేయు దేవా! నాలుగు దిశలందు ఈ మేక గర్భమును నినదింపచేయుము.
4. మేకా! నీ తకరిని - యోనిని - వృషణములను కోయుచున్నాను. తల్లిని, బిడ్డను, గర్భమును, గర్భాశయమును కోయుచున్నాను.
5. ఛాగీ! నీ ఆత్మ సర్వవ్యాప్తి అగునుగాక అని తొడల మధ్య భాగమును ఛేదించుచున్నాను.
6. ఈ మేక అవయవములు సారవంతములు. వివిధ రూపలు. తెల్లనివి. శుద్ధములు. స్థిరములు. ఈ అవయవములు మరొక జన్మనెత్తునుగాక.
7. ఒక పాదము, రెండు పాదములు, మూడు పాదములు. నాలుగు పాదములు, అయిదు పాదములు, ఆరు పాదములు, ఏడు పాదములు, ఎనిమిది పాదములు కల ఈ మేక లోకములందు వరుసగా వ్యాపించునుగాక.
8. మహీ ద్యౌః పృథివీచ నఇమం యజ్ఞం మిమిక్షితామ్ | పిపృతా నో భరీమభిః
భూమియు ద్యులోకమును గొప్పవి. అవి ఈ యజ్ఞమును ఆసేచనము చేయును గాత. అవి భరించగలవి. మమ్ము భరించును గాక.
పదకొండవ అనువాకము
(యాజ్యా పురోనువాక్యలు.)
1. ఇంద్ర బృహస్పతులారా! ఈ హవిస్సు మీకు ప్రీతికరము అగునుగాత. ఉక్థము, ప్రతిగరము మిమ్మే కీర్తించుచున్నవి.
2. ఇంద్ర బృహస్పతులారా! ఈ హవిరూప సోమము సమర్పించబడుచున్నది. రుచికరమగు హవిస్సు మీరు సేవించుటకు సమర్పించ బడుచున్నది.
3. ఇంద్ర బృహస్పతులారా! మీరు మాకు వందల అశ్వములను, వేల ధనములను ప్రసాదించండి.
4. బృహస్పతి మమ్ము పశ్చిమ, ఉత్తర, అధో దిశలందున్న హింసకుల నుండి రక్షించునుగాత. ఇంద్రుడు మమ్ము తూర్పు, దక్షిణ దిశలందున్న హింసకుల నుండి రక్షించునుగాక. మేము ఇంద్ర, బృహస్పతులకు మిత్రులము - వారు మాకు సుఖములు కలిగింతురుగాక.
5. అగ్నీ! నీవు పవిత్రుడవు. నీ కాంతులు సర్వత్ర సంచరించు చున్నవి. అవి వాయు ప్రేరితములు. ఇతర అగ్ని సంపర్కము కలిగినపుడు అగ్ని మండి పడును. అవి అనేకములను పావనము చేయును. ద్యులోకమున ఉండతగినవి. నిత్యనూతనములు. దోష పరిహారములు. అవి - ఆ కాంతులు - హవిస్సులను సేవించునుగాత.
6. అగ్నీ! నీవు సౌభాగ్యవంతుడవు. మానవులచే స్తుతించబడువాడవు. హోమ విదుడవు. అగ్నులను వేరుచేయగలవాడవు. రత్నములను ఇచ్చువాడవు. గోప్యములగు మంత్రములందు నిక్షిప్తుడవు. విశ్వప్రదర్శకుడవు. గొప్ప మనసున్న వాడవు. యాగార్హుడవు. ఘృతమును సేవించువాడవు. అట్టి నిన్ను స్తుతించుచున్నాను.
7. ధాత, జగత్పతి యగువాడు మాకు ధనములను ప్రసాదించునుగాక. అతడు మాకు పరిపూర్ణ సంపద ప్రసాదించునుగాత.
8. ధాతయు, ప్రజలకు, ధనములకు స్వామి యైనవాడు సమస్త విశ్వమును సృష్టించినాడు. అతనికి మేము ఘృతయుక్త హవిస్సులను అందించుచున్నాము. ఆ స్వామి యజమానికి సంతానము ప్రసాదించగలడు.
9. మా జీవితమునకు సరిపోవునదియు, క్షీణించనిదియు, అనుకూలమైనదియునగు ధనమును మాకు ధాత యగునట్టి వాడు ప్రసాదించును గాత. మేము యజ్ఞము చేయువారలము. ఆ దేవుని అనుగ్రహమును అర్థించుచున్నాము.
10. యజమాని ప్రజార్థి. తనఇంట దేవతలను నేతులతో సేవించువాడు. హవిస్సులు అర్పించువాడు. ధాత అతనికి ధనములు ప్రసాదించునుగాక.
మరణములేని దేవతలందరు - సమాన దయగల అదితి - అన్యదేవతలు ఈ యజమాని గృహమున అన్యోన్యముగా ఉందురుగాక.
11. అనుమతి దేవి ఈ యజ్ఞమును దేవతలకు చేర్చునుగాక. హవ్యవాహనుడగు అగ్నికి ఈ యజమాని హవిస్సులు అర్పించుచున్నాడు. అగ్ని ఇతనికి సుఖములు కలిగించునుగాక.
12. అనుమతి దేవీ! నీవు అన్ని విధముల అనుమతింపుము. మాకు సుఖములు కలిగించుము. మా యజ్ఞమునందు ప్రీతి కలిగి ఉండుము. మాకు చిరాయువు కలిగించుము.
13. అనుమతి దేవి మమ్ము ప్రజావంతులను అక్షయ ధనవంతులను చేయునుగాక. ఆమె మాపై కోపము వహించకుండునుగాక. ఆమె మా ఆహ్వానములను మన్నించుచు, మాకు సుఖములు కలిగించునుగాక.
14. ఈ ప్రకాశించుచున్నట్టి సకల జగత్తును అనుమతి దేవి శాసించుచున్నది. యజమానులు ఆ దేవికి హవిస్సులు అర్పించుచున్నారు. ఈ మహదాకాశము ఆమె దేహమునందు వర్తిల్లుచున్నది. ఆమె మా ఆహ్వానములను మన్నించును గాక. మాకు సుఖములు కలిగించునుగాత.
15. రాకాదేవి సులభముగా ఆహ్వానించతగినది. ఆమె మా ఆహ్వానములను ఆలకించును గాక. ఆలకించి మా అభీష్టములను గ్రహించునుగాత. మా పై ఆ దేవి అవిచ్చిన్నమగు అనుగ్రహము కలుగునుగాక. ఆమె మాకు బోలెడు ధనమును, స్తోత్రశస్త్రాది సహితుడగు వీరపుత్రుని ప్రసాదించునుగాక.
16. రాకాదేవీ! నీవు సౌభాగ్యవతివి. నీ మనసు మంచిది. నీవు మంచి పనులు చేయుదానవు. గొప్ప మనసున యజమానికి ధనములను ఇచ్చుచున్నావు. ఈ యజ్ఞమునందు మనసు ఉంచుము. అనుగ్రహించుము. మాకు సహస్రసంఖ్యాక పుష్టిని కలిగించుము.
17. "సినీవాలి పృథుష్టుజే' ఇత్యాది పురోనువాక్యకు ప్రతీక. "యాసుపాణిః" అనునది యాసుపాణిః స్వఙ్గురిః అను యాజ్యకు ప్రతీక.
18. కుహూదేవి సౌభాగ్యవతి. కర్మలు తెలిసినది. సులభముగా ఆహ్వానించ దగినది. ఆమెను ఈ యజ్ఞమునకు ఆహ్వానించుచున్నాను. ఆమె మా పూర్వులు వినునంతటి కీర్తిని మాకు కలిగించును గాత.
దేవీ! తే హవిషా విధేమ.
19. కుహూదేవతల అమృతపాలక ఆహ్వానమునకు అర్హమైనది. ఆమె మా హవిస్సును, దాని రుచిని ఎరుంగును గాక. ఆ దేవి యజమానికి పారలౌకిక సుఖములను కలిగించునుగాక. నీ మహిమలు తెలిసికొన్న యజమానికి ధనపుష్టిని కలిగించుము.
శ్రీమదాంధ్ర వచన కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత
మూడవ కాండము నందలి మూడవ ప్రపాఠకము సమాప్తము.





