Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
జుష్టోవాచో భూయాసం జుష్టోవాచస్పతయే దేవీవాక్ |
యద్వాచో మధుమత్తస్మిన్నాధాః స్వాహా సరస్వత్యై ||
మూడవ ప్రపాఠకము
మొదటి అనువాకము
1. అగ్నీ! నీవు కాంతిమంతుడవు. నీవు దేవతలందరిలో కాంతిమంతుడవు అగుదువుగాక. మానవులందు నన్ను ఆయుష్మంతుని చేయుము. బలవంతుని చేయుము. నాకు దీక్షాసంబంధియు, తపస్సంబంధియునగు కాంతి కలుగుటకు గాను నిన్ను హోమము చేయుచున్నాను.
2. అగ్నీ! నీవు తేజస్సును గూర్చి తెలిసినవాడవు. తేజస్సు నన్ను విడువకుండునుగాక. నేను తేజస్సును విడువకుందును గాక. కావున ఎన్నటికిని తేజస్సు నన్ను విడువకుండునుగాక.
3. ఓజోవంతుడవైన ఇంద్రా! నీవు దేవతలందరిలో ఓజస్సు కలవాడవు. నన్ను ఆయుష్మంతుని చేయుము. ఓజోవంతుని చేయుము.
ఇంద్రదేవతాక అతిగ్రాహ్యమా! నాకు బ్రాహ్మణ, క్షత్రియ ఓజస్సు కలుగవలెనని నిన్ను హోమము చేయుచున్నాను.
ఇంద్రా! నీవు ఓజస్సును గురించి తెలిసినవాడవు. ఓజస్సు నన్ను విడువకుండునుగాక. నేను ఓజస్సును విడువకుందునుగాక. కావున ఎన్నటికిని ఓజస్సు నన్ను విడువకుండును గాత.
4. సూర్యదేవా! నీవు దీప్తిమంతుడవు. నీవు దేవతలందరిలో దీప్తి కలవాడవు అగుదువు గాక. మానవులందు నన్ను ఆయుష్మంతుని, దీప్తిమంతుని, వర్చస్విని చేయుము.
సూర్యదేవతాక అతిగ్రాహ్యమా! నాకు వాయు, ఉదక సంబంధ దీప్తి కలుగవలెనని నిన్ను యజించుచున్నాను.
సూర్యదేవా! నీవు స్వర్గము తెలిసినవాడవు. స్వర్గము నన్ను విడువకుండునుగాక. నేను స్వర్గమును విడువకుందునుగాక.
5. మయి మేధాం మయి ప్రజాం మయ్యగ్ని స్తేజో దధాతు - అగ్నిదేవా నాకు మేధను, ప్రజను, తేజస్సును కలిగించుము.
మయి మేధాం మయిప్రజాం మయీన్ద్ర ఇంద్రియం దధాతు.
మయి మేధాం మయిప్రజాం మయి సూర్యో భ్రాజోదధాతు
రెండవ అనువాకము
1. గానము చేయదగిన సామము అయిదు విధములు. మొదటి దానిని వాయువు గానము చేయుము. రెండవదానిని అగ్నిరూపుడగు ప్రస్తోత అను ఋత్విజుడు గానము చేయును. ప్రజాపతి సంపూర్ణ సామస్వరూపము. బృహస్పతి రూపుడగు ఉద్గాత అను ఋత్విజుడు మూడవ సామభాగమును గానము చేయును. మరుద్రూపులగు ప్రతిహర్తలు నాలుగవది యగు ప్రతిహారభాగమును గానము చేయుదురు. అయిదవది అగు పంచమ నిధన భాగమును ఇంద్రుడు గానము చేయును. విశ్వేదేవతలు ఉపగాయకులు అగుదురు.
వాయువు మున్నగు వారు ప్రాణపోషకులు. వారు నాయందు ప్రాణములను నిలుపుదురుగాక.
(ప్రస్తోత, ఉద్గాత, ప్రతిహర్తలు సామగానము చేయుచుండగా అన్య ఋత్విజులు సామూహికముగా 'ఓం' అని ఉపగానము చేయవలెను. యజమాని 'హో' అని ఉపగానము చేయవలెను. అది ఎంత దివ్యముగ, ఎంత శ్రావ్యముగ, ఎంత అద్భుతముగా ఉండును!!!.)
2. అధ్వర్యుడు సోమగానము చేయువారికి అనుజ్ఞ ఇచ్చును. అదియే అభ్యనుజ్ఞ అగుచున్నది. అప్పుడు అధ్వర్యుడు వాయువు మున్నగు దేవతలను తనయందు ప్రవేశపెట్టుకొనినవాడు అగును.
3. ఇడ దేవగోరూప. ఆమె దేవతలను ఆహ్వానించునది అగును. మనువు యజ్ఞ ప్రవర్తకుడు అగును. బృహస్పతి మంత్ర వాక్య విశేషములను ప్రశంసించిన వాడగును.
మధుమనిష్యే మధుజనిష్యే మధువక్ష్యామి మధువదిష్యామి మధుమతీం దేవేభ్యోవాచ ముద్యాసగ్ం.
తీయని ఆలోచనలనే మనసునందు ఉంచుదును. తీయని ఫలము లిచ్చు పనులనే చేయుదును. తీయనిదే మాట్లాడుదును. తీయగనే చెప్పుదును. దేవతల కొరకు, సవన త్రయమున, తీయని స్తుతులు చేయుచున్నాను.
నా యొక్క ఈ మధురవాక్కును దేవతలు రక్షింతురుగాత. పితరులు ఆనందింతురుగాక.
మూడవ అనువాకము
1. సోమాంశమా! వసుదేవతలు నిన్ను గాయత్రి ఛందస్సుతో చేర్చెదరుగాక. నీవు అగ్నికి ప్రియమగు అన్నరూపము దాల్చుము.
రుద్రులు నిన్ను 'త్రిష్టుప్' ఛందస్సుతో చేర్చెదరుగాత. ఇంద్రునకు ప్రియమగు అన్నరూపమును దాల్చుము.
ఆదిత్యులు నిన్ను జగతీ ఛందస్సుతో చేర్చెదరు గాక. విశ్వేదేవతలకు ప్రియమగు అన్నరూపము దాల్చుము.
2. ప్రకాశించుచున్న సోమమా! నీ సారము ప్రకాశవంతము. దానిని మందగతి గల ఉదకములందు కదలించుచున్నాను. మంగళకర ఉదకములందు కదలించుచున్నాను. జ్ఞానాకార ఉదకములందు కదలించుచున్నాను. అభినవ ఉదకములందు కదలించుచున్నాను. వేగము గల ఉదకములందు కదలించుచున్నాను. పోటీ పడుచున్న ఉదకములందు కదలించుచున్నాను. విశ్వమును ధరించు ఉదకమునందు కదలించుచున్నాను. మధుర ఉదకములందు కదలించుచున్నాను. దిశలవంటి ఉదకములందు కదలించుచున్నాను. దీప్తివంతములగు ఉదకములందు కదలించుచున్నాను. నీకు సంబంధమగు ప్రకాశవంతసారము సర్వత్ర కదలించుచున్నాను.
3. దధిద్రవ్యమా! నీ యొక్క సారమును సోమసార సహితముగ పగటిసూర్యకిరణములచేర్చి గ్రహించుచున్నాను.
4. ఈ పాత్రయందు తీవ్రములగు సోమరసధారలు ద్యులోకమునుండి పడి కలయుచున్నవి.
5. వర్షము కలిగించు ఇంద్రుని మహాస్వరూపము వలె వర్షలక్షణము వెలుగొందుచున్నది. ఇది లతారూప సోమము. ఇది దేవతారూప సోమమునకు తొలిరూపము.
6. సోమమా! నీ పేరు నిర్లక్ష్యము చేయ జాలనిది. అది అప్రమత్తము. సోమాయస్వాహా.
7. సోమదేవీ! నీవు మనోహరవు. నీవు అగ్నికి ప్రియమగు అన్నరూపము దాల్చినావు. గాయత్రీ ఛందోరూపమవు అయినావు. మరల సోమసమూహమున చేరుము.
సోమదేవీ! నీవు సకల ప్రాణులకు స్వాధీనవు. ఇంద్రునకు ప్రియమగు అన్నరూపము దాల్చినావు. త్రిష్టుప్ ఛందోరూపమవు అయినావు. మరల సోమసమూహమున చేరుము.
సోమదేవీ! మాకు స్నేహ పాత్రమైన దానవు. విశ్వేదేవతలకు ప్రియమగు అన్నరూపము దాల్చినావు. జగతీఛందోరూపమవు అయినావు. మరల సోమసమూహమున చేరుము.
8. ప్రాణము దూరప్రాంతము నుండి మమ్ము చేరును గాత. అంతరిక్షము నుండి మమ్ము చేరునుగాత. స్వర్గపు ఉపరిభాగమున ఉన్నను మమ్ము చేరునుగాత.
హిరణ్యమా! నీవు భూమి మీద ఆయువునకు కారణము అగుచున్నావు. అమృతత్వ హేతువు అగుచున్నావు. అట్టి నిన్ను పరిగ్రహించుచున్నాను.
(భూమి మీద జీవించుటకు ధనము అవసరము అను సత్యమును చెప్పినాడు.)
9. ఇంద్రాగ్నీ మే వర్చః కురుతాం - ఇంద్రాగ్నులు నాకు వర్చస్సు కలిగింతురుగాక, వర్చః సోమో బృహస్పతిః వర్చో మే విశ్వేదేవాతాం వర్చో మే ధత్తమశ్వినా.
10. యజ్ఞమునకు సంబంధించిన విధులను అన్నింటిని వేదము వచించినది. వానిని అన్నింటిని మనసున నిలుపుకొనుచున్నాను. కావ్యమువలె వాచ్యముగ చెప్పనట్టి విధులు ఈ యజ్ఞమున చక్రనేమి వలె వ్యాపించి ఉన్నవి.
నాలుగవ అనువాకము
1. 'మన్దాది' ఇత్యాది పదములు ఉదకములను గూర్చి చెప్పబడినవి. అవియే ఉదకములకు గోప్యములగు నామములు. కావున ఉదకాభిమాన దేవతల ప్రీతికై 'మన్దాసుతేశుక్రే' ఇత్యాది మంత్రములను చదువవలెను. ఉదకముల గోప్యనామముల చేతనే ద్యులోకమునుండి వర్షమును పొందవచ్చును.
2. "దధిద్రవ్యమా! నీయొక్క సారమును సోమసార సహితముగ పగటి సూర్యకిరణముల చేర్చి గ్రహించుచున్నాను" అనునది మంత్రార్థము. రాత్రియే పగటికి కారణము అగుచున్నది. సూర్య కిరణములు వర్షమునకు కారణములు అగుచున్నవి.
ఈ మంత్రపఠనము వలన యజమాని పగటివలనను, సూర్యకిరణముల చేతను ద్యులోకము నుండి వర్షము కురిపించుచున్నాడు.
3. ఈ పాత్రయందు తీవ్రములగు సోమరసధారలు ద్యులోకము నుండి పడి కలియుచున్నవి' అనునది మంత్రోక్తవిధియే. వ్యాఖ్య అక్కరలేనిది అగును.
4. వర్షమును కలిగించు ఇంద్రుని మహా స్వరూపము వలె లక్షణము వెలుగొందుచున్నది అనుట వలన యజమాని వర్షమును పొందుచున్నాడు. అది ఇంద్రుని మహాస్వరూపము వంటిది అని అర్థమగును.
5. 'సోమదేవీ! నీ పేరు నిర్లక్ష్యము చేయజాలనిది - అప్రమత్తము' అని మంత్రము చెప్పినది. యజమాని 'అదాభ్య' పాత్రను గ్రహించి సోమము కొరకు హోమము చేయవలెను. అప్పుడు అతడు హవిస్సును యాగము చేసినవాడు అగును.
6. అంశునామక సోమమును పాత్రయందు గ్రహించిన యజమాని యొక్క ఆయువు, ప్రాణము దిగజారుచున్నవి. 'ప్రాణము దూరప్రాంతము నుండి మమ్ము చేరునుగాత' అను మంత్రము వలన ఆయువు, ప్రాణము యజమాని యందు స్థిరపడుచున్నవి.
7. హిరణ్యమా! నీవు ప్రాణమవు. అమృతత్వమవు, అని సోమాభిషవము నందు పడవేయు హిరణ్యము పై శ్వాసను విడువవలెను. బంగారము అమృతత్వహేతువు. ఆయువు ప్రాణస్వరూపము.కావున అమృతత్వహేతువగు హిరణ్యము పైని శ్వాసవిడుచుట చేత ఆయురూపమగు ప్రాణమును తనయందు స్థాపించుకొనువాడు అగుచున్నాడు.
8. హిరణ్యము శతసంఖ్యాకము కావలెను. మానవుడు శతాయువు. శతీంద్రియములు కలవాడు. కావున నూరు ఇంద్రియములందు నూరేళ్లు ఆయువు స్థాపించుకొనిన వాడు అగును.
9. "ఇంద్రాగ్నీ" అను మంత్రములచేత నీటిని తాకవలెను. భేషజం వా ఆపో భేషజం కురుతే - నీరు ఔషధమగును. నీరు చికిత్సచేయును.
అయిదవ అనువాకము
1. సోమమా! నీవు వాయువువు. ప్రాణమవు. విడుచుశ్వాసవు అగుచున్నావు. సవితాదేవుని ఆధిపత్యమున ఉండుము. నాకు అపానము - పీల్చుశ్వాసను కలిగించుము.
నీవు నేత్ర, శ్రోత్ర స్వరూపమవు అగుచున్నావు. ధాత ఆధిపత్యమున ఉండుము. నాకు ఆయువును ప్రసాదించుము.
నీవు రూపమవు, వర్ణమవు అగుచున్నావు. బృహస్పతి ఆధిపత్యమున ఉండుము. నాకు సంతతి కలుగజేయుము.
నీవు మనసునందలి ఋతమవు, వాక్కు నందలి ఋతమవు అగుచున్నావు. ఇంద్రుని ఆధిపత్యమున ఉండుము. నాకు క్షాత్రమును కలిగించుము.
నీవు భూతకాలమవు, భవిష్యత్కాలమవు అగుచున్నావు. పితృదేవతల ఆధిపత్యమున ఉండుము. అపామోషధీనాం గర్భం ధా - నాకు నీరు, ఓషధుల మూలమును ప్రసాదించుము.





