Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
జ్ఞానానంద మయందేవం| నిర్మల స్ఫటికాకృతిం |
ఆధారం సర్వ విద్యావాం హయగ్రీవ ముపాస్మహే||
ఆంధ్ర ఋగ్వేద వచన సంహిత
నాలుగవ మండలము నాలుగవ అధ్యాయము
మొదటి అనువాకము మొదటి సూక్తము
మండలద్రష్ట వామదేవునకు నమస్కారము ఋషి - వామదేవుడు, దేవత - అగ్ని,
ఛందస్సు - 1 అష్టి, 2- అతి జగతి 3 ధృతి, 4 -20 త్రిష్టుప్.
1. అగ్నీ ! నీవు ద్యుతిమంతుడవు. శీఘ్రగామివి. స్పర్దావంతులగు దేవతలు సర్వదా నిన్ను యుద్ధమునకు ప్రేరేపింతురు. యజమానులు నిన్ను స్తుతుల ద్వారా ప్రేరేపింతురు. యజనీయ అగ్నీ ! నీవు అమరుడవు. ఉత్కృష్ట జ్ఞాన విశిష్టుడవు. యజ్ఞముచేయు మానవుల మధ్యకు చేరుటకును సమస్త యజ్ఞములందు ఉపస్థితుడవగుటకు దేవతలు నిన్ను సృష్టించినారు. నీవు కర్మాభిజ్ఞుడవు.
2. అగ్నీ ! నీభ్రాత వరుణుడు. అతడు హవ్యభోజనుడు. యజ్ఞభోక్త. అత్యంత ప్రశంసనీయుడు. ఉదకవంతుడు అదితి పుత్రుడు. జలదానముచేసి మనుష్యులను భరించువాడు. సుబుద్ధియుక్తుడు. విరాజమానుడు.
అగ్నీ ! నీవు అట్టి వరుణుని స్తోతలకు అభిముఖుని చేయుము.
3. గమనకుశలములగు అశ్వద్వయము రథమునకు పూన్చబడి, శీఘ్రగామి చక్రము లక్ష్యముగా స్థానమువైపు సాగును. అట్లే సుఖీభూత దర్శనీయుడవగు అగ్నీ ! నీ మిత్రుడు వరుణుని మావైపు తీసుకొనిరమ్ము. అగ్నీ ! నీ సాయముననే వరుణునకు సుఖప్రదమగు హవి లభించినది. మరుత్తులకు సహితము హవి ప్రాప్తమయినది. దీప్తిమంతుడవగు అగ్నీ ! నీవు మా పుత్ర, పౌత్రులకు సుఖము ప్రసాదించుము.
4. అగ్నీ ! నీకు సంపూర్ణ పురుషార్థ సాధనోపాయము తెలియును. మా విషయమున ద్యుతిమంతుడగు వరుణుని కోపమును ఉపశమింప చేయుము. నీవు అందరికన్న అధిక యాజ్ఞికుడవు. హవ్యవాహనుడవు. దీప్తిమంతుడవు. నీవు మమ్ము సకల పాపములనుండి, విశేషముగ విముక్తులను చేయుము.
5. అగ్నీ ! మమ్ము రక్షింపుము. మా విషయమున ప్రసన్నుడవు అగుము. ఉష చెదరిపోవును. ప్రాతఃకాలము అగును. అగ్నిహోత్రాదులు మొదలగును. అప్పుడు నీవు మాకు దగ్గరివాడవు అగుము. వరుణుడు మాకు కలిగించిన జలోదరాది రోగములను, పాపములను నాశము చేయుము. నీవు యజమానులకు అత్యంత ఫలప్రదుడవు. నీవు ఈ సుఖకర హవిని ఆరగింపుము. మేము నిన్ను విశిష్టముగా ఆహ్వానించుచున్నాము. మా దగ్గరకు విచ్చేయుము.
(వరుణుడు జలాధి దేవత. అతడు జలోదరమునకు కారణము అగును అనుచున్నాడు. అగ్ని జలోదరమునకు ఉపశమనకారి అనుచున్నాడు. ఇందును గురించివైద్య పరిశోధన అవసరము.)
6. దేవతలు క్షీరాభిలాషులు, వారికి గోవు యొక్క తేజోయుక్త, కవోష్ణ దుగ్ధములు స్పృహణీయములు. మానవులకు స్పృహణీయము, భజనీయము.
7. అగ్నికి ప్రసిద్ధములు, ఉత్తమములు. యదార్థ భూతములగు మూడు రూపములు ఉన్నవి. అవి అగ్ని, వాయువు, సూర్యుడు. ఆ మూడు రూపములు సమస్తజనులకు స్పృహణీయములు. అగ్ని అనంత ఆకాశమున స్వతేజమున పరివేష్టితుడు. సమస్త శోధకుడు. దీప్తియుక్తుడు. అత్యంత దీప్తిమంతుడు. స్వామి. అట్టి అగ్ని మా యజ్ఞముకు విచ్చేయవలెను.
8. అగ్ని దూత. ఆహ్వానకారుడు. సువర్ణమయ రథోపేతుడు. రమణీయ జ్వాలా విశిష్టుడు. అతడు సమస్త యజ్ఞముల కోరికగలవాడు. రోహితాశ్వుడు, రూపవంతుడు, సదా కాంతియుక్తుడగు అగ్ని అన్న సమృద్ధ గృహమువంటి రమణీయుడు.
9. అగ్ని యజ్ఞమున నియుక్తుడగువాడు. అతడు యజ్ఞమున నిమగ్నులయిన వారిని ఎఱుంగును. అధ్వర్యులు మహాస్తోత్రములతో అగ్నిని ఉత్తరవేదిని ప్రతిష్ఠింతురు. అగ్ని యజమాని గృహమున అభీష్టవరదుడయి వసించును. ద్యుతిమంతుడగు అగ్ని ధనికులతో ఒకేచోట నివసించును.
10. అగ్ని వద్ద కీర్తనీయమగు ఉత్కృష్ట రత్నము ఉన్నది. దానిని స్తోతలు స్తుతింతురు. అగ్ని సర్వజ్ఞుడు. అతడు ఆ రత్నమును మాకు పంపవలెను. అగ్ని మరణరహితుడు. సమస్త యజ్ఞముల కొఱకు దేవతలు అగ్నిని సృష్టించినారు. ద్యులోకము అగ్నికి జనకుడు. పాలకుడు. అధ్వర్యులు ఘృతాది ఆహుతులతో యదార్థభూతుడగు అగ్నిని తడిపెదరు.
11. అగ్నియే శ్రేష్ఠుడు. "సజాయత ప్రథమః" అగ్ని యజమానుల గృహములందు అవతరించినాడు. అగ్ని మహా అంతరిక్షపు మూలస్థానమున ఆవిర్భవించినాడు. అగ్ని పదరహితుడు. శిరోవర్జితుడు. అతడు సరీరముల అంతర్భాగమున దాగి ఉండును. జలవర్షమగు మేఘమున ధూమాకారుడయి ఉండును.
12. స్తుతియుక్తమగు ఉదకముల ఉత్పత్తి స్థానమగు అంతరిక్షము మేఘములకు గూడు అగును. అగ్ని అట్టి అంతరిక్షమున వర్థిల్లును. వెలుగు అగ్నివద్దకు సర్వప్రథమముగా వచ్చిచేరును. స్పృహణీయము, నిత్య తరుణము, కమనీయము, దీప్తిమంతము అగు అగ్నినే సప్తస్తోతలు స్తుతించెదరు.
13. మా పితృపురుషులు యజ్ఞనిర్వహణమునకుగాను ఈ లోకమున అగ్నికి అభిముఖులయి సాగినారు. వెలుగునకుగాను ఉషాదేవిని ఆహ్వానించినారు. అగ్ని పరిచర్యవలన వారికి బలము సమకూరినది. ఆ బలమున పర్వత గుహయందు, అంధకారమున ఉన్న గోవులను బయల్పరచినారు.
(పితృపురుషులు అంగిరులు)
14. అంగిరులు పర్వతమును విదీర్ణము చేయునపుడు అగ్నికి పరిచర్యలు చేసినారు. ఇతర ఋషులు అంగిరుల సత్కార్యమును సర్వత్ర కీర్తించినారు. అంగిరులకు పశువులను రక్షించు ఉపాయము తెలియును. వారు అభిమత ఫలప్రదుడగు అగ్నిని స్తుతించినారు. జ్యోతిని సాధించినారు. బుద్ధిబలమున యజ్ఞము చేసినారు.
15. అంగిరాదులు కర్మల నేతలు. అగ్ని ఉపాసకులు. వారు మనమున గోలాభము కోరినారు. గోవులున్న పర్వతము ద్వార నిరోధకము, సుదృఢము, దృఢబద్ధము. గోనిరోధకము. సర్వత్ర వ్యాప్త గోపూర్ణ గోష్ఠరూపము అంగిరులు అగ్నిని స్తుతించి ఆ పర్వతమును వెలువరించినారు.
16. అగ్నీ ! స్తోత్రము చేయువారు అంగిరాదులు. వారు వాగ్రూప జనని విషయిక స్తుతి సాధక శబ్దమును కనుగొన్నారు. తదుపరి వచన సంబంధమగు ఇరువది ఏడు ఛందస్సులను కలిగించినారు. తదుపరి వాటిని ఎరుగు ఉషను స్తుతించినారు. ఆవిధముగ సూర్యుని తేజస్సు వెంట అరుణవర్ణ ఉష ఆవిర్భవించినది. "ఆవిర్భువదరుణీర్యశసాగోః"
17. రేయి చీకట్లు పరచినది. ఉష ఉదయించినది. పరచిన చీకట్లను చెదరగొట్టినది. ఆకాశము ప్రదీప్తమయినది. ఉషాదేవి వెలుగు పరచినది. మానవుల మంచి, చెడ్డకార్యములను చూచుటకుగాను సూర్యుడు అజర పర్వతము మీదికి ఎక్కినాడు.
18. సూర్యోదయమున అంగిరాదులు పణులు దొంగిలించిన గోవులను ఎరింగినారు. వెనుకనుంచి ఆ గోవులను స్పష్టముగా చూచినారు. దీప్తియుక్తమగు ధనమును కాంచినారు. వారి సమస్తగృహములకు యజనీయులగు దేవతలు వచ్చినారు. మిత్ర భూతుడవగు అగ్నీ ! నీవు వరుణజనిత ఉపద్రవములను నివారించువాడవు. నిన్ను ఉపాసించువానికి సత్యలాభము కలుగవలెను. "సత్యమస్తు"
19. అగ్నీ ! నీవు అత్యంత దీప్తిమంతుడవు. దేవతల ఆహ్వానకర్తవు. విశ్వ పోషకుడవు. యాగశీలుడవు. మేము నిన్ను స్తుతించుచున్నాము. యజమానులు నిన్ను ఆహూతుని చేయుటకు ఆవుపాలు పితుకరు. సోమలతా సంబంధమగు శోధిత అన్నమును తమ ఇండ్లలో భద్రపరచరు. వారు కేవలము నిన్ను స్తుతింతురు.
20. అగ్ని సమస్త యజ్ఞార్హ దేవతల పోషకుడు. అగ్ని సమస్త మానవులకు అతిథివలె పూజనీయుడు. అన్న భోజి అగ్ని స్తోతలకు సుఖప్రదుడు కావలెను.
రెండవ సూక్తము
ఋషి-వామదేవుడు, దేవత-అగ్ని, ఛందస్సు-త్రిష్టుప్.
1. అగ్ని మరణరహితుడు. మానవుల మధ్య సత్యవంతుడయి నిలిచినాడు. దీప్తిమంతుడగు అగ్ని శత్రు పరాభవ ఆహ్వాత. యజ్ఞము చేయుటలో అందరిని మించినవాడు. అగ్ని తన మహిమ వలన ప్రజ్వరిల్లుటకు ఉత్తరవేదిన స్థాపించబడినాడు. హవిద్వారమున యజమానులను స్వర్గమునకు చేర్చుటకు అచట నిలిచినాడు.
2. అగ్నీ ! నీవు బలపుత్రుడవు. నేడు మా కార్యమునకు విచ్చేసినావు. దర్శనీయ అగ్నీ ! నీ రథాశ్వములు ఋజువంతములు, మాంసిలములు, దీప్తివంతము, బలము కలవి. వానిని నీ రథమునకు కట్టుము. జన్మ విశిష్ట దేవతల, మానవుల మధ్యకు హవి అందించుటకు దూతగా సాగుము.
3. అగ్నీ ! నీవు సత్యభూతుడవు. నేను రోహిత వర్ణులయిన నీ అశ్వద్వయమును స్తుతింతును. వాటి వేగము మనోవేగమును మించినది. అవి అన్నమును జలములను రక్షించును. నీవు దీప్తిమంతములగు అశ్వద్వయమును రథమున కూర్చుము. దేవతల, మానవుల మధ్య ప్రవేశింపుము.
4. అగ్నీ ! నీ అశ్వములు ఉత్తమములు. నీ రథము ఉత్తమము. నీ ధనము ఉత్తమము. మానవుల మధ్యన శుభంకర హవివంతులగు యజమానుల కొఱకు అర్యమ, వరుణుడు, మిత్రుడు, ఇంద్రావిష్ణువు, మరుద్గణములు, అశ్వద్వయమును రప్పింపుము.
5. అగ్నీ ! నీవు బలవంతుడవు. మా యజ్ఞము గోవిశిష్టము, మేష విశిష్టము, అశ్వ విశిష్టము కావలెను. అధ్వర్యు, యాజమాన విశిష్టమగు యజ్ఞము సర్వదా అప్రదూష్యము, హవిరన్నయుక్తము అగును. అది పుత్ర, పౌత్ర హేతుభూతము, అవిచ్చిన్న అనుష్ఠాన యుక్తము, ధనసంపన్నము, సకలధన హేతుభూతము అగును.
6. అగ్నీ ! నీ కొఱకు చెమటోడ్చి కట్టెలు మోయువానిని, నిన్ను పొందుటకు కట్టెలమోపుమోయు తలవానిని నీవు ధనవంతుని చేయుదువు. వానిని పాలించెదవు. వానికి హాని తల పెట్టువాని నుండి వానిని రక్షింపుము.
(కర్మ చేయు యజమానిని మాత్రమేకాక చెమటోడ్చు శ్రామికుని రక్షించమనుచున్నాడు)
7. అగ్నీ ! అన్నముకోరి నీకు హవిరన్నము సమర్పించువాని నీకు హర్షదమగు సోమము సమర్పించువాని అతిథిరూపమున ఉత్తరవేదిన ప్రతిష్ఠించినవాని దేవత్వకాంక్షతో నిన్ను గృహమునందు సమిద్దుని చేయువాని పుత్రులు ధర్మపథమున నిశ్చలులు కావలెను. ఔదార్య విశిష్టులు కావలెను.
8. అగ్నీ ! ఒకడు రాత్రికాలమున, మరొకడు ఉషఃకాలమున నిన్ను స్తుతించును. ఒక యజమాని హవ్యయుక్తుడయి నిన్ను ప్రసన్నుని చేయును. తన ఇంట అలంకరించిన అశ్వమువలె సంచరించి వారిని దారిద్ర్యమునుండి రక్షింపుము.
9. అగ్నీ ! నీవు అమరుడవు. యజమానులందు ఒకడు నీకు హవ్యము సమర్పించును. ఒకడు స్రుక్కును సంయతము చేయును. ఒకడు పరిచర్య చేయును. అట్టి యజమానులు ధనశూన్యులుకారాదు. బాధించువారు వారిని అంటరాదు.
10. అగ్నీ ! నీవు ఆనందయుక్తుడవు. దీప్తిమంతుడవు. యువతముడవు. నీవు మానవ సంపాదితము, హింసారహితమగు అన్నమును అనుభవించుము. యజ్ఞమును వర్థిల్లచేయుచు అగ్నికి పరిచర్య చేయు యజమానిని నీవు నీవానిగా భావింతువు.
11. అశ్వపాలకుడు అశ్వములకాంత, దుర్వహ పుష్ఠములను విడదీయును. అట్లే విద్వాంసుడగు అగ్ని పాప పుణ్యములను విడదీయవలెను. అగ్నీ ! మాకు సుందర పుత్రయుక్త ధనము ప్రసాదించుము. దాత కానివానిని దగ్గరనుండి రక్షింపుము.
12. అగ్నీ ! మానవ గృహములందు అతిరస్కృత దేవతలు నివసింతురు. వారు మేధావివి అగు నిన్ను హోతను చేసినారు. నీవు మేధావివి. యజ్ఞస్వామివి. కావున నీ చంచల తేజమున దర్శనీయములగు అద్భుత దేవతలను చూడుము.
13. అగ్నీ ! నీవు దీప్తిమంతుడవు. యువతముడవు. మానవుల కోరికలు తీర్చువాడవు. ఉత్తరవేది మీద ప్రతిష్టించ యోగ్యుడవు. నీ కొఱకు సోమాభిషము చేయునట్టి, పరిచయం చేయునట్టి స్తోత్రము చేయునట్టి యజమానిని రక్షించుటకు అతనికి విశేషము, ఆహ్లాదకరము, ఉత్తమమగు ధనమును ప్రసాదించుము.
14. అగ్నీ ! నిన్ను వాంఛించి మేము కాళ్లు, చేతులు శరీరముతో పనిచేసినట్లు యజ్ఞకర్తలు, శోభనకర్మలగు అంగిరాదులు బాహువులతో కాష్ఠమంథనముచేసి నిన్ను పుట్టించినారు. అది శిల్పి రథనిర్మాణము చేసినట్టిది అగును.
15. మేము ఏడుగురము మొట్టమొదటి మేధావులము. మేము ఉషామాతవద్ద ఉండి అగ్ని పరిచారకులు లేదా కిరణములను ఆవిర్భవింపచేసినాము. మేము ద్యుతిమంతుడగు ఆదిత్యుని పుత్రులము అంగిరులము. మేము దీప్తిమంతులమయి ఉదక విశిష్ట పర్వతమును లేదా మేఘమును భేదవ మొనర్చినాము.
(వామదేవుడు + ఆరుగురు అంగిరులు = ఏడుగురు అయినారు)
16. అగ్నీ ! మేమ చేసిన శ్రేష్ఠము, పురాతనము, సత్యభూత యజ్ఞమున నిమగ్నులయిన పితృపురుషులు దీప్తస్థానమునకు చేరినారు. వారు ఉక్థలను ఉచ్చరించి అంధకారమును దూరము చేసినారు. పణులు దొంగిలించిన అరుణవర్ణ గోవులను లేక ఉషను ప్రకాశితము చేసినారు.
17. సుందర యజ్ఞాది కార్యరతులగు, దీప్తయుక్త దేవాభిలాషులగు స్తోతలు కొలిమిలో ఇనుమును నిర్మలము చేసినట్లు చేసికొందురు. వారు అగ్నిని ప్రదీప్తుని, ఇంద్రుని ప్రవృద్దుని చేసెదరు. వారు నలువైపుల వ్యాపించినారు. మహా గోసమూహమును పొందినారు.
18. తేజస్వీ అగ్నీ ! అన్నము నిండిన ఇంట పశుసమూహములు ఉండునట్లు అంగిరాదులు దేవతల గోసమూహమువద్ద ఉందురు. వారు తెచ్చిన గోవులవలన ప్రజలు సమర్థులు అయినారు. ఆర్యసంతానము వర్థిల్లినది. మానవులు పోషణ సమర్థులు అయినారు.
19. అగ్నీ ! మేము నీకు పరిచర్యలు చేయుదుము. అందువలన మేము శోభన కర్మవంతులము అగుదుము. చీకట్లను తొలగించు ఉష తేజస్సును దాల్చును. నీవు ద్యుతిమంతుడవు. మేము నీ మనోహర తేజస్సును సేవింతుము.
20. విధాతా అగ్నీ ! నీవు మేధావివి. మేము నీ కొఱకు సంపూర్ణముగా ఈ ఉక్థము ఉచ్ఛరింతుము. నీవు దీనిని స్వీకరింపుము. నీవు ఉద్దీప్తుడవు అగుము. మమ్ము విశేష ధనవంతులను చేయుము. నిన్ను అనేకులు ఆరాధింతురు. మాకు మహాధనమును ప్రసాదించుము.
మూడవ సూక్తము
ఋషి - వామదేవుడు, దేవత - అగ్ని, ఛందస్సు - త్రిష్టుప్.
1. అగ్ని యజ్ఞవిధాత. దేవతల ఆహ్వాత. ద్యావాపృథ్వులకు అన్నదాత. సువర్ణమువలె ప్రభావశాలి. శత్రువులను ఏడ్పించువాడు. రుద్రాత్మకుడు. యజమానులారా ! మీ రక్షణకుగాను, వజ్రరూప మృత్యువుకన్నముందు అట్టి అగ్నిని సేవించుడు.
2. అగ్నీ ! పతికామిని, వస్త్రాచ్చాదిత అగు జాయపతి కొఱకు స్థానము కల్పించును. అట్లే మేము ఉత్తరవేదిమీద నీకు స్థానము కల్పించినాము. అదియే నీ స్థానము. సుకర్మా అగ్నీ ! నీవు తేజము ద్వారా పరివృతుడవయి మాకు అభిముఖముగా విచ్చేయుము. ఈ స్తుతి సాంతము నిన్ను సేవించును.
3. అగ్ని స్తోత్ర శ్రవణ పరాయణుడు. అప్రమత్తుడు. మానవ ద్రష్ట. సుఖకరుడు, అమరుడు. స్తోతలారా ! అగ్నిని స్తోత్ర, శస్త్ర పాఠములు చేయుడు. ప్రస్తరమువలె సోమాభిషవకారి యజమాని అగ్నిని స్తుతించును.
4. అగ్నీ ! మా ఈ కర్మకు నీవే దేవతవు. సత్యజ్ఞ అగ్నీ ! నీవు సుకర్ముడవు. నీవు మా స్తోత్రమును అవగతము చేసికొనుము. ఉన్మాదకారకములగు నీ స్తోత్రములు ఎప్పుడు ఉచ్చరించబడును? మా ఇంట నీతో ఎప్పుడు సఖ్యత కలుగను?
5. అగ్నీ ! వరుణుని ముందు నీవు మాగురించి పాపజన్య నింద ఏలచేసెదవు? సూర్యుని ముందు ఎందుకు నిందింతువు? మేము చేసిన అపరాధమేమి? అభీష్టఫలదాత మిత్రునకు, పృథ్వికి ఏల చెప్పినావు? అర్యమ, భగులకు ఏల చెప్పినావు?
6. అగ్నీ ! నీవు యజ్ఞమున వర్థిల్లునపుడు ఆ కథ ఏల చెప్పెదవు? ప్రకృష్ట బలయుక్తుడు, శుభప్రదుడు, సర్వత్రగామి, సత్యనేత వాయువుతో ఆ కథ ఏల చెప్పెదవు? పృథ్వితో ఏల చెప్పెదవు? పాపులగు మనుష్యులను చంపు రుద్రునితో ఆ కథ ఏల చెప్పెదవు?
7. అగ్నీ ! మహామహుడు, పుష్టిప్రదుడు పూషతో ఆ పాపపు కథ ఏల చెప్పెదవు? యజ్ఞభాజనుడు, హవిప్రదుడగు రుద్రునికి ఏల చెప్పెదవు? బహుస్తుతిమంతుడగు విష్ణువుతో ఆ పాపపు కథ ఏల చెప్పెదవు? బృహత్ సంవత్సరము లేక నిరృతితో ఆ కథ ఏల చెప్పెదవు?
8. అగ్నీ ! పత్యభూత మరుద్గణములతో ఆ కథ ఏల చెప్పెదవు? అడిగినంతనే సూర్యునకు ఆ కథ ఏల చెప్పెదవు? దేవి అదితితోనూ, శీఘ్రగమనుడైన వాయువుతోను ఏల చెప్పెదవు? సర్వజ్ఞ జాతవేదా ! నీవు ద్యులోకము కార్యసాధన చేయుము.
9. మేము సత్యభూత యజ్ఞము చేతుము. అట్లే నిత్యము గోవులను పాలు యాచింతుము. అపక్వమయినది అయినప్పటికి పక్వములగు పాలను దాల్చుచున్నది. అది నల్లనిది అయినప్పటికి శుభ్రము, పుష్టికరము, ప్రాణధారక దుగ్ధములతో నరులను పోషించుచున్నది.
10. అభిమత ఫలప్రదుడు, శ్రేష్ఠుడు అగు అగ్ని సత్యభూతము, పుష్టికరమగు పాలతో తడియును. అన్నప్రదుడగు అగ్ని ఒకచోట నిలిచి తనకాంతితో సర్వత్ర సంచరించును. జలవర్షిక సూర్యుడు మేఘపు పాలు పిదుకును.





