Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    6. మాధ్యందిన సవనము నందు ప్రతిగరము చెప్పిన పిమ్మట 'ఉక్థంవాచి' అను మంత్రముచే హోతను స్తుతించవలెను. ఇందలి నాలుగు అక్షరములచే చతుష్పద యగు 'త్రిష్టుప్' ను స్మరించినట్లగును. బలమే 'త్రిష్టుప్'. మాధ్యందిన సవనము బలము. కావున తనయందు బలమును దాల్చినట్లగును.

    7. తృతీయ సవనమునందు ప్రతిగరము చెప్పిన పిమ్మట 'ఉక్థంవాచీంద్రాయ' అను మంత్రముచే హోతను స్తుతించవలెను. ఇందలి ఏడు అక్షరములచే సప్తసంఖ్యాక శాక్వరి ఛందస్సును స్మరించినట్లగును. పశువులు శక్వరీఛందోబద్ధ ప్రాప్యములు. తృతీయ సవనము జగతీ ఛందము కలది. పశువులే జగతీఛందస్సు. తృతీయ సవనము పశువులు. కావున తృతీయ సవనమున పశువులను సాధించును.

    8. హోత ప్రశ్నించుటకై అధ్వర్యుని అభిముఖముగా ఆహ్వానించరాదు. అందువలన హోత అధ్వర్యునకు 'ఆవ్య' అను వ్యాధి కలిగించినవాడగును. అధ్వర్యుడు దానిని నిరాకరించినచో అతని కుటుంబములోని వారు సంవత్సరము లోపల సర్వ వ్యాధి పీడితులగుదురు. అందుకు పరిహారముగా అధ్వర్యుడు హోతను 'శోగ్ంసామోదఇవ' - నీవు ప్రశంసార్హుడవు మాకు సంతోషకరుడవు అను మంత్రము చేత ప్రత్యాహ్వానము చేయవలెను. అందువలన అభిముఖాహ్వాన రూపమగు వ్యాధులు నశించును.

    9. ప్రశ్నించువానికి బదులు చెప్పుటకు సమాధానము చెప్పువాడు సావధానుడై ఉండును. అట్లే అధ్వర్యుడు ప్రత్యుత్తరము చెప్పుటకు సావధానుడై ఉండవలెను.

    10. ప్రతిగర సమాప్తికి 'అర్ధర్చ' కాలమగును. ఆ కాలమును అతిక్రమించిన నిర్ణీత సమయమున ప్రత్యుత్తరము చెప్పినట్లు కాకుండును.

    11. అర్ధర్చ సమాప్తి నుండి ప్రతిగరము లోపించరాదు. అది జరిగినచో అడవిలో మృగములు తరుముచుండగా పరిగెత్తి శక్తిహీనుడు అయినవాని పగిది అగును.

    12. ఋత్విజులకు గాన విశేషములు సమానములే. సామగులకు ఋక్కులే ఉద్గీథము. శస్త్రములను స్తుతించు హోతలకు ప్రణవము ఉద్గీథము. అధ్వర్యునకు ప్రతిగరము ఉద్గీథమగును.

    13. యజమాని ఈ విషయములు తెలిసికొనవలెను. అదేవిధముగ ప్రతిగరము చెప్పవలెను. అందువలన అతనికి అన్నసమృద్ధి కలుగును. అతని సంతానమున అన్న సమృద్ధికలవాడు పుట్టును.

    14. హోత భూమి స్వరూపుడు. అతడు కూర్చుండి స్తోత్రము చేయవలెను. అందువలన అతడు భూమినుండి తొలగి పోకుండును. ఈ భూమి నిలిచి ఉన్నట్లు కనిపించుచున్నది కదా! అందువలన యజమాని భూమినుండి సారము గ్రహించును.

    అధ్వర్యుడు ద్యులోక స్వరూపుడు. అతడు నిలబడి ప్రతిగరము చెప్పవలెను. దివిపైన నిలిచినట్లు కనిపించుచున్నది కదా! అందువలన యజమాని దివినుండి సారమును గ్రహించును.

    15. హోత కూర్చుండి స్తోత్రము చేయవలెను. అందువలన భూమినుండి అందుకున్న హవిరాదికము ఆధారముగా దేవతలు జీవించుచున్నారు.

    అధ్వర్యుడు నిలుచుండి ప్రతిగరము చెప్పవలెను. అందువలన ద్యులోకమునుండి దేవతలు ప్రదానము చేసిన వర్షము ఆధారముగా నరులు జీవించుచున్నారు.

    16. హోత ప్రాఙ్ముఖుడై స్తోత్రము చేయుట వలన రేతస్సు పత్నీక్షేత్రాభి ముఖముగ ప్రవేశించుచున్నది. అధ్వర్యుడు పశ్చిమ ముఖుడై ప్రతిగరము చెప్పుట వలన ప్రజలు క్షేత్ర విముఖులుగ పుట్టుచున్నారు.

    17. హోత అధ్వర్యుని అభిముఖముగ ఆహ్వానించరాదు. అందువలన అధ్వర్యునకు వజ్రప్రహారము కలుగును. అభ్యాహ్వానము తరువాత అధ్వర్యుడు పడమటికి తిరుగవలెను. అందువలన వజ్రప్రహారము తప్పును.

    (మంత్రముచే ప్రోత్సహించుట 'ప్రతిగరము'.)

                                        పదవ అనువాకము

    1. ప్రతినిర్గ్రాహ్యపాత్రమా! నీవు ఉపయామమున గ్రహించబడిన దానవు. నిన్ను ఇంద్రవాయువుల కొరకు అందుకొనుచున్నాను. ఇంద్రవాయువులు వాక్కునకు పాలకులు. యజ్ఞపాలకులు. అవినాశ్యమగు యజ్ఞమునకు అధ్యక్షులు.

    2. ప్రతినిర్గ్రాహ్యపాత్రమా! నిన్ను ఉపయామమున గ్రహించుచున్నాను. నీవు ఋతము నందు ఉన్నదానవు. నిన్ను మిత్రావరుణుల కొరకు గ్రహించుచున్నాను. మైత్రావరుణులు నేత్రపాలకులు. అవినాశ్యమగు యజ్ఞమునకు అధ్యక్షులు.

    3. ప్రతినిర్గ్రాహ్యపాత్రమా! నిన్ను ఉపయామమున గ్రహించుచున్నాను. నీవు శ్రోత్ర ఇంద్రియము నందు ఉన్నదానవు. అశ్వినులు కొరకు నిన్ను గ్రహించుచున్నాను. అశ్వినులు నేత్రపాలకులు. అవినాశ్యమగు యజ్ఞమునకు అధ్యక్షులు.

    4. ఐన్ద్ర వాయవ ప్రతినిర్గ్రాహ్యమా! నిన్ను దేవతల కొరకు, విశ్వేదేవతల కొరకు, సకల దేవతల కొరకు ఆదిత్య స్థాలియందు అవనతము చేయుచున్నాము.

    5. ఉరుక్రమ విష్ణువా! ఈ సోమము నీ ఆధీనమైనది. నీవు ఈ సోమమును రక్షింపుము. ఈ సోమమునకు నీ సంబంధము కలిగినది. దానిని పాపదృష్టి కలవాడు చూడకుండునుగాక.

    6. ఇది సోమము. సమస్త ధనములు కలది. ఆ ధనరూప సోమము నాయందు ఉన్నది. ఐన్ద్రవాయవ గ్రహమా! నీవు వాక్కును పాలించుదానవు. నా వాక్కును రక్షించుము.

    7. సమస్త ధనములు గల సోమము నాయందు ఉన్నది. మైత్రావరుణగ్రహమా! నీవు నేత్రమును పాలించుదానవు. నా నేత్రములను రక్షింపుము.

    సమస్త ధనముగల సోమము నాయందు ఉన్నది. అశ్వినీ గ్రహమా! నీవు శ్రోత్రపాలకమవు. నా చెవులను రక్షింపుము.

    8. చేతిలో ఉన్న సోమమా! నీవు సుఖప్రదాత్రివి. తేజోవంతములందు శ్రేష్ఠమవు. ప్రాణములు కాపాడుదానవు. నా ప్రాణములను కాపాడుము.

    9. మైత్రావరుణ గ్రహమా! నీవు దుఃఖములు నశింప చేయుదానవు. తేజోవంతములందు శ్రేష్ఠమవు. నీవే ఆపానమును రక్షించు దానవు. నా అపానమును రక్షింపుము.

    10. శుభములను పాలించువారలారా! ఇంద్రవాయువులారా! మా శత్రువులు మమ్ము హింసించువారు ఉన్నారు. మమ్ము అతిక్రమించి సోమపానము చేయువారు ఉన్నారు. వారిని అణగద్రొక్కుచున్నాను.

    ఇంద్రా! నేను పగవారిని మించిన ఇహ, పరలోక జ్ఞానవంతుడను కావలెను. నేను అట్లు అగునట్లు అనుగ్రహించుము.

    శుభపాలకులగు మిత్రావరుణులారా! మమ్ము హింసించువారును, మమ్ము అతిక్రమించి సోమపానము చేయువారును ఉన్నారు. వారిని అణగద్రొక్కుచున్నాను.

    శుభకర్మ పాలక అశ్వినులారా! మమ్ము హింసించునట్టియు, నన్ను అతిక్రమించి సోమపానము చేయు శత్రువును అణగ ద్రొక్కుచున్నాను.

                                       పదకొండవ అనువాకము

    1. అగ్నీ! యజమానులు నీతో స్నేహము చేయుచున్నారు. అట్టివారు సంతానవంతులు, అన్నవంతులు, నీ రక్షణలు కలవారు అగుచున్నారు. వారు సంసార దుఃఖములను దాటిపోవుచున్నారు.

    2. ఋత్విజులారా! అగ్ని హోమ నిష్పాదకుడు. మనకు హితము కూర్చువాడు. అతనిని సూర్యుని స్తుతించిన రీతి స్తుతించండి. పూర్వ ఋషుల స్తుతులతోను, మమ్ము పాలించునట్టి స్తుతులతోను స్తుతించండి.

    3. అగ్నీ! నీకు సోమ, ఓషధి, సాన్నాయ రూపములగు మూడు అన్నములు కలవు. ఆహవనీయ, గార్హ పత్య, దక్షిణ రూపములగు మూడు సహస్థానములు కలవు. సాత్విక, రాజస, తామసరూపములగు మూడు నాలుకలు ఉన్నవి. అగ్ని, విద్యుత్తు, ఆదిత్య ములను మూడు దేవతా సంబంధ దేహములు ఉన్నవి. వానితో మా వాక్కులను ప్రమాదరహితములను చేయుము. మమ్ము రక్షింపుము.

    ఇంద్ర విష్ణువులారా! మేము యజ్ఞము చేయుచున్నాము. దానిని నిరాటంకముగా పూర్తిచేయించండి. అందుకని మీకు హవిస్సు నర్పించుచున్నాను. మిమ్ము సంతోషపెట్టుచున్నాను.

    ఇది అరిష్టములను అధిగమించిన యజ్ఞము. దీనిని మీరు పరిసమాప్తి చేయించినారు. ఈ యజ్ఞమును స్వీకరించండి. మాకు ధనము ప్రసాదించండి.

    5. విష్ణువా! నీవు, ఇంద్రుడు ఎల్లప్పుడు విజయులు అయినారు. పరాజితులైన జాడలేదు. మీ ఉభయులందు ఏ ఒక్కరు కూడ పరాజితులు కాలేదు. మీ ఇద్దరి స్పర్థకు గోసహస్రములు లభించును. వానిని మూడు భాగములుగ విభజించండి.

    6. అగ్నీ! నీకు ఆయువును వృద్ధిపొందించు మూడు అన్నములు ఉన్నవి. అవి పురోడాశము, సోమము, సాన్నాయము. నీ యొక్క ఆవిర్భావ ఉషః కాల జ్వాలలకు మూడు స్థానములు ఉన్నవి. అవి ఆహవనీయ, గార్హ పత్య, దక్షిణలు. ఆ జ్వాలలచే దేవతలను కాపాడు హవిస్సులను గ్రహించుము. యాగము చేయుము. తదుపరి యజమానికి దుఃఖములు పోగొట్టుము. సుఖములు కలిగించుము.

    7. అగ్ని విద్వాంసుడు. అతనికి మూడు విధముల హవిస్సులు అంతటను అందును. అగ్ని ఈ కర్మయందు ఏకాదశ సంఖ్య గల మూడు గణముల దేవతలను సంతోష పరచునుగాత.

    8. అగ్ని దేవతలకు దూతయగును. అతడు దేవతల కొరకు యాగము చేయునుగాత. అగ్ని విప్రుడు. అతడు మమ్ము సంతోషపరచునుగాక. మాకు ఉన్న కుత్సిత శత్రువులు నశింతురుగాక.

    9. ఇంద్రా విష్ణువులారా! మీరు శంబరునికి సంబంధించిన తొంబది తొమ్మిది నగరములను నాశనము చేసినారు. అతనికి సంబంధించిన లక్షల కొలది వీరులను హతమార్చినారు.

    10. ఇంద్రుని తల్లి గొప్పవాడగు ఇంద్రునితో ఇట్లన్నది:-

    "పుత్రా! నీవు శత్రువు విషయమున మిన్నకున్నావు. అందువలన దేవతలు నిన్ను విడిచిపోవుచున్నారు."


    అప్పుడు ఇంద్రుడు వృత్రుని వధించుటకు ఉద్యమించినాడు. 'మిత్రమా! విష్ణూ! నీవు పరాక్రమించుము' అన్నాడు.

            శ్రీ మదాంధ్ర వచన కృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ సంహిత
            మూడవకాండము నందలి రెండవ ప్రపాఠకము సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.