Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    4. ఉష ధనవతి. ఆమె వస్త్రమువంటి విశాల అంధకారమును క్షీణింప చేయును. సూర్యపత్ని అయి ఉష సంచరించును. ఉష సౌభాగ్యశాలిని. సత్యకార్యశాలిని. ఆమె ద్యులోక భూలోకముల అంతమున ప్రకాశించును.

    5. స్తోతలారా ! ఉష మీ ముందు శోభిల్లుచు అవతరించును. మీరు ఉషకు నమస్కరించుడు. ఉషను స్తుతించుడు. స్తుతులను స్వీకరించు ఉష ఆకాశమున ఉర్థ్వాభిముఖ తేజమును ఆశ్రయించును. ప్రకాశమాన రమణీయ దర్శన ఉష అత్యంత దీప్త అగును.

    6. సత్యవతి అగు ఉషను ఆమె ద్యులోక తేజము వలన ఎల్లరు ఎరుగుదురు. ధనవతి ఉష నానావిధ రూపయుక్తగా ద్యావాపృథ్వులను నిండియుండును. అగ్నీ ! నీకు అభిముఖముగా వచ్చునది, భాసమాన ఉషను నీవు హవి యాచింతువు ధనము పొందుదువు.

    7. వర్ష ద్వారమున జలమును ప్రేరేపించువాడు ఆదిత్యుడు. అతడు దినమూలమున ఉషను ప్రేరేపించును. విశాల ద్యావాపృథ్వుల మధ్య ప్రవేశించును. అనంతరము అందాల ఉష మిత్రావరుణుల ప్రభావ స్వరూపమయి, బంగారమువంటి తన కాంతులతో అనేక దేశములను ప్రకాశవంతము చేయును.

                               అరువది రెండవ సూక్తము

 ఋషి - విశ్వామిత్రుడు, దేవత - వేరు వేరు ఛందస్సు - 1-3 త్రిష్టుప్, మిగిలినవి గాయత్రి.

    1. మిత్రావరుణులారా ! మిమ్ము శత్రువులు అభిమానింతురు. మీ ప్రజలు తరుణ వయస్క శత్రువులచే బాధింపపడరాదు. మావంటి బంధువులకు అన్నము అందించునట్టి మీ యశస్సు అపరిమితము. నిరుమానము.

    2. ఇంద్రావరుణులారా ! యజమానులు మీ నుండి ధనము వాంఛింతురు. మీ రక్షణ, అన్నము కొఱకు మిమ్ము సర్వదా ఆహ్వానింతురు.

    3. మరుద్గణములారా ! ద్యులోక, భూలోకములతో కలిసి మీరు ఉభయులు మా స్తుతులను ఆలకించుడు.

    ఇంద్రావరుణులారా ! మాకు మేము కోరిన ధనము లభించవలెను.

    మరుద్గణములారా ! మాకు సర్వకర్మ సమర్థుడగు పుత్రుని, పశు సంపదను ప్రసాదించుడు.

    సర్వజన పూజనీయలు దేవపత్నుల శరణు మమ్ము రక్షించవలెను.

    హోత్రి, భారతి ఉదారవచనములతో మమ్ము పాలించవలెను.

    (హోత్రి అగ్ని పత్ని. భారతి సూర్యపత్ని అగుదురు)

    4. బృహస్పతీ ! నీవు సకల దేవతలకు హితకరుడవు. మేము అందించు పురోడాశాదులను స్వీకరింపుము. హవి సమర్పించిన యజమానికి ధనము ప్రసాదించుము.

    5. ఋత్విక్కులారా ! మీరు యజ్ఞసమూహమున, అర్చనీయ స్తుతుల ద్వారా, విశుద్ధ బృహస్పతికి పరిచర్యలు చేయుడు. నేను శత్రువును పరాభవించగల బలమును యాచింతును.

    6. బృహస్పతి అభిమత ఫలప్రదాయకుడు. విశ్వరూపనామక గోవాహన యుక్తుడు. అతిరస్కరణీయుడు. ఎల్లరికి భజనీయుడు. బృహస్పతిని అభిమత ఫలము యాచించుచున్నాము.

    7. దీప్తిమంతా, పూషా ! నవీన తమములు, శోభస్కరములగు స్తుతులు మీవియే. మేము మీకొరకే ఈ స్తుతిని ఉచ్ఛరించెదము.

    8. పూషా ! నా ఈ స్తుతిని స్వీకరింపుము. కామకుడు స్త్రీవద్దకు సాగినట్లు నీవు హర్షకారిణి అగు ఈ స్తుతి వద్దకు సాగుము.

    9. నిఖిల లోకములను విశేషరూపమున చూచునట్టి పూష మమ్ము రక్షించవలెను.

    10. మా బుద్ధిని ప్రేరేపించువాడు శ్రుతులందు ప్రసిద్ధుడు, ద్యోతమాన జగత్ స్రష్ట పరమేశ్వరుడు సంభజనీయ బ్రహ్మాత్మక తేజమును మేము ధ్యానింతుము.

    11. మేము ధనాభిలాషులము. స్తుతులద్వారా ద్యోతమానుడగు సవితను, భజనీయ ధనముకొఱకు యాచించుచున్నాము.

    12. అధ్వర్యులు మేధావులు. కర్మనేతలు. వారు బుద్ధిప్రేరితులయి హవి, శుభస్తవముల ద్వారా సవితను అర్చింతురు.

    13. మార్గదర్శకులు సోమమునకు వెళ్లువారికి స్థానము చూపింతురు. దేవతలు సంస్కరించబడిన యజ్ఞస్థానమునకు చేరెదరు.

    14. సోముడు మా స్తోతలకు, ద్విపాద-చతుష్పాత్తులకు, పశువులకు రోగరహిత అన్నము ప్రసాదించవలెను.

    15. సోముడు మాకు అన్నము ఆయువును వృద్ధిచెందించవలెను. కర్మ విఘాతులగు శత్రువులను పరాభూతులను చేయవలెను. మా యజ్ఞస్థానమునకు విచ్చేయవలెను.

    16. మిత్రావరుణులారా ! మీరు శుభప్రద కర్మంకరులు. మా గోష్ఠములను దుగ్ధపూర్ణము చేయుడు. మా నివాస స్థానములను మధురస పూరములు చేయుడు.

    17. మిత్రావరుణులారా ! మీ కార్యములు విశుద్ధములు. మిమ్ము అనేకులు స్తుతింతురు. మీరు హవిరన్నమున వర్థమానులు, దీర్ఘస్తుతియుక్తులు కండు. మహత్వ ధనబలములతో విరాజిల్లుడు.

    18. మిత్రావరుణులారా ! మీరు ఉభయులు జమదగ్ని ఋషి ద్వారా లేక అగ్నిని ప్రజ్వరిల్లచేయు విశ్వామిత్రుని ద్వారా స్తుతులయి యజ్ఞప్రదేశమున ప్రవేశింపుడు. మీరే కర్మఫలములను వర్థిల్లచేయువారు. మీరు సోమపానము చేయండి.

    విద్వాంసుడు, బహుభాషావేత్త, కవి, కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, బాలసాహిత్యకారుడు, చలనచిత్ర రచయత, విమర్శకుడు, వ్యాసకర్త, అనువాదకుడు, వక్త, స్వాతంత్ర్య సమరయోధుడు, బుధజన విధేయుడు, నీవే తప్ప ఇతః పరంబెరుగనని విశ్వసించినవాడు, బహుగ్రంధకర్త దాశరథి రంగాచార్య రచించిన ఆంధ్రవచన ఋగ్వేద సంహితమున మూడవ మండలము సమాప్తము.  

                                      ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.