Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
అర్జునుడు ఊర్వశిని తల్లివలె చూచినాడు ఉద్రేకమునకు లోనుకాలేదు. శాంతముగా అన్నాడు:-
"అమ్మా! నీవు చెప్పినది సమంజసముగా లేదు. దేవతలు ఎట్లు నడచినను దోషములేదు. నేను కర్మ భూమిన పుట్టిన వాడను. కర్మకు అధికారిని. ధర్మమునకు బద్ధుడను. స్వర్గమందలి ఆచారములు నాకు వర్తించవు.
"మా వంశకర్త పురూరవుడు. నీవు అతనికి భార్యవు అయినావు. అందువలన నీవు నాకు తల్లివి అయినావు. నీవు ఇంద్రునకు పరిచారికవు. అందువలనను నీవు నాకు తల్లివి అగుదువు. కావున తల్లీ ఊర్వశీ! నీవు నన్ను పుత్ర వాత్సల్యమున చూడుము. నన్ను దీవించుము ఆశీర్వదించుము".
ఊర్వశి కామపరవశ అయి ఉన్నది. ఆమెలో అర్జునుని మాటలు మంటలు రేపినవి. కోపమున కనులు నిప్పులు కక్కినవి. ఆమె కామ వివశ అయినది. అర్జునుని శపించినది:-
"ఏను గామించి వచ్చిన నా మనోరథంబు విఫలంబు జేసిన వాడవు నీవు మర్త్యలోకంబున మాన వర్జితుండవయి మానినీ మధ్యంబున నపుంసకుండవై యుండుమని శాపంబిచ్చి నిజగృహంబునకుంజనియె".
ఆ విధముగా ఆ రాత్రి గడచినది. తెల్లవారినది. ఇంద్రునకు రాత్రి జరిగిన కథ తెలిసినది. అతడు అర్జునుని దగ్గరకు వెళ్లినాడు. అర్జునుని ఓదార్సినాడు. అన్నాడు:-
"అర్జునా! నీవు ధైర్యశాలివి. నీ అంతటి ధైర్యము గలవానిని ఏ యుగములందును చూడలేదు. నీ ఇంద్రియ నిగ్రహమునకు మునులందరు నిన్ను బహుధా ప్రశంసించినారు. ఊర్వశి నీకు ఇచ్చిన శాపము నీకు ఉపకరించును. నీవు అజ్ఞాతవాసమున నపుంసక రూపమున ప్రవర్తించుచు రాజకన్యలకు నృత్యము నేర్పుచుండుము. ఊర్వశి ఇచ్చిన శాపము ఒక సంవత్సరము మాత్రము ఉండును. అజ్ఞాతవాసము ముగిసిన తరువాత అది అంతరించును"
ఇంద్రుడు ఆ విధముగా శాపము అర్జునునకు వరము అగునట్లుగా ప్రసాదించినాడు. అనంతరము ఇంద్రుడు అర్జునునకు వజ్రాస్త్రము మున్నగు ఆయుధములను ఇచ్చినాడు. వాని ప్రయోగ, ఉపసంహారములను ఉపదేశించినాడు. అర్జునుని ఎవరు గెలువ లేకుండునట్లును, అర్జునుడు అందరిని ఓడించునట్లును వరమును ప్రసాదించినాడు. ఆ తరువాత చిత్రసేనుడను గంధర్వుని వద్ద సంగీత, వాద్య నాట్యములు అభ్యసించుటకు అర్జునుని నియమించినాడు.
అర్జునుడు చిత్రసేనుని వద్ద నృత్య, సంగీతములు అభ్యసించుచు స్వర్గమున కాలము గడిపినాడు.
ఆలోచనామృతము
1. పాండవులకు బలపరాక్రమములు ఉన్నవి. అది నిజాము. కాని, వారికి ఉపాయ చాతుర్యము ఉన్నట్లు కనిపించదు. రాజసూయము వరకు వారికి వచ్చిన ఆపదలను ఎదుర్కొనుటకు విజయములు సాధించుటకు విదుర, వేదవ్యాస, శ్రీకృష్ణులు ఉపాయ చాతుర్యములను అందించి సహకరించినారు. రాజసూయము వలన పాండవులలో గర్వము పొడసూపినది. స్వబుద్ధిమీద ఆధారపడి, రాజ్యము కోల్పోయి, అవమానములపాలయి అడవులు పట్టినారు. సంపదపోయిన తరువాతనే సర్వులకు జ్ఞానోదయమగును. ఇది మానవ సహజము. పాండవులకు అడవులలో జ్ఞానోదయమయినది. మరల శ్రీకృష్ణుడు, వేదవ్యాసుడు వారి దగ్గరికి వచ్చినారు. ఉపదేశించినారు. అప్పుడు పాండవులు వారి మాటలు విన్నారు.
అధికారము, సంపద మనిషికి ఒక మాయపొర కప్పును. అవి రెండును పెద్దల, అనుభవజ్ఞుల మాటలు విననివ్వవు. అట్లు వినక పోవుట వలన కలుగు ప్రమాదములను హెచ్చరించునది ఈ వృత్తాంతము:-
2. అడవులలో ఒకేచోట ఎక్కువకాలము ఉండరాదని వేదవ్యాసుడు వివరించినాడు. ఇందుకు రెండు కారణములు కావచ్చును. పాండవుల ఉనికి తెలిసిన దుర్యోధనుడు ప్రమాదము కలిగించవచ్చును. రెండవది అడవిలో ఒకేచోట ఉన్న కందమూల ఫలాదులు అయిపోవచ్చును. స్థలము మారుట వలన విరివిగా లభించుటకు అవకాశము ఉన్నది.
గ్రామములకు, నగరములకు, రాజ్యములకే కాక వనములకు కూడా పేర్లు నిర్ణయించినారు. కామ్యకము, తపోవనము అను పేర్లు ఇందుకు నిదర్శనము.
3. తపోవనమునకు ఆయుధము ధరించి వెళ్లరాదను ఒక నియమము ఉన్నట్లున్నది. బ్రాహ్మణులు తప్ప ఇతరులు తపోవనమున ప్రవేశించరాదని అర్థము. అర్జునుడు ఆ నియమమును ధిక్కరించినాడు. క్షత్రియులు కూడ తపోవనమున ప్రవేశించవచ్చునని నిరూపించినాడు. ఆ విధముగా అర్జునుడు ఒక సంస్కరణకు కారకుడు అయినాడు. విజ్ఞానము, జ్ఞానము ఏ ఒక్క జాతికి గుత్తసొమ్ము కాదని నిరూపించినాడు.
అడవులు, కొండలు, నదీనదములు మానవాళికి ఉపయోగపడవలసినవి. ఏ కొందరో వీనిని ఆకట్టుకొని కూర్చుండుటకు వీలులేదని నిరూపించినాడు.
తపోవనమునకు ఆయుధముతో పోరాదని ఇంద్రుడు అడ్డగించినాడు. ఇంద్రుని మెప్పించి, అర్జునుడు సాయుధుడయి తపోవనమున ప్రవేశించినాడు.
4. నేటికిని మారణాయుధమున్న వాడు మొనగాడు. మానవజాతికి సేవ చేసినవాడు కాదు. మానవాళిని మంట కలిపినవాడు మొనగాడు. ఇది మానవ చరిత్ర మనకు ఎరుకపరచిన నిత్యసత్యము. ఎంత ఎక్కువమందిని హతమార్చు ఆయుధమున్న అంత గొప్ప దేశము, లేక అతడు అంత గొప్ప రాజు. ఆ దేశమునుండి ఆయుధములు ఆర్జించుటకు ఇతర దేశములు దేబరించుచుండును. ఆటం, హైడ్రోజను వంటి మారణాయుధములు గల దేశములను ఇతర చిన్న దేశములు అర్థించుట మనము చూచుచున్నాము.
మారణాయుధములు ఉన్నవాడు గొప్పవాడు. వాటిని ప్రయోగించ వలసిన పనిలేదు. ఆయుధము ఉన్నదన్న ఎదుటివాడు జంకును. అతి తక్కువగా ఉపయోగించబడునది ఆయుధము.
నాటికి "పాశుపతము" మారణాయుధములందు మిన్నదిగా కనిపించుచున్నది. దానిని ఆర్జించవలసినదని వేదవ్యాసుడు ఉపదేశించినాడు. ఆయుధముల ఆర్జనకు అర్జునుడు బయలుదేరినాడు.
నేటికిని ఆయుధములు ఆర్జనకే కదా! దేశములన్నియు తహతహలాడుచున్నవి!
5. మానవునకు అంతశ్శత్రువు గర్వము. గర్వమున్నవాడు ఏదియు సాధించలేడు. ఏలనన అతనికే అన్నియు తెలియును, అతడే అన్నీ చేయగలడు అను భ్రమలో ఉండును. ఈ భ్రమ జ్ఞానార్జనమునకు అడ్డుతగులును. ఇతరుల సాయము ఆర్జించవలెనను తృష్ణను నశింపచేయును. గర్వము పతనమునకు కారణము. పాండవుల విషయమున అదే జరిగినది.





