Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
అంత జరిగినను అర్జునునకు గర్వము వదిలినట్లు లేదు. తాను సర్వాధికుడను అను గర్వము అతని తలకు ఎక్కినది. ఆ గర్వము పడగొట్టకున్న అతని స్థానము అతనికి తెలుపకున్న అతనికే ప్రమాదము. అది చేయగలిగినవాడు శివదేవుడు ఒక్కడే. పాశుపతము అతని వద్దనే ఉన్నది. అది అందించు ముందు అర్జునుని గర్వము పడగొట్టదలచినాడు. రుద్రుడు ముందు అర్జునుని గర్వము పడగొట్టినాడు. అతని స్థానమును ఎరుకపరచినాడు. అనంతరము పాశుపతమును ఇచ్చినాడు.
6. ఒక విషయము కొంచెము సూక్ష్మముగను లోతుగను ఆలోచించవలసి ఉన్నది. బాహ్యనాగరకత బలిసినంతగా మనిషి సంస్కారము పెరుగదు. విజ్ఞానమునందును, నాగరకతయందును ఎంతో ముందుకు పోయిన సమాజములందు కూడా నిర్ణీతమయిన లైంగిక సంబంధములు ఉన్నట్లు కనిపించవు. బాహిరమయిన సంపద పెరిగిన కొద్దీ మానవుడు లైంగిక స్వేచ్చ కోరునట్లు కనిపించుచున్నది. నాగరకత పెరిగిన కొద్దీ నిగ్రహము తగ్గునని చెప్పవచ్చునేమో!
స్వర్గము ఆనాటికి అత్యంత నాగరకమయినదిగా చెప్పబడినది. ధన సంపద, ఆయుధసంపద అచట మితిమీరి ఉన్నట్లున్నది. కాని స్త్రీ పురుష సంబంధములందు వావి వరుసలున్నట్లు కనిపించవు. ఊర్వశి ఇంద్రునకు పరిచారిక. పూర్వము పురూరవునకు భార్య. ఆవిధముగా అర్జునునకు తల్లి అయినది. ఊర్వశిని అర్జునుని దగ్గరికి పంపినవాడు ఇంద్రుడు. అట్లనిన తన పరిచారికను కొడుకు దగ్గరికి పంపినాడు. ఊర్వశి వరుసకు అర్జునుని తల్లి. అయినను అర్జునుని దగ్గరికి వెళ్లుటకు ఆమె శంకించలేదు. పైగా తన కామము తీర్చమని అడిగి, తీర్చనందులకు శపించినది. స్వర్గమునందలి స్త్రీపురుష సంబంధములు అంత విచ్చిలవిడిగా ఉన్నట్లున్నవి.
రామాయణమున లంకను సహితము మరింత నాగరకమయిన సమాజముగా వర్ణించుట జరిగినది. లంకను వర్ణించిన కాండమునకు సుందరకాండమని పేరు పెట్టినాడు వాల్మీకి. లంకయందు సకల సంపదలున్నవి. ఆయుధములున్నవి. ఐశ్వర్యమున్నది. కాని లైంగిక నిగ్రహము లేదు. స్త్రీ పురుష సంబంధములందు నిబంధనలు లేవు.
అందముగా కనిపించినాడని రామునితో పొందుకోరినది శూర్పణఖ. సౌందర్యము కలదని సీతను అపహరించినాడు రావణుడు.
"స్వధర్మో రక్షసాం భీరు స్సర్వదైవ నసంశయః
గమనంవా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవా"
పర స్త్రీహరణము, పర స్త్రీగమనము రాక్షసులకు ధర్మము అంటాడు రావణుడు. ఈ రోజు అత్యంత నాగరకము, సంపన్నము అయిన అమెరికా దేశమున కూడా లైంగిక స్వేచ్చ కొఱకు తాపత్రయము పెరుగుచున్నది. హిప్పీలు, దిగంబర సభలు ఇందుకు నిదర్శనములు. నాగరకత వెఱ్ఱితలలు వేయుదశకు వచ్చినది అక్కడ.
అనాగరకులు అనిపించుకొను ఆటవిక తెగలందు ఉన్నంతటి లైంగిక క్రమశిక్షణ కూడా అత్యంత నాగరక సమాజములందు కనిపించుట లేదు. సంపద సంస్కార హీనతకు దారితీయునా?
7. స్వర్గము-కర్మభూమి అయిన భారతదేశమున రెండు విభిన్న నాగరకతలు కలవు. కర్మభూమి నుండి అర్జునుడు స్వర్గమునకు వెళ్లినాడు. అది ఒక భిన్న నాగరకత. అర్జునుడు అక్కడి నియమములను, ఆచారములను అనుసరింప వలెనను ధర్మమును ఊర్వశి వాదించినది. అర్జునుడు తన ధర్మమును చెప్పినాడు. కర్మభూమి నియమములనే పాటించినాడు.
రామాయణమందు సరిగ్గా ఇట్లే జరిగినది. రావణుడు సీతను తన దేశము-లంకకు తెచ్చినాడు. సీతకు రావణుడు తన ధర్మము చెప్పినాడు. ఆ ధర్మము ప్రకారము సీతను తనకు లొంగిపోవలసినది అన్నాడు. కాని సీత సరిగా అర్జునుని వలె తన ధర్మమును బోధించినది. "అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథా" శ్రీరామునకు, నాకు సూర్యునకు కాంతికి ఉన్నటువంటి సంబంధము అని చెప్పినది.
ఇక్కడ ఒక విషయము ఆలోచించవలసి ఉన్నది. మానవుడు ఏ దేశమునకు వెళ్లిన ఆ దేశపు ఆచారమును, శాసనమును అనుసరించ వలసి ఉన్నది. రామాయణమున సీతయు, ఈ సందర్భమున అర్జునుడును అట్లు చేయలేదు. అది దోషమగునా!
కాదు. మానవుడు ఒక సమాజపు అంతర్భాగము. అతనికి ఆ కట్టుబాట్లే వర్తించును. అతడు వేరు సమాజమునకు వెళ్లినపుడు వైయక్తిక కట్టుబాట్లను తనవెంట తీసుకొని వెళ్లును. అతడు తాను వెళ్లిన సమాజపు శిక్షాస్మృతికి లొంగవలసి ఉన్నది. కాని సాంఘిక నియమములు తన స్వంత సమాజపువే అతనికి వర్తించును.
మన దేశమున ఒక హత్య జరిగిన ఏ మతపువాడయినను అతనికి శిక్ష ఒకే శాసనమును అనుసరించి విధించబడును. కాని వివాహాది విషయములందు అట్లుకాదు. ఒక్కొక్క మతమునకు ఒక్కొక్క ఏర్పాటున్నది.
అందులకే అర్జునుడు తన ధర్మమూ బోధించినాడు. అందును అనుసరించి ప్రవర్తించినాడు.
8. వనిత తావలచి వచ్చిన కాదన్న నిగ్రహవంతులు స్వర్గమున అంతకుముందు లేరు. అర్జునుడే ఆపని చేసినాడు. అందుకే ఇంద్రుడు మెచ్చినాడు. ఊర్వశి పెట్టిన శాపమును సవరించి అర్జునునకు అది వరము అగునట్లు మార్చినాడు.
వాస్తవముగా అది గొప్ప నిగ్రహము!
నైషధము
ధర్మరాజు వద్దకు బృహదశ్వుడు అను ముని వచ్చినాడు. ధర్మరాజాదులు ఆమునికి స్వాగతం పలికినారు. సత్కరించినారు. అతనిని ఆసీనుని చేసినారు. అప్పుడు ధర్మరాజు "మునీంద్రా! మేము సకల రాజ్యమును, బంధువులను విడిచి, మృగములవలె అడవులలో ఉన్నాము. పూర్వము మా వలె కష్టములు పొందినవారున్నారా? ఉన్న యెడల వారిని గురించి మాకు తెలియ పరచుము" అని విన్నవించినాడు.
బృహదశ్వుడు ధర్మరాజునకు నలుని కథ చెప్పినాడు. నలుడు నిషాధ దేశమునకు రాజు. అందువలన అతని కథ "నైషధము" అయినది. ఆ కథ ఇట్లుండును.
పూర్వము నిషధ రాజ్యమును వీరసేనుడు పాలించినాడు. అతని కొడుకు నలుడు.
తపనీయ దండైక ధవళాత పత్రితో
ద్దండ తేజః కీర్తిమండలుండు
నిర్మల నిజ కథా నిమిష కల్లోలినీ
క్షాళితాఖిల జగత్కల్మషుండు
వితత నవద్వయ ద్వీప నానాజయ
శ్రీవధూటీ సమాశ్లిష్ట భుజుడు
నిఖిల విద్యానటీ నృత్యరంగ స్థలా
యతనాయమాన జిహ్వాంచలుండు
ప్రస్తుతింపంగ దగు సముద్భట కఠోర
చటుల గుణటంక్రియా ఘనస్తనితఘోష
చాప నీరద భవశరాసార శమిత
బలవ దహిత తేజో దవానలుడు "నలుడు"
(శృంగార నైషధము)





