Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    అనేక దివ్యాస్త్ర లాభము పొందిన అర్జునుని చూచినాడు ఇంద్రుడు. వేయి కన్నులునూ ప్రయోజనము పొందినట్లు తన పుత్రుని చూచి పొంగిపోయినాడు.
    ఐరావతమును ఎక్కి ఉన్న ఇంద్రుని చూచి అర్జునుడు ఆశ్చర్యపడినాడు. ఇంద్రుని దర్శించినందులకు సంబరపడినాడు.
    "అర్జునా! నీవు గొప్పపని చేసినావు. పరమేశ్వరుని మెప్పించినావు. పాశుపతము ఆర్జించినావు. నీవే దేవకార్యము తీర్చుటకు యోగ్యుడవు. నీకొఱకు మాతలితో రథము పంపింతును. అమరావతికి రమ్ము. అక్కడ నీకు దివ్యాస్త్రములను ప్రసాదింతును" అని చెప్పి ఇంద్రుడు దేవ గణములతో అంతర్ధానుడు అయినాడు.
    అర్జునుడు హిమవంతమున ఒంటరిగా మిగిలినాడు. అతడు పరమేశ్వరుని దర్శించినాడు. ఇంద్రాది దేవతలను చూచినాడు. దివ్యాస్త్రములను పొందినాడు. వాటిని తలచుకొనుచు తపోవనమునందలి అందములను చూచుచు అటు ఇటు తిరుగుచున్నాడు.
    ఇంతలో ఆకాశమున గంభీర ధ్వని వినిపించినది. అర్జునుడు అటు చూచినాడు. వేల మెరుపులు ఒక్కసారి వెలిగినట్లు కనులు మిరుమిట్లు గొలిపినవి. అర్జునుడు ఆశ్చర్యపడి చూచుచుండగనే ఇంద్రుని దివ్యరథము దిగినది. అర్జునుని ఎదుట నిలచినది. ఇంద్రుని సారథి 'మాతలి" రథము దిగినాడు.
    "అర్జునా! సమస్త దేవతలు తమ కిరీటములందలి నవరత్నకాంతి సోకునట్లుగా ఇంద్రునకు పాదాబివందనము చేయుదురు. అటువంటి నీ తండ్రి నీ కొఱకు రథము పంపించినాడు. రమ్ము అమరావతికి వెళ్లుదము. నూరు రాజసూయములు చేసిన వారికి కూడ ఈ రథమును ఎక్కు అదృష్టము లభించదు. బయలుదేరుము. అమరావతికి వెళ్లుదము" అని మాతలి అర్జునుని ఆహ్వానించినాడు.
    అర్జునుడు ఇంద్రుని రథము చూచినాడు. ఎంతో సంబరపడినాడు. మాతలికి నమస్కరించినాడు. గంగా నదిలో స్నానము చేసినాడు. పరిశుద్ధుడు అయినాడు. దేవతలకు పితరులకు తర్పణములు అర్పించినాడు. ఇంద్రుని దివ్యరథము ఎక్కినాడు. రథము ఆకసమునకు ఎగిరినది. అర్జునునకు దిగిపోవుచున్న మందర పర్వతము కనిపించినది. గడచిన సంఘటనల దృశ్యములు మనసున మసలినవి. "మందరమా! నా తపము నీ యందే ఫలవంతము అయినది. దివ్యాస్త్రలాభము నీ యందే లభించినది. నీకు నమస్కారము" అని మందరమునకు వందనము చేసినాడు.
    మాతలి సారథ్యమున ఇంద్రుని రథము వాయువేగ మనో వేగములతో సాగినది. రథము అమరావతిలో ప్రవేశించినది. అమరావతిని చూచి అర్జునుడు ఆశ్చర్యపడినాడు. ఆనందపడినాడు. అమరావతిలో అనేక సౌధములున్నవి. అవన్నియు రత్నమయములు. వాటినుండి రత్నకాంతులు ఈనుచుండును. అవి సుందరములు. శోభాయమానములు అయి ఉండును. ఆ సౌధములందు ధర్మమార్గమున రాజ్యము పాలించి తనువులు బాసినవారు, రణరంగమున అసువులు బాసినవారు, యజ్ఞవిధులు నిర్వహించి మరణించిన వారు, మహా తపస్సంపన్నులు నివశించుచుందురు.
    అర్జునుడు సౌధములను చూచుచు సాగిపోయినాడు.
    అర్జునునకు ఐరావతము కనిపించినది. అది మంచు కొండవలె తెల్లగా ప్రకాశించుచున్నది. ఏనుగు తల నుండి మద జలధారలు కారుచున్నవి. అవి మంచుకొండ నుండి వెలువడు సెలయేళ్ల వలె ఉన్నవి. ఐరావతము గొప్పగా ఉన్నది. అందముగా ఉన్నది. గంభీరముగా ఉన్నది.
    రథము సాగుచున్నది. మార్గములకు ఇరుపక్కల ఉద్యానములున్నవి. వానిలో వివిధ దివ్య పుష్ప జాతులున్నవి. చల్లని, మెల్లని గాలి, పూల పరిమళములను మోసుకొనివచ్చి అర్జునుని తాకినది. అది ఆహ్లాదకరముగా ఉన్నది. అర్జునుని పరవశింప చేసినది.
    రథము సాగుచున్నది. నలువైపుల నుంచి మెల్లని, సన్నని వాద్యధ్వనులు చక్కని సంగీతము వినిపించినది. సంగీతము మనసును మురిపించినది. దేవతలు, సిద్ధులు అర్జునుని చూచినారు. అతని పరాక్రమమును కీర్తించినారు. సిద్ధులు, దేవతలు అర్జునుని ఆశీర్వదించినారు.
    రథము ఆగినది. అర్జునుడు దిగినాడు. మాతలి మార్గము చూపినాడు. అర్జునుడు అనుసరించినాడు. అతడు ఇంద్రభవనము చేరినాడు. ఇంద్రుడు ఎదురువచ్చినాడు. అర్జునుడు ఇంద్రునకు పాదాభివందనము చేసినాడు. ఇంద్రుడు అర్జునుని బాహువులు పట్టుకొని లేవనెత్తినాడు. కౌగిలించుకున్నాడు. ఇంద్రుడు పుత్రపరిష్వంగమున పులకాంకితుడు అయినాడు.
    ఇంద్రుడు సభ తీర్చి ఉన్నాడు. దేవతలున్నారు. సభ వైభవముగా ఉన్నది. దేవతా వేశ్యలు చామరములు వీచుచున్నారు. సభ అందముగా ఉన్నది. ఆనందముగా ఉన్నది. ఆహ్లాదకరముగా ఉన్నది. ఇంద్రుడు అర్జునుని సింహాసనము వద్దకు తోడ్కొని వెళ్లినాడు. తాను కూర్చున్నాడు. అర్జునుని తన తొడపై కూర్చుండ పెట్టుకున్నాడు. తదుపరి తన పక్కన కూర్చుండ బెట్టుకున్నాడు. అర్జునునకు ఇంద్రుని అర్దాసనము లభించినది. దేవతలందరు ఆశ్చర్యపడినారు. ఆనందించినారు. అర్జునుని ఆశీర్వదించినారు.
    ఇంద్రసభ ముగిసినది. అర్జునునకు రత్నమయమయిన భవనమును విడిదిగా ఏర్పరచినారు. అర్జునుడు అందు విడిసినాడు. గంధర్వ గానములు అతనికి మత్తెక్కించినవి.
    అంత సాయంత్రమయినది. సూర్యుడు అస్తమించినాడు. తారకాయుతుడయిన చంద్రుడు ఉదయించినాడు. వెన్నెలలు విరజిమ్మినాడు. రేయి వయ్యారములు ఒలకబోసినది. రాత్రి మత్తుగా ఉన్నది. వాతావరణము మత్తుగా ఉన్నది. మనసు మత్తుగా ఉన్నది.
    అప్పుడు నిలింపపతి పంపున సొంపార నూర్వశి యర్జున సంగమ కాంక్షంజేసి క్రొమ్మెఱుంగు దీవయుంబోలె మణిమయ మంజీర ఘళంఘళ నినాదంబును గణకణ ఘణ ఘణత్కారంబును మ్రోయుచుండ మందగమనంబున అర్జునుని మందిరమునకు అరుదెంచినది.
    అర్జునుడు ఊర్వశిని చూచినాడు. భయ భక్తి సంభ్రమములతో బ్రత్యుత్థానంబును, దండ ప్రణామంబునుంజేసి, కరకమలములు మొగిచి యిట్లనియె:-
    "అమ్మా! నీవు పుత్ర స్నేహమున నా వద్దకు వచ్చినావు. నీకు వందనము. నీరాక వలన నేను కృతార్థుడను అయినాను".
    ఊర్వశి వచ్చిన పని వేరు. విన్నమాట వేరుగా ఉన్నది. ఆమె నిశ్చేష్ట అయినది. అర్జునుని మాటలు ఆమెకు నచ్చలేదు. ఆమెలో కోరికలు బుసలు కొట్టుచున్నవి.
    "అర్జునా! నీవు వీరుడవు. నీ గుణగణములు నారదాదుల వలన విన్నాను. నీమీద మనసయినది నీతో రమించవలెనను కొండంత కోరికతో వచ్చినాను, నీవేమో వెఱ్ఱిమాటలు మాట్లాడినావు. నేను నీకు తల్లినని ఒక వరస కలిపినావు. మేము దేవతా స్త్రీలము. మాకు వావి వరసలు లేవు, స్వర్గమున అట్టి వరుసలు వెదకరాదు. ఇచట స్త్రీ, పురుషులు బంధువరుసలు లేక రమింతురు. ఇది ఈ లోకపు ఆచారము. ఇక్కడ అది దోషముకాదు. నీవు ఇప్పుడు స్వర్గమున ఉన్నావు. కాబట్టి నా కోరిక తీర్చుము. నాతో రమింపుము. రమ్ము, మేరుపర్వతముల విహరింతము. ఆకాశగంగ సైకతములందు ఆడుదము. చక్కని చిన్నది నీముందున్నది. ఆలోచన మానుము. ఆలింగనమునకు రమ్ము" అని ఊర్వశి అర్జునుని ఉసికొల్పినది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.