Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    నేను : సుల్తాను గారు తెలుసా ?
    కుర్రాడు : ఏ సుల్తాను గారు ?
    నేను : పెళ్ళికొడుకు పక్కన నీతో కూర్చున్నవారు.
    కుర్రాడు : వారు మా అన్నగారు. వారిని సుల్తానుగారు అనవద్దు.
    నేను : సరేకానీ నేనిచ్చింది వారి కిస్తావా ?
    కుర్రాడు : కోప్పడితే?
    నేను : కోప్పడరు?
    కుర్రాడు : ఏమిస్తారు/ తాంబూలమా?
    నేను : " తాంబూలం కాదు. ఇదిగో ఈ కాగితం ఇవ్వు" అని అక్కడ పడి ఉన్న కాగితం తీసి పద్యం వ్రాసి ఇచ్చాను.
        వలపు వగలు వీడి నన్ను విస్మరించితి వెన్నడో!
        నేను రగిలింతు నీ నిండు సభలో నిన్ను!
    కాగితం వారు చూడకుండా వారి ముందు పెట్టవలసిందని చెప్పాను. కుర్రాడు అలాగే చేశాడు. నేను తలుపుచాటుగా చూస్తున్నాను. సుల్తానుగారు కాగితం తీసి చూశారు. వారి ముఖంలో ఆలోచన వ్యక్తమైంది. మళ్ళీ కాగితం చదివారు. జేబులో పెట్టుకొని సైగ చేసి షమ్మీర్ ఖానును పిలిచారు. అతని చెవిలో ఏదో చెప్పారు. షమ్మీర్ ఖాను మా గదిలోకి వచ్చి "మీ పత్రానికి జవాబు ఇంటికి వెళ్ళి వ్రాసి పంపుతామన్నారు" అని చెప్పాడు.
    మరుసటి రోజు ఉదయం మళ్ళీ కచేరి జరిగింది. సభలో నవాబుగారు లేరు. వారు లేని సభ రిక్టంగా కనిపించింది. పాడ బుద్ది కాలేదు. కచేరీ ముగిసిం తరువాత ఇంటికి వచ్చాను. షమ్మీర్ ఖాను కోసం నిరీక్షణ. పగలు గడిచింది. సాయంకాలం అయింది. దీపాలు వెలిగాయి. అప్పుడు వచ్చాడు . నవాబుగారి పత్రం అందించాడు. అందులో ఉన్న విషయం ఇది.
    "హృదయంలో అణగి వున్న అగ్నిని పద్యం ప్రజ్వరిల్లజేసింది. నిన్ను ప్రేమించాను. అది నిజం, రీతులు, నియమాలు బలవత్తరం అయినవి. మీ ఇంటికి రావడం అసంభవం. నవాబ్ గంజ్ లో నాకొక అన్యోన్య మిత్రుడున్నాడు. రేపు అక్కణ్నుంచి కబురంపుతాను. వీలున్నప్పుడు వచ్చేయి. మనం కలుసుకునేందుకు ఇదొక్కటే మార్గం -- అదీ రాత్రి తొమ్మిది పది గంటల వరకు.
        ఒక్క కనుచూపుకై పడిగాపులు పడియుండి;
        దక్కించుకొంటి నీ మధుర సమాగమక్షణమ్ము!
        కాని - వలపుతేనే లానుట మానివైచి        
        వంకర మాటల తెగవాడుకో సమయమేది?"
    నాటి నుంచి సుల్తాను గారు ఖానమ్ ఇంటికి రాలేదు. వారానికి రెండు మూడు సార్లు నవాబ్ గంజ్ బన్నె గారి ఇంటి నుంచి కబురంపేవారు. అది వింత స్నేహం. అందులో  సొగసుంది. అందం ఉంది. ఒకప్పుడు కవిత్వ చర్చ జరిగేది. ఒకప్పుడు నవాబు బన్నె సాహెబ్ తబలా వాయించేవారు. నేను పాడేదాన్ని. రాగం, తాళం తెలియకున్నా సుల్తాను గారు కూడా పాడేవారు. తమ గజళ్ళు తామే పాడేవారు.
        చూపుల పందే మింతై అంతై ఎంతో పెరిగే!
        నేను ప్రియుని చూచుతి, అతడు చూచెనా చూపుల!
    ఆ గోష్టిని తలుచుకుంటే అంతా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. వేసవి రోజులు, వెన్నెల రేయి. తోటలో తెల్లని చాందినీ పరచి ఉంది. బాలీసులు, విలాస సామగ్రికి కొదవలేదు. విచ్చిన మల్లెలు. రకరకాల పూలు, చమేలీ పరిమళం మనసులో గుబాళిస్తుంది. నింపి ఉన్న హుక్కాలు, ఏకాంత గోష్ఠి మనసుకు నచ్చిన ముచ్చట్లు, స్వేచ్చ. ఆ వాతావరణం లో మనిషినే కాదు దేవుణ్ణి కూడా మరిచిపోతాం. ఎంత వేగంగా గడిచిపోయినట్లుంటుంది. ఆకాలం! కాని స్మృతిపదంలో అవి జీవితాంతం బాధ పెడుతుంటాయి.
    మేమిరువురమూ ప్రేమించుకున్నాం. మా ఇరువురి ప్రవృత్తులూ ఒకలాంటివే. జీవితమంతా కలిసి ఉన్నా విసుగులేదు. సుల్తానుగారికి కవిత్వమంటే ఆసక్తి. నాకా పిచ్చి చిన్నతనం నుంచే పట్టుకుంది. మా మనసులు కలిసిపోయాయి. అదే ప్రేమకు కారణం కావచ్చు. కాని విధి అలాంటి మధుర కాలాన్ని క్షణాలుగా మార్చి అంతం చేసింది.

        వలపు సంత తిరిగి దోపినైతిని పో
        స్వర్గమందు నీ స్మృతులె వెంట నంటి రగిలించే!
    వారు మాటమాటకు పద్యం చదివేవారు. నేను పద్యంతోనే జవాబిచ్చేదాన్ని. నాతొ కలిసిపోయినంతగా సుల్తానుగారూ ఎవరితోనూ కలిసిపూలేదు. అదే మా ప్రేమకు కారణం కావచ్చు. కాని దైవం బలీయం అయింది. అలాంటి సమావేశాలన్నింటిని ఇట్టే భగ్నం చేస్తుంది.
        నిండు పున్నమిరేయి నింగిని చూచి నిట్టుర్చితి
        ఎన్నెన్ని వలపు తీయనిరేలు చెదిరిపోయినవి!
    రుస్వా: అదంతా నిజమే కానీ మీరు పాదం పెట్టిం తరవాత భగ్నమైపోయి ఉండాల్నే!
    ఉమ్రావ్ : వాహ్ మిర్జా గారూ! అయితే వారికి నేను శత్రువునా?
    రుస్వా : ఆ మాట అనలేను గానీ తమ పాదం పడినచోటల్లా శూన్యమయింది!
    ఉమ్రావ్ : మీ ఇష్టం వచ్చినట్లనుకోండి. ఈ విషయం తెలిసి ఉంటే నా కధ వినిపించేదాన్నే కాదు. తప్పయింది క్షమించండి.
    రుస్వా : తప్పు. జీవితంలో మీరు చేసిన పని అదొక్కటే. మంచైనా చెడు అయినా దానితోనే మీ పేరు లోకంలో నిలిచిపోతుంది. అదలా ఉండనివ్వండి. ఆ గజలు లోని రెండు మూడు చరణాలు చదవండి.
    ఉమ్రావ్ : మీ పరిహాసం బాగుంది.
    రుస్వా : బాగుండక ! సరే గజల్ వినిపించండి.
    ఉమ్రావ్ :  మంచిది వినండి. అది చరణాలు, తరవాత కొన్నీ జ్ఞాపకం ఉన్నాయి.
        మనోవ్యధ దుఃఖనిశలు గడువ తొడ్పడే
        వలపు విస్తరించుకొలది చింతలు చిన్నవయ్యే!
        కురులు విప్పి శోకమూర్తి యననొప్పె ఆమె;
        కాంక్షలెల్ల ఒకటోకటి శోకనీరధి మున్గే!    
         అపశకునలు మొదలె విరహమందు తోనే,
        వలపు కలయక ముందే చెదరే చెలిమి తీవె!

                                                                            8

    ఆ కాలంలోనే జాఫరలీఖాను కొలువుంచుకున్నారు. వారి వయసు సుమారు 70 ఏండ్లు. నోట్లో ఒక్క పన్ను గాని, తల మీద ఒక్క వెంట్రుక కానీ లేదు. నడుము వంగిపోయింది. అయినా ప్రేమ వ్యవహారంలో దక్షుణ్ణి అనుకునే వాడతడు. అతని వదులు అంగరఖా, పైజమా , టోపీ మరువలేను.
    ఆ వయసులోనూ ఆ స్థితిలోను వేశ్యను ఉంచుకోవాల్సిన అవసరం. ఏమిటి అనుకోవచ్చు మీరు. అది ఆ కాలపు ఫేషను. వేశ్యలేని అమీరు గాని, జాగీర్దారుగాని ఉండేవాడు కాడు. తమ వైభవానికి తగిన ఇతర సామాగ్రితో పాటు నవాబుల దర్భారులో స్వస్తి చెప్పే ఇతరుల్లో ఒక వేశ్య కూడ ఉండేది. ఆమెకు నెలకు డెబ్బయి అయిదు రూపాయల జీతం. గంట రెండు గంటల సహచర్యం తరవాత వెళ్ళిపోయేది. ఈ నవాబు ముసలివాడు తొమ్మిది గంటల తరవాత దివాన్ఖానా (కొలువు కూటమి) లో కూర్చో లేకపోయేవారు. పొరపాటున ఎన్నడైనా ఆలస్యం అయితే దాది వచ్చి వారిని తీసుకెళ్ళేది. నవాబుగారి తల్లి ఇంకా జీవించివున్నారు. అయిదేండ్ల కుర్రాడిలా భయపడేవారు తల్లికి. భార్య అంటే ఏంతో ప్రేమ. నశరాత్రము , మొహర్రంలో తప్ప ఇతర రాత్రులలో వేరుగా పడుకునేవారు కారు.
    మీరు నవ్వుతారు గాని నన్నడిగితే అతడు ప్రేమించతగినవాడే . ఆ వార్ధక్యంలో కూడా విరహగీతం పాడితే గుండె నిండినట్లయ్యేది.
    సంగీతంలో వారికి ప్రావీణ్యం ఉండేది. వారి ముందు పాట పాడే ధైర్యం ఎవరికీ లేదు. మంచి మంచి సంగీత విద్వాంసులను నిలదీశారు. పట్టాపొందిన సంతాప సంగీత విద్యాంసుని లాంటి ప్రజ్ఞ వారిది. సంతాపగీతాలంటే ఏంతో ఇష్టం వారికి. వారి కొలువులో ఉండి వందల సంతాప గీతాలు నేర్చుకున్నాను. నా కీర్తి దూరదూరాలకు వ్యాపించింది.
    వేశ్యలంతా మొహర్రం (పీరుల) పండుగ చేసేవారు. కాని ఖానమ్ అందరికంటే అట్టహాసంగా చేసేవారు. ఇమామ్ బాడా (మఠం) గాజు మొగ్గలతో అలంకరించబడేది. మొహర్రం పది రాత్రులు సభలు జరిగేవి. పదవరోజు వందలమంది ఉపవాసాలుండేవారు. నలబై రోజుల వరకు ప్రతి లక్ష్మీ వారము సమావేశం జరిగేది.    




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.