Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
నవాబు : మనవి చేస్తాను. మీరు మాత్రం గజల్ చదవాలి.
ఈలోగా తలుపు తెరుచుకొని 50, 55 ఏండ్ల వృద్దుడు గదిలో ప్రవేశించాడు. నలుపు రంగు పెద్ద గడ్డం, వంకర తలపాగ , నడుముకు కత్తి వ్రేలాడుతుంది. గదిలోకి వచ్చినా పక్కనే కూర్చున్నాడు. నవాబు నావైపు చూశారు. తల వంచుకున్నాను. కత్తి వేటుకు రక్తం లేదు. ఏకాంతంగా ఉంటుందని నవాబుతో ఒప్పందం. ఎంత చక్కని సంభాషణ! మంచి హాస్యం! రక్కసిలా వచ్చి కూలాడు.
ఎంత హాయి అయన స్నేహం! పానకంలో పుడకలా వచ్చాడు మూర్ఖుడు. నవాబ్ గజల్ చదివేవాడు. నేనూ చదివేదాన్ని. నన్ను పొగిడేవారు. హృదయానికి ఎంత ఉల్లాసం! ఎంత అనందం ఒలికిపోయింది! ఇవ్వాళే రావాలా ఈ రాక్షసుడు! ఈ పీడ త్వరగా దూరం అవుతే బావుండును. వాణ్ణి చూచాను. నా గుండె అదిరింది. నా ప్రాణానికి వీడు మరొక దిలావర్ ఖాను అయినాడు. వాని నడుమునకున్న కత్తి నా గుండెనే చీలుస్తుందో, నవాబుకేమైనా నష్టం కలిగిస్తుందో అని వణికిపోయాను. భగవంతుడా! ఎక్కడి నుంచి తెచ్చావు నాయనా ఈ ఆపద! అని తిట్టుకున్నాను.
నాకేమీ తోచలేదు. బువాహుసేనీని కేకవేశాను. ఆవిడ వచ్చింది. గ్రహించింది. బువాహుసేనీ కి కూడా అతనిని గురించీ తెలీదన్నట్లు తేలింది.
బువాహుసేనీ: ఖాన్ సాహెబ్! కాస్త ఇటు విచ్చేయండి. మీతో ఒక విషయం విన్నవించాలి.
ఖాన్ సాహెబ్ : చెప్పాల్సింది అక్కడి నుంచే చెప్పు. మేము కూర్చున్న చోటు నుంచి కదలం.
హుసేనీ : దౌర్జన్యమా?
ఖాన్ : దౌర్జన్యమేమి? బోగం కొంప ఒకని జాగీరా! పోనీ దౌర్జన్యమే. మేము కదలం. చూస్తా ఎవడు .... కదిలిస్తాడో?
హుసేనీ : జాగీరు ఎందుకు కాదు? డబ్బిచ్చినవానిది వేశ్య. ఇప్పుడెవరూ రావడానికి వీల్లేదు.
ఖాన్ : మేమేం డబ్బు వెచ్చించలేమా?
హుసేనీ : అయినా ఇది సమయం కాదు. మరోసారి విచ్చేయండి.
ఖాన్ : నీకేం అర్ధం కావడం లేదా? చెప్పెశాంకదలమని.
నవాబు ముఖం కోపంతో ఎర్ర వారింది. ఇప్పటిదాకా మౌనంగా ఉన్నారు. పెదవి కదపలేదు.
హుసేనీ : సరి, బిడ్డా, నీవు లేచి ఇలా రా. (నవాబును సంభోదించి) మీకు విశ్రమించే సమయం. సౌధానికి వేంచేయండి.
నేను లేద్దామనుకుంటుండగానే దుర్మార్గుడు నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఏం చేయాలి?
నవాబు : ఖాన్ సాహెబ్! మీ క్షేమం కోసం చెబుతున్నాను. ఆవిడ చేయి వదలండి. ఇది వేశ్యాగృహం అని ఇంత సేపటినుంచి ఊరుకున్నాను. కాని ఇప్పుడు .....
ఖాన్ : కాని ఇప్పుడు ..... ఇప్పుడెం చేస్తారో చూస్తా. విదిపిస్తావా?
నేను : ( గట్టిగా చేయి విదిలించి) సరి. వదలండి. నేనెక్కడికి వెళ్ళను (ఖాను చేయి వదిలాడు)
నవాబు : మాటలు మంచిగా రానివ్వండి. మీకు సర్పురుషుల స్నేహం లభించినట్లు లేదు.
ఖాన్ : నీకు లభించిందా ? చాలు. ఏం చేసుకుంటావో చేసుకో.
నవాబు : మీరు పోట్లాడ్డానికి వచ్చినట్లున్నారు. కాని ఇది వేశ్యాగృహం. గరడీశాల కానీ మైదానం గానీ కాదు. ఇంతటితో ముగించి ఇక్కడి నుంచి నిర్గమించడం మంచిది. లేకుంటే .....
ఖాన్ : కాకుంటే నన్ను మింగేస్తారా? వెళ్ళిపొండి అని నన్నే అన్నావు. నువ్వెందుకు వెళ్ళవు?
నవాబు : ఖాన్ సాహెబ్! అమీరులంటే నాకెంతో గౌరవం; నేను నా గౌరవాన్ని కాపాడుకోవాలి. తలిదండ్రులు , బంధువులు, మిత్రుల గౌరవం కూడా కాపాడాలి. అలా కాకుంటే మీ దుడుకుదనానికి ఎప్పుడో ఫలితం చూచి ఉండేవారు. మళ్ళీ చెపుతున్నాను. అనవసరపు మొండితనం మాని ఇక్కడ్నుంచి వేం చేయండి.
ఖాన్ : బోగం కొంపకు వచ్చి తల్లికి భయపడతావు? ఏమిటా దుడుకుతనం? నేను నీ తండ్రి నౌకరును. నువ్వు అతని కొడుకువు. అయితే ,మాత్రం బోగం కొంపలో నీవూ కూర్చున్నావు. నేనూ కూర్చున్నాను. మా ఇష్టం వచ్చినపుడు వెళ్ళిపోతాం. అనవసరంగా నువ్వే మంకు చేస్తున్నావు. నన్ను కదిలించిన వాణ్ణి ఇవాళ్టికి చూడలేదు.
నవాబు : కదిలించడం కష్టమా? సేవకులను పిలిస్తే మెడ మీద చేయి వేసి బయటికి గెంటేస్తారు.
ఖాన్ : సేవకుల బలం చూచుకొని పొంగకు. చూచావా కటారి?
నవాబు : ఇలాంటి కటార్లు చాలా చూశాం. సమయానికి పనికి వచ్చింది కటారి. మీ ఒరలోంచి కటారి వచ్చేలోపల తల మెడ నుంచి వేరవుతుంది. చూతాం తరువాత.
ఖాన్ : అయ్యో పాపం! అయితే ఇంటికి వెళ్ళు. అమ్మ జ్ఞాపకం చేస్తుంటుంది.
నేను చూస్తుండిపోయాను. నవాబు ముఖం పూర్తిగా కందిపోయింది. కోపంతో వణికిపోతున్నారు. అయినా గౌరవంగా సంభోదిస్తున్నారు. ఆ దుష్టుడు ఎంత పేలినా "మీరు" అని మాట్లాడుతున్నారు. ముందు నవాబు బెదిరారనుకున్నాను. కాని అలా కాదు. వారికి తమ గౌరవం మీద దృష్టి ఎక్కువ. సౌమ్యంగా పరిష్కారం కావాలని చూస్తున్నారు. కాని ఆ దుష్టుని ప్రేలుడు ఎక్కువ అవుతుంది. నవాబు మెత్తపడుతుంటే వాడు పులి అవుతున్నాడు.
నవాబు : అచ్చా, ఖాన్ సాహెబ్ , నడవండి అయిష్ బాగ్ కు , అక్కడ పోట్లడుదాం.
ఖాన్ : (వెర్రిగా నవ్వి) కుమారా ! ఇంకా బుగ్గలు పాలు చిమ్ముతున్నాయి. మగవారితో పోట్లాడే ధైర్యం వచ్చిందా? కూలావో మీ అమ్మ మొత్తుకుంటూ తిరగాల్సి వస్తుంది.
నవాబు : "దుర్మార్డుడా! నీ ద్వేష్టాలు హద్దు మీరాయి. నీ దుర్మార్గానికి ఇదిగో శిక్ష" అని జేబులో నుంచి పిస్తోలు తీసి "ధన్" అనిపించారు. ఖాను నేల కూలాడు.
నేను మొద్దు బారిపోయాను. గచ్చు మీద రక్తపు మడుగు. బువాహుసేనీ బొమ్మలా నిలబడిపోయింది. ఆ ధ్వని విని ఖానమ్ , మిర్జా, ఖుర్షిద్, అమీర్ జాన్ , బిస్మిల్లా ఖాన్, దాసదాసీలు అంతా పరిగెత్తుకొని వచ్చేశారు. నా గది నిండిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్పుకున్నారు. ఒక నవాబు నడీడు నౌకరు షమ్షీరు ఖాన్ నవాబు చేతిలోని పిస్తోలు తీసుకొని "హుజూర్! తాము ఇంటికి దయచేయండి. ఇది నేను చూసుకుంటాను" అన్నాడు.
నవాబు : నేను వెళ్ళను. అయిందేదో అయింది. కావలసింది అవుతుంది.
షమ్మీర్ ఖాను బోడ్లోంచి చురిక లాగి " జనాబ్ అమీర్ ఆలే ఉస్సలాం తోడు గుండెలో గుచ్చుకుంటాను. కాదంటారా ఇక్కడి నుంచి దయచేయండి. తామిక్కడ ఉండడం మంచిది కాదు ' అన్నాడు.
ఇంతలో ఖానుకు గుండు ఎక్కడ తగిలిందో చూచారు జనం. ప్రాణం పోలేదు. భుజానికి తగిలింది.
షమ్మీర్ : నేను విన్నవించుకుంటున్నాను. తాము దయ చేయండి. ఈ వెధవ కోసం తామెందుకు బదలాం అవుతారు?
నవాబుగారు ఏమి అనుకున్నారో తెలీదు. మా మనిషి వెంట వెళ్ళాడు. వారు ఇంటికి వెళ్ళారు. ఖానమ్ మిర్జా, అలీ బేగ్ కు కబురంపింది. చౌకీలోనే ఉన్నాడు. వెంటనే వచ్చాడు. ఖానమ్ అతణ్ణి చాటుగా తీసికెళ్ళి చెవిలో ఏమో చెప్పింది. అక్కడ్నుంచి వస్తూనే మిర్జా "దుర్మార్గుడ్ని అవతల పారేయండి చూతాం" అన్నారు. అయినా ఖానును అవతల పారేయలేదు. భుజానికి కట్టు గట్టి డోలీ పిలిపించాం. ఈలోగా ఖాను కు కొద్దిగా తెలివి వచ్చింది. ఇంటిని గురించి అడిగితె "మురగ్ దానా" లో ఉంటారని తెలిసింది. డోలీ మీద వేసి ఇంటికి పంపించాం. మనుషులతో ఇంటి దగ్గర దింపిరావలసిందని చెప్పాం. వారు అలగే చేశారు.
చాల రోజుల దాకా సుల్తాను గారు గాని, వారి మనిషి గాని రాలేదు. చెప్పానుగా వారి పట్ల నాకు మమత కలిగింది. వారు రారని నిశ్చయించుకున్నాను . అలాగే జరిగింది. మానమర్యాదలు గల మనిషి, మొదలు వచ్చేప్పుడే మనిషితో అనేక కట్టు దిట్టాలను గురించి చెప్పి పంపారు. ఎవరూ ఉండరని బువాహుసేనీ మాట ఇచ్చింది. పొరపాటు జరిగింది. కావలి ఉంచలేదు. దుర్మార్గుడు ఖాను ఎక్కడి నుంచి వచ్చాడో ఊడి పడ్డాడు. గాలిమేడ కూలిపోయింది. నాలుగైదు రోజుల తరవాత ఒక పెళ్ళిలో మేళం ఏర్పాటైంది. అక్కడికి సుల్తాను గారు కూడా విచ్చేశారు. కచేరీ తొమ్మిది గంటలకు మొదలైంది. సభలో ఎలా మాట్లాడ్డం? సంజ్ఞ చేసే అవకాశం కూడా లేదు. విలువైన బట్టలు ధరించిన తొమ్మిది సంవత్సరాల కుర్రాడు సుల్తాను గారి దగ్గర కూర్చొని ఉన్నాడు. మేజువాణి పూర్తీ అయింది. వేరే గదిలో బట్టలు మారుస్తున్నాను. కుర్రాడు లేచాడు. సైగ చేసి పిలిచాను. వచ్చాడు. దగ్గర కూర్చోబెట్టుకున్నాను. తాంబూలం ఇచ్చాను.





