Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    5. నదులారా ! త్రిగుణిత, త్రిసంఖ్యాక స్థానము దేవతల నివాస స్థానము అగును. ముల్లోకముల నిర్మాత సంవత్సరము లేక సూర్యుడు యజ్ఞమునకు సామ్రాట్టులు, జలవతి, అంతరిక్షచారిణి. ఇళ, సరస్వతి, భారతి అణు ముగ్గురు దేవేరులు మూడు సవనములకు విచ్చేయవలెను.

    6. సకలమును ప్రేరేపించు ఆదిత్యా ! ద్యులోకమునుండి నిత్యము మూడు మారులు విచ్చేయుము. మాకు రమణీయ ధనము ప్రసాదించుము. సర్వరక్షక ఆదిత్యా ! మాకు మధ్యం దినమున మూడు మారులు మూడు సవనములందు పశువులు, సువర్ణము, రత్నములు, గోధనమూ ప్రసాదించుము. ధిషణా ! మాకు ధనము కలుగునట్లు చేయుము.

    7. సవితా ! దినమున మూడు మారులు మాకు ధనమును ప్రసాదించుము. కళ్యాణహస్తుడు, రాజు, మిత్రావరుణులు, ద్యావాపృథ్వి, అంతరిక్షాదులు సవిత వదాన్యత్యను అర్థము అర్థించవలెను.

    8. వినాశరహితములు, ద్యుతిమంతములగు మూడు ఉత్తమ స్థానములు ఉన్నవి. ఈ మూడు స్థానములందు కాలాత్మక సంవత్సరమునకు అగ్ని వాయు, సూర్యనామక పుత్రులు శోభింతురు. యజ్ఞవంతులు, తిరస్కరింపజాలని వారు దేవతలు దినమునకు మూడు మారులు మా యజ్ఞమునకు రావలెను.

    (మూడు సంఖ్యకు ప్రాధాన్యత కలిగించుచున్నాడు. త్రిలోకములు. త్రిమూర్తులు, త్రిసంధ్యలు మున్నగు త్రిసంఖ్యాకములు నేటికి ప్రధానములయి ఉన్నవి.)

                              ఏబది ఏడవ సూక్తము

    ఋషి - విశ్వామిత్రుడు దేవత - విశ్వేదేవతలు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. వివేకవంతుడగు ఇంద్రుడు నా యొక్క దేవతా విషయిక స్తుతిని ఏకాకిని, రక్షణహీన గోవువలె భావించవలెను. తక్షణ పలప్రాప్తినిచ్చు ధేనురూపమగు స్తుతిని ఇంద్రాగ్నులు ప్రశంసించవలెను.

    2. ఇంద్రుడు, పూష, అభీష్టవర్షి, కళ్యాణపాణి మిత్రావరుణులు ప్రీతులు కావలెను. వారు అంతరిక్షమున శయనించిన మేఘరూప ధేనువును పితుకుదురు.

    నివాసప్రదులగు విశ్వదేవతలారా ! మాకు మీరు ప్రసాదించు సుఖప్రాప్తి కలుగునట్లు, ఈ వేదికమీద విహరించండి.

    జలవర్షక ఇంద్రుని శక్తిని వాంచించు ఓషధులు వినమ్రములయి ఇంద్రుని గర్భాధాన శక్తిని ఎరుగును.

    3. పలాభిలాషిణులు, ఎల్లరకు ప్రీతీ కలిగించు ఓషధులు నానారూపములగు వ్రీహి, యవ, నీవారాది సస్యరూప సంతానము ముందు విహరించును.

    4. యజ్ఞమున ప్రస్తరములు ధరించిన మేము సుందరరూప విశిష్ట ద్యావాపృథ్వులను స్తుతివచనముతో స్తుతింతుము. అగ్నీ ! నీ దీప్తులు అతిశయములు. వరణీయములు. కమనీయములు. పూజ్యములు. అవి మానవుల కొఱకుగాను ఊర్ధ్వముఖములు అగును.

    5. అగ్నీ ! నీ జ్వాలలు మధుమతులు. ప్రజ్ఞాశాలినులు. అత్యంతవ్యాప్తి విశిష్టములు. అవి దేవతల మధ్యకు చేరును. ఆహ్వానార్థము ప్రేరితములు అగును. జ్వాలాజిహ్వారూపమున మా రక్షణకుగాను యజనీయ దేవతలను ఈ యజ్ఞమున ప్రవేశ పెట్టుము. దారి వర్షమునకుగాను సోమపానము చేయించుము.

    6. అగ్నీ ! నీవు ద్యుతిమంతుడవు. నానారూపుడవు. నీ అనుగ్రహము మమ్ము విడువజాలనిది. ఆ అనుగ్రహమే మేముకోరిన ఫలములను ఇవ్వవలెను. మమ్ము వర్థిల్ల చేయవలెను. ఎట్లనగా మేఘము వర్షించి వనస్పతులను    వృద్ధిచేసినట్లు, నివాసప్రద జాతవేదా ! మాకు అట్టి అనుగ్రహ వృద్ధిని ప్రసాదించుము. సర్వజన హితము కలిగించు శుభవృద్ధిని కలిగించుము.

                              ఏబది ఎనిమిదవ సూక్తము

      ఋషి - విశ్వామిత్రుడు దేవత - అశ్వినులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఉషప్రియములు కలిగించునది. సనాతన అగ్నికొఱకు కమనీయములగు పాలను పితుకును. ఉషాపుత్రుడగు సూర్యుడు వాటిమధ్య సంచరించును. శుభ్రదీప్తమగు దినము సూర్యుని వహించుచున్నది. అంతకుముందే అశ్వినుల స్తోతలు మేల్కొందురు.

    2. అశ్వినులారా ! మీ రథము అశ్వద్వయము సత్యరూప రథముపై మీ ఉభయులను యజ్ఞమునకు తెచ్చుటకుసాగును. పుత్రుడు మాతాపితలు లక్ష్యముగా సాగినట్లు యజ్ఞములు మీ కొఱకు ఉన్ముఖములు అగును. మా నుండి 'పణుల' ఆసురీబుద్ధిని విశేషముగా నష్టపరచుము. మేము మీకు హవి అర్పించుచున్నాము. మీరు ఉభయులు విచ్చేయండి.

    3. అశ్వినులారా ! మీది సుందర చక్ర విశిష్ట రథము. అశ్వములు చక్కగా పూన్చబడినవి. ఆ రథములు ఆరోహించుడు. విచ్చేసి స్తుతికారుల శ్లోకములను ఆలకింపుడు. మా వృత్తి హానికి విరుద్ధముగా నడుచున్నారని పురాతన విప్రులు చెప్పరా?

    4. అశ్వినులారా ! మీరు మా స్తుతులను గ్రహించండి. అశ్వసహితులుగా మా యజ్ఞమునకు సాగండి. స్తోత్రలందరు స్తుతి లక్షణ వచనములతో మీ ఇద్దరిని ఆహ్వానించుచున్నారు. వారు మిత్రుల అర్పింతురు. సూర్యుడు ఉష వెనుక ఉదయించును. కావున విచ్చేయండి.

    5. అశ్వినులారా ! నానాదేశములను మీ తేజమున తిరస్కరించండి. దేవయాన మార్గమున ఇచ్చటికి విచ్చేయండి. మీ కొఱకు స్తోతలు ఉద్ఘోషించుచున్నారు. శత్రుక్షయ కారక అశ్వినులారా ! మీ కొఱకు మాదక శోపాత్రలు విశేషరూపమున సమకూర్చబడినవి.

    6. అశ్వినులారా ! మీ ఉభయుల సఖ్యత పురాతనము. వాంఛనీయము. కళ్యాణకరము. మీ ఉభయుల ధనము జుహ్నుకులజము. మీ ఉభయుల సుఖకర సఖ్యతను తేపతేపకు తలుచుకొని మేము మిత్రులము అగుచున్నాము. హర్షదాయక సోమము ద్వారా మీ ఉభయులతో మేము హృష్టులమగుదుము.

    7. అశ్వినులారా ! మీరు శోభన సామర్థ్యయుక్తులు. నిత్యవయస్కులు. అసత్య రహితులు. శుభఫలప్రదాతలు. అక్షీణులు. సోమపాయులు. మీరు వాయు, నియుద్గణ యుక్తులయి విచ్చేయుడు. దివస శేషమున సోమపానము చేయుడు.

    8. అశ్వినీద్వయమా ! విశేషహవిస్సు మీ వద్దకు చేరును. దోషరహితులు, కర్మకుశలురగు స్తోతలు విలక్షణ స్తుతి వచనములతో మిమ్ము సేవింతురు. స్తోతలద్వారా ఆకర్షితమయిన జలప్రద రథము ద్యావాపృథ్వుల మధ్యన సంచరించును.

    9. అశ్వినులారా ! ఈ సోమము అత్యంత మధురరస మిత్రము. దీనిని పానము చేయుడు. మీ రథము ధనదానకరము. సోమాభిషవ కర్త యజమాని ఇంటికి తేపతేపకు వచ్చును.

                              ఏబది తొమ్మిద సూక్తము

 ఋషి - విశ్వామిత్రుడు, దేవత-మిత్రుడు, ఛందస్సు- 1- 5 - త్రిష్టుప్, మిగిలినవి గాయత్రి.

    1. స్తుతించబడిన దేవతలు సకల లోకములను వ్యవసాయాది కార్యములందు ప్రవర్తింప చేయుదురు. మిత్రుడు వర్షము ద్వారా అన్నమును, యజ్ఞమును కలిగించును. ద్యావాపృథ్వులను ఉభయలోకములను భరించును. కర్మపరులయిన మానవులను కృపాదృష్టితో చూచును. మిత్రునకు ఘృతయుక్తమగు హవ్యము సమర్పించుడు.

    2. ఆదిత్య, మిత్రులారా ! యజ్ఞయుక్తుడయి మీకు హవిరన్నము సమర్పించువాడు అన్నవంతుడు అగును. మీ రక్షణగల నరుని ఎవ్వడును నష్టపరచజాలడు. పరాభవించలేడు. మీకు హవిస్సు అర్పించువానిని దూరమునుండిగాని, దగ్గరనుండిగాని పాపములు అంటజాలవు.

    3. మిత్రా ! మేము రోగ వర్జితులము అగుదుము. అన్న విషయమున సంత్రుప్తులమగుదుము. పృథ్వియొక్క విశాల ప్రదేశమున ఆదిత్య కర్మ వద్దకు చేరెదము. మా విషయమున ఆదిత్యుని అనుగ్రహము వృద్ధికావలెను. 

    4. సూర్యుడు నమస్కార యోగ్యుడు. సుందరుడు. స్వామి. అత్యంత బలవంతుడు. విధాత. యజ్ఞార్హుడు, అట్టి సూర్యుడు ఉద్భవించినాడు. అతని అనుగ్రహము, శుభంకర వాత్సల్యము యజమానులమగు మాకు లభించవలెను.

    5. ఆదిత్యుడు మహామహుడు. సకలలోక ప్రవర్తకుడు. నమస్కరించి ఆదిత్యుని ఉపాసించవలెను. అతడు స్తుతించువారి విషయమున ప్రసన్నుడు అగును. స్తుతి యోగ్యుడయిన మిత్రునకుగాను హవ్యము అగ్నిలో అర్పించుడు.

    6. మిత్రదేవత వర్షము కలిగించి మానవులను భరించును. అతని అన్నము, అందరు భజించు ధనము కేర్తిమంతములు.

    7. మిత్రదేవత తన మహిమ వలన ద్యులోకమును ఆవిష్కరించినాడు. అతడు కీర్తివంతుడయినాడు. భూమిని సమృద్ధ అన్న విశిష్టను చేసినాడు.

    8. శత్రుంజయుడు. జలవిశిష్టుడగు మిత్రునకు పంచజనులు హవిస్సులు సమర్పింతురు. మిత్రుడు తన స్వరూపమున సమస్త దేవగుణములను ధరించును.

    ("పంచజనాః నిషాద పంచమశ్చత్వారో వర్ణాః" అన్నాడు శాయణుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర నిషాదులు పంచజనులు అన్నాడు. ఇచట నిషాదయుక్తముగా సకల జనులకు దేవతలకు హవిస్సును ఇచ్చు అధికారము చెప్పబడినది.)

    9. దేవతలు నరులమధ్య కుశచ్చేదన చేయు ఋత్విక్కునకు మిత్రదేవుడు శుభప్రదమగు అన్నప్రదానము చేయుము.

                              ఆరువదవ సూక్తము

    ఋషి - విశ్వామిత్రుడు దేవత - ఋభువులు, ఇంద్రుడు; ఛందస్సు - జగతి.

    1. ఋభువులారా ! మీ ఘనకార్యములు అందరికి తెలియును. మానవులగు మీరు సుధన్వుని పుత్రులు. మీరు మీ సకల కర్మల ద్వారా శత్రుపరాభవకర్తలు, తేజోవిశిష్టులు అయినారు. యజ్ఞభాగమును ఆర్జించినారు. ఆ సకల కర్మలు మీరు గుర్తుంచుకొందురు.

    2. ఋభవులారా ! మీది చమసమును విభక్తము చేసిన శక్తి. మీరు గోవు శరీరమున చర్మయోజన చేసిన ప్రజ్ఞావంతులు. ఇంద్రుని అశ్వద్వయమును నిర్మించిన మనీషులు మీరు. అట్టి సకల కార్యముల వలన మీకు యజ్ఞభాగమునకు అర్హతయు, దేవత్వమును కలిగినవి.

    3. ఋభువులు మానవ పుత్రులు. యాగాది కర్మలు చేసినారు. ఇంద్రుని స్నేహము సంపాదించినారు. పూర్వము వారు మరణ ధర్మము కలవారు. ఇంద్రుని స్నేహమున ప్రాణములు దాల్చినారు. సుధన్వుని పుత్రులు కర్మబలము, యజ్ఞయాగాది బలముల వలన అమృతత్వము పొందినారు.

    4. ఋభుగణములారా ! మీరు ఇంద్రునితోకూడ ఒకే రథముమీద అధిరోహించండి. సోమాభిషవ స్థానమునకు కదలండి. తదుపరి మానవుల స్తుతులను స్వీకరించండి. సుధన్వ పుత్రులారా ! మీరు అమృత బలవంతులు. మీ శుభకర్మములను ఎంచజాలువారు లేరు. మీ సామర్థ్యమును ఎన్నగలవారు లేరు.

    5. ఇంద్రా ! నీవు 'వాజ' విశిష్టుడవు. ఋభువుల సహితుడవయి జలమున తడువుము. అభిషుత సోమమును ఉభయ హస్తముల పానము చేయుము. నీవు స్తుతులద్వారా ప్రేరితుడవు అగుదువు. యాజమాన గృహమున సుధన్వ పుత్రుల సహితుడవయి సోమపానము చేసెదవు.

    ("వాజ" అనగా ఋభువుల భ్రాత. 'వాజ' అన్నము కూడ అగును.)

    6. బహుస్తుతుడవగు ఇంద్రా ! ఋభువులు, వాజయుక్తుడవయి, ఇంద్రాణి సహితుడవయి మా తృతీయ సవనమున ఆనందింపుము. మూడు సవనములందు సోమపానము చేయుటకు ఈ రోజు నిర్ణయము అయినది. అయినను దేవతల వ్రతములకు, మానవుల కర్మల కొఱకును నీవు సకల దినములు నిర్ణయములగును.

    7. ఇంద్రా ! స్తోతల అన్నమును స్వీకరింపుము. వాజయుక్త ఋభువుల వెంట ఈ యజ్ఞమునకు రమ్ము. స్తోతల స్తోత్రములను ఆలకింపుము. మరుద్గణములు సహితము శత సంఖ్యాక గమన కుశల అశ్వములవెంట, యజమానియొక్క సహస్ర ప్రకార ప్రణీత యజ్ఞమునకు విచ్చేయవలెను.

                          అరువది ఒకటవ సూక్తము

        ఋషి - విశ్వామిత్రుడు, దేవత - ఉష, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఉషా ! నీవు అన్నవతివి. ధనవతివి. జ్ఞానవతివి. నీవు స్తోతల స్తోత్రములను గ్రహింపుము. ఉషా ! నీవు అందరి వరణీయవు. పురాతన యువతివలె శోభాయమానవు. బహుస్తోత్రవతివి. నీవు యజ్ఞకర్మమునకు విచ్చేయుము.

    2. ఉషా ! నీవు మరణరహితవు. సువర్ణమయ రథవతివి. ప్రియ, సత్యవచనములు ఉచ్చరించుదానవు. నీవు సూర్య కిరణ సంబంధివయి శోభిల్లుదువు. అనంతబల యుక్తములగు అరుణవర్ణి అశ్వములు సులభముగా నీ రథమున పూన్చబడును. అవి నిన్ను ఆవాహనము చేయవలెను.

    3. ఉషా ! నీవు సకల ప్రాణుల సమక్షమున అవతరించు దానవు. మరణరహితవు. సూర్యుని కేతన స్వరూపవు. నీవు నభమున ఉన్నతవై నిలుతువు. నవీనతమ ఉషా ! నీవు ఆకాశమున ఒక మార్గమున సంచరించ ఇచ్చగించి, సూర్యుని రథాంగమువలె మరల మరల అదే మార్గమున సాగుదువు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.