Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    అర్జునుడు ఉగ్రుడు అయినాడు. తన కత్తిలాగి కిరాతుని నెత్తిన కొట్టినాడు.
    కత్తి ఈశ్వరుని దేహమున లీనమయినది.
    అర్జునుడు మండిపడినాడు. చెట్లను పెరికినాడు విసరినాడు. బండలను తీసినాడు కొట్టినాడు. అన్నియు శివుని యందు లీనమయినవి.
    కిరాతరాజు చలించలేదు. నిశ్చలముగా నిలిచినాడు.
    అర్జునునకు మరింత కోపము వచ్చినది. కిరాతుని మీదకు ఉరికినాడు పిడికిలితో పొడిచినాడు. గుద్దినాడు. ముష్టియుద్ధము చేసినాడు.
    అర్జునునకు ఈశ్వరుని దివ్య దేహము తగిలినది. ఓర్చుకొనలేక పోయినాడు. కొండను తాకిన పొట్టేలు వలె పడిపోయినాడు. మూర్చిల్లినాడు.
    కిరాత సైన్యము కిరాతార్జునుల యుద్ధము చూచినారు. అర్జునుని ధైర్య సాహసములకు, బలపరాక్రమములకు ఆశ్చర్యము నొందినారు. కిరాతరాజును చూచినారు. కరుణించమన్నట్లు చూచినారు.
    పార్వతి పడిపోయిన అర్జునుని చూచినది. పొంగి పోవుచున్న భర్తను చూచినది. కరుణించమన్నట్లు క్రీగంట ప్రార్థించినది.
    శివుడు అర్జునుని చూచినాడు. అతని ధైర్యమునకు మెచ్చినాడు. తన వారిని చూచినాడు. వారి ప్రార్థనలు మన్నించినాడు.
    అర్జునుడు మూర్ఛతేరుకున్నాడు. ఎదుట శివుని చూచినాడు.
                --జటామకుటేందు రేఖయుం    
    గరమున శూలమున్ గరళకాల గళంబు బృహద్గజాజినాం
    బరము దృతీయ లోచనము బన్నగహారము నొప్పు చుండగన్.
    "ఇట్లు విరూపాక్షుండు నిజరూపంబుతో నర్జునునకు సన్నిహితుండై అర్జునా! క్షత్రియులొరులెవ్వరు నీయట్టి శౌర్య ధైర్యవంతులు లేరు. నీ తపఃక్షాత్ర గుణంబులకు మెచ్చితి నీ కోరిక సఫలంబు సేసెద దేవాసుర మానుషంబైన జగంబంతయు నీవ జయింతు; నా స్వరూపంబు సూడుమని దివ్య దృష్టి యిచ్చినం జూచి పార్థుండు గృతార్థుండయి దండ ప్రమాణంబుసేసి" శివదేవుని స్తుతించినాడు:-
    కపర్దిన్ సర్వదేవేశ భగనేత్ర నిపాతన.
    దేవదేవ మహాదేవ నీలగ్రీవ జటాధర.
    కారణానాంచ పరమం జానే త్వాం త్ర్యంబకం విభుమ్.
    దేవానాంచ గతిందేవ త్వత్ప్ర సూతమిదం జగత్.
    అజేయస్త్వం త్రిభిర్లోకై స్స దేవాసుర మానుషైః
    శివాయ విష్ణురూపాయ విష్ణవే శివరూపిణే.
    దక్షయజ్ఞ వినాశాయ హరిరుద్రాయవై నమః
    లలాటాక్షాయ శర్వాయ మీఢుషే శూలపాణయే.
    పినాక గోప్త్రే సూర్యాయ మార్జాలీయాయ వేధసే.
    ప్రసాదయే త్వాం భగవన్ సర్వభూత మహేశ్వర.
    గణేశం జగతశ్శంభుం లోకకారణ కారణమ్.
    ప్రధాన పురుషాతీతం పరం సూక్ష్మతరం హరమ్.
    వ్యతిక్రమం యే భగవన్ క్షంతు మర్హసి శంకర.
    భగవద్దర్శనా కాంక్షః ప్రాప్తో స్మీమ మహాగిరిమ్.    
    దయితం తవదేవేశ తాపసాలయ ముత్తమమ్.
    ప్రసాద యేత్వాం భగవన్ సర్వలోక నమస్కృతమ్.
    నమే స్యాదపరాధోయం మహాదేవాతి సాహసాత్
    కృతో మయాయ మజ్ఞానాత్ విమర్దోయ స్త్వయా సహ
    శరణం ప్రతిపన్నాయ తత్ క్షమ స్యార్య శంకర".
    
    అని యట్లు స్తితియించి కృతాంజలియై కిరీటి వెండియు నిట్లనియె-
    "దేవదేవా! నీవు కిరాతుడవనుకొని నీతో యుద్ధము చేసినాను. నన్ను క్షమింపవలెను. ఈశ్వరుడవు. నీ మహిమలు ఎరుగుట ఎవరికీ సాధ్యపడదు. నేను సామాన్యుడను. తప్పు చేసినాను. నన్ను మన్నించవలెను. రక్షించవలెను" అని సాష్టాంగ పడినాడు.
    పరమేశ్వరుడు అర్జునుని చూచినాడు. లేవనెత్తినాడు. కృపా విస్తార దృష్టిచేత అర్జునునకు తృప్తి కలిగించినాడు. నవ్వుచు అర్జునుని చేతిని పట్టుకొని అన్నాడు:-
    "అర్జునా! నీవు చేసిన తప్పును క్షమించినాను. అమానుషమయిన నీ పరాక్రమమునకు మెచ్చినాను. పూర్వ జన్మమున నీవు 'నరుడు' అను దేవర్షివి. నారాయణునకు మిత్రుడవు. నరనారాయణులు బదరీ వనమున వేల సంవత్సరములు తపస్సు చేసినారు. మీరు మహాత్ములు. మీవలననే జగములు నిలుచున్నవి. గాండీవము పూర్వము నీదే. ఇంద్రుని రాజ్యాభిషేక సమయమున నీవే ఈ గాండీవముతో రాక్షసులను జయించినావు. నీ గాండీవము అక్షయ తూణీరములు నాలో లీనమయి ఉన్నవి. ఇదిగో వీనిని గ్రహించుము" అని వానిని అర్జునునకు ప్రసాదించి "నీ ఇష్టమయిన వరము కోరుకొనుము ఇచ్చెదను" అని రుద్రదేవుడు అర్జునుని యెడల ప్రసన్నుడు అయినాడు.
    "దేవదేవా! పరమేశ్వరా! నాకు ఇష్టమగు వరమును ప్రసాదింతునన్నావు. నాకు పాశుపతము అను దివ్యాస్త్రమును ప్రసాదింపుము. దానితో దైత్య, దానవ, యక్ష, రాక్షస, పిశాచ, సర్పములను జయింతును. అతివీరులయిన ద్రోణాదులను జయింతును. సహజ కవచకుండలములుగల కర్ణుని వధింతును" అని అర్జునుడు చేతులు దోయిలించి ప్రార్థించినాడు.
    ఈశ్వరుడు కరుణించినాడు. విశుద్ధాత్ముండైన పార్థునకు మంత్ర, ధ్యాన, జప, హోమ పూర్వకంబుగా సంధాన, మోక్షణ, సంహార సహితంబుగా బాశుపతాస్త్రం బిచ్చి దీనికి నసాధ్యంబెద్దియు లేదు, అల్పులయందు బ్రయుక్తంబయిన జగత్సంహారము సేయు. ఈదివ్య బాణమ్మున నీవఖిల లోకమ్ములు జయింతువని కౌంతేయునకు వరంబిచ్చి పురాంతకుండంతర్హితుండయ్యెనంత:-
    అర్జునుడు పాశుపతాస్త్రము సాధించినాడని ఇంద్రునకు తెలిసినది. దేవేంద్రుడు యమ, కుబేర, వరుణ అశ్వినీ దేవతలు మున్నగువారితో అర్జునుడు ఉన్నచోటికి వచ్చి ప్రత్యక్షము అయినాడు.
    అర్జునుడు చకితుడయి చూచినాడు. అతనికి చమక్కుమని దివ్య విమానములు కనిపించినవి. కనులు చీకట్లు కమ్మినవి. మరేమియు కనిపించలేదు. అప్పుడు యమధర్మరాజు గంభీర స్వరమున పలికినాడు:-
    "అర్జునా! ఇంద్రాది దేవతలందరు వచ్చి ఉన్నారు. నిన్ను మెచ్చినారు. నీకు వరములు ఇవ్వనున్నారు. నీకు దివ్యదృష్టి ఇచ్చినాను చూడుము".
    అర్జునుడు సకల దేవతలను చూచినాడు. ఆనందపరవశుడు అయినాడు. అందరికి మ్రొక్కినాడు. చేతులు జోడించి వారిని స్తుతించినాడు.
    దేవతలు అర్జునుని మెచ్చినారు. వరములు ఇచ్చినారు.
    యముడు దండాయుధమును అర్జునునకు ఇచ్చినాడు. "అర్జునా! సూర్యాంశమున పుట్టిన కర్ణుని నీవు వధింతువు. దేవ, దైత్య, దానవ, గంధర్వ, యక్ష, రాక్షసాంశమున పుట్టిన సకల రాజులను యుద్ధమున నీవు వధింతువు". కుబేరుడు కుబేరాస్త్రమును అర్జునునకు ఇచ్చినాడు.
    "అర్జునా! ఇది నాకు ప్రియమయినది. "అంతర్ధానము" అను అస్త్రము దివ్యమైనది. దీనివలన నీవు దుర్యోధనాదులను వధించగలవు. పరమేశ్వరుడు త్రిపురములను నాశనము చేసినపుడు ఈ అస్త్రమును ప్రయోగించినాడు" అన్నాడు.
    వరుణుడు వరుణపాశములను ఇచ్చినాడు "అర్జునా! ఇది ఉత్తమమయిన అస్త్రము. తారకామయ సంగ్రామమున దీనితో వేలమంది దైత్యులను బంధించినాను. ఈ అస్త్రముతో నీవు సంగ్రామమున ప్రవేశించిన ధరాతలము నిఃక్షత్రియమగును" అన్నాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.