Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

                                      7


    ప్రతి ఆడదాని జీవితంలో తనను వలచేవాడు కావాలనే ప్రాయం వస్తుంది. అది తాత్కాలికం కాదు. యౌవనోదయంతో ప్రారంభమై వయసుతో పెరిగి పెద్దది అవుతుంటుంది.
    గోహర్ మిర్జాకు నేనేంటే ఇష్టమే. అతని ప్రేమలో ఒక లోపం ఉంది. పౌరుషం తక్కువ. పురుషులకు కావలసిన ధైర్యసాహసాలు లేవు. తల్లీ పాటకత్తే. ఆ లక్షణాలు వచ్చాయి. అతని సంపాదనంతా నా దగ్గర లాక్కున్నదే. నాకు ఒక్క రూపాయి తప్ప ఇచ్చి ఎరుగడు. ఆ రూపాయి విషయం ఇదివరకే చెప్పాను. అందువల్ల నా హృదయం ఒక ప్రేమికుడిని అన్వేషించసాగింది. అతడు నా గౌరవానికి తగినవాడు కావాలి. డబ్బు ఇవ్వాలి. నవాబ్ సుల్తానా గారి రూపం అందమైనది. వేలమంది స్త్రీలను వలపించే ఠీవి ఉంది వారి ముఖాన. స్త్రీకి అచ్చం ముఖస్తుతి, ప్రేమ ప్రస్తావన మాత్రమే పసందు అనుకుంటారు కొందరు. అది వాస్తవం కాదు. ముఖస్తుతి , వలపు స్త్రీ కి ఇష్టమే కాని దానిలో నీచత్వం ఉండరాదు. కొందరు వేశ్యలను వెదుక్కుంటూ వస్తారు. ఆవిడ తనను ప్రేమించాలని భగవంతుని ప్రార్ధిస్తారు. తరవాత ఆవిడ తమ ఇంట్లో పడి ఉండాలి. సర్వస్వం అతని కిచ్చేయాలి. వంట చేసి పెట్టాలి. అతని పిల్లల చెప్పులు తుడవాలి. ప్రతి పురుషుడు "హజ్రత్ యూసుఫ్ కావడం గాని, ప్రతి స్త్రీ పురుషుని మీద పడి చావడం గాని సాధ్యం కాదు. స్త్రీ పురుషులు పరస్పరం ప్రేమించుకుంటారు. కాని ఆ ప్రేమమాటున ఏదో స్వార్ధం ఉంటుంది. నిస్వార్ధ ప్రేమ లైలామజ్నూ, షీరీఁ ఫర్హాద్ కధల్లో మాత్రం కనిపిస్తుంది. ప్రేమ అనేదే లేదంటారు కొందరు. అలాంటి వాళ్ళను చూసాం. ప్రేమను అర్ధం చేసుకోవడానికి మనసు కావాలి. ప్రేమ అనేది లేని పక్షంలో స్త్రీలు , పురుషులు పిచ్చివాళ్ళు కావడం ఎందుకు?
    రెండవరోజు రాత్రి నవాబుగారు విచ్చేశారు. బువాహుసేనీ మాములు ప్రకారం బేరం సాగించింది. నిర్ధారణ జరిగి డబ్బు నిర్ణయం అయిన తరువాత గదిలో ఉన్న ఇతరులు నిర్గమించారు. నవాబు గారు నన్ను కొలువు పెట్టుకోలేదని , అప్పుడప్పుడు రాత్రిళ్ళు గంట, రెండు గంటలు మాత్రం వస్తుంటారని తెలిసింది. వారు అమాయకులు, వయసు పెద్దేనిమిది సంవత్సరాలుంటుంది. తలిదండ్రుల కట్టుదిట్టాల్లో పెరిగారు. మోసాలు, కుట్రలు తెలియవు. సేవకుడు పరిచయం చేశాడు కాబట్టి సరిపోయింది. అందుకు కూడా అయన తడబడేవారే కొద్దిసేపట్లోనే వారి ఇబ్బంది దూరం చేశాను.
    వలపు మాటలు సాగాయి. నేను ప్రేమోన్మత్తురాలినయ్యాను. నవాబుగారి రూపమే అలాంటిది. రాతి గుండెలు సైతం కరిగిపోతాయి. గులాబీ లాంటి ఎర్రని రంగు, పొడవైన ముక్కు, పల్చని పెదవులు, అందమైన ఉంగరాల జుట్టు, ఎత్తయిన నొసలు, పెద్ద పెద్ద కళ్ళు బలిష్టములైన బాహువులు, వ్యాయామం చేసి దృడ శరీరం; భగవంతుడు బంగారాన్ని మూసలో పోసి తీసినట్లుంది విగ్రహం. పైగా ముద్దుముద్దు పలుకులు. మాటకొక వలపు పదం. చాలావరకు స్వంత రచనలే. పద్యం చదవడంలో విలక్షణత ఉంది. వారిది కవుల వంశం. తండ్రితో పాటు కవి సమ్మేళనాల్లో చదివేవారు.
    వలపు కవిత చదవడానికి కవులు వెనకముందాడరు. ఎవరిముంధైనా సరే చదివేస్తారు. పెద్దలముందు చిన్నలు, చిన్నలముందు పెద్దలు, వేరే మాటలు మాట్లాడడానికి వెనక ముందాడుతారు కాని పద్యం చదవడానికి కాదు. వచనంలో అనగూడని భావాలు సైతం పద్యాల్లో చదివేస్తారు. మొత్తం మీద ఆరాత్రి సహచర్యంలో ఆనందించాం.
    నవాబు : నీ వయారం నన్ను మోహింపజేసింది. మిమ్ములను చూడకుండా ఉండలేకపోతున్నాను.
    నేను : మీ దయ. కాకుంటే అల్పురాలనైన నేనెక్కడ? తామెక్కడ?
    నవాబు : ఓహో! మీకు చదువు వచ్చునట్లుందే?
    నేను : జీహఁ.... ఏదో కొద్దిగా చదువుకున్నాను.
    నవాబు : వ్రాత కూడా వచ్చా?
    నేను: అవును వ్రాస్తాను.
    నవాబు : అయితే ఆ గజల్ మీ చేత్తో వ్రాసిందేనా?
    నేను: చిరునవ్వు నవ్వాను.
    నవాబు : ఓహో! ఎంత ముద్దుగా ఉంది వ్రాత! చాల సంతోషం, మనసులోని మాటలు సేవకులతో చెప్పి పంపడం బావుండదు. ఇప్పుడిక అక్షర బాషలో ముచ్చటించుకోవచ్చు. సాధ్యమైనంతవరకు ఇలాంటి విషయాల్లో పరుల జోక్యం ఉండరాదు. మేము కోరేది అది.
        వన్నెకాడ! నీకు నాకు దాయదగినది లేనేలేదు
        మన వలపువంతల నడుమ వేరొకని మంతనాలేల?
    నేను : ఇది తమ రచనా?
    నవాబు ; జీ నహీఁ కీర్తి శేషులు పితృపాదులు శలవిచ్చారు.
    నేను : రమ్యంగా శలవిచ్చారు!
    నవాబు : మాషా అల్లా, మీకు కవిత్వంలో కూడా అభిరుచి ఉందా?
        సౌందర్యమొసగిన దైవము
        సద్గుణము లీయవలె!    
        వాగ్విలాసములకు తోడు
        జ్ఞానమను గ్రహించాలె!
    నేను : ఎవరి పద్యం ?
    నవాబు : వారిదే.
    నేను : గొప్పగా శలవిచ్చారు.
    నవాబు : వారు ఇలాంటివే రచించారు. మీ యోగ్యతకు అనుగుణంగా ఉన్నాయా?
    నేను : బళా ! ఇది పెద్దల అనుగ్రహం!
            కాకున్ననెంత? నా ఉనికేడ?
    నవాబు: వాహ్! ఎంత సరళంగా చెప్పారు!
    నేను : అనుగ్రహం
    నవాబు : అయితే మీరు పద్యాలు చెపుతారా?
    నేను : జీ నహీఁ తమలాంటి వారితో చెప్పించుకుంటాను.
           ఈ మాట మీద నవాబుగారు ముందు తడబడ్డారు. తరవాత చిరునవ్వు చూచి నవ్వారు.
    నవాబు : బాగా చెప్పారు. వేశ్యలు చాలామంది విటులతో చెప్పించుకొని తామే వ్రాశామని చదువుతారు.
    నేను : వేశ్యలేనా? మగవారు చేయరా?
    నవాబు : నిజం. నాన్నగారి మిత్రులలో ఒక్క పాదం కూడా వ్రాయనివారున్నారు. కాని ప్రతి సభలో పద్యాలు చదవడానికి తయారు! నాన్నగారి పద్యాలే చదివేవారు ఎక్కువగా. అప్పుడప్పుడు నావి కూడా చదివేసేవారు. అందులో ఏమిటీ అనందం? మా తండ్రిగారు గురువుగారి రచనలను కూడా సంకలనం లో చేర్చలేదు. "అబద్దపు పొగడ్తలు అనందాన్నేలా ఇస్తాయి' అనేవారు.
    నేను : అదొక పిచ్చి.
    నవాబు : మీరు చదివిన గజల్ ఇంకేమైనా జ్ఞాపకం ఉంటే చదవండి.
    నేను : వలచి వలపించుకొన్నప్పుడే
             కలత  లెదురైన - నిబ్బరముండవలె కాని
             మొదలే ముందు వెన్కలరయవలె కాని
             ఇపుడు నెత్తి నోరు కొట్టుకొన్న ఫలమేమి?
    నవాబు : ఓహో! చాలా బావుంది. కొత్తగా చెప్పారు. మరోసారి.
    నేను : తమ అనుగ్రహం (మళ్ళీ చదివాను)
    నవాబు: కవిత బాగుంది. మరేదన్నా చదవండి.
    నేను : ఇది నా గజల్ కాదు. చివరి రెండు ద్విపదులు నావి.
    నవాబు : ఇది మీదా? ఇలాంటి పద్యాలా? మరేదన్నా గజల్ చదవండి.
    నేను : ఇక తాము శలవివ్వాలి. అందుకే ప్రారంభించాను.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.