Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
11. దానార్థము బంగారము చేతగలవారు, శుభవచనులు సవితృ యజ్ఞపు మూడు సవనములకు ఆకసమునుండి విచ్చేయుదురు. సవితా ! నీవు స్తోతల స్తోత్రములను గ్రహించుము. తదనంతరము సంపూర్ణ అభిలాష ఫలములను మాకు ప్రసాదించుము.
12. త్వష్ట ఈ సుందర జగత్తును నిర్మించినవాడు. కళ్యాణకారుడు. ధనవంతుడు. సత్యసంకల్పుడు. అతడు మమ్ము కాపాడవలెను. కోరికలు తీర్చవలెను.
ఋభువులారా ! పూష సహితులుగా మీరు మాకు ధనమును అందచేయుడు. సంతృప్తులను చేయుడు. సోమాభిషవమునకుగాను ప్రస్తరమును ఉత్కేలనచేయు ఋత్విక్కులు ఈ యజ్ఞము చేసినారు.
13. మరుద్గణములు, వాగ్దేవత ద్యోతిమంత రథవంతులు, ఆయుధవంతులు, దీప్తిమంతులు, శత్రు వినాశకులు, యజ్ఞోత్పన్నులు, నిరంతర గమనశీలురు, యజ్ఞార్హులు. వారు మా ఈ స్తోత్రమును వినవలెను. త్వరాన్విత మరుద్గణములారా ! మాకు పుత్ర విశిష్ట ధనమును ప్రసాదించుడు.
14. ధన హేతువగు ఈ స్తోత్రము, అర్చనీయ శస్త్రము, ఈ మహా యజ్ఞమున బహుకర్మల విష్ణువును చేరవలెను. సకల జనని, పరస్పర అసంకీర్ణ ములగు దిశలు విష్ణువును హింసించవు. అతడు ఉరు విక్రముడు. త్రివిక్రమావతారమున ఒకే పాదమున సమస్త జగమును ఆక్రమించినాడు.
15. సకల సామర్థ్య సంపన్నుడగు ఇంద్రుడు ద్యావాపృథ్వులను తన మహిమతో పూరించినాడు. ఇంద్రునిసేన శత్రుపురములను కూల్చునది. వృత్రుని వధించునది. శత్రువును పరాజితము చేయునది. అట్టి సేనగల ఇంద్రుడు పశువులను కూర్చి మాకు అనేక పశువులను దానము చేయవలెను.
16. అశ్వినులారా ! మేము మీ బంధువులము. మీరు మా కోరికలు తెలిసినవారు. మీరు మా పాలకులు కావలెను. మీ ఇద్దరి కలయిక కమనీయము. మా కొఱకు మీరు ఉత్తమ ధనదాతలు కావలెను. మిమ్ము తిరస్కరించగలవాడు లేడు. మేము మీకు హవిస్సు సమర్పించుచున్నాము. మీ శుభకర్మములతో మమ్ము పాలించుడు.
17. కవిదేవతలారా ! విశాలములగు మీ కర్మలు మనోహరములు. వాటిద్వారానే మీరు ఇంద్రలోకమున దేవత్వము పొందినారు.
బహుజన ఆహూతుడవగు ఇంద్రా ! నీవు ప్రియతమ ఋభువులతో స్నేహముగా ఉన్నావు. నీవు ఈ స్తుతిని ధనలాభమునకుగాను స్వీకరింపుము.
18. నిరంతర గమనశీలుడగు సూర్యుడు, దేవమాత అదితి, యజ్ఞార దేవగణములు, అహింస కర్మల వరుణుడు మమ్ము రక్షించవలెను. వారు మా పుత్రులను అహితకర్మల నుండి దూరముగా ఉంచవలెను. మా గృహములను, పశువుల, సంతానయుక్తము చేయవలెను.
19. అగ్ని హోత్రమునకుగాను అనేక దేశములందు ఆవిర్భవించినవాడు దేవదూత అగ్ని అగును. కర్మసాధనలో లోపము వలన మేము అపరాధులము. అగ్ని మమ్ము సర్వత్ర నిరపరాధులు అనవలెను. ద్యావాపృథ్వులు జలసమూహములు. సూర్యుడు, నక్షత్రవ్యాప్తమగు అంతరిక్షము మా స్తుతిని వినవలెను.
20. అభిమత ఫలప్రదులు మరుత్తులు. ప్రార్థించువారి కోరికలు తీర్చు నిశ్చల పర్వతములు మా హవిస్సులు అందుకొని మా స్తుతులు వినవలెను. అదితి పుత్ర సహిత అయి మా స్తుతి వినవలెను. మరుత్తులు మాకు శుభంకర సుఖములు ప్రసాదించవలెను.
21. అగ్నీ ! మా మార్గము సర్వదా సుఖ ప్రయాణ యోగ్యము కావలెను. దేవతలారా ! మధుర జలములందు ఓషధులను చేర్చండి. అగ్నీ ! నీ మైత్రి వలన మా ధనమునకు నష్టము కలుగరాదు. మాకు సమృద్ధమగు అన్నము లభించవలెను.
22. అగ్నీ ! హవన యోగ్య హవిని ఆస్వాదించుము. మా అన్నమును చక్కగా ప్రకాశవంతము చేయుము. ఆ అన్నములను మా ముందుకు తెమ్ము. సంగ్రామమున బాధలు కలిగించు సకల శత్రువులను జయింపుము. ప్రఫుల్ల మనస్కుడవయి మా రోజులను అన్నింటిని ప్రకాశవంతము చేయుము.
ఏబది అయిదవ సూక్తము
ఋషి - విశ్వామిత్రపుత్రుడు వాచ్యుడు లేక ప్రజాపతి దేవతలు - విశ్వేదేవతలు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఉదయమున ప్రాచీన ఉష అంతరించినపుడు అవినాశ ఆదిత్యుడు సముద్రము నుండిగాని, ఆకాశము నుండిగాని ఉదయించును. సూర్యోదయమయినపుడు అగ్నిహోత్రాదులందు తత్పరులగు యజమానులు కర్మ చేయుదురు. వెంటనే దేవతల వద్దకు చేరెదరు. దేవతలందరి మహాబలము ఒక్కటియే "దేవానామసురత్వమేకం"
2. అగ్నీ ! ఇప్పుడు దేవతలు మమ్ము హింసించరాదు. దేవపదవికి చేరిన పురాణ పురుషులు పితరులు మమ్ము హింసించరాదు. యజ్ఞ ప్రజ్ఞాపకుడు, సనాతన ద్యావాపృథ్వుల మధ్య ఉదయించు సూర్యుడు మమ్ము హింసించరాదు. "దేవానామసురత్వమేకం"
3. అగ్నీ ! మా బహువిధ కోరికలు వివిధ దిశలందు విహరించును. అగ్నిష్టోమాది యజ్ఞములకుగాను మేము పురాతన స్తోత్రములను దీప్తము చేతుము. యజ్ఞార్ధము అగ్ని ప్రజ్వలితమైనపుడు మేము సత్యము పలుకుదుము "దేవానామసురత్వమేకం"
4. సర్వసాధారణుల రాజు, దేదీప్యమాన అగ్ని అనేక దేశములందు అగ్నిహోత్రము కొఱకు స్థాపితుడగును. అగ్ని వేదిపైన శయనించును. అరణికాష్ఠమున విభక్తుడు అగును. ద్యావాపృథ్వులు అగ్నికి ఇద్దరు తల్లులు. ద్యులోకము అతనికి వృష్ట్యాద్యుల ద్యారా పుష్టి కలిగించును. మరొకమాత వసుధ అతనికి నివాసము మాత్రము ప్రదానము చేయును. "దేవానామసురత్వమేకం"
5. జీర్ణ విషధులందును, నవ్య ఓషధులందును గుణాను రూపమున నిలిచిన అగ్నిలేక సూర్యుడు సద్యోజాతుడై, పల్లవించి ఓషధుల అభ్యంతరమున ఉండును. ఎటువంటి పుష్పరేతో సంయోగము లేకనే ఓషధులు అగ్నివలన గర్భము దాల్చి ఫల పుష్పాదులను కలిగించును. ఇది దేవతల ఐశ్వర్యము. 'దేవానామసురత్వమేకం."
6. ఉభయ లోకములను నిర్మించిన వారు ద్యావాపృథ్వులు. వారి పుత్రుడగు సూర్యుడు అస్తమించువేళ పశ్చిమదిశన శయనించును. కాని ఆ ద్యావాపృథ్వుల పుత్రుడు, సూర్యుడు, ఉదయించువేళ నిరాటంకముగ ఆకాశమున ఒక్కడే సాగును. ఈ సకల కర్మలు మిత్రావరుణులవి. "దేవానామసురత్వమేకం"
7. అగ్ని ఉభయలోక నిర్మాత. యజ్ఞహోత. యజ్ఞమున విరాజిల్లువాడు. ఆ అగ్నియే ఆకాశమున సూర్యరూపమున కదలును. అతడు సకల కర్మల మూలభూతుడు. భూమిమీద నివసించువాడు. సుందర వచనముల స్తోతలు అతనిని అందముగా స్తుతింతురు. "దేవానామసురత్వమేకం."
8. యుద్ధశూరుని ముందుకు వచ్చు శత్రుసేన పరాజ్ముఖమయినట్లు తోచును. అట్లే సమీపమున ఉన్న అగ్నికి అభిముఖముగా వచ్చు భూతజాతులు. పరాజ్ముఖమయినట్లు కనిపించును. అందరు గుర్తెరిగిన అగ్ని జలమును హింసించు దీప్తి తన మధ్యమున ధరించినాడు. "దేవానామసురత్వమేకం."
9. అగ్ని దేవదూత. పరిపాలకుడు. అతడు ఓషధుల మధ్యన వ్యాపించి ఉన్నాడు. అతడు సూర్యుని వెంట ద్యావాపృథ్వుల మధ్య సంచరించును. నానావిధరూపములు ధరించు అగ్ని మమ్ము అనుగ్రహదృష్టితో చూడవలెను. "దేవానామసురత్వమేకం."
10. అగ్ని వ్యాప్తుడు. సర్వరక్షకుడు. ప్రియతముడు. క్షయరహిత తేజోవంతుడు. అతడు పరమ స్థానమగు అంతరిక్షమందలి జలస్థానమును రక్షించును. అగ్ని సంపూర్ణ భూతజాతములను ఎరుగును. "దేవానామసురత్వమేకం."
11. అహోరాత్రులు మిథునరూపములు. నానారూపములు ధరించునవి. శుక్ల కృష్ణ వర్ణముల రాత్రింబవళ్లు భగినులు. వానిలో ఒకటి అర్జునవర్ణ రెండవది కృష్ణవర్ణ. "దేవానామసురత్వమేకం."
12. మాత పృథ్వినకాగా దుహిత ద్యులోకమగును. అవి రెండును పాలిచ్చు ఆవులు. అవి అంతరిక్షమున పరస్పరము కలిసి ఉండును. ఒకదాని రసము మరొకదానికి త్రావించును. జలస్థాన భూతమగు అంతరిక్ష మధ్యమున నిలిచిన ద్యావాపృథ్వులను మేము స్తుతింతుము. "దేవానామసురత్వమేకం."
13. ద్యులోక పృథ్వులు తమ పుత్రుడగు అగ్నిని ఉదకధారారూప జిహ్వతో నాకును. మేఘము ద్వారా ధ్వనించును. ద్యురూపధేనువు భూమికి జలము వర్షించి తన పొదుగును పరిపుష్టము చేసికొనును. అట్లు జలవర్జితమయిన భూమి సత్యభూత ఆదిత్యుని జలమువలన వర్షకాలమున తడిసి పోవును. "దేవానామసురత్వమేకం."
14. పృథ్వి నానావిధ శరీరములను ఆచ్చాదించును. అది అత్యున్నతమై ముల్లోకముల వ్యాపించిన సూర్యుని నాకుచు నిలుచును. సత్యభూత ఆదిత్య స్థానజ్ఞానులమగు మేము అతనికి పరిచర్యలు చేసెదము. "దేవానామసురత్వమేకం."
15. పదద్వయమువంటి అహోరాత్రులు ద్వావాపృథ్వుల మధ్యన నిలిచినవి. వాటి మధ్యన ఒక నిగూఢమగు అన్య పదార్థము ఆవిర్భూతమయినది. అహోరాత్రులు కలిసిన మార్గము పుణ్యకారకము, అపుణ్యకారకము, ఉభయ గమ్యములు కలది అగును. "దేవానామసురత్వమేకం"
16. వృష్టి వర్షమున సర్వులను ప్రీతులను చేయునది, శిశురహిత, ఆకాశవాసిని, అక్షీణప్రసవిణీయువతి, సర్వధానూతన రూపధారి మేఘము లేక దిశలు కంపించవలెను. "దేవానామసురత్వమేకం"
17. జలములు వర్షించు పర్జన్యరూప ఇంద్రుడు ఇతర దిశలందు మేఘము ద్వారా గొప్ప ధ్వని చేయును. అతడు అన్యదిశలందు జలము వర్షించును. అతడు జలము, శత్రువును విసరివేయువాడు. ఇంద్రుడు ఎల్లరికి భజనీయుడు. అతడు అందరికి రాజు "దేవానామసురత్వమేకం"
18. జనులారా ! శూరుడగు ఇంద్రుని శోభన అశ్వములను వివరముగా వర్షించుచున్నాము. దేవతలు సహితము ఇంద్రుని అశ్వములను ఎరుగుదురు. రెండు రెండు నెలలు కలిసి ఆరు ఋతువులు అగును. హేమంత శిశిరములను కలిపినప్పుడు అయిదు ఋతువులు అగును. ఇవే ఇంద్రుని అశ్వములు. ఇవి కాలాత్తముడగు ఇంద్రుని వహించును. "దేవానామసురత్వమేకం"
19. త్వష్ట అంతర్యామి అయినందున అందరి ప్రేరకుడగును. అతడు నానావిధ రూపవిశిష్టుడు. అతడు బహుప్రకారజనులను సృష్టించినాడు. వారిని పోషించుచున్నాడు. ఈ సమస్త జగములు త్వష్టవే అగును. "దేవానామసురత్వమేకం"
20. ఇంద్రుడు మహంతములగు ద్యావాపృథ్వులను పశుపక్ష్యాదులతో నింపినాడు. ఇంద్రుని తేజముననే ద్యావాపృథ్వులు అతిశయ వ్యాప్తములయినవి. సమర్థుడగు ఇంద్రుడు శత్రువులను పరాజితులనుచేసి వారి ధనము గ్రహించుటలో విఖ్యాతుడు. "దేవానామసురత్వమేకం"
21. ఇంద్రుడు విశ్వదాత. మాకు ప్రభువు. అతడు ఈ పృథ్వి, అంతరిక్షములందు మిత్రునివలె వసించును. వీర మరుద్గణములు యుద్ధమున ఇంద్రుని ముందుసాగును. వారు ఇంద్రుని ఇంట వసింతురు. "దేవానామసురత్వమేకం"
22. పర్జన్యాత్మక ఇంద్రా ! ఓషధులు నీవలననే సిద్ధిపొందినవి. జలములు నీ వలననే ప్రవహించినవి. ధరిత్రి నీ భోగము కొఱకు ధనమును ధరించినవి. మేము మీ పుత్రులము. మేము మీ ధనపు భాగస్వాములము కావలెను. "దేవానామసురత్వమేకం"
(ఆంధ్రవచన ఋగ్వేద సంహిత మూడవ అష్టకము మూడవ మండలమున మూడవ అధ్యాయము సమాప్తము)
నాలుగవ అధ్యాయము ఏబది ఆరవ సూక్తము
ఋషి - విశ్వామిత్రపుత్రుడు వాచ్యుడు లేక ప్రజాపతి, దేవత - విశ్వేదేవతలు, ఛందస్సు - త్రిష్టుప్.
1. సృష్టి తరువాత జరుగు స్థిరములు, ప్రసిద్ధవంతములు అగు కర్మలను మాయావులు హింసించరాదు. విద్వాంసులు సహితము హింసించరాదు. ద్రోహ రహిత ద్యావాపృథ్వులు ప్రజాగణయుక్తములయి వానికి విఘ్నము కలిగించరాదు. అచల పర్వతములను వంచగలవాడు లేడు.
2. ఒకస్థాయీ సంవత్సరము వసంతాది ఆరు ఋతువులు కలిగి ఉండును. సత్యభూతము, ప్రవృద్ధమగు ఆదిత్య సంవత్సరము రశ్మియుతమగును. చంచలములగు లోకత్రయములు పైన పైన ఉండును. స్వర్గ అంతరిక్షములు గుహా నిహితములు. ఒక్క భూలోకమే కనిపించునది.
3. గ్రీష్మము, వర్షము, హేమంతములు ఉరములు, జలవర్షకములు, నానారూపములు, వసంతము, శరత్తు, హేమంతము విశిష్టములు. బహుప్రాకారములు, ప్రజావంతములు అవియే ఉష్ణము, వర్షము, శీతాత్మకమను మూడు గుణములు కలిగి మహత్వవంతములయి సంవత్సరములుగ వచ్చును. సేచన సమర్థ సంవత్సరము అందరి కొఱకు జలమును ధరించును.
4. సంవత్సరము సకల ఓషధుల వద్ద వాని పాద స్వరూపముగ జాగృతమయినది. నేను ఆదిత్యుల మనోహరనామములను ఉచ్ఛరింతును. ద్యుతిమంతము స్వతంత్ర పథగామియగు జలసమూహము సంవత్సరము నాలుగు నెలలు వర్షము ద్వారా సంప్రీతుల చేయును. మిగిలిన ఎనిమిది నెలలు వదిలివేయును.





