Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
"ఎవరు నీవు? ఎచటి నుంచి రాక? తేజోవంతుడవు. సిద్ధునివలె కనిపించుచున్నావు. ఈ పర్వతమందు నీకేమి పని? పుణ్యఫలములు పొందుము.
"ఈ పర్వతము శాంతమునకు నిలయము. ఇచట తపస్సంపన్నులు ఉందురు. ఇచట ఆయుధము వలన ప్రయోజనములేదు కాబట్టి ఆయుధము విడువుము. నిరాయుధడవయి సాగుము".
అర్జునుడు ముసలి బాపని మాటలు విన్నాడు. నిలుచున్నాడు. నిశ్చలుడయి ఉన్నాడు. చలించలేదు. బ్రాహ్మణుడు అది చూచినాడు. మేచ్చినాడు. నిజరూపము ధరించినాడు. ఇంద్రుడయి ఎదుట నిలిచినాడు "నాయనా! అర్జునా! నీ ధైర్యమునకు మెచ్చినాను. నీ ఇష్టము వచ్చిన వరము కోరుకొనుము ప్రసాదింతును" అన్నాడు.
"దేవేంద్రా!" అర్జునుడు అన్నాడు. "నాకు దివ్యాస్త్ర లాభము కావలెను. దుర్యోధనాదులు మాకు గొప్ప అవమానములు కలిగించినారు. నా సోదరులు అవమాన సాగరమున మునిగి ఉన్నారు. నాకు స్వర్గాదులు అక్కరలేదు. వారి దుఃఖము పోగొట్టవలెను. అందుకు నాకు దివ్యాస్త్రములు కావలెను. వానిని నాకు ప్రసాదించుము".
ఇంద్రుడు అర్జునుని మాటలు విన్నాడు. అతని పట్టుదలను మెచ్చుకున్నాడు. "అర్జునా! నీ సంకల్పమునకు మెచ్చినాను. నీకు దివ్యాస్త్ర లాభము కలుగును. నీవు శివుని గూర్చి తపము చేయుము. యోగము అవలంబించుము. రుద్రుని ప్రత్యక్షము చేసికొనుము. ఈశ్వరుడు ప్రసన్నుడయిన, నీకు దివ్యాస్త్రములు లభించును. నీ కోరిక నెరవేరుగాక" అని చెప్పి అంతర్ధానుడు అయినాడు.
అర్జునుడు ఇంద్రునకు నమస్కరించినాడు. ఆయుధములు ధరించియే హిమవత్పర్వత శిఖరమునకు చేరినాడు. తపోవనమున ప్రవేశించినాడు. అది సుందర ప్రదేశము. అచట నానావిధ ఫలపుష్ప వృక్షములున్నవి. మనోహరములయిన సరస్సులున్నవి. అచటి గాలి హాయిగను, పరిమళయుక్తముగను ఉన్నది. అర్జునుడు తపోవనమున తపము సాగించినాడు మనో, వాక్, దేహ, కర్మములయందు నియమము గలవాడు అయినాడు. ఈశ్వరుని యందు మనసు నిలిపినాడు. ముందు మూడురోజులకు ఒకసారి పండ్లుమాత్రము ఆహారముగా తీసుకున్నాడు. ఆవిధముగా ఒకనెల గడిపినాడు. రెండవ నెలలో ఆరురోజులు ఉపవసించినాడు. మూడవ నెలలో పదిహేనురోజులు ఉపవాసము చేసినాడు. ఆ తరువాత వాయువును మాత్రము భక్షించినాడు. రెండు చేతులు పైకి ఎత్తినాడు. ఒకేకాలి బొటనవేలు మీద నిలిచి తపము ఆచరించినాడు. ఆ విధముగా నాలుగవ మాసము గడచినది. తపోవనము నందలి మహర్షులందరు, అర్జునుని ఘోర తపము చూచినారు. ఆశ్చర్యపడినారు. వారందరు కైలాసమునకు వెళ్లినారు. శివుని దర్శించినారు. అతనికి విన్నవించినారు:-
"మహాత్మా! మహావీరుడయిన అర్జునుడు ఘోర తపము చేయుచున్నాడు. అతని తపస్సు వలన చెలరేగిన అగ్ని ధూమము వనమంతయు వ్యాపించినది. అర్జునుని తపమునకు సకల జీవులు భయపడుచున్నారు. కావున అర్జునుని ఇష్టము తీర్చుము. తపము మాన్పించుము".
శంకరుడు మునుల వాక్కులు విన్నాడు. చిరునవ్వు నవ్వినాడు. "అర్జునుని అభిప్రాయము నాకు తెలియును. అతనికి సంతోషము కలిగింతును" అని ఈశ్వరుడు మహర్షులను పంపించినాడు.
శివుడు ఎరుకల రాజు అయినాడు. పార్వతి ఎరుకల రాణి అయినది. సకల భూతగణములు కిరాతులు అయినారు. పరమేశ్వరుడు కిరాత సైన్యముతో తపోవనమున ప్రవేశించినాడు. ఆ సైన్యపు నడకకు భూమి కదలినది. మృగములు పక్షులు బెదిరినవి. వాటికి కూతరాలేదు. మూగవి అయినవి. కాలు కదలలేదు. కుంటివి అయినవి. కన్ను కనిపించలేదు, గ్రుడ్డివి అయినవి. మృగములన్నియు స్థావరములు అయినవి. అప్పుడు మూకుడు అను రాక్షసుడు అడవి పంది అయినాడు. అర్జునుని మీదకు ఉరికినాడు. అర్జునుడు పందిని తన బాణముతో కొట్టినాడు. కిరాత వేషమున ఉన్న ఈశ్వరుడు "బాణము వేయవద్దు, వేయవద్దు" అనుచు ఉరికి వచ్చినాడు. ఆ పందిని తన బాణముతో కొట్టినాడు. ఆ విధముగా పందికి రెండు పక్కల బాణములు తగిలి చచ్చినది. అర్జునుడు అటు పందికి తగిలిన రెండవ బాణమును చూచినాడు. తిరిగి బాణము వచ్చిన వైపు చూచినాడు. ఎదురుగా కిరాతరాజు కనిపించినాడు. అతడు గొప్పగా ఉన్నాడు. గొప్ప ధనుస్సు ధరించి ఉన్నాడు. గొప్ప సేన కలిగి ఉన్నాడు. అర్జునుడు అది చూచి ఆశ్చర్యపడినాడు.
"కిరాతరాజా! మానవులకు అగోచారమయిన ఈ మహారణ్యమున ఆడవారితో సంచరించుచున్నావేల? సంచరించితివిపో నేను కొట్టిన పందిని నీ వేల కొట్టితివి? అట్లు చేసి నీవు మృగయా ధర్మమును వ్యతిరేకించినావు. కావున నా బాణపరంపరతో నిన్ను హతమార్తును" అన్నాడు అర్జునుడు.
కిరాతరాజు పర్వతరాజు వలె నిల్చినాడు. చలించలేదు. నవ్వినాడు "అంత శక్తిమంతుడవా? హెచ్చులు పలుకుచున్నావు? అయిన రమ్ము నాతో యుద్ధము చేయుము. నా భుజబలమును ఎరుగనట్లున్నావు. నీవు జీవింపలేవు" అన్నాడు కిరాతుడు. కదలలేదు.
అర్జునుడు కిరాతుని మాటలు విన్నాడు. అతనిలో కోపము పొంగినది. గాండీవము అందుకున్నాడు. శరవర్షము కురిపించినాడు.
కిరాతుడు కొండవలె నిలిచినాడు.
బాణవర్షము జలవర్షము వలె రిత్తవోయినది.
కొండ మీద చినుకులు పడినట్లయినది.
కిరాతరాజు దేహమున బాణములు లీనమయినవి.
అర్జునుడు ఆశ్చర్యచకితుడు అయినాడు.
"ఇతడు ఇంద్రుడో, ఈశ్వరుడో, కుబేరుడో కావలయును. కాకున్న నా బాణములు ఇట్లు రిత్తపోవు" అని ఆలోచించినాడు. అయినను ధైర్యము విడువలేదు. మరిన్ని దివ్యాస్త్రములను ప్రయోగించినాడు.
అర్జునుని బాణములన్నియు ఈశ్వరునిలో లీనమయినవి. ఈశ్వరుడు చలించలేదు. అతనికి ఒక్క గాయము కాలేదు.
అర్జునుడు బాణము తీయబోయినాడు. అంబుల పొదులలో బాణములు లేవు. అక్షయ తూణీరములు ఎండిపోయిన నదివలె అయినవి. ఒక్క శరమైనను అందులేదు.
అర్జునుడు దిగ్భ్రాంతి చెందినాడు. అగ్నిదేవుడు ఇచ్చిన అక్షయ తూణీరములు వట్టిపోవుట అతనికి అర్థము కాలేదు. ఎదుట ఉన్నవాడు ఎవడో ఎరుగలేకపోయినాడు. అయినను ధైర్యము విడువలేదు అతని మనసు మండినది. కోపము పొంగినది. గాండీవమును ఎత్తి ఎరుకల రాజును కొట్టినాడు.
గాండీవము కనిపించలేదు.
గాండీవము కిరాతుని దేహమున లీనమయినది.





