Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    మరొక మిర్జాగారు ఉండేవారు - నడుము వంగి డెబ్బయి ఏండ్ల వాడు. నోట్లో పళ్ళు లేవు. పొట్టలో ప్రేవుల్లేవు. ఖానమ్ గారి పూర్వపు ప్రియుడు. ఇప్పుడు వారితో సంపర్కం ఏమీ లేదు. అయినా ఇంటి మనిషిలా ఉంటాడు. రెండు పూటలా ఖానమ్ తో భోజనం చేసేవాడు. బట్టలు, నల్లమందు వగైరా ఖర్చులన్నీ భరించేది. ఒకరోజు మేమంతా ఖానమ్ దగ్గర కూర్చుని ఉన్నాం. ఖుర్షిద్ జాన్ ఏడుపు ముఖం పెట్టుకొని కూర్చుంది.
    ప్యారేసాహేబ్ పెళ్ళి అవుతుంటే నీ నెత్తిన ఏడుపు కూర్చుందా? "ఏమోనమ్మా! ఈకాలపు ప్రేమలే విచిత్రం . ముండ లేంతో మిండలంతే. మా కాలంలో నా చూడండి (మీర్జాగారిని చూపించి) ఇప్పటికీ ఇక్కడే ఉన్నారు. వయసులో కలిశాం. తలిదండ్రులు పెండ్లి కుదిరించారు. పెళ్ళి బట్టలతో వచ్చారు నాకు చూపడానికి. పెళ్ళి బట్టలు ముక్కలు ముక్కలుగా చించేశాను. పోనివ్వనని చెయ్యి పట్టి కూర్చోబెట్టాను. నలబై సంవత్సరాలైపోయింది. ఇవ్వాళటి వరకు ఇంటికి వెళ్ళలేదు. చెప్పండి ఇలాంటి వాడున్నాడా మీకు " అడిగింది ఖానమ్ .
    అంతా తలలు వంచుకున్నాం.
    
                                   6


    తొలి ఆటపాటలు బిస్మిల్లా మిస్సీలోనే జరిగాయి. కాని తొలికచ్చేరి నవాబ్ షుజాత్ ఆలీఖాన్ కొడుకు పెళ్ళిలో. ఆ సదస్సు మరువరానిది. నవాబు బంగళా రమ్యంగా అలంకరించబడింది. విలువైన గాజు దీపాలతో రాత్రి పగలుగా మారిపోయింది. శుభ్రమైన గచ్చు మీద పారసీకపు రత్నకంబళ్ళు పరచబడినాయి. జరీ పనిచేసిన పెద్ద పెద్ద బాలీసులు.
    పూలవాసనలతోను, అత్తరు పరిమళంతోనూ భవనమంతా గుబాళించింది. హుక్కాల పొగ, ఊదుబత్తీల ధూపమూ పరిమళించాయి. అప్పటికీ నా వయసు పధ్నాలుగు సంవత్సరాలు. ఆ కాలంలో బరోడా నుంచి ఒక గాయనివచ్చింది. ఆమె ఖ్యాతి నగరమంతా వ్యాపించి పోయింది. సంగీతంలో అందెవేసిన చేయి. గొప్పగొప్ప సంగీత విద్వాంసులు మూలపడ్డారు. ఆవిడ గొంతు శ్రావ్యం అయింది. గొంతెత్తి పాడితే నాలుగు వీధులకు వినవచ్చేది. ఖానమ్ ఆలోచించింది. ఆవిడ తరవాత నా పాట పెట్టింది. నాకు ఏమీ అర్ధం కాలేదు. జనం ఆశ్చర్యపోయారు. ఏమిటీ ఖానమ్ పిచ్చి ? బరోడా భాయి ముందు ఈ అమ్మాయి ఏం నిలుస్తుంది? అనుకున్నారు.
    మొదటి అవర్తం ప్రారంభం అయింది. సదస్సు యావత్తు నావైపు చూచింది. పొంగుతున్న యవ్వనం . ముఖం బాగాలేదు. కాని చురుకుదనం , కొంటేదనం ఉండేవి.
        యౌవనమెట్టిదని అడుగనేల ?
        రంగు రంగుల శుక్రడాపమ్మది సుమా !
    కొద్దిసేపు నాట్యం చేయగానే ఖానమ్ మరొక గజల్ ప్రారంభించింది.
        అతడీ సభకు అరుదెంచునయా!
        చూడవయా , ఆపై వింత వింతలు!
    ఈ గజల్ సదస్యులమీద నుంచి ప్రభావం కలిగించింది. తరవాత మరొక పదం ప్రారంభించి పాట సాగిస్తే సభ ఊగిపోయింది.
          బాధ మరువ - క్రొత్త బాధను రగిలించు  
          బాధ నణతుమన్న - అలిగిపోవు ప్రియుడు !
    ఈ పదంతో చిచ్చురేగింది.
        కనురెప్పలు వాలే, చూపులు వంకరాయే
        గురితప్పి బాణాలు నేలగూలె !
    ఈ కవిత ఎంత ప్రభావం వేసిందో చిత్తగించండి.
        వలపు నింపుకొని కోర్కెల చంపుటెట్లు?
        ఉసురులను తీసి కాయమును నిలుపుటెట్లు?
    తరవాత ఈ పద్యం
        ఆదమరచి నా సోదచెప్పుకొంటి నతనికి,
        అయ్యో! ఇపుడు మాటమార్చినంత ఫలమేమి?
    సదస్సు సాంతం ఊగిపోయింది. ప్రతివాడు సావధానంగా వింటున్నాడు. ప్రతి పదానికి "వాహ్ వావ్" అంటున్నారు. ప్రతి భంగిమను మెచ్చుకుంటున్నారు. ఒక్కొక్క పదం ఎనిమిది పదిసార్లు చదివించారు. అయినా సంతృప్తి కలుగలేదు. ఆ గజల్ తో కచేరీ ముగిసింది.
    రుస్వా : సదస్యుల గతి ఏమైందో కాని ఈ గజల్ ఇంకేమైనా వినిపించండి. ఎవరి రచన /
    ఉమ్రావ్ : తెలీదా ?
    రుస్వా : అర్ధమైంది.
    ఉమ్రావ్ : వినండి.
        కోర్కెతీరక 'చచ్చేద' నటంచు విలపించే '
        కోర్కె తీరువేళ గోరీకి చేరుకోనియే!
    రుస్వా : సుబ్బానల్లా! (బాగుబాగు)
    ఉమ్రావ్ : కలం విరిచేశారు. కాగితం చించేశారు. అయినా పలకలేదు.
        ఊర్పునకు శక్తియేమాత్ర మున్నగాని
        వేలమారులు నిట్టుర్పు విడిచియుందు.
    రుస్వా : ఇది వేదాంతం వారికే అర్ధం కావాలి.
    ఉమ్రావ్ : వినండి.  
        సోదచెప్పి నా ఎద బ్రద్దలు సేయకు !
        ఎదయను అద్దాన నున్నది నీవే! నీవే!
    రుస్వా : మేము ఈ లోకం వాళ్ళం. మాకెందుకీ వేదాంతం! అయినా "అద్దాన " బాగుంది. శ్లేష.
    ఉమ్రావ్: మకుటం వినండి.
        వలవంత మానుము సోద వెళ్ళబోయుటయు,
        అలిగి చక్కబోవు నిర్దయుడా వలపుకాడు!
    రుస్వా: అదిపాదమే మకుటం చేసినట్లున్నాడు. పాపం తీరిక లేదేమో!
    ఉమ్రావ్: వారికి తీరికెక్కడ?
    మొదటి కచేరి జరిగిం తరువాత మరుసటి రోజు బువాహుసేనీ నా గదిలోకి వచ్చింది. వెంట ఒక సేవకుడున్నాడు.
    బువాహుసేనీ: "ఉమ్రావ్ గారూ! ఇతని విన్నపం వినండి" అని గదిలోంచి వెళ్ళి పోయింది.
    సేవకుడు : (సలామ్ చేసి) నన్ను నవాబ్ సుల్తాన్ గారు పంపారు. రాత్రి సభలో పచ్చని పాగాతో వరునికి కుడి పక్కన కూర్చున్నవారు. ఏకాంతంగా తమ దగ్గరికి వస్తానని శలవిచ్చారు. రాత్రి తాము పడిన గజల్ ప్రతి దయచేయవలసిందని కోరారు.
    నేను : నవాబుగారికి సలాములు తెలియజేయి. వారు సాయంకాలం ఎప్పుడైనా వేం చేయవచ్చు. ఎవరైనా ఉంటే వెళ్ళిపోతారు. గజల్ కోసం రేపు పగలు వస్తే వ్రాసి ఉంచుతాను.
    రెండవరోజు మధ్యాహ్నం సేవకుడు వచ్చాడు. గదిలో ఒంటరిగా ఉన్నాను. వ్రాసి ఉంచిన గజల్ అతనికి ఇచ్చేశాను. అయిదు సవరనులు తీసి ఇస్తూ "ఇది తమకు యోగ్యమైంది కాదు. అయినా తాంబూలపు ఖర్చునకు గాను మా తరపున స్వీకరించండి. ఈరోజు దీపాలు పెట్తిం తరువాత వస్తాం" అని నవాబుగారు విన్నవించమన్నారని చెప్పి సలామ్ చేసి సేవకుడు వెళ్ళిపోయాడు. తరవాత బువాహుసేనీని పిలిచి సవరనులు ఇచ్చి ఖానమ్ కు అప్పగించమని అందామనుకున్నాను. సవరనులు మెరుస్తున్నాయి. కొత్త బంగారం సవరనులు. మనసు వాటిని వదల్లేకపోయింది. చూచాను. పెట్టె ఎక్కడా కనిపించలేదు. మందపు కోడు కింద దాచేశాను.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.