Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
7. ఇంద్రా ! ఈ యజ్ఞముచేయు వారు భోజుల, సుదాసుల యాజకులు. వీరు నానారూపులగు అంగిరులు, మేధాతిథి మున్నగువారు. దేవతలను మించిన బలవంతులు మరుత్తులు. నేను విశ్వామిత్రుడను. వారు నాకు అశ్వమేధమున మహనీయ ధనమును ప్రసాదించుచు అన్నమును చక్కగా వర్థిల్ల చేయవలెను.
8. ఇంద్రుడు కామరూపి, కోరిన రూపము ధరించగలవాడు. ఇంద్రుడు మాయావి. అతడు తన దేహమున నానా రూపములు ధరించగలడు. అతడు ఋతుమంతుడు. అయినను ఋతువుకాని సోమపానము చేయును. "అనృతుపాబుతావా" అతడు స్తుతుల ద్వారా ఆహూతుడు అయినపుడు అర్థ ముహూర్త సమయమున మూడు సవనములకు సాగును.
9. విశ్వామిత్రుడు సమర్థుడు. ఋషి. ద్యుతిమంతుడు. తేజస్సుల స్రష్ట. ఉత్కృష్టుడు. అధ్వర్యాదులకు ఉపదేశించువాడు. అతడు జలవంతమగు సింధు వేగమును నిరోధించినాడు. పిజవన పుత్రుడగు సుదాసునితో విశ్వామిత్రుడు యజ్ఞము చేయించినపుడు ఇంద్రుడు కుశికగోత్రజులగు ఋషులతో ఎంతో ప్రియముగా వ్యవహరించినాడు.
10. విప్రులారా ! ఋషులారా ! నేతృగణ ఉపదేశకులారా ! కుశిక గోత్రోత్పన్నులారా ! పుత్రులారా ! యజ్ఞమున శిలలతో సోమమును అభిషవించునపుడు, స్తుతులద్వారా దేవతలను ప్రసన్నులను చేయుటకు ఉచ్చరించు మంత్రములు హంసల శబ్దోచ్చారణవలె ఉండవలెను. దేవతలతో కూడ మీరు సోమపానము చేయండి.
11. కుశిక గోత్రజోత్పన్నులారా ! పుత్రులారా ! మీరు అశ్వమువద్దకు చేరుడు. దానిని ఉత్తేజపరుచుడు. ధనమునకుగాను సుదాసుని అశ్వమును విడువుడు. ఇంద్రరాజు విఘ్నకారకుడగు వృత్రుని తూర్పు, పడమర, ఉత్తర దిశలందు వధించినాడు. అందువలన సుదాసుడు భూమిమీద ఉత్తమ స్థానమున యజ్ఞము చేయవలెను.
12. కుశిక పుత్రులారా ! విశ్వామిత్రుడను, ద్యావాపృథ్వులద్వారా ఇంద్రుని స్తుతించినాను. స్తోత విశ్వామిత్రుని ఇంద్ర విషయకమగు ఈ స్తోత్రము భరతకుల మానవులను రక్షించవలెను.
13. విశ్వామిత్ర వంశజులు వజ్రధరుడగు ఇంద్రుని కొఱకు స్తోత్రము రచించినారు. ఇంద్రుడు మమ్ము శుభప్రదమగు ధనయుక్తులను చేయవలెను.
14. ఇంద్రా ! అనార్యులు నివసించు దేశమందలి గోవులు నీకు ఎందుకు పనికివచ్చును? అవి సోమమున కలుపుటకు యోగ్యమయిన పాలు ఇవ్వవు. దుగ్ధప్రదానముద్వారా పాత్రను దీప్తము చేయవు. ధనవంతుడవగు ఇంద్రా ! ఆ గోవులను మా వద్దకు తెమ్ము. పరమగంధ, ధనమును సహితము అందించుము.
ఇంద్రా ! నీచవంశజుల ధనము మాకు ఇమ్ము.
15. అగ్నిని ప్రజ్వలితుని చేయు ఋషుల ద్వారా సూర్యుని నుండి తెచ్చి మాకు ఇవ్వబడినదియు అజ్ఞానమును బాధించునదియు, రూప శబ్దములతో సర్వత్ర సంచరించు వాక్కు ఆకాశమున అనంత శబ్దము చేయును. సూర్యదుహిత సరస్వతి ఇంద్రాది దేవతలవద్ద అక్షయ అమృతరూప అన్నమును వృద్ధిపరచును.
16. గద్యపద్యరూపమున సర్వత్ర గోచరించు వాగ్దేవి పంచజనులకు లభించు అన్నమునుమించిన అన్నమును మాకు శీఘ్రముగా ప్రసాదించవలెను. దీర్ఘాయువుగల జమదగ్న్యాదిమునులు సూర్యుని నుంచి తెచ్చి వచనమును మాకు అందించినారు. పక్షులను నడుపు సూర్యుని కూతురు వాగ్దేవి మా కొఱకు నూతన అన్నమును దానము చేయవలెను.
("నిషాదపంచమాశ్చత్వారా వర్ణాః" శాయణుడు. పంచజనులు అనగా నిషాదులు సహితముగ నాలుగు వర్ణములవారు)
17. విశ్వామిత్రుడు సుదాసుని యజ్ఞమున అవభృము చేసినాడు. యజ్ఞశాలనుంచి వెళ్లిపోదలచినాడు. అప్పుడు అతడు రథాంగములను రథపు భాగములను స్తుతించినాడు. అశ్వద్వయము స్థిరముగా ఉండవలెను. అక్షము దృఢముగా ఉండవలెను. దండము ఎరుగరాదు. యుగము ఎరుగరాదు. కీలద్వయము అరగకముందే ఇంద్రుడు భరించవలెను. అహింసిత, నేమివిశిష్ఠ రథమా ! నీవు మాముందుకు వచ్చి నిలువుము.
18. ఇంద్రా ! మా శరీరములకు బలము ప్రసాదించుము. మా పుత్ర పౌత్రులు చిరంజీవులు అగుటకు బలము ప్రసాదించుము. మేము బలవంతులము కావలెను.
19. ఇంద్రా ! రథము యొక్క ఖదిర కాష్ఠయొక్క 'సార'ను గట్టిపరచుము. సీసపు కాష్ఠమును గట్టిపరచుము. మేము దృఢపరచిన అక్షమా ! నీవు దృఢపడుము. మా గమనశీల రథమునుండి మమ్ము పడద్రోయకుము.
20. వనస్పతులచే నిర్మించబడిన ఈ రథము మమ్ము విడువరాదు. నష్టము కలిగించరాదు. మేము ఇల్లుచేరువరకు ఈ రథము నడుచుచుండవలెను. గుఱ్ఱములను విడుచు పర్యంతము మాకు శుభములు కలుగవలెను.
21. ఇంద్రా ! నీవు శూరుడవు. ధనవంతుడవు. మేము శత్రుహింసకులము. మాకు విశేషము, శ్రేష్ఠమగు ఆశ్రయదానము చేయుము. మమ్ము సంతుష్టులను చేయుము. మమ్ము ద్వేషించువాడు నికృష్టుడయి పతనము కావలెను. మేము ద్వేషించువానికి ప్రాణవాయువు లభించకుండవలెను.
22. ఇంద్రా ! గొడ్డలితాకి చెట్టు కూలినట్లు మా శత్రువులు కూలవలెను. బూరుగుపూవు సులభముగా చెట్టునుండి విడిపోయినట్లు మా శత్రువుల అవయవములు విడిపోవలెను. వంటకుండ పొంగి నురుగులు క్రక్కినట్లు నా మంత్ర సామర్థ్యమున ప్రహతుడయిన శత్రువు నోట నురుగులు క్రక్కవలెను.
23. విశ్వామిత్రుడు వసిష్ఠభృత్యులతో అనుచున్నాడు:-
పురుషులారా ! అవసానము కలిగించి విశ్వామిత్రుని మంత్రశక్తిని మీరు ఎరుగరు. తపస్సు క్షీణించునను లోభమున మానముగా ఉన్నవానిని పశువువలె తీసికొని పోవుచున్నారు. వసిష్ఠుడు నాతో స్పర్ధించ తగినవాడుకాడు. ఏలననగా ప్రాజ్ఞుడు మూర్ఖుని పరిహసించడు. గుఱ్ఱము ముందు గాడిద నిలువదు.
24. ఇంద్రా ! భరతవంశీయులు (వసిష్ఠునితో) స్పర్థ ఎరుగుదురు. సమాధానము ఎరుగరు. వారికి శిష్ట సాంగత్యములేదు. యుద్ధమున సహజ శత్రువు మీదకువలె వారి మీదకు గుఱ్ఱములను తోలుదురు. ధమర్దారణము చేయుదురు.
(ఆంధ్రవచన ఋగ్వేద సంహిత మూడవ అష్టకము మూడవ మండలమున నాలుగవ అనువాకము సమాప్తము)
ఆలోచనామృతము
1. వేదము అపౌరుషేయము. అనగా వేదము మానవ నిర్మితము కాదు. దైవదత్తము. దైవప్రసాదము. సమస్త ప్రకృతి దైవదత్తమే. దైవప్రసాదమే !
మానవుడు సృష్టించ గలవాడు కాడు. ప్రకృతిని దర్శించి వినియోగించగలవాడు మాత్రము. ప్రకృతి సాయములేక లోకములు నిలువజాలవు.
దైవప్రసాదమయిన ప్రకృతి శక్తులను శాస్త్రజ్ఞులు ఆవిష్కర్తలు, మేధావులు, ఋషులు దర్శింతురు. దర్శించుట అనగా కంటికి కనిపించినది చూచుటకాదు. కంటికి కానరాని దానిని కనుగొనుట; ఋషి అతీంద్రియ దర్శి !
మనము వేదమున చూచు ఋషులు వేదకర్తలుకారు. ద్రష్టలు మాత్రము. స్మర్తలు గుర్తుంచుకున్నవారు అగుదురు.
కాని గృత్సమదుని నుంచి ఋషులు తామే సూత్రములను నిర్మించినామని చెప్పుకొనుచున్నారు. విశ్వామిత్రుడు ఈ విషయమున మరింత ముందునకు సాగినాడు. తనను, తనవంశజులను పూర్తిగా ప్రకటించినాడు. తమను ఇంద్రసములను దేవసములను చేసికొన్నాడు.
విశ్వామిత్రుడు నిగ్రహము కోల్పోయినట్లు కనిపించును. అతనిలో సంయమనము తక్కువగాను, ద్వేషము అతిశయముగను కనిపించును. శత్రువులను అతడు శాపనార్థములు పెట్టిన తీరు అతిసామాన్యుని తలపించును.
వసిష్ఠుడు విశ్వామిత్రుని పశువునువలె ఈడ్పించినట్లు చెప్పబడినది. దీనివెనుక కథను వివరించుట జరుగలేదు. విశ్వామిత్రుడు సుదాసునితో యజ్ఞము చేయించుట ఇందుకు కారణము కావచ్చును.
వసిష్ఠ, విశ్వామిత్రులు ఇద్దరును రాగద్వేషములకు అతీతులు కాలేక పోయినారు ! అయినను ఋషులు అయినారు !
2. పర్వతమును, ఇంద్రుని సమానముగా స్తుతించుట జరిగినది 53-1 సూత్రమున.
శ్రీమద్భాగవత పురాణమున ఇంద్రునికన్న పర్వతము మిన్న అని కృష్ణుడు వక్కాణించినాడు. ఇంద్రునకు బదులు పర్వతమునకు పూజ చేయించినాడు. ఆ సందర్భముననే గోవర్ధిగిరిని ఎత్తినాడు శ్రీకృష్ణపరమాత్ముడు.
3. 53-4న గృహిణిని గురించి చక్కగా చెప్పబడినది. జాయేదస్తం ఇల్లాలే ఇల్లు. గృహిణీ గృహముచ్యతే అని వివరించినాడు. ఇచట గృహిణి 'జాయ' అను పదము వాడినాడు.
"తస్యాపునర్ణవో భూత్వా దశమే మాసి జాయతే
తజ్జాయా జాయాభవతి యదస్యాజాయతేపునః" అంటుంది బ్రాహ్మణము. తల్లి బిడ్డను కని పదవ మాసమున పునర్జన్మించును. అందువలన 'జాయ' అయినది. జాయ భార్య మాత్రముకాదు. మాతృమూర్తి కూడ అగును.
53-6లో "కళ్యాణీర్జాయా సురణం గృహేతే" అన్నాడు. రమణీయ గృహము శుభములు కలిగించు 'జాయ'
స్త్రీకి సముచిత స్థానము కలిగించినాడు.
4. 53-8 "అనృతుపా ఋతువా" అన్నాడు. ఇంద్రుడు ఋతువును అనుసరించి పానము చేయువాడు. అయినను ఋతువు కానపుడు సహితము పానము చేయును. ఋతువుకాకున్నను సోమమువచ్చు పద్ధతి కనుగొన్నట్లున్నది. ఇంద్రుడు జయించిన దిక్కులలో దక్షిణములేదు.
అయిదవ అనువాకము - ఏబది నాలుగవ సూక్తము
ఋషి - విశ్వామిత్రుడు వాచ్యుడు లేక ప్రజాపతి దేవత - విశ్వేదేవతలు, ఛందస్సు - త్రిష్టుప్.
1. అగ్ని మంథనమున నిష్పాద్యమానుడు, స్తుతి యోగ్యుడు. ఈ మహా యజ్ఞమున అగ్నిని గూర్చిన సుఖంకరమగు సూత్రము వారంవారం మరలమరల ఉచ్చరించబడును. అగ్ని గృహమున విరాజిల్లి తేజోవంతుడయి మా స్తుతులను ఆలకించవలెను. నిరంతరము దివ్యతేజో యుక్తుడగు అగ్ని మా స్తోత్రములను ఆలకించవలెను.
2. స్తోతా ! ద్యావాపృథ్వులు ఎంతో గొప్పవి. వాటి సామర్థ్యమును తెలిసికొనుము. వానిని అర్చింపుము. నా మనసు సమస్త భోగములను కోరుచున్నది. సర్వత్ర నిలిచి ఉన్నది. పూజాభిలాషులగు దేవగణములు మానవ యజ్ఞములందు ద్యావాపృథ్వులను కీర్తించుటలో మత్తులగుదురు.
3. ద్యావాపృథ్వులారా ! మీ ఋతము, సత్యము, యదార్థము. మీరు మా మహా యజ్ఞసమాప్తికి సమర్థులగుదురు. అగ్ని, ద్యులోక, పృథ్వులకు నమస్కారము. హవిర్లక్షణ అన్నమున నేను పరిచర్య చేసెదను. ఉత్తమ ధనమును యాచించుచున్నాను.
4. సత్యయుక్తులగు ద్యావా పృథ్వులారా ! పురాతనులు, సత్యవాదులగు మహర్షులు మీ నుంచి వారి హితార్థములు పొందినారు. పృథ్వీ ! యుద్ధములకు సాగు మానవులు నీ మాహాత్మ్యమును గ్రహించి నీకు నమస్కరింతురు.
5. ఆ సత్యార్థమును ఎరిగినవాడు ఎవ్వడు? ఎరిగిన సత్యార్థమును వివరించగలవాడు ఎవ్వడు? సన్మార్గమున దేవతలవద్దకు ఎవడు చేర్చగలడు? దేవగణములకు దిగువన ద్యులోకమున ఉన్న నక్షత్రాదులను చూడవచ్చును. అవి ఉత్కృష్టము, దుర్జ్ఞే యవ్రతమున నిలిచి ఉన్నవి.
6. కవి, మానవ ద్రష్ట సూర్యుడు ద్యావాపృథ్వులను పూర్తిగా చూడగలడు. జలముల ఉత్పత్తి స్థానము అంతరిక్షము. అక్కడ హర్షకారిణులు, రసవతులు, సమాన కర్మద్వారా పరస్పర ఐక్యభావాపన్నులు ద్యావాపృథ్వులు పక్షులగూళ్లవలె వేరువేరుగ అనేక స్థానముల వ్యాపించి ఉన్నవి.
7. ద్యావాపృథ్వులు పరస్పర ప్రీతియుక్తకర్మద్వారా ఐకమత్యప్రాప్తులు, అవినాశనులు. అవి జాగృతములయి అనశ్వర అంతరిక్షమున నిత్యయవ్వనులయి, అక్కాచెల్లెండ్లవలె ఏకాత్మజాయమానులయి నిలిచి ఉన్నవి. అవి రెండు తమలో తాము ద్వంద్వనామములు కలిగి ఉండును.
8. ఈ ద్యావాపృథ్వులు సమస్త భౌతిక వస్తువులను అవకాశ దానము ద్వారా విభజించును. మహా సూర్య, ఇంద్ర, జల, సముద్ర పర్వతాదులను భరించును. అయినను బాధపడవు. జంగమాత్మ, స్థావరాత్మక జగత్తు ఒకే భూమిమీద ఉన్నవి. చలనము గల పక్షులు నానారూపములయి ద్యావాపృథ్వుల మధ్య నిలుచును.
9. ద్యులోకమా ! నీవు గొప్పదానవు. నీవే సర్వజనన కారణమవు. నీవే పాలింతువు. నీ సనాతనత, పూర్వక్రమానుగతి, మా జననత్వము అన్ని ఒకే చోటునుంచి ఉత్పన్నమయినవి. ద్యు భగిని అగును. మేము ఆమెను స్మరింతుము. ద్యులోకమా ! విస్తీర్ణ వివిక్త ఆకాశమున నిన్ను స్తుతించు దేవతలు వాహన సహితులయి నిలిచి ఉన్నారు.
10. ద్యావా పృథ్వులారా ! మీ యొక్క ఈ స్తోత్రమును మేము చక్కగా ఉచ్ఛరించుచున్నాము. సోమమును ఉదరమున ధరించు అగ్నిరూప జిహ్వావంతులు, దీప్యమానులు, నిత్యతరుణులు, కవి, తమ తమ కర్మలను ప్రకటించువారలగు మిత్రాది దేవతలు ఈ స్తోత్రమును ఆలకించవలెను.





