Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



        "నాగమం పరివీరఘ్న నహిజీవేత్ సుయోధనః
        మయ్యాగతే ధవా వీరద్యూతం సభవితా తథా!"
    "నేను వచ్చి ఉన్న జూదమన్న జరిగి ఉండెడిది కాదు. దుర్యోధనుడన్న జీవించి ఉండువాడుకాడు" అని తాను లేకుండుట వలన జరిగిన అనర్ధమును వివరించి, తనతో సఖ్యముగా ఉండవలసినదని హెచ్చరించినాడు.
    vi) ఇంతకూ శ్రీకృష్ణుడు వచ్చినది చెల్లెలు సుభద్రను తీసుకొని వెళ్లుటకు.
    3. సాల్వుడు ద్వారక మీదకి దండెత్తినపుడు ఎదిరించిన వారిలో బలరామాదులు లేరు. యువతరమే బాధ్యత తీసుకొని ఎదిరించినది.
    4. "సౌంభకము" గాలిలో తేలి, నీటమునగ గల నగరము. దీనిని గురించి పరిశోధించవలసి ఉన్నది. మొత్తము మీద రాక్షసులకు జలమున ఉండగల విద్యయేదో వచ్చునని అనేక పురాణకథల వల్ల వెల్లడియగుచున్నది.
    5. సాల్వుని సౌంభకము మీద మాయా వాసుదేవుని బాధించుట రామరావణ యుద్ధమున ఇంద్రజిత్తు మాయ సీతను చూపి బాధించుటను తలపించును. అక్కడ శ్రీరాముడు ఇక్కడ శ్రీకృష్ణుడు ఆ ఘోరమును చూచి మూర్చిల్లినారు.
    6. జూదమును గురించి భాగవతమున ఒక వృత్తాంతమున్నది. పరీక్షిత్తు కలి పురుషుని వధించుటకు కత్తిని ఎత్తినాడు. కలి తాను సర్వత్ర ఉండనని తనకు స్థానములు నిర్దేశించమని కోరినాడు. అప్పుడు కలి నివాసమునకు నాలిగింటిని నిర్దేశించినాడు 1. జూదము. 2. పానము. 3. స్త్రీ. 4. హింస. వికర్ణుడు, కృష్ణుడు కూడ జూదములు పాపమని చెప్పినారు.

                                                కిరాతార్జునీయము

    పాండవులు ద్వైతవనమున ప్రవేశించినారు. ఆ వనము దట్టమైనది. భద్రమయినది. సుందరమయినది. అక్కడ సర్వకాలములందును ఫల, పుష్పములు ఉండును. నెమళ్లు నాట్యములాడుచుండును. కోకిలలు గానము చేయుచుండును. అక్కడ పెద్ద పెద్ద సరస్సులుండును. వానియందు తామర, కలువపూలు విస్తారముగా ఉండును. అక్కడ కొంగలు, జలాకములు, చక్రవాకములు, తుమ్మెదలు సరస్సులకు సొగసులు కూర్చుచుండును. నదులలో నిర్మలములయిన జలము ఉండును. మహర్షులు శాంత మనస్కులయి తపము చేయుచుందురు.
    ఆ వనమునందు అందమయిన తీగలు చుట్టుకున్న అయిదు వృక్షములను పాండవులు ఎన్నుకున్నారు. ఆ వృక్షముల నీడన ఉండి పాండవులు దైవకార్యములు, పితృకార్యములు నిర్వర్తించినారు. మహర్షులతో చర్చలు జరిపినారు.
    అక్కడికి మార్కండేయ మహర్షి వచ్చినాడు. పూర్వము శ్రీరామునివలె వనవాసము చేయుచున్న పాండవులను చూచినాడు. దుర్భుద్ధిగల దుర్యోధనుని నిందించినాడు. సత్యవంతులయిన పాండవులకు విజయము కలుగునని ఆశీర్వదించినాడు. వెళ్లినాడు. పాండవులు, ద్రౌపది పరస్పరము న్యాయధర్మములను గురించి చర్చించుకున్నారు.
    వచ్చిన మహర్షులను ఆదరించినారు. వారు చెప్పిన ధర్మబోధలు విన్నారు. అట్లుండగా ఒకనాడు వేదవ్యాస మునీంద్రుడు పాండవుల దగ్గరకు వచ్చినాడు. అతడు కృష్ణాజినము ధరించి ఉన్నాడు. బ్రహ్మదేవునితో సమానమయిన తేజము కలిగి ఉన్నాడు. సర్వలోక పూజ్యుడు అయి ఉన్నాడు. పాండవులు వేదవ్యాసుని చూచినారు. ఎదురేగినారు. భక్తిపూర్వకముగా నమస్కరించినారు. వ్యాసుని ఆశీస్సులు పొందినారు. తోడ్కొని వచ్చినారు. చిక్కని నీడగల చెట్టుక్రింద ఆసీనుని చేసినారు. పూజించినారు.
    వ్యాస మునీంద్రుడు సంతసించినాడు. "ధర్మజా! భీష్మ, ద్రోణ, కృప, కర్ణులు పరాక్రమవంతులనియు వారిని గెలుచుట దుర్లభమనియు నీవు భయపడుచున్నావు. ఆ విషయము నేను గ్రహించినాను. నీ భయము పోగొట్టుటకు ఇచటికి వచ్చినాను. నేను యోగబలమున "ప్రతిస్మృతి" అను విద్యను కనుగొన్నాను. దానిని నీకు బోధింతును. ఈ విద్యను అర్జునునకు బోధించి ఉత్తర దిక్కునకు పంపుము. అతనికి రుద్రుడు ప్రత్యక్షమయి సకల దివ్యాస్త్రములను ప్రసాదించును. మీరు ద్వైతమున చాలకాలము ఉన్నారు. ఒకచోట ఎక్కువ కాలము ఉండుట మంచిది కాదు. మరొక చోటునకు తరలుడు" అని ధర్మరాజునకు ఏకాంతముగా "ప్రతిస్మృతి" విద్యను ఉపదేశించినాడు. పాండవులను ఆశీర్వదించి వేదవ్యాస మునీంద్రుడు వెళ్లిపోయినాడు.
    ధర్మరాజు వేదవ్యాసుని కృపా వాక్యములు విన్నాడు. ద్వైతవనము విడుచుటకు నిశ్చయించినాడు. అచటి నుండి పాండవులు బయలుదేరినారు. కామ్యక వనమును చేరినారు. సరస్వతీ నదీ తీరమున నివాసము ఏర్పరచుకున్నారు. ఆవిధముగా కొంత కాలము గడచినది.
    ఒకనాడు ధర్మరాజు అర్జునుని ఏకాంతముగా కలుసుకున్నాడు. అర్జునునితో అన్నాడు:-
    "సోదరా! అర్జునా! మనకు కౌరవులకు యుద్ధము తప్పనట్లున్నది. రానున్న యుద్ధమున భీష్మద్రోణులు కౌరవ పక్షమున ఉందురు. వారు మనకు ఆచార్యులు. మహాశక్తి సంపన్నులు. ధనుర్వేదము సాంతము వారికి కరతలామలకము. భీష్మద్రోణాదులను జయించు విద్యను వ్యాసదేవుడు దయామయుడయి నాకు ఉపదేశించినాడు. నీకు ఆవిద్యను ఉపదేశింతును. నీవు ధనుర్బాణ, కవచ, ప్రాస, ఖడ్గములను ధరించి, అజేయుడవయి ఉత్తర దిశకు వెళ్లుము. ఆ విద్యవలన తపము చేసి ఇంద్రుని ప్రత్యక్షము చేసిగొనుము. పూర్వము దేవతలందరు వృత్రాసురునకు భయపడి, తమ ఆయుధములను బల సంపదను దేవేంద్రునకు సమర్పించినారు. నీవు ఇంద్రుని ప్రసన్నుని చేసిన ఆయుధ బలము సాంతము నీకు లభించును. తదనంతరము ఈశ్వరుని కృప వలన నీకు ఇష్టసిద్ధి కలుగును" అనిచెప్పి అర్జునునకు "ప్రతిస్మృతి" విద్యను ఉపదేశించినాడు.
    అర్జునుడు అన్న చెప్పిన మాటలు విన్నాడు. విద్యను విశ్వసించినాడు. ఉత్తర దిశకు ప్రయాణమునకు సన్నద్ధుడు అయినాడు. శాస్త్ర ప్రకారము హోమము చేసినాడు. అగ్ని హోత్రునకు తృప్తి కలిగించినాడు. పురోహితుడు ధౌమ్యునకు నమస్కరించినాడు. ధర్మరాజు అనుజ్ఞ తీసుకున్నాడు. భీమ, నకుల, సహదేవులకు చెప్పినాడు. అర్జునుడు గాండీవము, అక్షయ తూణీరములు గ్రహించినాడు. స్వర్ణకవచము ధరించినాడు. ఆజానుబాహువైన అర్జునుడు ఇంద్రుని వలె భాసించినాడు. అతనిని చూచి సకల భూతములు సంతసించినవి. ఇష్టకార్య సిద్ధి కలుగునట్లు సర్వులు దీవించినారు. అర్జునుడు పయనమయినాడు. ద్రౌపది ఎదురుగా వచ్చినది.
    "ప్రాణనాథా! అర్జునా! క్షత్రియ కులమున జన్మించి వీరపత్నినయి అవమానముల పాలయినాను. ఇక నాకు క్షత్రియ జన్మవద్దు. అవమానములు వద్దు. మనము ఇప్పుడు అవమాన సముద్రమున మునిగి ఉన్నాము. అందునుండి ఉద్ధరించుటకు పూనుకున్నావు. మహాకార్యము సాధించుటకు బయలుదేరినావు. నీకు శుభమగుగాక! దశదిశలు, భూమి, సూర్యచంద్రులు, ఆకాశము నిన్ను సర్వదా రక్షించుగాక" అని అర్జునుని ప్రేమ దృక్కులతో చూచి ఆలింగనము చేసుకొని సాగనంపినది.
    అర్జునుడు హిమవంతమునకు బయలుదేరినాడు. వీర్యవంతుడు, తేజోవంతుడు అయిన అర్జునుడు హిమవంతము చేరినాడు. సాగినాడు. గంధమాదనము చేరినాడు. ఇంద్రకీలము దాటుచున్నాడు. అప్పుడు అది దాటవద్దని పెద్ద ధ్వని వినవచ్చినది. అర్జునుడు అది విన్నాడు. ఆశ్చర్యపడినాడు. క్షణము ఆగినాడు. చప్పున అతనిమీద పూలవాన కురిసినది. అర్జునుడు పైకి చూచినాడు. ఏమియు కానరాలేదు. క్రిందకు చూచినాడు. అక్కడ ఒక ముదుసలి బ్రాహ్మణుడు కనిపించినాడు. అతడు యమ నియమాదుల వలన శుష్కించిన దేహము గలవాడు. తేజోవంతుడు. అర్జునుని చూచినాడు అన్నాడు:-




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.