Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

                                     5


        నా ప్రక్క పనికిమాలినవాళ్ళు పడి గుర్రుచెట్ట
        కొల్లగొనిపోయే నా వలపుటేద నొక చతురచోరుడు!
    వానాకాలం ఆకాశం మబ్బులతో నిండిపోయింది. మింటికి మంటికి ఏకధారగా వర్షం కురుస్తుంది. ఉరుములు, మెరుపులు, బువాహుసేనీ గదిలో ఒంటరిగా పడి ఉన్నాను. ఖానమ్ వెంట బువాహుసేనీ హైదర్ ఇంటికి వెళ్ళింది. దీపం ఆరిపోయింది. అంధకారం . కన్ను పొడుచుకున్నా కనిపించడం లేదు.
    ఇతర గదుల్లో విలాసాలు, ఒకచోట పాటలు, ఒకచోట హాస్యాలు, నేనో? చీకటి ఒంటరితనం, ఏడ్పు, దగ్గర ఎవరూ లేరు. మనసుబాధ మనసుకే తెలియాలి. మెరుపు మెరుస్తే దుప్పటి కప్పుకునేదాన్ని. ఉరిమితే చెవుల్లో వ్రేళ్ళు పెట్టుకోడం, ఈ స్థితిలో కన్ను మలిగింది. ఎవరో గట్టిగా చేయి పట్టుకున్నట్లనిపించింది. చైతన్యం వచ్చింది. నోట మాట రాలేదు. తుదకు స్పృహ లేకుండా అయింది.
    తెల్లవారి దొంగ కోసం వెదకడం. ఎక్కడ దొరుకుతాడు? ఖానమ్ మూతి ముడుచుకొని కూర్చుంది. బువాహుసేనీ కేకలు వేసింది. నేను మాత్రం కదలక మెదలక కూర్చున్నాను. అడిగి అడిగీ విసిగిపోయాను. నాకు తెలుస్తే గదా చెప్పడానికి?
    రుస్వా : తెలిసినా ఎందుకు చెప్పాలి అనరు కదా?"
    ఉమ్రావ్ : ఎందుకా సూటిపోటు మాట?
    ఆనాటి ఖానమ్ ఆతురత , బువాహుసేనీ దీనత తలచుకుంటే నవ్వు వస్తుంది.
    రుస్వా : ఎందుకు రాదు? వారి ఆశలన్నీ మట్టిపాలు అయితే మీకు పరిహాసం!
    ఉమ్రావ్ : ఆశలు అడియాశలు కావడం! ఖానమ్ సంగతి మీకు తెలియదు. బయటికి పొక్కనీయదు . అణచేసింది.
    ఆ రోజుల్లో ఒక పెద్ద నవాబు కుమారుడు చదువుకోసం లక్నో వేంచేశారు. తండ్రి లంచాలు, నజరానాలతో లక్షలు ఆర్జించాడు. చనిపోయేప్పుడు ఒక జాగీరు కొడుకు ఖర్చు కోసం ఏర్పాటు చేసిపోయాడు. కొన్ని రోజులు చదివారు. తరువాత లక్నో గాలి తగిలింది. దుర్వర్తన విద్యలో పండితుడూ, ధూరవిద్యలో విద్యాంసుడు అయిపోయారు. నామధేయం రాషిదలీ "రాషద్" తఖల్లుస్. లక్నో లో ఒక గురువు వారిని కవిని చేశాడు. తఖల్లుస్ అంటే వారికెంతో గర్వం.
    ఊరి నుంచి వచ్చిన సేవకులు రఖన్ మియాఁ అనేవారు. లక్నోవారు "రాజా" బిరుదం ఇచ్చారు. ఆ బిరుదు అంతగా నచ్చలేదు. లక్నో వాతావరణం అంటే పడి చచ్చేవారు. కొద్ది రోజుల్లోనే నవాబ్ సాహెబ్ అయిపోయారు. ఇంటినుంచి వచ్చినపుడు గడ్డం ఉండేది. లక్నోకు వచ్చి కత్తించారు. తరువాత పిల్లిగడ్డం అయింది. కొద్ది రోజులు తరవాత నున్ననైంది.
    అసలే చిన్న ముఖం. గడ్డం పోవడంతో వికారం అయింది. అందులోనే సొగసు ఉందనుకున్నారు. నల్లని రంగు, స్పోటకం మచ్చలు, చట్టి ముక్కు, డొక్కుపోయిన చెంపలు, మెడపోట్టి, మనిషి పొట్టి, ఆ మహాశయునికి మాత్రం ఇవన్నీ సౌందర్య చిహ్నాల కిందే లెక్క. తాను నలకూబరుణ్ణి అనుకునేవాడు. అద్దం ముందు గంటల తరబడి పడి వుండేవాడు. మెలి పెట్టడం వల్ల మీసాలు పిచ్చుక తోకలా తయారైనాయి. జలపాలు పెంచి ఉంగరాలు తిప్పించారు. మడత టోపీ, పొడవైన అంగరఖా, వదులు పైజమా ఈ అలంకార విశేషాలన్నీ వేశ్యల దర్భారుకు వేంచేయాడనికి.
    స్వయంగానే విలాసపురుషుడు. పైగా సహచరులు ఇతర మహనీయులు. కొద్ది రోజుల్లోనే ఉన్నత వేశ్యా గృహాలకు ప్రవేశం లభించింది. స్వేచ్చ ఎక్కువైంది. చొరవ కలిగింది. "చట్టన్ జాన్" అత్త అయిపొయింది. "బిగ్గన్ " మొట్టికాయలు వేస్తుంది. "హుస్నా" బూట్లూ లాగి పారేస్తుంది. పిల్ల నవాబు ఇహిహి అని నవ్వుతుంటారు. వేశ్య మాతలంటే వారి కెంతో గౌరవం. ఒక సాని ఇంట్లో ఒక రాత్రి గడిపితే చాలు - ఆ వేశ్య మాతను తల్లిని చేసుకునేవారు. గోష్ఠిలో ఆవిడను "అమ్మాజాన్" అని పిలిచి వంగి సలామ్ చేసేవారు. కోట గెలిచానని సూచించడానికి దాన్ని సంకేతంగా భావించేవారు.
    రెండు మూడు గడియల రాత్రి తరవాత ఖానమ్ గారు కొలువు తీర్చేవారు. వారి సేవకు ఒక దాసీ హాజరుగా ఉండేది. ఈ మహాశయుడు అక్కడ ప్రత్యక్షం. సంగీతంలో బాగా ప్రవేశం ఉండేది. స్వయంగా టుమ్రీలు రచించేవారు. రాగం కల్పించి పాడేవారు. భావం ప్రదర్శించేవారు. తన ప్రజ్ఞ ప్రదర్శిచేవారు. నోటితో తబలా వాయించేవారు. మిత్రులు పరిహసించేవారు. అయినా అర్ధం అయ్యేది కాదు. కవి సమ్మేళనాల్లో కూడా తయారు. పద్యం చదివితే పొగిడి చంపేవారు. మహాకవులతో పోల్చేసేవాళ్ళు. గజల్ చదివితే సదస్యులంతా ఉలికిపడేవారు. ఆడవారి పాటలకూ ముందు వీరు తమ పదాలు చదివేవారు. జనం పొట్టలు ఉబ్బెట్టు నవ్వేవారు. హేళనను పొగడ్తగా భావించేవారు. వంగి  సలాములతో స్వీకరించేవారు.
    కొడుకు విద్వాంసుడై వస్తాడని తల్లి లెక్కలేనంత డబ్బు పంపేది. ఏది కావాలని వ్రాస్తే అది వచ్చేది. లక్నోలోని సోమర్లు, పోకిర్లు, చిల్లరగాళ్ళు, పనికి మాలిన సజ్జు మొత్తం వెంటపడ్డారు. వారి సహవాసం వల్లనే కోర్కెలు మొదలై వ్యసనాలుగా పరిణమించాయి. వలపుతో మొదలై పిచ్చికి దిగింది. ఇటు ఖనమ్ పీల్చి వేయసాగింది. "వద్దు బాబూ! అది ఇంకా చిన్న పిల్లా' అనేది. ఈ మహాశయుని ప్రార్ధనలు, విన్నపాలు , ఆతురత నాకు ఇవాళ్టికీ జ్ఞాపకం ఉన్నాయి. మంత్రాలు, తాయెత్తులు, మందులు మాకులు అయిం తరువాత అయిదు వేలకు బేరం తెగింది. డబ్బు కోసం ఊరికి వెళ్ళాల్సివచ్చింది. తల్లి చాటుగా , రెండు ఊళ్ళు కుదువ పెట్టి ఇరవై, ఇరవై అయిదు వెలతో లక్నో చేరారు.
    డబ్బు దివాన్జీ ద్వారా ఖానమ్ గారి ఖజానాలో జమ కట్టబడింది. బువాహుసేనీ చేయి చాచింది. అయిదు వందలు పట్టేసింది. మొత్తం మీద నవాబు గారి తల నున్ననైంది. ఆరు నెలలు లక్నోలో ఉన్నారు. నెలకు నూరు రూపాయిలు ఇచ్చేవారు. అడిగి పుచ్చుకున్నవి వేరు. రహస్యంగా నా కిచ్చినవిబువాహుసేనీకి ఇచ్చేదాన్ని. వాటి విషయం ఖానమ్ కు తెలియదు. ఇప్పుడు నేను స్వతంత్రను. నా కొలువులో ఇద్దరు దాసీలూ, ఇద్దరు పనివాండ్లు ఉన్నారు. గేటు దగ్గర గది నాకోసం అలంకరించబడింది. ముగ్గురు నలుగురు పురుషులు -కులీనుల బిడ్డలూ, నవాబుల బిడ్డలూ వచ్చి కూర్చుంటున్నారు.
    గోహర్ మిర్జా వస్తుండేవాడు. ఖానమ్ బువాహుసేనీలకు అతడంటే మంట. నాకు ఇప్పుడు కాబట్టి అడ్డు పెట్టేవారు కారు. ఈలోగా గోహర్ మిర్జా తండ్రి గతించాడు. వచ్చే డబ్బు నిలిచిపోయింది. బన్నూ ముసలిదైపోయింది. అతని ఖర్చుల బాధ్యత నామీద పడింది.
    ఒకణ్ణి తమవాణ్ణి చేసి పెట్టుకోవడం వేశ్యల రివాజు. అతని వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. ఎవరూ లేనపుడు వినోదానికి పనికివస్తాడు. సరుకులు తెప్పించుకోవడంలో హాయి. మనిషిని పంపితే కొంత తినేస్తాడు. వీరు మెహర్బానీకని మంచివి తెస్తారు. జబ్బున పడితే సేవలు చేస్తారు. రాత్రంతా కాళ్ళు పిసుకుతారు. ఉదయం మందు తాగిస్తారు. మందు తెస్తారు. మిత్రుల ముందు, గ్రాహకుల ముందూ కీర్తిస్తారు. పిట్టల్ని పట్టి తెస్తారు. పెళ్ళిళ్ళ లో నాట్య ప్రదర్శనల ఏర్పాట్ల బాధ్యత తీసుకుంటారు. కచేరీలకు తీసికెళ్తారు. నాట్యం జరుగుతుంటే సదస్సుల్లో కూర్చొని పొగడుతుంటారు. ఆమె నాట్యం చేస్తుంటే వీరు తాళం వేస్తుంటారు. ప్రతి భంగిమకూ "ఆహ్" అంటారు. ప్రతి తాళానికీ "వాహ్" అంటారు. ఆమె భావం వ్యక్తపరుస్తుంది. వీరు వ్యాఖ్యానిస్తారు. వారి వల్లనే మంచిమంచి భోజనాలు లభిస్తాయి. గౌరవమూ, మర్యాద కలుగుతాయి. నవాబులు, అమీర్లతో కలిసినపుడు ఇనాములు దొరుకుతాయి. వీరికీ సాంగత్యపు అనందం వారి వలన పెరుగుతుంది. వేశ్య తానంటే  ప్రాణం ఇస్తుంది అనుకుంటారు వీరు. ఆవిడ బొంకుతుంది. " నేను వారి కట్టుబాట్ల్లో దాన్ని. వివశనై వచ్చేస్తాను మీదగ్గరకు. వారు వచ్చేవేళ అయింది. విడువండి వెళ్ళనివ్వండి. వారు ఎల్లప్పటివారు. మీరేం పోషిస్తారు?" ఇలాంటి మాటలకే జనం లొంగేది. తగదా జరిగితే ఎంతకైనా తయారు. నగరంలో వంకరటింకర వాళ్ళందరితో వారికి పరిచయం. కేక వేస్తె యాభై, అరవై మంది సిద్దం అవుతారు. విటులకు కూడా వారంటే భయం. ఏ క్షణం తనింటికి తాను తిరిగి వెళ్ళిపోతుందో అని.
    అమీర్ జాన్ కు కాజిమాలీ మీద ప్రాణం. ఏండ్ల తరబడి డబ్బు ఇచ్చింది. ఒకసారి అయిదు వందల ఖరీదైన బంగారు కడియాలు తీసి ఇచ్చేసింది. ఎవడో లాక్కుపోయాడని ఉదయం గగ్గోలు పెట్టింది. ఇకోకసారి పడుకొండు వందల దిద్దుల జతలో ఒకటి ఇచ్చేసి "ఐష్ బాగ్ జాతర " లో పోయిందని బొంకింది. అలా వేల రూపాయలు ధారపోసింది. ఖుర్షిద్ కు ప్యారేసాహేబ్ అంటే   ఇష్టం. బిస్మిల్లా కు చెలికాడు లేడు. నిర్లక్ష్యం ఆమె స్వభావం. ఎవరి కట్టులోనూ వుండేది కాదు.
    ఖానమ్ గారు యాభై, యాభై అయిదు సంవత్సరాల వయసులో మీర్ ఔలాదలీ అంటే పడి చచ్చేది. మీర్ పద్దెనిమిది, పందొమ్మిది సంవత్సారాల వాడు. అందమూ, వయసూ ఉన్నాయి. కసరత్తు చేసిన శరీరం, అందరినీ ఆకర్షించేవాడు. కాని ఖానమ్ అంటే వణుకు. పలకరించే ధైర్యం ఉండేది కాదు. పాపం పేదవాడు. చద్ది అన్నం గతి లేకుండేది. ఖానమ్ వల్లనే కుటుంబం యావత్తూ జీవించేది. వేయిన్నర వెచ్చించి పెళ్ళి చేసింది. పెళ్ళినాటి రాత్రి తప్ప రాత్రిళ్ళు ఇంట్లో పడుకునే అదృష్టం కలుగలేదు. రాత్రింబవళ్ళు ఇక్కడే ఉండేవాడు. గడియ రెండు గడియలు ఇంటికి వెళ్ళేవాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.