Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
4. ఇంద్రుడు అరిభయంకరుడు. శీఘ్ర పరాజయ కర్త. పరాక్రమవంతుడు. అతడు తన దేహమును నానా రూపములుగ చేసినాడు. ఇంద్రుడు తన పరాక్రమమున 'త్వష్ట' రాక్షసుని పరాజితుని చేసినాడు. చమసమునందు ఉన్న సోమమును దొంగిలించి త్రాగినాడు.
5. ఇంద్రా ! నీవు అన్న ప్రాప్తకారకుడవు. యుద్ధపు ఉత్సాహమున ప్రవృద్దుడవగుదువు. ధనవంతుడవు. ప్రభూత ఐశ్వర్యవంతుడవు. నేతృశ్రేష్ఠుడవు. స్తుతిశ్రవణ కర్తవు. ఉగ్రుడవు. యుద్ధమున శత్రునివారకుడవు. ధనవిజేతవు. మేము నిన్ను ఆశ్రయ ప్రాప్తికొఱకు ఆహ్వానించుచున్నాము.
నలుబది తొమ్మిదవ సూక్తము
ఋషి - విశ్వామిత్రుడు దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. స్తోతలారా ! మహా ఇంద్రుని స్తుతించండి. ఇంద్రుని రక్షణగల మానవులు సోమపానముచేసి తమ కోరికలను తీర్చుకొనవచ్చును. దేవతలు, ద్యావాపృథ్వులు బ్రహ్మద్వారా ఆధిపత్యమునకుగాను ఇంద్రుని సృష్టించినారు. ఇంద్రుడు శోభనకర్ముడు. పాపనివారకుడు.
2. ఇంద్రుడు సంగ్రామమున స్వతేజ విరాజితుడు. హర్యశ్వయుక్త రథస్థితుడు. బలయుద్ధముల నాయకుడు. యుద్ధమున సేనలను రెండు భాగములుగ విభజించువాడు. అట్టి ఇంద్రుని అతిక్రమించువారులేరు. అతడే సేనల ఉత్కృష్ట స్వామి. అతడు శత్రు శోషకులగు మరుత్తులతో కూడును. తీవ్రవేగమున శత్రువుల ప్రాణములను నష్టపరచును.
3. బలముగల అశ్వము శత్రువును చిందరవందర చేయును. అట్లే బలవంతుడగు ఇంద్రుడు యుద్ధమున శత్రువును పెరికివేయును. ద్యావాపృథ్వులందు వ్యాపించిన ఇంద్రుడు ధనవంతుడు అగును. యజ్ఞమున ఇంద్రుడు 'పూషు' ని వలె యజనీయుడు. అతడు స్తుతి కర్తలకు పిత. ఆహుతుడయిన కమనీయ ఇంద్రుడు అన్నదాత అగును.
4. ఇంద్రుడు ద్యులోక, అంతరిక్షములను దాల్చినవాడు. అతడు ఊర్ధ్వగామి. రథమువలె సాగును. గమనశీల మరుత్తులు అతని సహాయకులు. ఇంద్రుడు రాత్రిని ఆచ్చాదితము చేయును. సూర్యుని ఉత్పన్నము చేయును. అతడు అనుభవించదగిన కర్మఫలరూప అన్నమును ధనికుడు తనమాటతో ధనమును విభజించినట్లు విభజించును.
5. ఇంద్రా ! నీవు అన్నమును ఆర్జింపుము. యుద్ధమందు ఉత్సాహమున ప్రవృద్దుడవగుదువు. ధనవంతుడవు. ప్రభూత ఐశ్వర్యశాలివి. నరశ్రేష్ఠుడవు. ధనవిజేతవు. మేము ఆశ్రయ ప్రాప్తి కొఱకు నిన్ను ఆహ్వానించుచున్నాము.
ఏబదవ సూక్తము
ఋషి-విశ్వామిత్రుడు, దేవత-ఇంద్రుడు, ఛందస్సు-త్రిష్టుప్.
1. ఇంద్రుడు యజ్ఞమునకు రావలెను. స్వాహాకృత సోమపానము చేయవలెను. ఇంద్రుడు విఘ్నకారకుల హింసకుడు. యాజకులకు అభీష్ట ఫలప్రదాత. మరుద్వంతుడు. ఇది ఆ ఇంద్రుని సోమము. ఇంద్రుడు అత్యంత వ్యాపకుడు. అతడు మేము అందించిన అన్నమునకు సంతృప్తుడు కావలెను. ఈ హవ్యము ఇంద్రుని అభిలాషను పూరించవలెను.
2. ఇంద్రా ! నీవు యజ్ఞమునకు వచ్చుటకు రథమును పరిచారక అశ్వయుక్తము చేసినాము. నీవు పురాతనుడవు. అశ్వవేగమును గుర్తించగలవు. గుర్రములు నిన్ను యజ్ఞమునకు తేవలెను. వచ్చి కమనీయము, చక్కగా అభిషుతమగు సోమమును త్వరత్వరగా పానము చేయుము.
3. ఇంద్రుడు స్తోతల కోరికలు తీర్చువాడు. స్తుతులద్వారా ప్రసన్న యోగ్యుడు. ఆ ఇంద్రుని స్తుతించు ఋత్విక్కులు తమ శ్రేష్ఠత్వము, చిరంజీవిత్వ ప్రాప్తికొఱకు ఇంద్రునకు గవ్యమిశ్రిత సోమమును సమర్పింతురు. సోమవంతుడవగు ఇంద్రా ! సంతోషముగ సోమపానము చేయుము. స్తోతలకు అగ్నిహోతాద్రి కార్య సిద్ధికొఱకు బహువిధ ధేనువులను ప్రసాదించుము.
4. ఇంద్రా ! నీవు అన్నప్రాప్తి కారకుడవగుము. యుద్ధపు ఉత్సాహమున ప్రవృద్దుడవగుదువు. ధనవంతుడవు. ప్రభూత ఐశ్వర్యశాలివి. నేతృశ్రేష్ఠుడవు. స్తుతి శ్రవణకర్తవు. ఉగ్రుడవు. యుద్ధమున శత్రునివారకుడవు. ధనవిజేతవు. మేము ఆశ్రయ ప్రాప్తికిగాను నిన్ను ఆహ్వానించుచున్నాము.
ఏబది ఒకటవ సూక్తము
ఋషి - విశ్వామిత్రుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - 4 -9 త్రిష్టుప్,
1-3 జగతి, 10-12 గాయత్రి.
1. ఇంద్రుడు అభిమత ప్రదాత. మానవ పోషకుడు. ధనికుడు. సూక్తముల ద్వారా ప్రశంసనీయుడు. బల,ధనాది సంపదలతో ప్రతిక్షణము వర్ధమానుడు. స్తోతలచే బహుశః ఆహోతుడు. మరణ ధర్మ రహితుడు. శోభన స్తుతివచనములచే నిత్యము స్తూయమానుడు. ఆ ఇంద్రుని అధిక స్తుతివచనములతో బహువిధముల స్తుతించవలెను.
2. ఇంద్రుడు నూరు యజ్ఞములు చేసినవాడు. జలవంతుడు. మరుద్యుక్తుడు. సర్వజగములకు నేత. అన్నదాత. శత్రుపుర భేదకుడు. యుద్ధములకు శీఘ్రముగ వెళ్లువాడు. మేఘ భేదనమున జలప్రేరకుడు. ధనప్రదాత. శత్రువుల పరిభవకర్త. స్వర్గప్రదాత. అతనివద్దకు మా స్తుతివాణి చేరవలెను.
3. ఇంద్రుడు శత్రుబల సంహారకుడు. యుద్ధమున ఎల్లరచే స్తుతించబడువాడు. అతడు పాపరహిత స్తుతులను సమ్మానించును. అగ్ని హోత్రాదులు చేయు యజమాని గృహమున సోమపానము చేయును. ప్రసన్నుడగును.
విశ్వామిత్రా ! మరుత్తులతో కూడ శత్రువుల పరాభవకర్త, శత్రు సంహారకుడగు ఇంద్రుని స్తుతించుము.
4. ఇంద్రా ! నీవు మానవ నేతవు. వీరుడవు. రాక్షసులు పీడించిన ఋత్విక్కులు నిన్ను స్తుతులు ఉక్థల ద్వారా అర్చింతురు. నీవు వృత్రహననాది కార్యములు నిర్వహించినావు. బలమున ఉద్యమించినావు. పురాతనుడగు ఇంద్రుడు ఒక్కడే సకల అన్నములకు ఈశ్వరుడు. కావున ఇంద్రునకు నమస్కారము.
5. నరుల విషయమున ఇంద్రుని శాసనము బహువిధము. ఇంద్రుడు శాసకుడు. అతనికి భూమి అనేక ధనములను ఇచ్చును. ఇంద్రుని ఆజ్ఞవలన ద్యులోకము, ఓషధులు, జలములు, నరులు వృక్షములు అతని అనుభవ యోగ్యమగు ధనమును రక్షించెదరు.
6. అశ్వవంతుడవగు ఇంద్రా ! ఋత్విక్కులు నీకు స్తోత్రములను, శస్త్రములను అర్పింతురు. వానిని గ్రహించుము. ఇంద్రా ! నీవు నివాస ప్రదాతవు. మిత్రరూపుడవు. వ్యాసకుడవు. ఈ అభినవ హవిస్సు నీకు సమర్పించుచున్నాము. స్వీకరింపుము. స్తోతలకు అన్నము ప్రసాదించుము.
7. మరుద్వంతా ఇంద్రా ! నీవు పూర్వము 'శర్యాతి' యజ్ఞమున సోమపానము చేసినావు. అట్లే ఈ యజ్ఞమున అభిషుత సోమపానము చేయుము. నీ నివాస స్థానము బాధారహితము. స్థిరము యజ్ఞము చేయు మేధావి జనులు నీకు హవిస్సు ద్వారా పరిచర్య చేయుదురు.
(వైవస్వత మనువు పుత్రుడు శర్యాతి.)
8. ఇంద్రా ! నీవు సోమాభిలాషివి. మిత్రులగు మరుత్తులతో విచ్చేయుము. ఈ యజ్ఞమున అభిషుత సోమపానము చేయుము. పురుహూత ఇంద్రా ! నీవు జన్మించినంతనే దేవతలందరు నిన్ను మహాసంగ్రామమునకు భూషించినారు.
9. మరుత్తులారా ! జలప్రేరణవలన ఇంద్రుడు మీకు మిత్రుడు. మీరు అతనిని ప్రసన్నుని చేసినారు. వృత్ర సంహారక ఇంద్రుడు మీవెంట హవిస్సు సమర్పించు యజమాని గృహమున అభిషుత సోమము సేవించవలెను.
10. ధనస్వామీ ! స్తూయమాన ఇంద్రా ! ఉద్దేశానుక్రమమున, ఓజస్సున ఈ అభిషుత సోమమును, త్వరగా, పానము చేయుము.
11. ఇంద్రా ! నీ కొఱకు అన్నమిశ్రిత సోమము అభిషుతమైనది. నీవు అందు నిమగ్నుడవు అగుము. నీవు సోమపాన యోగ్యుడవు. ఈ సోమము నిన్ను ప్రసన్నుని చేయవలెను.
12. ఇంద్రా ! ఈ సోమము నీ ఉదరపు రెండు కక్షలందు వ్యాపించవలెను. స్తోత్ర సహితమై అది నీ శరీరమున వ్యాపించవలెను. ధనము కొఱకు అది నీ భుజములందు వ్యాపించవలెను.
ఏబది రెండవ సూక్తము
ఋషి - విశ్వామిత్రుడు, దేవత - ఇంద్రుడు ఛందస్సు -1-3 జగతి, 4-9 త్రిష్టుప్,
10-12 గాయత్రి.
1. ఇంద్రా ! వేపిన యువలయుక్తము, దధిమిశ్రితము, సత్తుయుక్తము, సవనీయ పురోడాశ యుక్తము, శస్త్రవంతము అగు మా సోమమును ప్రాతస్సవనమున సేవింపుము.
2. ఇంద్రా ! నీవు పక్వపురోడాశమును సేవింపుము. పురోడాశము ఆరగించుటకు సిద్ధమగుము. హవనయోగ్యమగు పురోడాశాది హవి నీ కొఱకు సాగును.
3. ఇంద్రా ! మా ఈ పురోడాశమును ఆరగింపుము. మాశ్రుతి లక్షణవాణిని, స్త్రీని సేవించు కాముకుడు ప్రియురాలిని సేవించినట్లు సేవింపుము.
4. ఇంద్రా ! నీవు పురాతన కాలమునుండి ప్రసిద్ధుడవు. మా పురోడాశమును ప్రాతసవనమున సేవింపుము. అందువలన నీ కార్యములు మహిమాన్వితములు అగును.
5. ఇంద్రా ! మధ్యాహ్న సవన సంబంధి, వేపిన యవన పురోడాశమును నీవును ఇచటికివచ్చి భక్షింపుము. సంస్కృతుడవు అగుము. నీకు పరిచర్యలు చేయువారు, స్తుతించుటకు వేగిరపడువారు, ఆబోతువలె అటునిటు తిరుగు వారయిన స్తోతలు స్తుతిలక్షణ వచనములతో నిన్ను స్తుతించునపుడు నీవు పురోడాశాదులను భక్షింతువు.
6. బహుజన స్తుతుడవగు ఇంద్రా ! తృతీయ సవనమున వేపిన యవల పురోడాశమును ఆరగింపుము. కవీ ! ఇంద్రా ! నీవు ఋభువంతుడవు. ధనయుక్త పుత్రవంతుడవు. మేము హవియుక్తులమయి స్తుతుల ద్వారా నీ పరిచర్యలు చేసెదము.
("ఋభవో యేకేచన దేవాః" అని శాయణుడు. ఋభువులు దేవతలు అగుటను గురించి ఇంతకుముందు గమనించినాము)
7. ఇంద్రా ! నీవు శూరుడవు. వృత్రహంతవు. విద్వాంసుడవు. పూషవంటి దేవతవు. నీ కొఱకు మేము పెరుగు కలిపిన 'సత్తు' సిద్ధము చేసెదము. నీవు హర్యశ్వవంతుడవు. నీ కొఱకు వేసిన యవలు సిద్ధము చేసెదము. మరుత్తుల సహితుడవయి పురోడాశ భక్షణ చేయుము. సోమపానము చేయుము.
8. అధ్వర్యులారా ! ఇంద్రుని కొఱకు యవల పేలాలు తెండు. అతడు నాయక శ్రేష్ఠుడు. ఇంద్రునకు పురోడాశము సమర్పించుడు. శత్రుపరాభవ కర్తా ! ఇంద్రా ! నిత్యము మేము చేయు నీ స్తుతులు నిన్ను సోమపానమునకు ఉత్సాహితుని చేయవలెను.
ఏబది మూడవ సూక్తము
ఋషి - విశ్వామిత్రుడు, దేవతలు - వేరు వేరు, ఛందస్సు-1-9,11,14-15,17,19,21, 23-24 త్రిష్టుప్, 10,16 జగతి, 12,20,22 అనుష్టుప్, 13 గాయత్రి, 18 బృహతి.
1. ఇంద్ర, పర్వతములారా ! మీరు మహారథముమీద మనోహరుడు, సుందరుడగు పుత్రయుక్త అన్నము తీసికొనిరండు. ద్యుతిమంతులగు మీరు ఉభయులు మా యజ్ఞమున హవ్యమును ఆరగించుడు. హవ్యమున తృప్తిచెంది మా స్తుతి వచనములతో వర్థిల్లుడు.
2. ఇంద్రా ! ఈ యజ్ఞమున నీవు కొంతసేపు నిలువుము. వదిలిపోకుము. రమ్యమగు అభిషుత సోమమున ఇప్పుడే నిన్ను అర్చింతుము. తీయని మాటలతో బిడ్డ తండ్రి పంచె అంచు పట్టుకున్నట్లు మేము మధురవచన స్తోత్రములతో నీ పంచె చెరగు పట్టుకుందుము.
"హోత అధ్వర్యునితో అనుచున్నాడు" :-
3. అధ్వర్యా ! మనము ఇద్దరము స్తుతింతుము. నీవు నాకు ప్రత్యుత్తరము ఇమ్ము. ఉభయులము ప్రీతియుక్తముగ ఇంద్రుని స్తుతింతుము. నీవు యజమానిని కుశలమీద ఆసీనుని చేయుము. ఇంద్రుని గురించి మనము చేయు ప్రశస్తి ప్రసిద్ధము కావలెను.
4. ఇంద్రా ! గృహిణియే గృహము అగును. స్త్రీయే పురుషుని మిశ్రణ స్థానము అగును. రథయుక్తములగు అశ్వములు నిన్ను ఆ గృహమునకు చేర్చవలెను. మేము నీ కొఱకు సోమము అభిషితము చేసినపుడు మాచే ప్రేరితుడయిన దూతస్వరూప అగ్ని నీవద్దకు వచ్చును.
(నీవు గృహిణితోనే ఉండుము. సోమము అగ్నిద్వారా నీకు అందును అని భావము)
5. ఇంద్రా ! నీవు స్వకీయ గృహాభిముఖుడవు అగుము. లేదా మా యజ్ఞమునకు విచ్చేయుము. ఉభయ స్థానములను మీకు ప్రయోజన కరములు. అక్కడ స్త్రీ ఉన్నది. ఇక్కడ సోమము ఉన్నది. ఇంటికి చేరుటకు నీవు మహారథమును అధిష్ఠించుము. లేదా సకిలించు గుఱ్ఱములను విడువుము.
6. ఇంద్రా ! ఇక్కడనే నిపువుము. సోమపానము చేయుము. సోమపానము చేసి ఇంటికి వెళ్లుము. నీ రమణీయ గృహమున మంగళకారిణి అగు భార్య, సుందర ధ్వని ఉన్నవి. ఇంటికి వెళ్లుటకు మహారథము మీద ఆసీనుడవు అగుము లేదా గుఱ్ఱములను విడువుము. ఈ యజ్ఞముననే నిలువుము.





