Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    అప్పటికి నీ రాజసూయము ముగిసినది. నీ అనుమతి పొంది నేను ద్వారకకు వెళ్లినాను. అప్పుడు ద్వారక వెలుపలగల ఉద్యానములు పాడయినవి. చెట్లు విరిగిపడి ఉన్నవి. వేదాధ్యయనము వినిపించలేదు. అగ్నిహోత్రశాలలు నిశ్శబ్దముగా ఉన్నవి. స్త్రీలు భయపడి నగలు ధరించుటలేదు. నేను వీటిని చూచినాను. జరిగిన విషయము తెలుసుకున్నాను ద్వారకలో ప్రవేశించలేదు. ద్వారకను రక్షించు బాధ్యత బలరామాదులకు అప్పగించినాను. సాల్వుని వధించి ద్వారకలో అడుగు పెట్టెదనని దండయాత్రకు వెడలినాను.
    ప్రయాణ భేరి మ్రోగినది. పాంచజన్య శంఖము పూరించినాను. ఆ ధ్వనికి దిక్కులు పిక్కటిల్లినవి. నేను రథమును ఎక్కిసాగినాను. గరుడ ధ్వజము సగర్వముగా ఎగిరినది. చతురంగ బలములతో మూర్తికావత దేశమున ప్రవేశించినాను. నా రాక తెలుసుకున్నట్లున్నాడు సాల్వుడు సౌంభక నగరమును ఎక్కి సముద్ర కుక్షి ప్రదేశమునకు వెళ్లినాడు.
    "నేను చతురంగ బలములతో సాల్వుని వెంటపడినాను. సాల్వుని సైన్యము మీద విరుచుకు పడినాను. నేను శరవర్షము కురిపించినాను. అప్పుడు రాక్షససేన తునాతునకలయినది. రాక్షససేనలోని వారు చచ్చి సముద్రమున కూలగా సముద్రమున ప్రళయధ్వని కలిగినది. నా చతురంగ సేనలు చేయు ధ్వనులు సముద్రఘోషను మించినవి. సాల్వుని సేన చచ్చుట, జవ చచ్చుటను ఎరిగినాడు సాల్వుడు. సౌంభక నగరము నెక్కి సముద్ర గర్భము నుండి బయటపడినాడు.
    "సాల్వుడు ఉగ్రుడయి దండెత్తినాడు. మాయను ప్రయోగించినాడు. పాశములు, ఖడ్గములు, శూలాయుధములు కురిపించినాడు. నేను నా దివ్యబాణముల చేత మాయను ఖండించినాను. అప్పుడు సాల్వుడు శరవర్షము కురిపించినాడు. అంధకారము పరచినాడు. చలిని వ్యాపింపచేసినాడు. అంతలోనే ప్రకాశము కలిగించినాడు. నూరుగురు సూర్యులను ఆకాశమున వెలిగింప చేసినాడు. అప్పుడు నాకు పగలేదియో రాత్రి ఏదియో తెలియలేదు. నేను ఆగ్నేయాస్త్రము ప్రయోగించినాను. రాక్షసమాయను పటాపంచలు చేసినాను.
    "ఇంతలో మరొక విచిత్రము జరిగినది. సాల్వుని సౌంభకము ఆకాశమున కనిపించినది. దానిమీద దీనుడయిన నా తండ్రి వసుదేవుడు బంధితుడయి కనిపించినాడు. నా తండ్రిని సాల్వుడు నానా బాధలు పెట్టుచున్నాడు. అది చూచి నాకు దుఃఖము కలిగినది. చేతినుండి ధనుస్సు జారిపడినది, నాకు మూర్ఛవచ్చినది, రథము మీద పడిపోయినాను.
    "తెలివి వచ్చి చూడగా నా తండ్రి కనిపించలేదు. అది సాల్వుని మాయ అని గ్రహించినాను. మరింత కోపమున విజృంభించినాను. బాణవర్షము కురిపించినాను. అది చూచి సాల్వుడు సౌంభక నగరముతో మాయమయినాడు. నా బాణములకు రాక్షస సేన సాంతము నశించినది. సాల్వుడు అది చూచినాడు సౌంభకమును ప్రాగ్జ్యోతిష నగరము చేసినాడు. తాను దానవాకారము దాల్చినాడు. నా మీద పర్వత వర్షము కురిపించినాడు. నేను నా బాణములతో పర్వతములను బద్దలు కొట్టినాను.
    అప్పుడు నా సారథి దారుకుడు మాయావియగు సాల్వుని వధించుమని పురికొల్పినాడు. అప్పుడు నా చక్రాయుధము ప్రయోగించినాను. అది సూర్యుని తేజస్సుతో సాగినది. దావాగ్ని ఉరికినట్లు ఉరికినది. సౌంభక నగరమును కాల్చినది. కూల్చినది. నగరము తునాతునకలయి కూలినది. సాల్వ రాక్షసుడు నా చక్రాయుధము తాకి రెండు ముక్కలయి కూలినాడు".
    శ్రీకృష్ణుడు సాల్వుని వృత్తాంతము వివరించినాడు. పాండవుల వద్ద అనుమతి పొందినాడు. సుభద్రను, అభిమన్యుని వెంట పెట్టుకున్నాడు. బంగారు రథము మీద ద్వారకకు పయనమయి వెళ్లినాడు. ధృష్టద్యుమ్నుడు ద్రౌపదీ పుత్రులను వెంట పెట్టుకున్నాడు. కాంపిల్య నగరమునకు వెళ్లినాడు. పాండవులు కామ్యక వనమును వదిలినారు. ఇంద్రసేనాది మూలభృత్యుల యుక్తముగా ద్వైతవనమునకు వెళ్లినారు.

                                                        ఆలోచనామృతము

    1. దుర్యోధనుడు పాండవుల మీద దండెత్తుటను ఎరిగిన మహాత్ములు హస్తినలో చేసిన ప్రయత్నములు తెలుసుకున్నాము. రాజులు అదివిని పాండవరక్షణకుగాను ససైన్యముగా ఉరికినారు. అట్లు వచ్చిన వారు పాండవుల బంధువులు మాత్రమే. ఇతరులు బాధపడినారు. కాని ఆడుకొనుటకు రాలేదు. రాజుల తత్త్వమే అంత. పాండవులు బలవంతులు అయినపుడు రాజసూయమునకు అందరు వచ్చినారు. సంపదపోయిన రాజసూయమునకు అందరు వచ్చినారు. సంపదపోయిన పాండవుల దగ్గరికి దగ్గరి బంధువులు మాత్రమే వచ్చినారు. శ్రీకృష్ణుడు సుభద్రకు అన్న ధృష్టద్యుమ్నుడు ద్రౌపదికి సోదరుడు.
    ఆడపిల్లల ఇక్కట్లలో పుట్టింటివారు ఆదుకుందురనుటకు ఇది నిదర్శనము. ఇది నాడున్నది-నేడున్నది.
    2. ఆప్తులను చూచినపుడు అందరి దుఃఖము పొంగి పొరలును. శ్రీకృష్ణుని చూచిన ద్రౌపది ఉరికినది. తన గోడంత వెళ్లబోసుకున్నది. ఆవేశమున కన్నీరు కార్చినది. మరింత చెప్పలేకపోయినది. గుండె తేలిక కాగా కూలబడ్డది.
    3. రాజసూయ సందర్భమున శ్రీకృష్ణార్జునులకు స్పర్ధలు కలిగినట్లున్నదని చెప్పినాము. అది ఇక్కడ ధృవపడినది. మనస్పర్ధలు దూరమయినవి కొంతవరకు. జూదము సమయమునకు తాను రాలేకపోయినందులకు సాల్వుని వృత్తాంతము కారణమని శ్రీకృష్ణుడు చెప్పినాడు. అది అంతగా పొసగుటలేదు.  
    i) శ్రీకృష్ణుడు రాజకీయ ధురంధరుడు. రాజసూయమున శిశుపాల వధ జరుగునని అతడు ముందే ఎరుగును. అసలు రాజసూయము శిశుపాల వధ కొరకేననిన అతిశయోక్తికాదు. శిశుపాలవధ జరిగిన సాల్వుడు దండెత్తునని తెలుసుకొనుట సామాన్యులకు కూడ సాధ్యమగును. శ్రీకృష్ణుడు ద్వారకలో అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లున్నాడు.
    ii) ద్వారకపై సాల్వుని దండయాత్ర ఒక ప్రధాన విషయము. అది ఇంద్రప్రస్థమున ఉన్న శ్రీకృష్ణునకు తెలియకుండుట అసంభవము. ఆవిషయము అప్పుడు అక్కడి రాజులకు తెలియరాదని శ్రీకృష్ణుడు వెల్లడించి ఉండడు. అభిప్రాయ భేదములు లేకున్న పాండవులకు తప్పక తెలిపియుండును. అర్జునుని సాయముగా గొనిపోయి ఉండును.
    iii) ఇంద్రప్రస్థమున తెలియలేదు అనుకుందము. ద్వారకలో తెలిసిన తరువాత భీమార్జునులను రప్పించి వారి సాయముతో దండెత్తవలసి ఉండెను. ఆ విధముగా చేయలేదనిన అభిప్రాయ భేదములే అందుకు కారణములని విదితము.
    iv) జరాసంధ వధకు భీమార్జునులను శ్రీకృష్ణుడు తీసుకొని వెళ్లినాడు. తమ పరాక్రమమున శ్రీకృష్ణునకు ఖ్యాతి లభించినదని భీమార్జునులు అనుకున్నట్లున్నారు. వారి సాయము లేకున్నను సాల్వుని ఎదిరించి వధించ గలిగినానని శ్రీకృష్ణుడు నిరూపించదలచినాడు.
    v) పాండవుల సాయము లేకున్నను తాను సాల్వుని పరిమార్చగలిగినాడు. తన సాయములేక పాండవులు అడవుల పాలయినారు అని నిరూపించినాడు శ్రీకృష్ణుడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.