Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
రుస్వా : తఖల్లుస్ విషయం తేకండి. ఒక ఉదారుని ఉదారతతో నగరంలో చాలామంది రుస్వాలున్నారు. జనులు అనవసరంగా మంచిమంచి తఖల్లుసులు వదిలి నిష్కారణంగా రుస్వా అయిపోతున్నారు. కాకుంటే ఏమిటీ చిత్రం. పేర్లు కూడా మార్చుకోవాలా? మంచిదే. ఇంగ్లీషు వారి ఆచారం ప్రకారం తండ్రీ కొడుకుల పేర్లు ఒకేరకంగా ఉంటాయి. వీరంతా నాకు ఆత్మ సంతతి. సంతతి ఎంత పెరుగుతే నా పేరు అంత వెలుగుతుంది.
ఆ చర్చ ఇప్పుడెందుకు గాని నేను అడిగిన విషయం చెప్పక తప్పదు.
ఉమ్రావ్ : ఏమిటీ బలవంతం! సిగ్గువిడిచిన మాటాలు అడుగుతారు.
రుస్వా : పెండ్లిళ్ళలో పాడే బూతు పాటల కంటే సిగ్గు విడిచిన విషయమా?
ఉమ్రావ్ : మీ లక్నోలో వేశ్యలు బూతులు పాడరు. పాట కత్తెలు పాడ్తారు . అదీ స్త్రీల గోష్టిలో , పల్లె బోగం వాళ్ళు పురుషుల ముందు కూడా పాడాల్సి వస్తుంది. మిర్జాగారూ! పల్లె కానీ, పట్నం కానీ ఆ ఆచారం మాత్రం మంచిది కాదు.
రుస్వా : మీరు కాదంటే ఆగుతుందా? మేము ఈ కళ్ళతో చూదాం. ఈ చెవులతో విన్నాం. మహామహా మగవాళ్ళు సైతం ఆడవాళ్ళతో దూరి ఆనందంగా తిట్లు తింటారు. తల్లులనూ, అక్కాచెల్లెళ్ళను తిడ్తూన్నా ఆనందిస్తారు. ముఖాలు చేటలు అవుతాయి. అల్లా ఈ రోజులు చూపించాడు. చూపించకుండా ఉంటే బాగుండేది. పెళ్ళిళ్ళలో రాత్రింబవళ్ళు ఈ పిచ్చి వేషాలు జరుగుతాయి. పతివ్రతలైన పడుచుల ముందే ఇల్లాంటివి జరుగుతుంటాయి. పోనీండి ఆ చర్చ . మీ కధ చెప్పండి. మేమేమీ సంస్కర్తలం కాము విమర్శించడానికి.
ఉమ్రావ్ : పంతం విడువరు. సరే వినండి.
బిస్మిల్లా మిస్సీ ఉత్సవమూ , ఖుర్షిద్ జాన్, అమీర్ జాన్ గదులు చూచాము. నా హృదయంలో కొత్తకొత్త కోర్కెలు చిగిరించాయి. ఒక ప్రత్యేక ఉత్సవం తరవాత బిస్మిల్లా, భిస్మల్లా జాన్ అయింది. ఖుర్షిద్, ఖుర్షిద్ జాన్ అయింది. తిరిపేపు పట్టా దొరికింది. స్వాతంత్ర్యం లభించింది. నాతొ విడిపోయారు. నన్ను వారు కొంచెపు చూపు చూడసాగారు. పురుషులతో నవ్వులాటలూ , హాస్యమూ సాగించారు. వేరువేరు గదులు అలంకరించబడినాయి. గచ్చు మీద రత్నకంబళాలు, నవారు మంచం నగిషీ వక్కాకుల పెట్టె, అలంకార పేటిక, బట్టల పెట్టె, గోడలకు ఉగల్ దాష్ , నిలువుటద్దాలు, మంచి మంచి పటాలు, కప్పుకు గాజు బుగ్గలు , వాటిలో సాయంకాలం కాగానే వెలిగించే దీపాలు, ఇద్దరిద్దరు దాసీలు, ఇద్దరిద్దరు పనివాళ్ళు చేతులు కట్టుకుని నుంచోటం తమాషాగా ఉండేది. నవాబుల పుత్రులు, అందమైన యువకులు విలాసాలకు చేరేవారు. వెండి హుక్కా ఎప్పుడూ పక్కనుండేది. ఎదురుగా మూత తెరచిన వక్కాకుల పెట్టె, ఆకులకు సున్నం రాచి అందిస్తుండేవారు. సందడి . లేచి నుంచుంటే జనం "బిస్మిల్లా" అనేవారు. కదిలితే నేలమీద చూపులు పరచేవారు. ఆ దొరసాని లక్ష్యమే చేసేది కాదు. ఆమె మహారాణి. పెదవి కదిపితే కావాలన్నది ప్రత్యక్షం. అడుగకుండానే గుండెలు అరచేతిలో పెట్టి అందించేవాళ్ళు. కొందరు ప్రాణాలు అర్పించడానికి సైతం సంసిద్ధులు. అయినా లెక్కలే దావిడకు. ఏ బహుమానానికి విలువలేదు. రాణిగారికి ప్రాణాలు అమూల్యలుకావు. నిర్మూల్యాలు , రాజ్యాన్ని కాలదన్నేంత దర్పం. తొలగని గర్వం. అయినా తొలగించేవారు తొలగిస్తారు. ప్రాణాలు తీసే హొయలు. అయినా పోయేవారి ప్రాణాలే పోతాయి. క్షణంలో నవ్వించడం, క్షణంలో ఏడిపించటం ఒకని ఎద పిడికిట్లో నలుగుతుంది. ఇంకొకరి గుండె కాలి కింద అణుగుతుంది. మాటకు కోపం. మూతి ముడిచింది. ఒడారుస్తున్నారు జనం. ఒకడు చేతులు జోడిస్తున్నాడు. ఒకడు బ్రతిమాలుతున్నాడు. మాట ఇచ్చి మరచింది. ఒట్టు పెట్టుకొని విడిచింది. గోష్ఠిలో అందరి చూపులూ ఆమె మీదే. ఆమె కన్నెత్తి చూడదు. ఆమె చూపు తిరిగితే జనం చూపులు తిరుగుతాయి. వేలమంది చూపులు ఆమె మీదనే. జనం ఈర్ష్యతో కాలి చస్తారు. ఈమె ప్రాణాన్ని ప్రాణంతో కాలుస్తుంది. హృదయం మాత్రం రక్తం. ఏముంది? అంతా ఉత్తుత్తి. వట్టి నటన. అమాయకుడు ఎవడైనా పడ్డాడో ఇంకేముంది బోల్తా.
నేనంటే ఆమెకు చాల ఇష్టం
శత్రువులకు మాత్రం శిశిరం.
చత్తురు గాక ఆవిడ శత్రువులు. చివరకు చంపేసింది. అప్పటికి గాని గుండె చల్లబడలేదు. పాపం, ఇంట్లో ఏడ్పులు . ఈమె ప్రియులతో పకపకలు.
మిర్జాగారూ! ఆ విషయం నాకంటే మీకే బాగా తెలుసు. చెప్పగలరు కూడా. కాని అదంతా చూచి నా హృదయం ఏమైందో నాకే తెలుసు. ఆడదానికి ఆడదంటే అంతులేని ఈర్ష్య. చెప్పడానికి సిగ్గుగా ఉంది. వలచే వాళ్ళంతా నన్నే వలచాననుకునేదాన్ని, నన్ను చూచి ప్రాణాలర్పించాలనుకునేదాన్ని. కాని ఒక్కడూ కన్నెత్తి చూడడు. బువాహుసేనీ ఇంటి గోడలూ, కప్పూ పొగచూరి నల్లగా ఉండేవి. కుక్కి మంచం. అందులో నేనూ, బువాహుసేనీ పడుకునేవాళ్ళం. గదిలో ఒకపక్క పొయ్యి, దాని పక్కనే రెండు కుండలు, కళాయి గిన్నెలు రొట్టెల పెంకు , పళ్ళాలు , గిన్నెలు చిందరవందరగా పడి వుండేవి. ఒక మూలకు పిండి కుండ, దాని మీద రెండు మూడు కుండల్లో పప్పులు, ఉప్పు, మసాలాలు, పక్కనే వంట చెరకు రోలు, రోకలి. వంట చేసేటప్పుడు ప్రమిద దీపం పెట్టుకునేందుకు పొయ్యికి పైన గోడకి రెండు మేకులు. ప్రమిదలో సన్నని వత్తి గుడ్డిగా వెలుగుతుండేది. ఆ అందానికి రెండు ఉట్లు. ఒకదాన్లో ఉల్లిగడ్డలు, రెండవదానిలో చపాతీలు, పప్పు, కూరలు మాల్వీ గారి కోసం ఈ ఉట్లలో ఉల్లిపాయలది పోయ్యి మీద, రెండవది నా నెత్తి మీద ఉండేవి. మంచం నుంచి పరధ్యానంగా లేచానో కూర గిన్నె నెత్తికి కొట్టుకునేది.
ఉదయం తొమ్మిది గంటల దాకా మౌల్వీ గారి గద్దింపులు, సాయంకాలం నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా మళ్ళీ తిట్లూ, తన్నులూ , ఇదీ మా వలపు. అయినా నా చేష్టలు మానలేదు.
తొలుత అద్దంలో చూచుకోవాలనే కుతూహలం కలిగింది. బువాహుసేనీ కనుమరుగైతే చాలు, బుట్ట లోంచి అద్దం తీసి చూచుకునేదాన్ని. నా ముక్కూ, ముఖం ఇతర వేశ్యలతో పోల్చుకునేదాన్ని. నా ముఖంలో వికారం ఏమీ కనిపించేది కాదు. అందరినీ మించిన అందకత్తె ననుకునేదాన్ని. వాస్తవం మాత్రం అది కాదు.
రుస్వా: అయితే మీది కురూపం అనా ? ఇప్పటికీ వందలమంది కంటే అందంగా ఉన్నారు. వయసులో ఇంకెంత ఇదిగా ఉన్నారో!
ఉమ్రాన్ : సరే, ఇది పొగడ్తలకు సమయం కాదు. క్షమించండి. అప్పుడు మాత్రం నేను అలా భావించేదాన్ని. అదే నా ప్రాణం మీదికి తెచ్చింది. "నాలో ఏం లోపం ఉందని ఒక్కరూ నావైపు కన్నెత్తి చూడరు ?" అనుకునేదాన్ని.
రుస్వా : మీ విషయంలో ఎవరి దృష్టీ పడకపోవడం అనేదే లేదు! కాకపోతే "మిస్సీ" కాలేదూ; ఖానమ్ అంటే జనం భయపడేవారు. అందువల్ల వ్యక్తపరచలేదనుకుంటా.
ఉమ్రావ్ : కావచ్చు. కాని అంత విచక్షణ నాకెక్కడిది? తోటివాళ్ళను చూచి ఉడికిపోయేదాన్ని. తిండి రుచించదు. నిద్ర రాదు. తల దువ్వుకునేప్పుడు ఒక వ్యధ. బిస్మిల్లాకు నవాబ్ చబ్బన్ స్వయంగా తల ముడిచేవాడు. అది చూచినపుడు గుండె మీద పాములు పాకినట్లుండేది. నాకు తల ముడిచేదేవరు? బువాహుసేనీ. ఆవిడకు తీరిక లేకుంటే చింపిరి తలతోనే తిరిగేదాన్ని. తుదకు నేనే నేర్చుకున్నాను. వేశ్యలు రోజూ మూడుసార్లు బట్టలు మార్చేవారు. ఇక్కడ ఎనిమిది రోజులకు మార్చడానికి కూడా గతిలేదు. వారికి ఖరీదైన బట్టలు . ఇక్కడ అవే మామూలు దుస్తులు.
బట్టలు మార్చుకుంటే మగవాళ్ళల్లో కూర్చోవాలనిపించేది. ఒక్కొక్కసారి బిస్మిల్లా గదికీ, ఒక్కోసారీ అమీర్ జాన్ గదికీ వెళ్ళేదాన్ని. కాని కూర్చోనిచ్చేవాళ్ళు కారు. వారికి తమ విలాసాల మీద దృష్టీ నన్ను పంపించేసేవారు.
కూర్చోనివ్వకపోవడానికి మరొక కారణం ఉంది. ఆ రోజుల్లో నాలో కొంటెతనం ఉరవళ్ళు పరవళ్ళు తొక్కేది. ఎక్కడ కూర్చున్నా చిటికెలు వేయడం, వెక్కిరించడం, మగవాళ్ళను రాచుకు తిరగడం.
ఆ స్థితిలో గోహర్ మిర్జా గొప్పగా కనిపించాడు. నాతొ చనువుగా మాట్లాడేవాడు. పరిహాసా లాడుకునేవాళ్ళం. నేనేంటే అతని కెంతో ఇష్టం. ఉదయం బడికి వచ్చేప్పుడు జేబులో రెండు నారింజకాయలు వేసుకొని వచ్చేవాడు. నాకిచ్చేవాడు. ఒక్కొక్కసారి మిఠాయిలు తెచ్చేవాడు. తినిపించేవాడు. ఎక్కడ్నుంచి తెచ్చాడో తెలియదు, ఒకరోజు రూపాయి తెచ్చిచ్చాడు. జీవితంలో వేల రూపాయిలూ లేక్కించాను. కాని ఆ ఒక్క రూపాయి నాకిచ్చిన ఆనందాన్ని మరువలేను. అంతకు ముందు నాకు పైసలు చాలా దొరికాయి. కాని రూపాయి దొరకడం అదే మొదటిసారి. దాన్ని చాలాకాలం వరకు భద్రంగా ఉంచాను. ఖర్చు చేసే అవసరమూ కలుగలేదు. ఖర్చు చేస్తే ఎక్కడ్నుంచి వచ్చిందని అడుగుతారని భయం, రహస్యం అర్ధం అయింది. వయసుతోనే ఆ విచక్షణ వస్తుంది. నేనా వయసుకు వచ్చేశాను.





