Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
9. ఇంద్రా ! స్వేదయుక్తములు, దీర్ఘకేశులు అగు అశ్వములు కుశస్థానమున, రథముమీద మావద్దకు నిన్ను తీసికొని రావలెను.
నలుబది రెండవ సూక్తము
ఋషి - విశ్వామిత్రుడు దేవత - ఇంద్రుడు, ఛందస్సు - గాయత్రి.
1. ఇంద్రా ! గుర్రములు కట్టిన నీ రథము మావైపు రాగోరును. మేము పాలు కలిపి అభిషవించిన సోమము చేసినాము. విచ్చేయుము.
2. ఇంద్రా ! ఈ సోమ సమీపమునకు విచ్చేయుము. ఇది రాళ్లతో నూరి సిద్ధము చేయబడినది. కుశలమీద ఉంచబడినది. నీవు దీనిని విస్తారముగ సేవింపుము. సంతృప్తుడవగుము.
3. ఇది మేము ఇంద్రుని కొఱకు ఉచ్ఛరించిన స్తుతివాణి. ఇంద్రుని సోమపానమునకు ఆహ్వానించుటకు ఆ వాణి ఇంద్రుని చేరును.
4. ఇంద్రుడు అనేక ఆహ్వానములు కలవాడు. మేము స్తుతులు, ఉక్థల ద్వారా ఇంద్రుని సోమపానమునకుగాను ఈ యజ్ఞమునకు ఆహ్వానించుచున్నాము. ఇంద్రుడు యజ్ఞమునకు విచ్చేయవలెను.
5. ఇంద్రా ! నీవు శతక్రతువవు. అన్నధనుడవు. నీ కొఱకు సోమము సిద్ధముగా ఉన్నది. దీనిని జఠరమున దాల్చుము.
6. కవీ ! ఇంద్రా ! యుద్ధములందు నీవు శత్రువుల పరాజితకర్తవు. ధనజేతవు. నిన్ను అట్లే ఎరుగుదుము. ధనమును యాచింతుము.
7. ఇంద్రా ! ఈ యజ్ఞమునకు విచ్చేయుము. గవ్య మిశ్రితము, యవ మిశ్రితము అభిషుత సోమపానము చేయుము.
8. ఇంద్రా ! ఈ అభిషుత సోమము నీ పానము కొఱకే అగును. దీనిని నీ జఠరమునకు ప్రేరేపింతుము. ఇది నీ హృదయమునకు ఆనందము కలిగించవలెను.
9. ఇంద్రా ! నీవు సనాతనుడవు. మేము కుశికవంశ సంజాతులము. నీ రక్షణ కోరుచున్నాము. అభిషుత సోమపానము కొఱకు స్తుతి వచనములతో నిన్ను ఆహ్వానించుచున్నాము.
నలుబది మూడవ సూక్తము
ఋషి - విశ్వామిత్రుడు దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఇంద్రా ! నీ రథముమీద మావద్దకు విచ్చేయుము. ఈ సోమము ప్రాచీనకాలముండి నీదియే. నీ ప్రియతమ, సఖాస్వరూప అశ్వములను కుశలవద్ద విడుపుము. ఋత్విక్కులు సోమపానమునకుగాను నిన్ను పిలుచుచున్నారు.
2. ఇంద్రస్వామీ ! నీవు సమస్త పురాతన ప్రజలను అతిక్రమించి విచ్చేయుము. అశ్వ సహితుడవయి వచ్చి, సోమపానము చేయుము. ఇదే మా ప్రార్థన. స్తోతల స్నేహాభిలాషి స్తవములు నిన్ను ఆహ్వానించుచున్నవి.
3. ద్యుతిమంతా ! ఇంద్రా ! మాది అన్నవర్ధక యజ్ఞము. నీవు అశ్వసహతుడవయి మా యజ్ఞమునకు విచ్చేయుము. ఘృత సహిత అన్నరూప హవిని తీసికొని స్తుతులద్వారా సోమపాన స్థానమునకు నిన్ను ఆహ్వానించుచున్నాము.
4. ఇంద్రా ! సేచన సమర్థములు, శోభనాంగములు గలవి, సఖాస్వరూపములగు నీ అశ్వద్వయము నిన్ను రథము మీద యజ్ఞభూమికి తీసికొని రావలెను. సఖాస్వరూపుడగు ఇంద్రుడు లాజలుగల యజ్ఞమును సేవించుచు స్తోతల స్తుతును ఆలకించవలెను.
5. ఇంద్రా ! నన్ను జనుల రక్షకుని చేయుము. నన్ను అందరి స్వామిని చేయుము. నన్ను ఋషిని చేయుము. అభిషుత సోమపానకర్తను చేయుము. నాకు అక్షయ ధనము ప్రసాదించుము.
6. ఇంద్రా ! గొప్పవి, రథమున కూడినవి హరినామక ఉన్మత్తాశ్వములు నిన్ను మాముందునకు తేవలెను. అభీష్టవర్షి ఇంద్రుని అశ్వములు శత్రునాశకములు. ఇంద్రుని చేయితగలగానే గుర్రములు ఆకాశమార్గమున అభిముఖముగా వచ్చును. దిశలను ద్విధా చేయుచు గమనించును.
7. ఇంద్రా ! నీవు సోమాభిలాషివి. అభీష్టవర ప్రదాతవు. ప్రస్తరముతద్వారా అభిషవింపబడిన సోమమును పానము చేయుము. సువర్ణపక్షి నీ కొఱకు సోమము తెచ్చినది. సోమపానమున కలిగిన హర్షోల్లాసమున శత్రురూపులగు మనుష్యాధులను పడగొట్టెదవు. వర్ష ఋతువున మేఘమును అపావృతము చేతువు.
8. ఇంద్రా ! నీవు అన్నప్రాప్తి కారకుడవు. యుద్ధమందలి ఉత్సాహమున వృద్ధి చెందెదవు. ధనవంతుడవు. ప్రభూత ఐశ్వర్యవంతుడవు. నేత్ర శ్రేష్ఠుడవు. స్తుతిశ్రవణకర్తవు. ఉగ్రుడవు. యుద్ధమున శత్రునాశకుడవు. ధనవిజేతవు. ఆశ్రయప్రాప్తికొఱకు మేము నిన్ను ఆహ్వానించుచున్నాము.
నలుబది నాలుగవ సూక్తము
ఋషి - విశ్వామిత్రుడు దేవత - ఇంద్రుడు, ఛందస్సు - బృహతి.
1. ఇంద్రా ! శిలాభిషుతము, ప్రీతివర్ధకము, కమనీయమగు సోమము నీ కొరకే కావలెను. హర్యశ్వములు కట్టిన హరితవర్ణ రథమున ఆసీనుడవగుము. మాముందుకు విచ్చేయుము.
2. ఇంద్రా ! నీవు సోమాభిలాషివయి ఉషను అర్చింతువు. సోమాభిలాషివయి సూర్యుని ప్రదీప్తుని చేతువు. హర్యశ్వవంతా ! నీవు విద్వాంసుడవు. మా మనోరథము తెలిసినవాడవు. అభీష్ట ఫలప్రదానము చేయుము. మా సంపూర్ణ సంపదను అభివృద్ధి చెందించుము.
3. హరిద్వర్ణ రశ్మిగల ద్యులోకమును, ఓషధులను, హరిద్వర్ణ పృథివిని ఇంద్రుడు ధరించినాడు. హరిద్వర్ణ ద్యావాపృథ్వులమధ్య ఇంద్రుడు తన గుఱ్ఱములకు ఆహారము సాధించును. ఇంద్రుడు ఈ ద్యావా పృథ్వులమధ్యనే సంచరించును.
4. ఇంద్రుడు కోరికలు తీర్చువాడు. హరిద్వర్ణవంతుడగు ఇంద్రుడు జన్మించగనే సంపూర్ణ దీప్తివంత లోకములను ప్రకాశవంతము చేసినాడు. హర్యశ్వస్వామి ఇంద్రుడు, చేత హరిద్వర్ణ ఆయుధము ధరించును. శత్రుసంహారకమగు వజ్రము ధరించును.
5. ఇంద్రుడు కమనీయ, శుభ్రక్షీరాదుల ద్వారా వ్యాప్తుడు. కావున వేగవంతము, ప్రస్తరాభిషుత సోమమును ఆవిష్కరించినాడు. ఇంద్రుడు అశ్వయుక్తుడయి 'పణులు' దొంగిలించిన గోవులను గుహనుండి వెలికి తీసినాడు.
నలుబది అయిదవ సూక్తము
ఋషి - విశ్వామిత్రుడు దేవత - ఇంద్రుడు, ఛందస్సు - బృహతి.
1. ఇంద్రా ! నీ గుఱ్ఱములు ఉన్మత్తములు. వాని రోమములు నెమలిపింఛము వంటివి. నీవు అట్టి గుర్రములతో ఈ యజ్ఞమునకు విచ్చేయుము. ఎగురు పక్షిని వ్యాధుడు బంధించును. ఆవిధమగు ప్రతిబంధకము నీకు కలుగరాదు. బాటసారి ఎడారిని దాటినట్లు నీవు బాధలన్నింటిని అతిక్రమించి, త్వరగా ఈ యజ్ఞమునకు విచ్చేయుము.
2. ఇంద్రుడు, వృత్రహంత. అతడు మేఘములను బద్దలు కొట్టును. జలమును ప్రేరేపించును. అతడు శత్రునగరములను బద్దలు కొట్టినాడు. అతడు మావద్దకు వచ్చుటకు రథము ఎక్కినాడు. గుఱ్ఱములను తోలినాడు. ఇంద్రుడు బలవంతులగు శత్రువులను నష్టపరచును.
3. సాధువులగు గోపగణములు గోవులకు యవాది ధాన్యముల ద్వారా పుష్ఠి కలిగింతురు. దరిలేని సముద్రములను ఇంద్రుడు జలముల ద్వారా పరిపుష్టము చేయును. ఇంద్రా ! ఆవిధముగా నీవు యజ్ఞముచేయు యజమాని కోరికలు తీర్చుము. అతనికి పుష్టి కలిగించుము. గోగణములకు తృణాదులు, చిన్నచిన్న నీటి తావరములు, మహా జలాశయములు లభించినట్లు ఈ యజ్ఞమునందలి సోమము నీకు లభించును.
4. పుత్రుడు వ్యవహారజ్ఞుడు అయినపుడు తండ్రి ధన భాగము ఇచ్చును. ఇంద్రా ! అటువంటి పుత్రుని, శత్రువులను పరాజితులను చేయువానిని ధనవంతుని మాకు ప్రసాదించుము. చెట్లను ఊపి పండిన పండ్లను పొందుదురు. అట్లే మాకు కోరికలు తీర్చు ధనమును ప్రసాదించుము.
5. ఇంద్రా ! నీవు ధనికుడవు. స్వర్గమునకు ప్రభువవు. మధుర భాషివి. కీర్తివంతుడవు. బహుజన స్తుతుడవు. నీవు నీ బలమున వర్థిల్లుము. మా కొఱకు అతిశయ అన్నవంతుడవగుము.
నలుబది ఆరవ సూక్తము
ఋషి - విశ్వామిత్రుడు దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఇంద్రా ! నీవు యోద్ధవు. ఫలప్రదాతవు. ధనములకు స్వామివి. సమర్థుడవు. నిత్య యవ్వనుడవు. చిరంజీవివి. శత్రు పరాజయ కర్తవు. జరా రహితుడవు. వజ్రధారివి. ముల్లోకముల ప్రసిద్ధుడవు. మహావీరుడవు.
2. ఇంద్రా ! నీవు పూజనీయుడవు. ఉగ్రుడవు. ఘనుడవు. ధనదాన పారంగతుడవు. పరాక్రమమున శత్రువులను పరాజితులను చేయువాడవు. జగములన్నింటికి నీవు ఒక్కడవే రాజువు. నీవు శత్రువులను సంహరించుము. సాధుజనులను స్థాపించుము.
3. ఇంద్రుడు దీప్తిమంతుడు. సర్వప్రకారముల అపరిమితుడు. సోమవంతుడు. అతడు పర్వతములకన్న అధికుడు. బలమున దేవతలందరికి అధికుడు. ద్యావాపృథ్వులకన్న అధికుడు. విస్తీర్ణమున అంతరిక్షముకన్న అధికుడు.
4. ఇంద్రా ! నీవు మహామహుడవు. గంభీరుడవు. శత్రు భయంకరుడవు. సర్వత్ర వ్యాప్తుడవు. స్తోతల రక్షకుడవు. నదులు సముద్రాభిముఖులయి ప్రవహించును. అట్లే పూర్వకాల అభిమత సోమము ఇంద్రాభిముఖమై సాగును.
5. ఇంద్రా ! తల్లి గర్భము ధరించినట్లు నీ కోరికను అనుసరించి ద్యావాపృథ్వులు సోమమును ధరించును. కోరికలు తీర్చు ఇంద్రా ! ఆ సోమమునే అధ్వర్యులు నీ కొఱకు ప్రేరేపింతురు. నీవు పానము చేయుటకు శుభ్రపరచెదరు.
నలుబది ఏడవ సూక్తము
ఋషి - విశ్వామిత్రుడు దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఇంద్రా ! నీవు జలవర్షకుడవు. మరుద్వంతుడవు. ఇది పురోడాశరూప అన్నయుక్తమగు సోమము. రమణీయమగు ఈ సోమమును యుద్ధము కొఱకును. హర్షము కొఱకును సేవింపుము. నీవు విశేషరూపమున సోమము జఠరమున నింపుము. నీవు అనాది అభిషుత సోమమునకు స్వామివి.
2. ఇంద్రా ! నీవు శూరుడవు. దేవతల సంగతుడవు. మరుత్తుల యుక్తుడవు. వృత్రహంతవు. కర్మవిషయ జ్ఞాతవు. నీవు సోమపానము చేయుము. మా శత్రువులను వధించుము. క్రూరజంతువులను పరిమార్చుము. మమ్ము సర్వత్ర భయరహితులను చేయుము.
3. ఋతుపానముల ఇంద్రా ! మిత్రులగు మరుత్తులు, దేవతల సహితముగా విచ్చేయుము. మేము అర్పించు అభిషుత సోమపానము చేయుము. నీకు యుద్ధమున సాయపడుటకు మరుత్తులను చేర్చుకున్నావు. మరుత్తులు నిన్ను స్వామిగా భావించినారు. ఆ మరుత్తులే నిన్ను సంగ్రామమున శత్రుహననాది పరాక్రమవంతుని చేసినారు. అప్పుడు నీవు వృత్రుని వధించినావు.
4. మఘవా ! అశ్వవంత ఇంద్రా ! అహి హనన కార్యమున మరుత్తులు తమ త్యాగముల ద్వారా నిన్ను సంవర్థితుని చేసినారు. శంబరవధలో సంవర్థితుని చేసినారు. గోవుల కొఱకు పణులతో యుద్ధమున సంవర్థితుని చేసినారు. ఆ మరుత్తులు నేడు సహితము నిన్ను ప్రసన్నుని చేయుదురు. నీవు ఆ మరుద్గణ సహితుడవయి విచ్చేయుము. సోమపానము చేయుము.
5. ఇంద్రా ! నీవు మరుద్యుక్తుడవు. జలవర్షివి. ప్రోత్సాహకుడవు. శబ్ద విశిష్టుడవు. దివ్యుడవు. శాసనకర్తవు. విశ్వత్రాతవు. ఉగ్రుడవు. బలప్రదుడవు. మేము నూతన ఆశ్రయ లాభమునకుగాను నిన్ను ఆహ్వానించుచున్నాను.
నలుబది ఎనిమిదవ సూక్తము
ఋషి - విశ్వామిత్రుడు దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఇంద్రా ! నీవు జలవర్షకుడవు. సద్యోజాతవు. కమనీయుడవు. హవిర్యుక్త సోమరూప అన్న సంగ్రహకర్తను రక్షింపుము. విశేష సమయమున సోమపానముచేయు కోరిక కలిగినపుడు దేవతలకంటె ముందు మిశ్రిత సాధు సోమమును పానము చేయుము.
(సాధుసోమము కొత్తదిగా కనిపించుచున్నది. 'సాదోః రసాత్మనా సంసిద్ధం' అన్నాడు శాయణుడు. గవ్యమిశ్రిత సోమము గోచరించినది. ఇది సోమమునకు సాధురూపము కావచ్చును.)
2. ఇంద్రా ! నీవు జన్మించిన రోజుననే పిపాసివి అయినావు. పర్వతములందున్న సోమలత రసమును త్రావినావు. నీ మహాపిత కశ్యపూని గృహమున నీయువతి మాత, అదితి. చన్నిచ్చుటకుముందు సోమరసము పట్టించినది.
3. ఇంద్రుడు తల్లిని అన్నము అడిగినాడు. తల్లి చన్నులందు క్షీరరూపమున ఉన్న దీప్త సోమమును చూచినాడు. గృత్స ఇంద్రుడు శత్రువులను వారి స్థానముల నుండి కదిలించినాడు. సర్వత్ర సంచరించినాడు. అనేకవిధముల అంగవిన్యాసము చేసినాడు. వృత్రహననాది బహువిధ మహాకార్యములు చేసినాడు.





