Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    ద్రౌపది శ్రీకృష్ణుని రాకను విన్నది. ఆమెకు జరిగిన అవమానమును తలచుకున్నది. ఆమె గుండె మండినది. కన్నీరు జలజలరాలినది. ఆమె ఓర్చుకొనలేక పోయినది. అందరి రాజుల ముందుకు ఉరికినది. శ్రీకృష్ణునకు తన గోడు వెళ్లబోసుకున్నది:-
    "శ్రీకృష్ణా! నీయంతఃకరణ ప్రవృత్తి కగోచరంబేదియు లేదయినను నా పడిన పరాభవం బెఱింగించెద".
    "నేను ద్రౌపదిని. రాజునకు రాజయిన పాండురాజు కోడలిని. మహీమండలమును గెలువగల పాండవులకు పత్నిని. సర్వశక్తిమంతుడవయిన నీకు సోదరిని. అవిక్రమ పరాక్రమవంతుడయిన ధృష్టద్యుమ్నునకు చెల్లెలును. అయినను గుడ్డిరాజు ధృతరాష్ట్రుని కొడుకు దుష్టుడు దుశ్శాసనుడు నా జుట్టు పట్టి నిండు సభకు ఈడ్చి తెచ్చినాడు. నా మగలు మహాధీరులు చూచుచుండగనే నా కట్టుబట్టను ఊడపీకినాడు.
    "పాండవులు అరిభయంకరులు. కాని ఆనాడు ప్రాణములేని ప్రతిమల వలె పెదవి కదల్పక నా అవమానమును చూచినారు. ఉలకలేదు. పలకలేదు. నాకు అన్నలు, తమ్ములు బంధుజనులు ఇందరున్నను దిక్కులేని దానను అయినాను" అని గుండెలు అవియునట్లు ఏడ్చును.
    "అన్నా! శ్రీకృష్ణా! ఆ దుర్మార్గుడు - దుష్టుడు - నీచుడు - దుశ్శాసనుడు నా మొలబట్టి గుంజినాడా! దురాత్ముడయిన కర్ణుడు నన్ను చూచి వికటముగా నవ్వినాడు. దుశ్శాసనుడు చేసిన పరాభవమును కన్న కర్ణుడు నవ్విన వికటపు నవ్వు నన్ను కాల్చివేయుచున్నది. గుండెలో దావాగ్ని అయి దహించుచున్నది" అని చెప్పి కన్నీరు తుడుచుకొని డగ్గుత్తుకతో అన్నది:-
    "అన్నా! ఈ అన్యాయములకు అంతములేదా! దుర్మార్గుడయిన దుర్యోధనుడు బాల్యము నుండి భీముని అంతమొందించుటకు పథకము వేయుచున్నాడు. గంగానదిలో పడవేయించినాడు. విషము పెట్టినాడు. విషసర్పములతో కరిపించినాడు. లక్క ఇంటిలో పాండవులను కాల్చచూచినాడు. అధర్మమైన జూదమున రాజ్యమును అపహరించినాడు. నిండు సభలో నన్ను అవమానించగా ఈ పాండవులు చూచి సహించినారు".
    ద్రౌపది ఇక చెప్పలేక పోయినది. దుఃఖము పొంగిపొరలినది. కొంగు నోట కరచుకున్నది. మాటరాక కూలబడ్డది.
    దుఃఖార్తురాలయిన ద్రౌపదిని శ్రీకృష్ణుడు ఓదార్చినాడు:-
    "సోదరీ! కౌరవులకు, పాండవులకు భీకర సంగ్రామము జరుగనున్నది. ఆ యుద్ధమున దుర్యోధన, దుశ్శాసనులను భీముడు హతమార్చును. కర్ణుని అర్జునుడు కడ తేర్చును. ద్రోణుని ధృష్టద్యుముడు చంపును. అపుడు నీ దుఃఖము చల్లారును" అని ధర్మరాజుతో ఇట్లన్నాడు:-
    "ధర్మజా! స్త్రీవాంఛ, జూదము, వేట, పానమను నాలుగు దుర్వ్యసనములు. వానికి దూరమున ఉండవలెను. ముఖ్యముగా జూదము అధర్మకారణము. అధర్మజూదమును వదలకున్న పాపము కలుగును. నీవు జూదము ఆడునపుడు నేను సాల్వునితో యుద్ధములో చిక్కుకొని ఉన్నాను. అందువలన రాలేకపోయినాను. నేనే అక్కడ ఉన్నచో ధృతరాష్ట్ర, భీష్మ, ద్రోణులతో చెప్పి జూదము మాన్పించియుందును. నేను దగ్గర ఉన్నపుడు మీకు ఎట్టి కష్టములును రావు. జూదమున నేను లేను. పదినెలలు సాల్వునితో యుద్ధము చేసి వానిని చంపినాను. అందువలన మిమ్ము రక్షించలేక పోయినాను".
    శ్రీకృష్ణుని మాటలు విన్న ధర్మరాజు సాల్వుని వృత్తాంతము వివరించవలసినదిగా శ్రీకృష్ణుని ప్రార్థించినాడు. శ్రీకృష్ణుడు సాల్వుని కథ చెప్పినాడు:-
    "నీవు రాజసూయము చేసినావు. రాజసూయ సభయందు నేను శిశుపాలుని వధించినాను. ఆ వార్త విన్నాడు శిశుపాలుడు తమ్ముడు సాల్వుడు. చతురంగ బలములతో ద్వారక మీదకి దండెత్తినాడు. అప్పుడు నేను ఇంద్రప్రస్థముననే ఉన్నాను. ద్వారక అభేద్యమయిన నగరము. సాల్వుడు అందు ప్రవేశించలేక పోయినాడు. ద్వారక బయట విడిసినాడు. యుద్ధ సన్నాహములు సాగించినాడు. సాల్వునకు "సౌంభకము" అను నగరమున్నది. దానిది కామగమనము. అది కోరిన చోటికి పోగలదు. సాల్వుడు సౌంభకము సాయముగా ద్వారక వాసులకు ఉపద్రవము కలిగించినాడు. ప్రద్యుమ్న, చారుదేష్ణ, సాంబుడు మున్నగు యాదవ కుమారులు, అది చూచి సహించలేక పోయినారు. ద్వారకనుంచి వెలుపలికి వచ్చినారు సాల్వుని మీదికి దండెత్తినారు.
    "సాంబుడు, సాల్వుని సేనాని క్షేమమూర్తిని ఎదిరించినాడు. బాణవర్షము కురిపించినాడు. క్షేమమూర్తి జంకలేదు. ఎదురు బాణములు వేసినాడు. సాంబుడు క్షేముని రథపు గుఱ్ఱములను కొట్టినాడు. అవి బెదిరినవి. సారథికి వాటిని వశపరుచుట సాధ్యపడలేదు. అశ్వములు రథమును రణభూమి నుండి ఈడ్చుకొని పోయినవి. క్షేముడు యుద్ధము నుండి తొలగినాడు.
    అది చూచి వేగవంతుడు సాంబుని మీదకు ఉరికినాడు. చారుదేష్ణుడు సాంబుని తొలగించి, వేగవంతుని శిరమును తన గదతో కొట్టినాడు. వేగవంతుడు తల పగిలి కూలినాడు.
    అది చూచిన విచింత్యుడు చారుదేష్ణుని మీద శరవర్షము కురిపించినాడు. చారుదేష్ణుడు ఆగ్నేయాస్త్రము ప్రయోగించి విచింత్యుని కాల్చి కూల్చినాడు.
    విచింత్యుని చావు చూచిన సాల్వుని సైన్యము భయపడినది. చెల్లాచెదురు కాసాగినది. అది చూచిన సాల్వుడు రణరంగమునకు వచ్చినాడు. రథము మీది నుండి శర సహస్రములు కురిపించినాడు. యాదవ సైన్యము కకావికలమయినది. అప్పుడు ప్రళయాగ్నివలె సాల్వుని ఎదుర్కొన్నాడు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్న, సాల్వులకు ప్రళయ భయంకరమయిన యుద్ధము జరిగినది. ప్రద్యుమ్నుని బాణము తగిలి సాల్వుడు మూర్చిల్లి రథముమీద పడిపోయినాడు. క్షణములో సాల్వుడు మూర్ఛతేరుకున్నాడు. శరపరంపరతో ప్రద్యుమ్నుని మూర్చిల్లజేసినాడు. ప్రద్యుమ్నుని సారథి రథమును దూరముగా తీసుకొనిపోయినాడు. మూర్ఛతేరిన ప్రద్యుమ్నుడు అదిచూచి బాధపడినాడు. యుద్ధరంగము నుండి తప్పించినందులకు సారథిని నిందించినాడు. రథమును సాల్వుని ముందుకు తోలమని సారథిని గద్దించినాడు.
    సారథి అదిరిపడినాడు. తన ప్రజ్ఞను ప్రదర్శించినాడు. గుఱ్ఱములను సవ్య, అపసవ్య, చిత్ర, మండల గతుల చేత నడిపించినాడు. అపసవ్యముగా సాల్వుని ముందునకు రథము తోలినాడు. సాల్వుడు అది చూచి మండిపడినాడు. సారథిమీద మూడు బాణములు వేసినాడు. రాక్షస మాయ కల్పించినాడు. మాయచేత ప్రద్యుమ్నుని మీద బాణములు గుప్పించినాడు.
    ప్రద్యుమ్నుడు రాక్షసమాయను ఎరిగినాడు. తన బాణమున మాయను భగ్నము చేసినాడు. బ్రహ్మాస్త్రము ప్రయోగించి సాల్వుని గుండెకు కొట్టినాడు. సాల్వుడు ఆ బాణమునకు మూర్ఛ పోయినాడు. రథము మీద పడిపోయినాడు. ప్రద్యుమ్నుడు మరొక బాణము సంధించినాడు. సాల్వుని చంపదలచినాడు. అప్పుడు నారద మారుతులు ఉరికి వచ్చినారు. అతనిని వారించినారు. ఈ సాల్వ రాక్షసుడు నీ తండ్రి శ్రీకృష్ణుని చేత చావవలసి ఉన్నది. బాణము ఉపసంహరించు కొనుము" అన్నారు.
    ప్రద్యుమ్నుడు బాణము ఉపసంహరించుకున్నాడు.
    సాల్వుడు సౌంభక నగరమును ఎక్కి పారిపొయినాడు. ముట్టడి ఎత్తివేసినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.