Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
ఉమ్రావ్ : జోరుగా ఉందే. పడుచుధనపు ప్రస్తావన ప్రభావమేమో?
రుస్వా : కాదు. మదిర ప్రస్తావన ప్రభావం.
ఉమ్రావ్ : ఓ నిష్టాగరిష్ట ! నీకు శత్రువులు
మగువ , మదిర మాకు పరమ మిత్రులు!
రుస్వా : ఓహో ఎంత బాగా చెప్పారు.
మరతునని మక్కాలో ఒట్టేశాను!
మరలి దారితప్పి, ఒట్టే మరచాను !
వలపు, మదిర జ్ఞాపకం వస్తే రానీ!
ఉమ్రావ్ : బావుంది.
రుస్వా : హంస నడల - నీ బెళుకు
లేడి కనుల- నీ తళుకు
వెల్లువలా జ్ఞాపకం వస్తే రానీ!
ఉమ్రావ్ ; బాగానే ఉంది.
రుస్వా : ఆ కవిత వినండి.
గంధానిలం ఉండాలి.
కరిమబ్బులు ఉండాలి,
పచ్చని తోట, నచ్చిన మద్యం ఉండాలి!
పగలబడే పడుచుదనం ఉండి తీరాలి!
ఉమ్రావ్ : వాహ్ మిర్జాగారూ! చంపేశారు. సరే. మొత్తం మీద అలాగే చాలా సంవత్సరాలుఖానమ్ ఇంట్లో గడిచిపోయాయి. ఈలోగా విన్నవించదగిన విషయం ఏదీ జరుగలేదు. ఆఁ జ్ఞాపకం వచ్చింది. బిస్మిల్లాకు సంబంధించిన "మిస్సీ" ఉత్సవం ఎంతో ఆడంబరంగా జరిగింది. నాకు తెలిసినంతవరకు నాటి నుంచి నేటి వరకు అలాంటి ఉత్సవం రాజుల ఇళ్ళల్లో కూడా జరుగలేదు. దిలారామ్ బారాదరీ (నలువైపుల పన్నెండు ద్వారాలు మహాసౌధం) ఈ ఉత్సవం కోసం అలంకరించబడింది. దీపాలంకరణ జరిగింది. పట్నపు వేశ్యలు గాయనీ నర్తకీమణులు, కాశ్మీరపు భట్లు వచ్చేశారు. దూర ప్రాంతాల నుంచి బోగం మేళాలు పిలిపించబడినాయి. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు డిల్లీ నుంచి వచ్చారు. వారం రోజులు రాత్రింబవళ్ళు ఆటలు, పాటలు ! ఉదారంగా ఖర్చు చేసింది ఖానమ్. ఎన్నోదానధర్మాలు చేసింది. నాటి కీర్తీ నేటికీ మాయలేదు. బిస్మీల్లా, ఖానమ్ ఒకే కూతురు. ఏ లోటూ రానివ్వలేదు. నవాబ్ ఉమ్దఆల్ఫాఖాఁ బేగమ్ గతించారు. నవాబ్ చబ్బన్ గారు వారి ఆస్తికి వారసులయ్యారు. నవాబ్ జాదా (పిల్లనవాబు) వయసుకు చాల చిన్నవాడు. ఆ భగవంతునికే తెలియాలి ఖానమ్ ఎన్ని మాయపేలాలు వేసిందో! నవాబును బుట్టలో వేసుకుంది. పాపం, నవాబు చిక్కిపోయాడు. అతని డబ్బు ఇరవై అయిదు , ముప్పయి వేలు ఈఉత్సవానికి ఖర్చయింది. తరవాత బిస్మీల్లా నవాబు కొలువులో చేరిపోయింది. ప్రాణంతో సమానంగా చూచుకునేవాడు.
మిర్జాగారూ! మీరు అడిగినవాటన్నింటికీ సమాధానాలు చెప్పటం కష్టం. బోగం వాళ్ళకు సిగ్గు, లజ్జ ఉండవనేది నిజం. అయినా కాలం బలీయం అయింది.
వయసు కూడా ఒకటి ఉంది చూడండి. యవ్వనోద్రేకంలో హద్దులు గుర్తుండవు. వయసు ఉడుగుతుంటే అవి కూడా ఉడిగిపోతాయి. తప్పదు. ఎంతయినా వేశ్వలది స్త్రీ జాతి విషయం మరవరాదు. అలాంటి విషయాలు అడిగితె మీకేం ప్రయోజనం?
రుస్వా : నేను అడుగుతానంటే ఏదో ప్రయోజనం ఉండటం వల్లనే. మీరు చదువురానివారైతే ఇలాంటి విషయాలు వినిపించడానికి అభ్యంతరం ఉండాలి. విద్యావంతులకు ఇంత సిగ్గు పనికిరాదు.
ఉమ్రావ్ : అయితే విద్యావంతుల సిగ్గు జారిపోతుందా?
రుస్వా : అచ్చా, అచ్ఛా, వృధా మాటల్తో నా కాలాన్ని నష్టపరచకండి.
ఉమ్రావ్ : పత్రికల్లో వేయిస్తారా ఏం?
రుస్వా : మరేమనుకున్నారు ?
ఉమ్రావ్ : హాయ్ అల్లా! నన్ను కూడా మీలాగే రుస్వా అపవాదులపాలు ) చేస్తారా ?
రుస్వా : మీరు నాతో పాటు రుస్వీ అయితే , వచ్చే హాని లేదు.
వలపు ముచ్చట చెప్పనేరనిదానా!
రుస్వా పరిచయానికి తహతహ లేలనే?
చూడు, నన్నిక రుస్వాసాలు
చేయక వదలను! వదలను!
ఉమ్రావ్ : ఛీ. మీమ్మల్నేవతే ప్రేమిస్తుంది ?
సాధువుతోనైన బోడి సన్యాసితోనైన
హవ్వ ! ప్రేమాయణమే వల్లించువాడు సదా!
రుస్వా : ఎవరి కవిత ?
ఉమ్రావ్ : ఎందు కడుగుతారు ? అర్ధం అయింది. ఈ గజల్ విన్నారా ?
వలపుసంతలో ఉసురు లమ్మ వచ్చాను
ఐనా, అందాన్ని బేరమాడక మానను!
రుస్వా : ఆ కవిత గుర్తుందా "తగాదా లేకుండా"
ఉమ్రావ్ : సర్వం ఇస్తానని పాడు వాగ్ధానమేయనీ,
పట్టి పిండిన తప్ప ఇసుమంత జార్చడా మోసకారి!
రుస్వా : ఇంకేమైనా కవిత జ్ఞాపకం ఉందా?
ఉమ్రావ్ : గుర్తు రావడం లేదు.
రుస్వా : ఇది చాలా పెద్ద గజల్. చూడండి. ఎక్కడైనా పడి ఉందేమో! కనిపిస్తే నాకు చూపించాలి.
ఉమ్రావ్ : వారితోనే తెప్పించుకోకూడదూ?
రుస్వా : స్వయంగా వెళ్ళి వ్రాసి తెచ్చుకోవాల్సిందే. వారు మాత్రం వ్రాసి ఇవ్వరు.
ఉమ్రావ్ : అలాగా?
రుస్వా : జీహాఁ మీకు తెలీదు. చిత్తువ్రాయడం తప్ప ఎత్తి వ్రాయడం తెలీదు. ఒట్టు.
ఉమ్రావ్ : ఒకరోజు మీరు, నేనూ వెళ్దాం. ఇంకో పద్యం గుర్తుకు వచ్చింది.
అపనిందం పాలైతి
అలమటించిపోయితి,
అందరితో నా ముచ్చటలే
గుసగుసలాడును వాడు!
వినండి
ప్రేమించి పడరాని పలుపాట్లు పాలు జేసి,
కడకు అపనిందల పాల్జేసి ముంచిచేయు!
రుస్వా : ఇలాంటి నాది కూడా ఉంది. ఏమైందో తెలీదు. మకుటం మాత్రం గుర్తుంది.
ఉమ్రావ్ : మకుటం! అయితే వినిపించండి.
రుస్వా : వలపు ముచ్చట చెప్పనేరనిదానా!
రుస్వా పరిచయానికి తహతహలేంటే?
చూడు, నిన్నిక రుస్వాసాలు
చేయక వదలను! వదలను!
ఉమ్రావ్ : అమోఘంగా ఉంది. "మీ "తఖల్లుస్ ప్రభావం చూపింది.





