Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    5. రథంతరసామము భూలోకరూపము. బృహత్సామము ద్యులోకరూపము. ఈరెండింటి వలన యజమాని తన ప్రత్యర్థిని ఉభయలోకములనుండి పడగొట్టుచున్నాడు.

    రథంతరసామము వర్థమాన రూపము. బృహత్సామము భవిష్యత్ రూపము. ఈ రెండింటి వలన యజమాని తన ప్రత్యర్థిని వర్థమాన భవిష్యత్తులు లేనివానిగ చేయుచున్నాడు.

    రథంతర సామము భూతకాల శ్రేయోరూపము. బృహత్సామము. భవిష్యత్ శ్రేయోరూపము. ఈ రెండింటి వలన యజమాని తన ప్రత్యర్థిని భూత భవిష్యత్ శ్రేయస్సులు లేనివానిని చేయుచున్నాడు.

    రథంతర సామము పరిమిత శ్రేయోరూపము. బృహత్సామము అపరిమిత శ్రేయోరూపము. ఆ రెండింటి వలన యజమాని తన ప్రత్యర్థిని పరిమిత, అపరిమిత శ్రేయస్సులు లేనివానిగ చేయుచున్నాడు.

    6. విశ్వామిత్ర, జమదగ్నులు వసిష్ఠునితో స్పర్థవహించినారు. అప్పుడు జమదగ్ని 'విహవ్య' సూక్తమును కనిపెట్టినాడు. ఆ సూత్రము చేతనే జమదగ్ని వసిష్ఠుని బల వీర్యములను నశింపచేసినాడు.

    యజమాని విహవ్యమును ప్రయోగించినచో అతని ప్రత్యర్థి యొక్క బలవీర్యములను నశింపచేసినవాడు అగుచున్నాడు.

    7. ఏ యజమాని ఎక్కువ యజ్ఞక్రతువులు చేయునో అతడు తన ప్రత్యర్థి యొక్క దేవతలను పడగొట్టుచున్నాడు.

    యజమాని చేయుచున్న సోమయాగము సమాప్తమగుచుండగా ఒకవేళ ప్రత్యర్థి ద్వాదశస్తోత్రప్రయుక్త అగ్నిష్టోమ యాగమును ఆచరించినచో యజమాని పంచదశ స్తోత్రప్రయుక్త ఉక్థ్యనామక యాగము చేయవలెను.

    యజమాని ఉక్థ్యము సమాప్తమగుచుండగా అతని ప్రత్యర్థి ఉక్థ్యమును అనుష్ఠించినచో యజమాని ఏకోనత్రింశత్ స్తోత్ర ప్రయుక్తమైన అతిరాత్రయాగము చేయవలెను.

    యజమాని ఆవిధముగా చేసినట్లయిన ప్రత్యర్థి యొక్క దేవతలను నశింపచేసిన వాడగును. స్వయముగా ధనవంతుడగునని పెద్దలు చెప్పుచున్నారు.

                                       ఎనిమిదవ అనువాకము

    1. జలములారా! మీరు నిగ్రాభ్యములు కండు. దేవశ్రుతులు కండు. ఆయుర్మే తర్పయత - నా ఆయువును తృప్తిచెందించుడు. ప్రాణం మే తర్పయత - అపానం మే తర్పయత. వ్యాసం మే తర్పయత - చక్షుర్మే తర్పయత. శ్రోత్రంమే తర్పయత. మనోమే తర్పయత. వాచంమే తర్పయత. ఆత్మానం మే తర్పయత. అంగాని మే తర్పయత. ప్రజాం మే తర్పయత. పశూన్మే తర్పయత. గృహాన్మే తర్పయత. సర్వగణం తర్పయత. నాయొక్క పుత్రభృత్యాదులను తృప్తి చెందించుము.

    నాకు చెందిన వాటిని అన్నింటిని తృషాది రహితులను చేయుము.

    (1. నితరాం గ్రహీతవ్యాః నిగ్రాభ్యాః - ఎక్కువగా తీసికొనబడునది. 2. దేవైః శ్రూయన్తే ఇతి దేవశ్రుతః - దేవతలు వినునట్టివి.)

    2. ఓషధులు సోమమునకు ప్రజలు. ప్రజలే కదా రాజునకు ఇచ్చువారు.   

    ఓషధులారా! మీరు ఉపకరించుటకే పుట్టినవారు. యజ్ఞము కొరకు పుట్టినవారు. మిమ్ము మేము మనస్పూర్తిగా వర్థిల్లచేయుచున్నాము. మీరు ఇంద్రదేవతాకములు. మేము మీ సేవయందే ఉందుము.

    సోమలతారూప దేవతలు ఇంద్రునితో సమైక్యత చెంది ప్రాతస్సవనమున సోమమును అనుమతింతురు గాత అనునది మంత్రార్థము. అందువలన యజమాని సోమరూప ప్రజనుండియు, సోమదేవతనుండియు అనుమతి పొంది అభిషవించవలెను.

    3. సోమము అభిషవించ బడునపుడు నేల రాలిన తొలి అంశము యజమాని బలవీర్యములను, సంతానమును, పశువులను నశింపచేయగల సామర్థ్యము కలిగి ఉండును.

    ఆ దోషనివారణకుగాను 'ఆమ్కాస్కాని' మంత్రములచే అభిమంత్రించవలెను. 'నేలరాలిన సోమపు తొలి అంశమా! నీవు బలవీర్యములు, సంతానము, పశువులతో కూడ నావద్దకు మరలి రమ్ము. నా బలవీర్యములను, సంతానమును, ప్రజలను నశింపచేయకుము, అని మంత్రము వచించుచున్నది.

    యజమాని దీనిని బలవీర్యాదులు నశించకుండుటకు ఆశీస్సుగనే స్వీకరించవలెను.

    4. భూమి మీద సోమరస బిందువు పడినది. ఆ పడిన బిందువు హుతమగును. పృథివ్యాదిమూడు లోకములందు సంచరించును. ఆ బిందువును అది పడిన దిశన కాక ఏడు దిక్కులందును హోమము చేయుచున్నాను.

                                    తొమ్మిదవ అనువాకము

    1. దేవతలను దేవతల కీర్తితోను, మనుష్యులను మనుష్యుల కీర్తితోను చేర్చునట్టి యజమాని దేవతలందు దేవతల యశస్సు కలవాడును, మనుష్యులందు మానవ యశస్సు కలవాడును అగును.

    అందుకుగాను యజమాని ఆగ్రాయణ గ్రహము కన్న మున్న గ్రహించవలసిన గ్రహములను ఉపాంశువుగా గ్రహించవలెను. ఉక్థ్యాది గ్రహములను ఉపబ్దికలవానిగ గ్రహించవలెను. అప్పుడు దేవతలను దేవతల కీర్తితోనూ, మానవులను మానుష కీర్తితోను చేర్చినట్లగును. అందువలన యజమాని దేవతలందు దేవతల కీర్తి కలవానిగను, మానవులందు మానవుల కీర్తి కలవాడుగను అగుచున్నాడు. ఇది నిశ్చయము.

    2. మేము ప్రాతస్సవనమును అనుష్ఠించుచున్నాము. అగ్ని మమ్ము రక్షించునుగాత. ఈ అగ్ని సర్వమానవులకు స్వామి. అతడు మహిమాన్వితుడు. లోకములకు సుఖములు సమకూర్చువాడు. అతడు మా పాపములకు క్షయము కలిగించును. మమ్ము పావనులను చేయును. అగ్ని మాకు ధనము ప్రసాదించునుగాత. మేము అన్నవంతులము ఆయుష్మంతులము అగుదుముగాక.

    (ప్రాతస్సవన సమాప్తి హోమము చేయవలెను.)

    3. మేము మాధ్యందిన కర్మను అనుష్ఠించుచున్నాము. మమ్ము ఇంద్రుడు, మరుత్తులు, సర్వదేవతలు విడువకుందురుగాత. మేము దీర్ఘాయువులము అగుదుముగాక. దేవతలకు ఇష్టములగు స్తోత్రములు చదువుదుముగాక. దేవతలు మమ్ము తమ అనుగ్రహ వీక్షణములందు ఉంచుకొందురుగాత.

    (మాధ్యందిన సవర సమాప్తి హోమము చేయవలెను.)

    4. ఇది తృతీయమగు సాయం సవనము. దీనికి చమసగణదేవతలు, సత్యదేవతలు ప్రేరణ కలిగించినారు. అట్టి యజ్ఞమును ఇంద్రాది దేవతలును, స్వర్గమునకు చేరినవారును, పండితులగు ఋత్విజులును ధనసంపన్నము చేయుదురుగాక. దీనిని గొప్పయాగముల సరసన చేర్చెదరుగాత.

    (సాయంసవన సమాప్తి హోమము చేయవలెను.)

    5. కొన్ని ఆహుతులు ఆయతనవతములుగా హోమము చేయబడును. మరికొన్ని అనాయతనముగా హోమము చేయబడును. ఆఘారవతములగునవి ఆయతనవతములు. ఆఘారవతములు కానివి అనాయతనవతనములు.

    'దేవతలారా! మా యజ్ఞమును ఓషధులు, పశువులు, ప్రజలు, సర్వభూతములను హింసించకుండ చేయండి. సోమదేవతా! నీవు హింసారహితుడవు. ఈ యజ్ఞమును నేతితో వలె తడుపుము, అనునది మంత్రార్థము.

    అందువలన యజమాని అనాయతన ఆహుతులను సహితము ఆయతనవతముగా చేయుచున్నాడు. ఈ విషయములను గ్రహించిన యజమాని సకల జనులకు జీవనారాధుడు అగుచున్నాడు.

    6. రుద్రదేవా! ఈ సంస్రావ హవిస్సు నీ భాగము అయి ఉన్నది. ఈ భాగము నీకే అందవలెనని దేవతలు నిర్ణయించినారు. ఈ భాగమును స్వీకరించుము. నీవు గోపాలనమును, ధనసమృద్ధిని సుపుత్రుని, ఏడాదికి కలుగు ఓషధులను మంగళకరములు చేయువాడవు.

    7. మనువు తన కుమారులకు పంచి ఇవ్వదగిన తన ధనమును పంచి ఇచ్చినాడు. వేదాధ్యయనము చేయు నాభానేదిష్టుడను తన పుత్రునకు భాగము పంచి ఇవ్వలేదు. అతడు తండ్రిని 'నన్ను భాగరహితుని ఏల చేసినా'వని అడిగినాడు. తండ్రి నేను 'నిన్ను భాగరహితుని చేయలేదు' అన్నాడు.

    8. తండ్రి కొడుకునకు చెప్పుచున్నాడు:-

    అంగిరో ఋషులు సత్రయాగము చేయుచున్నారు. వారికి నాభానేదిష్ట బ్రాహ్మణము తెలియకున్నది. అందువలన మీరు స్వర్గమార్గమును తెలియలేకున్నారు. నీవు వారికి ఆ బ్రాహ్మణము చెప్పుము. ఆ ఋషులు సత్రయాగము పూర్తి చేసి స్వర్గమునకు చేరుదురు. అట్లు వెళ్లునపుడు వారి పశువులు మున్నగు సంపదను నీకు ఇచ్చెదరు.

    తండ్రి చెప్పినట్లే నాభానేదిష్టుడు మహర్షులకు ఆ బ్రాహ్మణమును చెప్పినాడు. వారు స్వర్గమునకు వెళ్లుచు తమ పశుసంపదను ఆ బాలునకు ఇచ్చినారు.

    9. అంగిరులు నాభానేదిష్టునకు యజ్ఞశేష పశువులను ఇచ్చినారు. అతడు ఆ పశువులను తన ఇంటికి తోలసాగినాడు. అప్పుడు రుద్రుడు అతనిని అడ్డగించినాడు.

    రుద్రుడు :- ఈ పశువులు నావి. నీవు తోలుకొని పోరాదు.

    నాభానేదిష్టుడు:- మహర్షులు నాకు ఈ పశువులను ఇచ్చినారు. నేను తోలుకొని పోవుచున్నాను.

    రుద్రుడు:- యజ్ఞశేషమునకు వారు స్వాములు కారు. యజ్ఞశేషద్రవ్యమునకు నేను స్వామిని అగుదును. కావున నా అనుమతి లేక నీవు ఈ పశువులను తీసికొని వెళ్లజాలవు. నా అనుమతి కొరకు నీవు నన్ను యజ్ఞమున భాగస్వామిని చేయుము. అప్పుడు నేను నీ పశువులను హింసించను.

    అప్పుడు నాభానేదిష్టుడు సంస్రావ హవిస్సును హోమము చేసినాడు. అందు వలన రుద్రుడు అతని పశువులను హింసించలేదు.

    10. యజమాని ఈ విషయములు తెలిసికొనవలెను. మన్దిన గ్రహము నుండి సంస్రావమును హోమము చేయవలెను. అప్పుడు రుద్రుడు యజమాని పశువులను హింసించకుండును.

                                   పదవ అనువాకము

    1. జుష్టోవాచో భూయాసం జుష్టోవాచస్పతయే దేవీవాక్ !
        యద్వాచో మధుమత్తస్మిన్మాధాః స్వాహా సరస్వత్యై ||

    వాగ్దేవి అనుగ్రహము కలవాడను అగుదును గాక. వాచస్పతి అనుగ్రహము కలవాడను అగుదును గాక. తల్లీ వాగ్దేవీ! మాటలలో మధురమైన వానిని నా నాలుక మీద నిలుపుము. సరస్వత్యై స్వాహా.

    2. వాగ్దేవీ! కర్మానుష్ఠానమునకని యజమాని ఈ ఋత్విక్కులను వరించినాడు. అతని యందు ఋక్ స్తోమమును సమృద్ధము చేయుము. గాయత్రి సామసహిత రథన్తర సామమును సమృద్ధము చేయుము. బృహత్ సామమున గాయత్రి వర్తనిగా సమృద్ధము చేయుము.

    3. సోమరాజమా! నీ సంబంధియగు రసలేశము అధిషవణ ఫలకము నుండి జారిపడినను అధ్వర్యుని చేతి నుండి జారిపడినను - దశాపవిత్రము నుండి జారిపడినను అది ఇంద్రుని కొరకు హుతము కావలెనని హోమము చేయుచున్నాను.

    4. లాజలనుండియు పురోడాశమునుండియు, ధాన్య, సోమముల నుండియు మన్దినగ్రహము నుండియు, శ్రుక్రగ్రహము నుండియు నేలమీద జారిపడిన లేశము ఇంద్రుడవైన నీకు చెందునట్లుగా స్వాహాకారముచే హోమము చేయుచున్నాను.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.