Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
5. సోమమా! నీ యొక్క రసబిందువు మధురమైనది. బలము నిచ్చునది. స్వాహాకృతమై ద్యావాపృథివ్యంత రిక్షములందు పడునది. అచటినుండి మరలి దేవతలను చేరును. స్వాహాకృతమగు ఆ బిందువును ఇంద్రుని కొరకు హోమము చేయుచున్నాను.
6. ఋత్విజులలో అధ్వర్యుడు ప్రథముడుగా ప్రవర్తించుచున్నాడు. అతడు స్తోత్రములచే యజించవలెనని అభిజ్ఞుల వాక్కు.
వాగ్దేవి దేవతలను గూర్చి ఋజు మార్గమున సాగునది. అధ్వర్యుడనగు నాయందు యశస్సును పశువులందు ప్రాణములను నిలుపునది. నాకు, యజమానికి సంతానము కలుగచేయునది. సరస్వతి అగ్రగామి. ఆమె మాముందు నడుచునుగాక అనునది మంత్రార్థము అట్లనుట వలన సరస్వతినే యజించినట్లగును.
7. ఋత్విజులు ఐన్ద్ర వాయవాది గ్రహములను చేతబట్టి బహిష్పవమాన స్తోత్రమునాకై సాగవలెను. అందువలన యజమానికి గృహరూప స్థానము కలిగించినట్లగును.
8. ఋత్విజులు పునరావృత్తి రహితులు. వారు బహిష్పవమాన స్తోత్రమునాకై సాగుచున్నారు. సామగాయకులు పునరావృత్తి రహితులు. వారు "ఉపాస్మైగాయతే" త్యాది తొమ్మిది ఋక్కులచే నుతించుచున్నారు. వారు మరలి రావలెను. యజమాని వద్ద ఉండవలెను. యజ్ఞము విష్ణుస్వరూపము. కావున విష్ణుసంబంధ మంత్రములచే యజ్ఞము చేయవలెను.
9. విష్ణుదేవా! నీవు మాకు ఎంతో దగ్గరివాడవు. మా అపరాధములను మన్నించువాడవు. మాకు సుఖములను ప్రసాదించుము. నీకు సంబంధించిన సోమరసధారలు మధుశ్చుతములు అగునుగాక. తరగకుండనిండునుగాత. అట్లని మంత్రము చెప్పినది.
అందువలన పూర్వపాత్రలందలి సోమము శుష్కమైనచో మరల వృద్ధినొందును.
పదకొండవ అనువాకము
1. అగ్ని వలన సమస్త జనులు సంపదలు పొందుచున్నారు. ప్రతిదినము కీర్తిదాయకము, సుపుత్రదాయకమగు ధనమును పొందుచున్నారు.
2. అగ్నీ! నీవు ప్రాణవంతుడవు. ఈ యజ్ఞమును గోమంతము, అజవంతము, అశ్వవంతము చేయుము. ఋత్విక్కులతో కూడిన దానినిగా చేయుము. సర్వదేవతలు అభిమానించు దానినిగను, అన్నముగల దానిగను, ప్రజలు గల దానిగను, దీర్ఘకాలము సాగుదానిగను, బహుధనోపేతముగను, విస్తీర్ణ మూలముగల దానిగను విద్వత్ సభతో కూడిన దానిగను చేయుము.
3. సౌమ్య హవిస్సు యొక్క యాజ్యాపురోనువాక్యలకు "ఆప్యాయస్వ" "సంతే" అనునవి ప్రతీకలు.
4. త్వష్ట కర్మములందు ముఖ్యుడు. విశ్వరూపుడు. అతనిని ఆహ్వానించుచున్నాము. అస్మాకమస్తుకేవలమ్ - అతడు మావాడు మాత్రమే అగునుగాక.
5. త్వష్టదేవుడు త్రివర్గసేవియు, చక్కగా పోషించువాడును, చిరంజీవియు, సత్యవాదియు, దేవకామియు, వీరుడును అగు పుత్రుని ఇవ్వగలవాడు. అతడు మాకు అటువంటి పుత్ర పౌత్రాదులను ప్రసాదించునుగాత. తదుపరి దేవతలకు అన్నము సమకూర్చునుగాత.
6. "ప్రణోదేవీ సరస్వతీ" అనునది పుర్వోక్తయాగము నందలి చతుర్థహవిస్సు. "ఆనోదివో బృహత" ఇత్యాదికము ఆ హవిస్సునకు యాజ్య. ఆ యాజ్యా పురోనువాకములకివి ప్రతీకలు.
7. సరస్వన్నామక దేవతాకమగు యజ్ఞము మమ్ము వర్థిల్లచేసినది. ఆ యజ్ఞము మాకు పుత్రులను, అన్నమును ప్రసాదించునుగాక.
8. సముద్రమా! నీ తరంగములు మధురములు ఆజ్యరూపములగు జలములను ప్రవహింపచేయునవి. నీ తరంగములు మాకు సుఖప్రదములు అగునుగాక.
9. సరస్వన్నామక దేవతాకమగు యజ్ఞఫలమును సమస్త పశువులు మానవులు అందుకొనుచున్నారు. ఆ యజ్ఞము వర్షము కలిగించుచున్నది. ధనపుష్టిగల యజమాని ఆ యజ్ఞమునందు నిమగ్నుడు అయి ఉన్నాడు. అట్టి సరస్వద్దేవుని మమ్ము రక్షించవలసినదని ఆహ్వానించుచున్నాము.
10. సముద్రుడు ద్యులోక అర్హుడు. స్వర్గమునకు ఎగురునపుడు పక్షిరూపుడు. చక్కని రెక్కలు కలవాడు. గొప్పవాడు. జలమును వర్షించువాడు. ఓషధుల గర్భములందు ఉండువాడు. వాన కురిపించి అందరిని సంతోషపెట్టువాడు. అట్టి సారవంత సముద్రుని మమ్ము రక్షింపుమని ఆహ్వానించుచున్నాము.
11. సినీవాలీ! నీవు దేవతలకు సోదరి వంటి హితకారిణివి. మహాస్తోత్రములు ఉన్న దానవు. మా హవిస్సులను స్వీకరించుము. మా సంతానమును వర్థిల్లచేయుము.
12. సినీవాలి చక్కని చేతులు కలది. బహు చక్కని అంగుళులు కలది. ప్రోత్సాహము కలిగించునది. బహు యజ్ఞములకు ప్రేరణ కలిగించునది. ఋత్విజులారా! అట్టి సినీవాలిని హవిస్సులతో యజించండి.
(చంద్రకళ కనిపించు అమావాస్య సినీవాలి. యా పూర్వ్కామావాస్యా సా సినీవాలి అని ఐతరేయము.)
13. 'ఐన్ద్ర ఉత్తమో భవతి' అనునది సప్తమ హవిస్సు. "ఇన్ద్రం వో విశ్వతస్పరి" 'ఇన్ద్రం నరః' దానికి పురోనువాక్య యాజ్య ప్రతీకలు.
14. ఇవి పొగలు. కారు మబ్బులను కలిగించునవి. అవి నీటిని మోయునవి. రెక్కలు చాచినట్లు కనిపించునవి. మబ్బులు సూర్యుని కిరణములను ఆచ్చాదించి ద్యులోకమునకు ఎగురునట్టివి. మబ్బులు పొగనుండి ఏర్పడినవి. నీటిని పీల్చినవి. వర్షించుటకు సాగుచున్నవి. వర్షము నేతివలె కురిసి నేలను తడుపుచున్నది.
15. ధూమము బంగరు రంగు గల అగ్ని కేశముల వలె ఉన్నది. అది మేఘమై, మేఘమునందలి మెరుపై ఆకాశరూపమును అగుపించ అరుగుచున్నది. అది గాలివలె కదలిక కలిగి వేయువేగవంతమై ఉన్నది. విద్యుత్కాంతులు విరజిమ్ము చున్నది. ఆ ధూమరూప మేఘము - మా కొఱకు - వర్షించును గాత.
పొద్దుపొడుపు కనిపించకుండ మబ్బులు క్రమ్మును గాత. పంట భూములు పండి యశోవంతములు అగునుగాక. నీటి కొరకు తపించు భూములు సస్యశ్యామలములు అగునుగాత.
16. పునర్నవమా! నీ ధూమములు సువర్ణములు - చక్కని రెక్కలు గలవి. పునర్గమనలు. అవి సర్వత్ర నీటి జల్లులు కురిపించుచున్నవి. ధూమముల నుండి మేఘములు కలుగుచున్నవి. మెరియుచున్నవి. కురియుచున్నవి. అప్పుడు మబ్బులు దయదలచుచున్నవి. వ్యాపించుచున్నవి. విస్తారముగ వర్షధారలు రాలుచున్నవి. మబ్బులు ఉరుముచున్నవి.
17. గాలివాన కలిగినపుడు ఉరుములు, మెరుపులు ఉరుకుచున్నవి. తల్లి ఆవు దూడను వలె గాలి మబ్బును చేరుచున్నది.
18. మరుత్తులారా! మీ వద్ద వజ్రాయుధము ఉన్నది. దానితో మీరు ఆటలాడుదురు. అప్పుడు మీరు మహాధ్వని గల గర్జన చేయుదురు. పర్వతములు గొప్పవి, అత్యున్నతములు, అయినను మీ గర్జనలకు భయపడును. ఎత్తులో ద్యులోకమునంటు సానువు గడగడలాడుచున్నది.
మరుత్తులారా! మీరు నీటివలె వ్యాపించండి. ఆటలాడండి. ఉరుకులు పెట్టండి.
19. అశ్వమా! ఆక్రందించుము. గర్జించుము. నీరు నిండిన రథము వంటి మేఘముతో పాటు సాగుము. మబ్బు డొక్కలో నీరు నింపుము. తెరచిన తలుపుల వంటిదియు, తోలు తిత్తి వంటిదగు మేఘములను ఆకర్షించుము. మిట్ట పల్లములు ఏకమగునట్లు వాన కురిపించుము.
(అప్సుయోనిర్వా అశ్వః అని తైత్తిరీయము - అశ్వమనగా జలముల జన్మస్థానము.)
20. అగ్నీ నీవు అజరుడవు. జలములు నీకు స్థానములు. అవి కాంతులను కప్పివేయును. గడ్డితిని పాలిచ్చు పశువు వలె - నీవు కాంతిని కప్పినను నీటిని నశింపచేయకుము.
21. అగ్నీ! నీవు నాశరహితుడవు. నీ స్థానములు అనేకములు. నీ స్వభావము ప్రకాశించుట. నీవు స్వధాన్నములు కలవాడవు. లోకములను తృప్తి చెందించువాడవు. నిన్ను అడిగిన వారలందరకు ఆత్మీయుడవు. నీ యందు - పూర్వీకుల - మాయలన్నియు దాగి ఉన్నవి.
22. మరుత్తులారా! దివినుండి మా కొరకు వర్షమును కొనిరండి. తదుపరి వ్యాప్తిమంతుడై, వర్షింపచేయు ఇంద్రుని జలధారలను ప్రవహింపచేయండి.
ఇంద్రా! నీవు అసువుల నొసగు వాడవు. మాకు నీవు ఉదకములను స్రవింపచేయుము. ఉరుముచు, మెరయుచు అంబరము నుండి మాముందుకు విచ్చేయుము.
23. మరుత్తులు మంచి దాతలు. యజ్ఞములందు ఋత్విగ్యజమానులు నీటిని, నేతిని వలె - మరుత్తులు జలములను ప్రవహింపచేయుదురు. శిక్షకులు అశ్వమును వలె మరుత్తులు మేఘమును అదుపు నందు ఉంచుదురు. వారు మబ్బులను అక్షయములుగ చేసి గర్జనలతో కూడిన వానలు కలిగింతురు.
24. ఋత్విగ్యజమానులారా! వాయువులు జలదాతలు. మీరు వారిని ఆకలి కలిగి ఏడ్చు బాలిక వలె ప్రార్థించుడు. అన్నపానముల కొరకు ఏడ్చుచున్న బిడ్డను ఊరడించు తలిదండ్రుల వలె వాయువులు ఋత్విగ్యజమానులను అనుగ్రహింతురు.
25. మరుత్తులారా! మీరు మధురజలమున ద్యావాపృథ్వులను తడుపండి. నేలమీద పారు నీటిచే ఓషధులను సారవంతము చేయండి. మీరు చక్కని నీటిని ప్రవహింపచేసిన ప్రదేశమందు సారవంతమగు అన్నమును, మంచి బుద్ధిగల జనులను కలిగించండి.
26. తృతీయ హవిస్సునందలి 'ఉదుత్యం జాతవేదసమ్' ఇత్యాది మంత్రములకు 'ఉదుత్యం' ప్రతీక 'చిత్రందేవానామ్' ఇత్యాది మంత్రమునకు 'చిత్రం' ప్రతీక అగును.
27. అగ్ని శుచిమంతుడు. సముద్రము నందు ఉండువాడు. అగ్నిని ఔర్వభృగువులు, అప్రవాన మహర్షి యజించినారు. మేమును వారివలెనే అగ్నిని అంతటను యజించుచున్నాము.
28. అగ్ని సూర్యుని సంతానము వంటివాడు. ఐశ్వర్యమునకు భోగము వంటివాడు. సముద్రమున ఉన్నవాడు. అతనిని అంతటను యజించుచున్నాము.
29. అగ్ని, వాయువు వంటి ధ్వనిగలవాడు. విద్వాంసుడు. మేఘము వలె సర్వజనులచే అపేక్షించబడువాడు. సముద్రనివాసి. అట్టి అగ్నిని ఉద్దేశించి హోమము చేయుచున్నాము.
శ్రీమదాంధ్ర వచన కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత
మూడవ కాండము నందలి మొదటి ప్రపాఠకము సమాప్తము.





