Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    5. యజమాని విరోధులు యజ్ఞపశువు కొరకు కలహింతురు. అపహరింతురు. అప్పుడు యజమాని విరోధులకు దుఃఖము కలుగవలెనని కువిదఙ్గేత్యాది నమో వృక్త శబ్ద ఘటితమగు ఋక్కును ఉచ్ఛరించుచు అగ్నీధ్ర స్థానమందలి అగ్ని యందు హోమము చేయవలెను. అందువలన పశువును దొంగిలించిన వాని బంధువులు అతనికి నమస్కరించుట మాని వేయుదురు. అపహర్తకు మానహాని కలుగును. అతడు మరణించును.

                                         నాలుగవ అనువాకము

    1. యజ్ఞపశువా! ప్రజలు పూర్వపువారు, ఇప్పటివారు ప్రజాపతినుండి పుట్టిన వారే. కావున నీవు ప్రజాపతి వద్దకు వెళ్లుము. నీ విషయము వివరింపుము. అతడు నీ స్వర్గప్రాప్తిని తెలిసికొని, అంగీకరించును గాత.

    2. పశుపతివైన అగ్నీ! మేము నేడు జ్యోతి ష్ఠోమము చేయుచున్నాము. ఆ కర్మ మధ్యమున పశువును బంధించు చున్నాము. దానిని నీవు ఆమోదించుము. మేము శుభప్రదమగు యజ్ఞము చేయుదుము. ఈ హవిస్సు దేవతలకు ప్రియము అగునుగాక.

    3. పశువా! నీ విషయమును దేవతలు తెలిసికొన్నారు. నీ ప్రాణములు - అవయవములందు కలవానిని - వారు స్వీకరించినారు. నీవు దేవమార్గమున స్వర్గమునకు సాగుము. ప్రాణరూపమున స్వర్గము చేరుము. మిగిలిన నీ అవయవములను పురోడాశాది హవిస్సు గావించుము.

    4. రుద్రుడు పశుపతి. అతడు ద్విపాత్తులకు, చతుష్పాత్తులకు ప్రభువు. ఈ యజ్ఞపశువు పశువుల నడిమిటిది. దాని స్వామి నుండి కొనబడినది. ఈ పశువు యజ్ఞయోగ్యతను పొందును గాక. యజమానికి సమృద్ధి కలుగును గాత.

    5. ఈ యజ్ఞ పశువు యొక్క పితృభ్రాత్రాదికములు బంధించి ఉన్నవి. అవి మనసుతోను, కంటితోను చూచుచున్నవి. అగ్ని ముందు వానికి విముక్తి కలిగించును గాత. తదుపరి ప్రజాపతి వీటిని తన ప్రజలందు కలుపును గాత. వాటికి విముక్తి కలిగించును గాత.

    6. అడవిలో ఉండు జంతువులు జాతి, వర్ణభేదమున అనేక రూపములు కలవి. అయినను పశు ధర్మమున అవన్నియు ఒక్కటియే. వానికి వాయుదేవత తొలుత విముక్తి కలిగించును గాత. తదుపరి ప్రజాపతి విముక్తి కలిగించునుగాక.

    7. దేవతలారా! ఈ పశువు లోక కారకమగు యాగమునకు మూలము. దీనిని దాత మాతృ, పితృ, భ్రాతరులనుండి విడిపించండి. యజమానికి స్వర్గప్రాప్తి కలిగించండి.

    ఈ పశువు యొక్క అవయవములు ఉపాకరణమున సంస్కరించబడినవి. దేవతలందు వ్యాపించి ఉన్నవి. ఇవి దేవతల ఉనికికి ఉపకరించునుగాత.

    8. యజమాని ప్రాణము పశుప్రాణమువలె అనేక విధములు అగునుగాక. యజ్ఞము పశువు ప్రాణము వెంట స్వర్గమును చేరునుగాత. పశురూపాన్నము దేవతలకు జీవనహేతువు అగునుగాక. సత్యాస్సంతు యాజమానస్యకామాః - యజమాని కోరికలు నిజాములు అగునుగాత.

    9. పశువు వధ సమయమున అరచి ఉండవచ్చును. కాళ్లు, రొమ్ము కొట్టుకొని ఉండవచ్చును. అగ్ని ఆ పాపముల నుండి మాకు విముక్తి కలిగించును గాక.

    10. పశువిశసన కర్తలగు దేవతలారా! మీరు అన్య దేవతలతో కూడి ఈ యజ్ఞమును జరిపించండి. బంధన రూపరజ్జువు నుండి పశువును విడిపించండి. బంధనము వలన కలిగిన దోషము నుండి యజమానికి విముక్తి కలిగించండి.

    (అధ్వర్యు, యజమానులు ఏకశూల, ద్విశూలములను తీసికొని పశు విశసన స్థలమునకు రావలయును.)

    11. నేల ఈ పశువును కట్టిన త్రాటిని విడుచునుగాత. పశువులకు, పశుపతికి నమస్కరించుచున్నాను.

    (పశువు కట్లు విడిపించవలెను.)

    12. నా విషయమున శత్రుత్వము వహించు వానిని నాకన్న తక్కువ వానిని చేయుచున్నాను. మేము ద్వేషించు వాని మీద ఈ పాశము విసరుచున్నాను.

    13. అగ్నీ! నీవు దేవతలకు హవ్యవాహనుడవు. పచ్చి హవిస్సును పక్వము చేయువాడవు. యజ్ఞ సంపాదనార్హుడవు. అట్లని దేవతలు నిశ్చయించి ఉన్నారు.

    జాతవేద అగ్నీ! నీవు బలిష్ఠుడవు. ఉత్సాహవంతుడవు. సంతోషముగా ఈ హవిస్సును వహింపుము.

    14. అగ్నీ! నీవు వపను పట్టుకొని దేవతల వద్దకు పొమ్ము. నీవు మానవహోతల కన్న పూర్వపు హోతవు. ఆజ్యముచే దేవతల దేహములను వర్థిల్లచేయుము. ఆ దేవతలు 'స్వాహా' అని సమర్పించిన దానిని ఆరగింతురుగాక.

    15. స్వాహా దేవేభ్యో దేవేభ్య స్స్వాహా.

                                        అయిదవ అనువాకము

    1. పశువులు ప్రజాపతి వలన కలిగినవి. వానికి రుద్రుడు అధిపతి. వానిని "ప్రజాపతేర్జాయమానాః" "ఇమామ్ పశుమ్" ఇత్యాది మంత్రములచే పశూపకరణము చేయవలెను. అది యజమాని నిరపరాధత్వము కొరకు అగును. ప్రజాపతి మరియు అగ్నిదేవతల కొరకే పశువును ఆలంభనము చేసినట్లగును.

    2. యజమాని రెండు కాళ్లవాడు. అందువలన రెండు మంత్రములచే ఉపాకరణము చేయవలెను.

    3. ఉపాకరణము చేసిన యజమాని "ప్రజానన్తః" ఇత్యాది అయిదు మంత్రములచేత హోమము చేయవలెను.

    4. విశసనమునకు కొనిపోవు పశువు పృష్టభాగమును యజమాని చేతితో తాకిన మరణించును. దానిని నివారించుటకే యజమాని ప్రాణము - పశుప్రాణము వలె - అనేక విధములు అగును గాక, అని చెప్పబడినది.

    5. శాంతి కొరకు గాను 4. 9 మంత్రముచే అధ్వర్యుడు హోమము చేయవలెను.

    6. పశు విశసనకర్తలగు 4. 10 మంత్రమును అనుసరించియే ఉన్నది.

    7. హోమ నిమిత్తము వపను తెచ్చునపుడు అగ్ని నుండి యజ్ఞము తొలగిపోవును. ఆ దోష నివారణార్థము వపపైభాగమున హోమము చేయవలెను. ఆ విధముగా చేసిన అగ్నినుండియే యజ్ఞమును పొందిన వాడగును. అంతేకాక పక్వము అయినట్లు అగును.

    8. కొందరు దేవతలు హోమమునకు పూర్వము స్వాహాకారమున సంతోషించెదరు. కొందరు హోమము చివరన స్వాహాకారమున సంతోషించెదరు. కొందరు హోమము చివరన స్వాహాకారమున సంతోషించెదరు. కావున యజమాని "స్వాహా దేవేభ్యః" "దేవేభ్యః స్వాహా" అని హోమము చేయవలెను. అందువలన ఉభయ ప్రకార దేవతలను సంతోష పెట్టినవాడు అగుచున్నాడు.

                                      ఆరవ అనువాకము

    1. నిర్దిష్ట దేవతలను అతిక్రమించి యజ్ఞము చేయువాడు దేవతలచే విడువబడుచున్నాడు. అందువలన అతడు దరిద్రుడు అగుచున్నాడు.

    నిర్దిష్ట దేవతలను అనుసరించి యజ్ఞము చేయువాడు దేవతలచే విడువబడుటలేదు. అందువలన అతడు ధనము కలవాడు అగుచున్నాడు.

    అగ్ని దేవతాక ఋక్కులచే అగ్నీధ్రమును అభిమర్శించవలెను. విష్ణుదేవతాక ఋక్కుచే హవిర్ధానమును అభిమర్శించ వలెను.

    అగ్ని దేవతాక ఋక్కులచేత స్రుక్కులను, వాయుదేవతాక ఋక్కులచేత వాయువ్య గ్రహములను, ఇంద్ర దేవతాక ఋక్కులచే సదస్సును అభిమర్శించవలెను.

    ఆ విధముగా చేసిన నిర్దిష్ట దేవతలను అనుసరించియే యజ్ఞము చేసినట్లగును. అతడు దేవతలచే విడువబడిన వాడు కాకుండును. అంతేకాక ధనవంతుడు అగును.

    2. ద్రోణకలశమా! నీవు పృథివీ రూపమవు. నిన్ను అగ్నితో కూర్చుచున్నాను.

    ఆదవనీయ పాత్రమా! నీవు వాయురూపమవు. నిన్ను అంతరిక్షముతో కూర్చుచున్నాను.

    పూతభృత్ పాత్రమా! నీవు స్వర్గరూపమవు. నిన్ను సూర్యునితో కూర్చుచున్నాను.

    3. జుహువు, ఉపభృత్తు, ధ్రువము అనెడి స్రుక్కులను వేరువేరుగా సూర్యకాంతిచే పరిరక్షించుచున్నాను.

    4. ఊర్ధ్వపాత్రమా! అగ్ని నిన్ను రక్షించును గాక. గాయత్రి నిన్ను రక్షించును గాక. నీవు సోమరసము నింపు ఉపాంశు పాత్రవు అగుచున్నావు.

    5. ఊర్ధ్వపాత్రమా! సోమదేవత, త్రిష్టుప్ ఛందస్సు నిన్ను రక్షించును గాక. నీవు సోమరసము నింపు అంతర్యామ పాత్రవు అగుచున్నావు.

    ఇంద్రదేవత, జగతీ ఛందస్సు నిన్ను రక్షింతురుగాక. నీవు ఇంద్రవాయుదేవతాక సోమము నింపుపాత్రవు అగుచున్నావు.

    బృహస్పతి, అనుష్టుప్ ఛందస్సు నిన్ను రక్షింతురు గాక. నీవు మిత్రావరుణ దేవతాక సోమరసపాత్రవు అగుదువుగాక.

    అశ్వినీదేవతలు, పంక్తి ఛందస్సు నిన్ను రక్షింతురు గాక. నీవు అశ్వినీదేవతాక సోమరసపాత్రవు అగుదువుగాక.

    చంద్రుడు, సతోబృహతీ ఛందస్సు నిన్ను రక్షింతురు గాత. నీవు మన్ధి సంబంధ సోమరసపాత్రవు అగుదువు గాక.

    విశ్వేదేవతలు, ఉష్ణిక్ ఛందస్సు నిన్ను రక్షింతురుగాత. నీవు ఆగ్రాయణ సోమరస పాత్రవు అగుదువుగాక.

    ఇంద్రుడు, కకుప్ ఛందస్సు నిన్ను రక్షింతురుగాక. నీవు ఉక్థ సోమరసపాత్రవు అగుదువుగాక.

    పృథివి, విరాట్ ఛందస్సు నిన్ను రక్షించునుగాక. నీవు ధ్రువ సోమరసపాత్రవు అగుదువుగాక.

                                       ఏడవ అనువాకము

    1. అధ్వర్యుడు యాగవిధులందు ఆలస్య ప్రమాదాదుల వలన అభీష్టనాశము చేయును. యజ్ఞనాశము యజమానికి బాధలు కలిగించును. కాని అది అంతకు ముందే అధ్వర్యుని బాధించును. దానిని నివారించుటకు గాను అధ్వర్యుడు 'ఆసన్యా' ఇత్యాది మంత్రములచే అగ్నీధ్ర స్థానమునందు ఆజ్యహోమము చేయవలెను. అందువలన అధ్వర్యుడు తాను సుఖము పొందుచున్నాడు. యజమాని దుఃఖ రహితుడు అగుచున్నాడు.

    2. అగ్నీ! శయనమునకు, ఆసనమునకు, గాయత్రీ కర్తృకమైన శత్రుపరాభవము కొరకు నీకు స్వాహా. త్రిష్టుప్ కర్తృకమైన శత్రుపరాభవము కొరకు నీకు స్వాహా. జగతీ కర్తృకమైన శత్రుపరాభవము కొఱకు నీకు స్వాహా.

    ప్రాణాపానములారా! మృత్యువు నుండి నన్ను రక్షించండి. నన్ను విడిచిపోకండి.

    3. యజమానులు పరస్పర మాత్సర్యముతో సోమయాగములు చేయుదురు. వారి విషయమున దేవతలును, ప్రాణాపానములు పరస్పర విరుద్ధములగును. ఛందస్సులే పరస్పర అనుకూల, విరుద్ధ కారకులు. కావున యజమాని మంత్రముల చేతనే విరుద్ధ ఛందస్సులను నశింపచేయును. 

    4. ప్రకృష్ట గతి కల ఆజ్యస్తోత్రములు యజమానికి అభిజయము కలిగించును. మరుత్వతములగు ఆజ్యస్తోత్రములను ప్రారంభించునట్టి ఋక్కులు యజమానికి విజయము కలిగించును. బృహత్సామా, రథన్తరసామములు రెండును సోమయాగమున ఆచరించదగినవి అగుచున్నవి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.