Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha
జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||
ముప్పది ఎనిమిదవ అధ్యాయము
1. (గోవును కట్టునట్టి రజ్జువును పట్టుకొనవలెను)
దేవస్య త్వా సవితుః ప్రసవ్కేశ్విర్బాహుభ్యాం పూష్ణో హస్తాభ్యాయ్
ఆదద్కేదిత్యైరాత్నాసి|
నేను సవితా దేవత అనుజ్ఞ యందు ఉన్నవాడను. ఈ రజ్జువును అశ్వినుల బాహువులతోను, పూష హస్తములతోను పట్టుకొనుచున్నాను. ఇది అదితికి మేఖల అగును.
2. ఇడా! విచ్చేయుము. అదితీ! విచ్చేయుము. సరస్వతీ! విచ్చేయుము. గోమాతా! విచ్చేయుము.
(ధావలి ఏహి ఏవంత్రిః - గోమాతా! విచ్చేయుము అని మూడుసార్లు పిలువవలెను.)
3. రజ్జువా! నీవు అదితి మేఖలవు, ఇంద్రాణి శిరోభూషణమవు.
(త్రాడుచే గోవు వెనుక కాళ్ళు కట్టవలెను.)
వత్సమా! నీవు పూషవగుదువు.
(దూడను విడువవలెను.) దూడా! ఘర్మమునకు కొన్ని పాలు ఉంచుము. (దూడను తొలగించవలెను)
4. గోమాతా! అశ్వినుల కొరకు పాలు ఇమ్ము. సరస్వతి కొరకు పాలు ఇమ్ము. ఇంద్రుని కొరకు పాలు ఇమ్ము. (పాలు పితుకవలెను.)
(పితుకునప్పుడు చిమ్మిపడిన పాల చుక్కలను ఉద్దేశించి) ఇది ఇంద్రునకు ఆహుతియగును.
5. తల్లీ సరస్వతీ! నీ స్తనము సుప్తమట్లున్నది. అది సుఖ స్వరూపమగును. రత్నములు ఇచ్చునదగును. ధనలాభము కలిగించునది అగును. సుదాత అగును. సకల వరణీయ ధనములను పోషించునదగును. నీ స్తన్యము ఇచ్చుటకు మా వైపు మరలుము. నేను విశాల అంతరిక్షమును అందుకొనగలను!
(సప్త ఇవాస్తే అనుపభోక్త్కన్యైః ఇతరులు అనుభవించనిది.)
6. (పరీశాసావదత్తే - రెండు పరీశసములను పట్టుకొని - ద్యావాపృథ్వీ పరీశాసౌ ఇతి శత పథం)
ప్రథమ పరీశసమా! నీవు గాయత్రీ ఛందమవు. ద్వితీయ పరీశసమా! నీవు త్రిష్టుప్ ఛందమవు.
(పరీశసములచే మహావీరమును పట్టవలెను.)
ఘర్మమా! నిన్ను ద్యావాపృథ్వుల కొరకు గ్రహించుచున్నాను.
(మహావీరఘటమును తుడిచి ఉపయమన స్రువమున దానిని పట్టుకొనవలెను.)
ఘర్మమా! నిన్ను నేను అంతరిక్షపు ఉదరము నుంచి గ్రహించుచున్నాను.
(మహా వీర ఘటమును మేకపాలచే తడుపవలెను.)
ఇంద్రా! అశ్వినులారా! తేనెటీగలు కూర్చిన ఈ మధువును సేవించండి. వసువులారా! ఈ పాలను వర్షము నిచ్చునట్టి సూర్యుని కిరణములకు సమర్పించండి.
7. సముద్ర రూప వాయువునకు స్వాహా. ఆదిత్య యుక్త ఇంద్రునకు స్వాహా. శత్రు హంత ఇంద్రునకు స్వాహా. ఋభు, విభ్వ, వాజయుక్త సవితాయ స్వాహా. బృహస్పతయే త్వా విశ్వదేవ్యావతే స్వాహా.
8. వసురుద్ర యుక్త ఇంద్రునకు స్వాహా. ఆదిత్య యుక్త ఇంద్రునకు స్వాహా. శత్రుహంత ఇంద్రునకు స్వాహా. యుభు, విభ్వ, వాజయుక్త సవితాయ స్వాహా. బృహస్పతయే త్వా విశ్వదేవ్యావతే స్వాహా.
9. యమాయ త్వాంగిరస్వతే పితృమతే స్వాహా| ఘర్మాయ స్వాహా ఘర్మః పిత్రే!
10. అధ్వర్యు దక్షిణ దిశన కూర్చుండి సకల దేవతలను యజించును. అందువలన దిశలన్నియు దక్షిణ దిశయందు ప్రతిష్ఠితములై ఉన్నవి.
అశ్వినులారా! ఘర్మస్థ మధువుయొక్క స్వాహా కృత అంశమును పానము చేయండి.
11. (మహావీరమును మూడుసార్లు పైకి ఎగురవేసి పట్టుకొనవలెను)
ఈ యజ్ఞమును ద్యులోకమునకు చేర్చుము. చేర్చుము ఈ యజ్ఞమును ద్యులోకమునకు స్వాహాగ్నయే యజ్ఞియాయ. యజనీయ అగ్నికి స్వాహా. శం యజుర్భ్యః యజువులు మాకు శుభములు కలిగించును గాత.
12. అశ్వినులారా! రాత్రింబవళ్ళు మీ రక్షణలచే హృదయయంగమ ఘర్మస్థ మధువును సేవించండి. నమో ఆదిత్యాయ. నమోద్యావాపృథివీభ్యాం.
13. అశ్వినులారా! ఘర్మము యొక్క మధుర దుగ్ధములను సేవించండి. ద్యావాపృథ్వులు మా కార్యములను ఆమోదింతురు గాత. ఇంద్రాదుల దానాదులు మా యజ్ఞమందే అగును గాత.
14. అతితప్త ధర్మమా! వర్షము కొరకు పుష్టినొందుము. అన్నము కొరకు పుష్టి నొందుము. బ్రాహ్మణ, క్షత్రియుల కొరకు పుష్టి నొందుము. ద్యావాపృథ్వుల కొరకు నొందుము.
ధర్మమా! నీవు జగత్తును ధరించుదానవు. సుధర్మమవు. మమ్ము హింసించకుము. మాకు ధనాదులు అందించుము. బ్రాహ్మణ క్షత్రియులను మా అధీనులను చేయుము.
15. (శకలైర్జుహోతి)
స్నేహోత్పాదక పూషకు స్వాహా. గ్రహణకారి ప్రాణములకు స్వాహా. ప్రతిరవకారి ప్రాణములకు స్వాహా. పితృభ్యః ఊర్ధ్య బర్హిభ్యో ధర్మ పావభ్యః స్వాహా. ద్యావాపృథివీ భ్యాం స్వాహా. విశ్వేభ్యో దేవేభ్యో స్వాహా.
16. ఋత్విజులచే నుతించబడు రుద్రునకు స్వాహా. జ్యోతిచే జ్యోతిష్మతియగు ప్రజ్ఞాపక దినమార్తాండునకు స్వాహా. జ్యోతిచే జ్యోతిష్మతి యగు ప్రజ్ఞాపాక అగ్నికి స్వాహా.
అత్యంత వీరుడగు అగ్నియందు మధువు హోమము చేయబడినది. తేదేవ ధర్మ నమస్తే మా మా హింసీః - మమ్ము బాధించకుము.
17. ధర్మమా! నీ సుబుద్ధియు, విస్తారమహిమయు ఈ ద్యులోకమును ప్రభావితము చేసినవి. నీ యశస్సు పృథ్వి యందంతటను వ్యాపించినది.
అగ్నీ! నీవు ఎంతో గొప్పవాడవు. రక్తవర్ణపు నీ పొగను పెంచుము. దేవతలకు ప్రియతముడవగు నీవు జాజల్యమానుడవగుము.
18. ధర్మమా! నీ కాంతి ద్యులోకమందున్నది. గాయత్రి ఛందమున ఉన్నది. హవిర్థాన గృహమున ఉన్నది. ఆ జ్యోతి వర్థిల్లును గాత. స్వాహా.
ధర్మమా! నీ జ్యోతి అంతరిక్షమున ఉన్నది. త్రిష్టుప్ ఛందమున ఉన్నది. అగ్నీధ్ర గృహమున ఉన్నది. ఆ జ్యోతి వర్ధిల్లును గాత. స్వాహా.
ధర్మమా! నీ వెలుగు భూలోకమందున్నది. జగతీ ఛందమునందున్నది. సదస్సునందున్నది. ఆ వెలుగు వర్ధిలును గాత. స్వాహా.
(అధ్వర్యు మూడు శలాకలపైన ఘృతాహుతులు ఇచ్చును.)
19. మహావీరమా! క్షత్రియుల పరమ పాలన కొరకు నిన్ను అనుసరించుచున్నాము. బ్రాహ్మణుల దేహముల కొరకు పాలించుము. ప్రజయందు ధర్మము ధరింప చేసి నందున నిన్ను అనుసరించుచున్నాము. నవ శుభములు కొరకని మేము నిన్ను అనుసరించుచున్నాము.
(హోమానంతర మధ్వర్యుః పత్నీమగ్రేకృత్వా శాలాయ నిష్క్రమతీత్యర్థః - హోమము ముగిసినంత అధ్వర్యు పత్నిని ముందుంచుకొని నిష్క్రమించును)
20. మహా వీరము నాలుగు దిశల రూపమగు నాలుగు కోణముల యజ్ఞమునకు నాభియు విస్తార యుక్తము అగును. సప్రథాః సనో విశ్వాయుః సప్రథాః సనః సర్వాయుః - ఆ మహావీరము మాకు విశ్వమందలి ఆయువును, సర్వయువును ప్రసాదించవలెను. మా నుండి ద్వేషమును తొలగించుము. కుటిలత్వము తొలగించుము. జగదనుగ్రహ రూపమునందు కలసిపోవుదుము గాక.
21. ధర్మమా! ఈ పాలు నిన్ను పూరించునవి. నీవు వానిలో నిండి పొమ్ము. వర్ధిల్లుము.
(మూడు మహా వీరములందు పాలునింపవలెను)
22. మహావీరము అభీష్ట వర్షకము. రసహారి. మిత్రుని వంటి ప్రియము. అది మరల మరల శబ్దము చేయును. జలధారము. ధననిధి యగు మహావీరము సూర్యునితో కలసి ప్రకాశించుచున్నది.
23. సుమిత్రియాన ఆప ఓషధయః సన్తు దుర్మిత్రియా స్తస్మై
సన్తుయ్కోస్మాన్ద్వేష్టి యంచ వయం ద్విష్మః
35-12 చూడగలరు.
24. ఉద్వయం తమసస్పరిస్వః పశ్యన్త ఉత్తరమ్
దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమమ్
20-21 చూడండి.
25.(సమిధమాదాయాహవనీయ్కేభ్యాదధాతి. సమిధను అందుకొని ఆహవనీయ అగ్నియందు వేయును.)
కట్టే! నీవు సమిధవు. ఆహవనీయగ్ని సమిధే! నీ కృప వలన మేము వర్ధిల్లుదుము గాత. నీవు సమిధవు. తేజస్సునకు కారణమవు. నాయందు తేజస్సు కలిగించుము.
26.(దధి ఘర్మ గ్రహణమ్. పెరుగుకుండపట్టి)
ఇంద్రా! ద్యావాపృథ్వులు ఎంత విస్తారములగునో, సప్తసాగరములు ఎంత విస్తారములగునో అంతటి పరిమాణము గల పాత్రయందు అన్నము నింపి పట్టుకున్నాను. అది అక్షయము. అది నాయందు అక్షయము అగును గాత.
27. ఇంద్రుని ప్రసిద్ధమహాబలము నాలో చేరవలెను. సంకల్ప సంపద నాలో చేరవలెను. సంకల్పబలము నాలో చేరవలెను. ఆదిత్యజ్యోతి, వేదజ్యోతి, బ్రహ్మజ్యోతి సహితమగు ధర్మము నాలో చేరవలెను.
28. పాలయొక్క సారభూతమగు పెరుగు ఈఘటమునందు నిండియున్నది. దీని ప్రభావమును మేము రానున్న - రానున్న సంవత్సరముల వరకు అనుభవింతుము గాత.
ఘటమా! నీవు కాంతి స్వరూపమవు. స్వీకర్తవుసు- సుఖపాలకమవు. ఈ దధిహోమశేషము. ఇంద్ర పేతము. ప్రజాపతి భక్షితము. మాధుర్యయుక్తము. ఆహ్వాతము. ఇటువంటి నీ దధి అంశమును, ఆహ్వానించబడినవాడనై భక్షించుచున్నాను.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహిత యందలి
మహావీర నిరూపణమను ముప్పది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.
మయిత్యాదిన్ద్రియం బృహన్మయి దక్షోమయి క్రతుః
ఘర్మస్త్రిశుగ్వి రాజతి విరాజా జ్యోతిషాసహ బ్రాహ్మణా తేజసా సహ.





