Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



                      జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
                    ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||
       
                                 ముప్పది ఏడవ అధ్యాయము

1.    దేవస్యత్వాసవితుః ప్రసవ్కే శ్వినోర్బాభ్యాంపూష్ణో హస్తాభ్యాం|
    ఆదదే నారిరసి ||

    (మట్టి త్రవ్వు అభ్రిని పట్టుకొని)
   
    అభ్రీ! నేను సవితా దేవత ప్రేరణయందు ఉన్నవాడను. అశ్వినుల బాహువులతో పూష హస్తముల చేతను నిన్ను పట్టినాను. నీవు నారీ రూపమవు.

    2. విద్వాంసులు, ద్విజులు, యజమాని యొక్క మహా ఋత్విజులు మనసులను ఏకాగ్రము చేసినారు. తమ బుద్ధి వృత్తులను ఏకాగ్రము చేసినారు. ప్రజ్ఞానియగు హోత యజ్ఞవిధిని జరిపించును. ఇది సవితా దేవత మహా పరిస్తుతి అగును.

    3. ద్యోతమాన ద్యావాపృథ్వులారా! ఇది పృథ్వికి దేవయజన స్థానమగు యజ్ఞము. ద్యులోకము నుండి జలమును - పృథ్వి నుండి మట్టిని తీసి యజ్ఞమునకు శిరోభూతమగు మహా వీరఘటము చేయుచున్నాను.

    (నేలను త్రవ్వి మట్టిని చేతిలోనికి  తీసుకొనవలెను)

    మృత్తికా! యజ్ఞము కొరకును, యజ్ఞ శిరోభూతమగు మహా వీరఘటము కొరకును నిన్ను అందుకొనుచున్నాను.

    4. చెదలు దేవతలారా! అన్నింటి కన్న ముందు భూమి ఉత్పన్నమైనది. భూతముల ఉత్పత్తి కన్న ముందు మీరు పుట్టినారు. ఇది దేవయజన స్థాన యజ్ఞము. ఈ యజ్ఞమునకు శిరోభూతమగు మహావీర ఘట నిర్మాణమునకు మీ మట్టిని తీసికొనుచున్నాము.

    (పుట్ట మట్టిని తీసికొనవలెను)

    వల్మీక మృత్తికా! మహా వీరఘట నిర్మాణమునకు నిన్ను తీసికొన్నాము.

    5. ఆది కాలమున ఈ పృథ్వి కొద్దిగా ఉండెను. పృథ్వి! పృథ్వియొక్క దేవయజన స్థాన యజ్ఞమున యజ్ఞ శిరోభూతమగు మహా వీరఘటనిర్మాణము కొరకు నిన్ను తీసికొందును.

    (పందులు ముట్టెలతో త్రవ్విన మట్టిని తీసికొనవలెను)

    మృత్తికా! యజ్ఞము కొరకు నిన్ను తీసుకొనుచున్నాను. యజ్ఞ శిరోభూత మహా వీర ఘటము కొరకు నిన్ను సేకరించినాను.

    6. పూతికా తృణమా! నీవు ఇంద్రుని ఓజస్సున ఉత్పన్నమైనావు. పృథ్వి యొక్క దేవయజన స్థాన యజ్ఞమున - యజ్ఞ శిరోభూత మహావీరఘట నిర్మాణమునకు నిన్ను అందుకొనుచున్నాను.

    (మేక పాలు తీసుకొనవలెను.)

    దుగ్ధమా! యజ్ఞము కొరకును, యజ్ఞ శిరోభూతమగు మహా వీర ఘట నిర్మాణము కొరకును నిన్ను తీసికొనుచున్నాను.

    (కృష్ణాజినము మీద సేకరించిన పదార్థములను ఉంచవలెను.)

    పదార్థములారా! యజ్ఞము కొరకును, యజ్ఞ శిరోభూత మహా వీర ఘటము కొరకును మిమ్ము స్పృశించుచున్నాను.

    7. (కృష్ణాజినము పట్టుకొని "పరివృత్తము" వైపు నడువవలెను.)

    బ్రాహ్మణస్పతి విచ్చేయును గాత. సత్య, ద్యుతి మంత ద్యావాపృథ్వులు విచ్చేయుదురు గాత. వీరుడు, మానవ హితకారి, పంక్తి, సాధకుడు మా యజ్ఞమును జారిపింతురు గాత.

    (పదార్థములను ఒక చతురస్ర స్థలమున 'పరివృత్త' మందు పెట్టవలెను.)

    పదార్థములారా! యజ్ఞము, యజ్ఞ శిరోభూతమగు మహా వీర ఘటము కొరకు మిమ్ము ఇచట పరివృత్తమున చేర్చుచున్నాను.

    (పుట్ట మన్ను, పందులు త్రవ్విన మన్ను, పూతికా తృణములను పాలతో కలిపి పిసుకవలెను.)

    పదార్థములారా! యజ్ఞము మరియు  యజ్ఞశిరోభూత మహావీర ఘటము కొరకు మిమ్ము కలుపుచున్నాను.

    (క్రమముగా మూడు మహావీరఘటములను వీధి ప్రకారము చేయవలెను.)

    మహావీరఘటములారా! యజ్ఞము కొరకును, యజ్ఞ శిరో భూత యజ్ఞ  దేవత కొరకును మిమ్ము నిర్మించుచున్నాను.

    8. ప్రథమ మహా వీర ఘటమా! నీవు యజ్ఞపు శిరమవు. (తాకవలెను) యజ్ఞము కొరకును, యజ్ఞ శిరోభూత యజ్ఞ దేవత కొరకును నిన్ను తాకుచున్నాను.

    ద్వితీయ మహా వీర ఘటమా! నీవు యజ్ఞపు శీర్షమవు. (తాకవలెను) యజ్ఞము కొరకును యజ్ఞ శిరోభూత దేవత కొరకును నిన్ను తాకుచున్నాను.

    తృతీయ మహా వీరఘటమా! నీవు యజ్ఞపు తలవు. యజ్ఞము కొరకును యజ్ఞ శిరోభూత దేవత కొరకును నిన్ను తాకుచున్నాను. (స్పృశించవలెను.)

    మహావీర ఘటములారా! యజ్ఞము కొరకును, యజ్ఞ శిరోభూత దేవత కొరకును మిమ్ము నున్నగా చేయుచున్నాను.

   
            ఏవమగ్రిమౌ మన్త్రౌ

    9. ప్రథమ మహా వీర ఘటమా! పృథివియొక్క దేవయజనస్థానయజ్ఞమందు సేచక అశ్వపు లద్దిచే నిన్ను ధూపితము చేయుచున్నాను.

    ద్వితీయ మహావీరఘటమా! పృథివి యొక్క దేవయజన స్థాన యజ్ఞమందు సేచక అశ్వపు లద్ది చే నిన్ను ధూపితము చేయుచున్నాను.

    తృతీయ మహా వీరఘటమా! అశ్వస్య త్వా వృష్ణాః శక్నా ధూపయామి దేవయజనే పృథివ్యాః

    మఖాయత్వా మఖస్యత్వా శీర్ష్ణే | మఖాయత్వా మఖస్యత్వా శీర్ష్ణే |
    మఖాయత్వా మఖస్యత్వా శీర్ష్ణే | మఖాయత్వా మఖస్యత్వా శీర్ష్ణే |

    10. (పక్వానుద్ధరతి - కాలినవానిని తీయవలెను.)

    ప్రథమ మహావీరఘటమా! ఋజు ద్యులోకము కొరకు నిన్ను నిప్పుల మీది నుంచి దింపుచున్నాను.

    ద్వితీయ మహా వీర ఘటమా! వర్షించి సకల కార్యములు సాధించు అంతరిక్షము కొరకు నిన్ను నిప్పుల మీది నుంచి దించుచున్నాను.

    తృతీయ మహా వీర ఘటమా! మేము నివసించుటకు ఆధార భూతమగు భూమి కొరకు నిన్ను అగ్గి మీది నుంచి దింపుచున్నాను.

    మహా వీర ఘటములారా!  యజ్ఞము కొరకును, యజ్ఞ శిరోభూత దేవత కొరకును మిమ్ము నేను పాలచే తడుపుచున్నాను. (మేక పాలతో తడుపవలెను)

   
        మహా వీర సంభరణం సమాప్తమ్

    11. (బ్రహ్మానుజ్ఞాతో యామాయత్వేతి మహావీరం ప్రోక్షతి - బ్రహ్మచే అనుమతి పొందినవాడై యమాయతో మొదలిడి మహా వీరులను ప్రోక్షించును)

    ఘర్మమా! యమ, యజ్ఞ, సూర్య తాపము కొరకు నిన్ను జలముచే ప్రోక్షించుచున్నాను.

    ఘర్మమా! సవితా దేవత నీకు మధుర ఘృతము పూయును గాత. (నేతి పూత వేయవలెను.)

    (ఆవపు ఇసుక క్రింద నూరు మాషముల వెండి పాతిపెట్టవలెను.)

    రజతమా! నిప్పు నేలను కాల్చకుండ కాపాడుము.

    (మూడు కుండలను కాలుటకు ఆవమున పెట్టి ఆవమును మూయవలెను. ఆవపు నలుదిశలు నిప్పు అంటించవలెను.)

    ఘర్మమా! నీవు చంద్రకాంతి వంటిదానవు. అగ్నితేజమువంటి దానవు. సూర్య తాపము వంటి దానవు.

    12. (కాలి బయటికి తీసిన మహా వీరములను వ్రేలిచే తాకి చూచిన యజమాని చెప్పవలసినవి)
   
    పృథ్వీ! నీవు ప్రాగ్దిశన అగ్ని ఆధిపత్యమున ఉన్నదానవు. రాక్షసాదులు నిన్ను వేధించజాలరు. నాకు ఆయుష్యము ప్రసాదించుము.

    భూమీ! దక్షిణదిశయందు ఇంద్రుని ఆధిపత్యమున ఉన్నదానవు. పుత్రవతిని. నాకు సంతానము ప్రసాదించుము.

    ధరిత్రీ! నీవు పశ్చిమదిశన సవిత ఆధిపత్యమున ఉన్నదానవు. నీవు సుఖముల  కొరకు ఆశ్రయణీయవు. నీవు నాకు దర్శన శక్తిని ప్రసాదించుము.

    రత్నగర్భా! నీవు ఉత్తర దిక్కున ధాత ఆధిపత్యమున ఉన్నదానవు. ఋత్విజులు ఆశ్రయించు యజనీయ స్థానమవు. నాకు ధన సమృద్ధిని ప్రసాదించుము.

    ధాత్రీ! నీవు ఊర్ధ్వ దిశన బృహస్పతి ఆధిపత్యమున ఉన్నదానవు. సర్వము ధరించుదానవు. నాకు ఓజస్సు ప్రసాదించుము.

    (మహా వీర ఘటములు దక్షిణ భూమి మీద యజమాని చేతిని బోర్ల వేయును.)

    మహా వీరమునకు దక్షిణమున ఉన్న స్థలమా! నాకు నాశనము కలిగించు రాక్షసాదుల నుండి నన్ను కాపాడుము.

    (ఉత్తరము వైపు చేయిపెట్టవలెను.)

    ఉత్తర భూమీ! నీవు మనువు యొక్క అశ్వమవు. మనోరశ్వాసి.

    13. ఘర్మమా! నీవు స్వాహా ఆకారపుదానవు. నీవు మరుత్తులచే ప్రతిష్ఠించబడిన దానవు. (ఘర్మమున నూరు మాషముల బంగారము పెట్టవలెను.)

    స్వర్ణ శతమాషమా! నీవు నన్ను ద్యులోకమునంటు రాక్షసాదుల నుండి రక్షింపుము.

    (కృష్ణాజినముతో ఘర్మమును విసరవలెను.)

    ప్రాణ, అపాన, వ్యానములను ఒక్కొక్క ప్రవర్గ్యమున ఉంచుచున్నాను.

    14. ప్రవర్గ్యము దేవతలకు గర్భము, స్తుతులకు పిత. ప్రజలకు అధిపతి. ప్రవర్గ్యము సవితతో కలసి పోయినది. అది సూర్య సహితముగా వెలుగుచున్నది. సూర్యేణ రోచతే.

    15. ఘర్మము అగ్నిచే ఏకీ భూతమైనది. సవితతో కలసిపోయినది. సూర్యనిచే శోభిల్లినది స్వాహాకారఘర్మము సూర్య తేజముతో, సవితతో, సూర్యునితో కూడి వెలుగొందుచున్నది.

    16. ఏ దేవత ద్యులోకమును, కిరణములను దాల్చువాడగునో, ఎవడు మనుష్య భావ రహితుడగునో, ఎవడు సూర్యుని నుండి ఆవిర్భవించినాడో, ఆ దేవత మాకు వాక్ శక్తిని ప్రసాదించును గాత.

    17. రక్షణ ధర్మము గల ఆదిత్యుడు ఆకాశము నుండి పడడు! అతడు విభిన్న మార్గములందలి రాక పోకలను చూచుచున్నాడు! అతను తన కిరణముచే కూడినవాడై సకల లోకములందు స్వచ్ఛందముగ సంచరించును!!

    18. ఘర్మమా! నీవు సకల భువన స్వామివి. మనస్పతివి. వాచస్పతివి. నీవు దేవశ్రుతుడవు. దేవత వగుము. యజ్ఞములందు దేవతలను రక్షింపుము.

    అశ్వినులారా! ఈ యజ్ఞమున దధ్యంగ అధ్వర్యు- బ్రాహ్మణులు ఎరుగవలసిన మధు విద్యను మధు విద్యా పూజకులగు మీకు బోధించినాడు. అట్టి అశ్వినులగు మీరు కూడ మాకు రక్షకులు కావలెను.

    19. ఘర్మమా! హృదయమున నీవు, మనసున నీవు, దివియందు నీవు, సూర్యుని యందు నీవు. నీవు ఊర్ధ్వగతివి అగుము. మా యజ్ఞమును స్వర్గమందలి దేవతలకు చేర్చుము.

    20. ఘర్మమా! పితాన్కోసి. నీవు మాకు తండ్రివి. పితానో బోధి. మా తండ్రిగా ఎరుగుము. నమస్తే. అస్తు మా మాంహింసీః (తండ్రివి కావున) మమ్ము ఎన్నడును బాధించకుము.

    (ముసుగు తొలగించి ఘర్మమును దర్శించు యాజమానపత్ని అనవలసినది.)

    మహావీరా! నీవు వీర్యమునకు అధిదేవతయగు త్వష్ట యుక్తుడవు. మేము స్త్రీలము. మైథునము నిమిత్తము నిన్ను ముట్టుకుందుము. నాకు పుత్రులను, గోవులు మున్నగు పశువులను ప్రసాదించుము. అరిష్టా హం సహపత్యా భూయాసమ్ - నాపతితో కూడి బాధలు లేకుండ జీవింతును గాత.

    21. అహః కేతునా జుషతాం సుజ్యోతిర్జ్యోతిషాస్వాహా|
    రాత్రిః కేతునా జుషతాం సుజ్యోతిర్జ్యోతిషా స్వాహా||
   
    పగలు జ్యోతి సహితమై సుజ్యోతిష్మంతుడగు సూర్యునకు స్వాహా. రాత్రి శుభ జ్యోతి సహితయై సుజ్యోతిష్మంతుడగు అగ్నికి స్వాహా.

    (రౌహిణి హోమమునకు రెండు ఘృతాహుతులు ఇవ్వవలెను.) (అగ్నిర్వైఘర్మః - తప్త ఇవవై ఘర్మః ఆదిత్యోవై ఘర్మః| ఆదిత్యః ప్రవర్గ్యః ఘర్మము, ప్రవర్గ్యము ఆదిత్యుడే అగును.)


                           దాశరథి రంగాచార్య విరచిత
               శ్రీమదాంధ్రవచన శుక్ల యుజుర్వేద సంహిత యందలి
         అభ్య్రాది రౌహిణాంతమను ముప్పది ఏడవ అధ్యాయము సమాప్తము.


                                  యతో యతః సమీహసే తతోనో అభయం కురు|
                                   శం నః కురు ప్రజాభ్య్కోభయం పశుభ్యః||




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.