Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    7. ఇంద్రా ! నీవు ఫలప్రదుడవు. అనేకులచే పిలువబడు వాడవు. శతక్రతువవు. మరుత్తులతో కూడి ఈ యజ్ఞమున సోమపానము చేయుము.

    8. వజ్రధర ఇంద్రా ! నీ కొరకును మరుత్తుల కొరకును సొమము అభిషుతమై ఉన్నది. ఉక్థమంత్ర పాఠకులు మిమ్ము భక్తియుక్తులై ఆహ్వానించుచున్నారు.

    9. ఇంద్రుడా ! నీవు  మరుత్తుల మిత్రుడవు ఈ యజ్ఞము మాకు స్వర్గము ప్రసాదించునది. ఈ యజ్ఞమున అభిషుతసోమ పానము చేయుము. బలయుతుడవై వజ్రమునకు పదును పెట్టుము.

    10. అభిషవణ ఫలకముల మీది సొమము అభిషుతమైనది. సోమము త్రావుము. బలము కలుగును. నిలువుము దవడలు ఆడించుము.

    11. వీవు శత్రువినాశకుడవు. నీవు దస్యులను హతమార్చినపుడు, ద్యావాపృథ్వులు నిన్ను తలుచుకొందురు.

    12.ఎనిమిది, తొమ్మిది దిశలందు యజ్ఞమును స్పృశించు స్తుతిసహితము ఇంద్రుని కన్నా తక్కువదే! నేను ఆస్తుతితోనే స్తుతిస్తాను.

    (ఎనిమిది దిశలు + ఒక ఆదిత్యుడు = తొమ్మిది)
       
                                 అరువది ఆరవ సూక్తము
 ఋషి - కాణ్వకురుసుతి, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - గాయత్రి - 10, 11 బృహతి

    1. ఇంద్రుడు పుట్టగానే బహుకర్మశాలి అయినాడు. తల్లిని అడిగినాడు :-
   
    "ఉగ్రుడెవడు ప్రసిద్ధుడెవడు?" అని

    2. శవిసి అప్పుడు చెప్పినది :- "పుత్రా! ఊర్ణనాభ, అహీశునాదులు అనేకులు ఉన్నారు. వారిని అణచుట మంచిది" అని

    3. వృత్రఘ్న ఇంద్రుడు రథ చక్రమునకు ఇరుసు వంటి దస్యులను త్రాటితో గుంజినాడు. వారిని వధించినాడు తాను ప్రవృద్ధుడైనాడు.

    4. ఇంద్రుడు ఒకేసారి ముప్పది కమనీయపాత్రల నిండిన సోమమును పానము చేసినాడు.

    5. మూలశూన్య అంతరిక్షమందలి మేఘమును - బ్రహ్మణలను అభివృద్ధిపరచుటకు నలుదిశలనుండి కొట్టినాడు.

    6. ఇంద్రుడు మానవుల కొరకు పరిపక్వ అన్నము కల్పించ దలచినాడు. మహాశరము అందుకున్నాడు. మేఘమును చేదించినాడు.

    7. ఇంద్రా ! నీ బాణము నూరు అగ్రములు, వేయి పత్రములుగలది. నీవు ఆబాణమునే వాడెదవు.

    8. స్తోతలు, పుత్రులు, భృత్యులు, స్త్రీల కొరకు ఆ బాణమున వలసినంత ధనము తెమ్ము. ఇంద్రా ! నీవు జన్మతోనే విరాట్టువు - స్థిరుడవు.

    9. ఇంద్రా ! ఈ  పర్వతములుఎంతో పెరిగినవి. అంతట వ్యాపించినవి. వీనిని నీవే కల్పించినావు. వానిలో నీమనసు స్థిరముగా నిలుపుము.

    10. ఇంద్రా ! నీ వద్ద ఉన్న జలమంతయు విష్ణువు ప్రదానము చేసినదే. విష్ణువు ఆకాశమున పరిభ్రమించువాడు. నీ చేత ప్రేరణపొందిన వాడగును. ఇంద్రుడు నూరు మహిషములను, క్షీరాన్నమును, జలమును హరించు మేఘమును ఇచ్చినాడు.

    11. నీ ధనుస్సు అనేక బాణములు విడుచునది, సునిర్మితము, సుఖావహము అగును. నీ బాణము బంగారపుది. నీ భుజములు రమణీయములు, సుర్మభేదకములు, సుసంస్కృతములు, యజ్ఞవర్ధకములు.

                                    అరువది ఏడవ సూక్తము
 ఋషి - కాణ్వకురుసుతుడు, దేవత - ఇంద్రుడు , ఛందస్సు - గాయత్రి - 10 బృహతి.

    1. శూర ఇంద్రా ! పురోడాశము స్వీకరింపుము. వందల, వేల గోవులను మాకు ప్రసాదించుము.

    2. ఇంద్రా ! నీవు మాకు గోవులు, అశ్వములు, తైలము ప్రసాదించుము. వానితో మనోహరము, హిరణ్మయమగు అలంకారము అందించుము.

    3. శత్రువులను రాచిపెట్టువాడవు, వాసదాతవాగు ఇంద్రా ! నీవు చెప్పినదే అందరు విందురు. నీవు మాకు అనేక కర్ణాభరణములు ఇమ్ము.

    4. ఇంద్రా ! నీవు కాక అన్యులు వర్థకులుకారు. యుద్ధమున నిన్ను మించినశూరుడు లేడు. నిన్ను మించిన దాతలేడు. నీవు కాక ఋత్విక్కులను నేతలేడు.

    5. ఇంద్రుడు ఎవరిని తిరస్కరించడు. ఇంద్రుడు ఎవరితోను ఓటమి ఎరుగడు. అతడు లోకములను చూచును వినును.

    6. ఇంద్రుని మానవులు వధింపజాలరు. అతని మనసున క్రోధమునకు స్థానము లేడు. నింద కన్నా ముందే నిందకు చోటివ్వడు.

    7. క్షిప్రకారి, వృత్రఘ్న, సోమపాయ ఇంద్రుని ఉదరము - సేవకుల కర్మలతో నిండును.

    8. ఇంద్రా ! నీలో నీకు ధనములు ఇమిడి ఉన్నవి. సమస్త సౌభాగ్యములు ఉన్నవి. నీదానము కౌటిల్యములేనిది.

    9. నామనసు యవలు, గోవులు, సువర్ణము, ఆభరణములు కోరి నీ వద్దకు వచ్చును.

    10. ఇంద్రా! నీ ఆశతోనే నేను కొడవలి పట్టినాను. ఇంతకు ముందు నూర్చిన యవల ------ఆశలు నేరవేర్చును.

                              అరువది ఎనిమిదివ సూక్తము
    ఋషి - భార్గవ కృత్నుడు దేవత - సోమదేవత ఛందస్సు - గాయత్రి 9. అనుష్టుప్

    1. ఇతడు సోమకర్త. ఇతనిని గ్రహించువారు లేరు. ఇతడు విశ్వజిత్, ఉద్భుత సోమ యజ్ఞనిపృకుడు. అతడు ఋషి మేధావి కావ్యమున స్తుత్యుడు.

    2.సోముడు దిగంబరివి ఆచ్చాదించును. రోగికి ఆరోగ్యము కలిగించును. గ్రుడ్డివానికి కాళ్లు ఇచ్చును.

    3. సోమా ! శరీరమును కృశింపచేయు అన్యకృతుల అప్రియ కార్యముల నుండి రక్షింపుము.
   
    4. ఋజీషసోమవంత సోమమా! నీవు ప్రజ్ఞమరియు బలముతో ద్యులోక, భూలోకములందలి మా శత్రువుల కార్యములను నిష్పలము చేయము.

    5. ధనము కోరిన జనులు ధనికుని వద్దకు పోయిన దాతయొక్క దానము లభించును. భక్షుకుని కోరిక తీరును.

    6. పురాతన ధనము లభించినపుడు యజ్ఞాభిలాషికి ప్రేరణ కలుగును అప్పుడే దీర్ఘాయువు లభించును.

    7. సోమా ! నీవు హృదయమందు సుందర, సుఖకర, యజ్ఞసంపాదక, నిశ్చల మంగల కరుడవు.

    8. సోమా ! నీవు  మమ్ము చంచలులను చేయకుము. మమ్ము భయపెట్టకుము. మా హృదయమందలి ప్రకాశమును మాపకుము.

    9. స్వకీయస్థానమున దుర్బుద్ధి  ప్రవేశించవద్దు. శత్రువులను దూరము చేయుము. సోమరస సేవనము చేయువారి హింసకులను వధించుము.
   
                              అరువది తొమ్మిదవ సూక్తము
    ఋషి - నోధాస పుత్రుడు ఏకద్యునుడు దేవత - ఇంద్రుడు ఛందస్సు
                                - గాయత్రి 10 అనుష్టుప్


    1. ఇంద్రా ! నిన్ను వినా అన్యులను అభిమానించను. కావున సుఖము ప్రసాదించుము.

    2. అహింసక ఇంద్రుడు నన్ను తన ప్రాప్తికొరకు కాపాడినడో, అతడు మాకు సదా సుఖములను అందించవలెను.

    3. ఇంద్రా ! నీవు ఆరాధకుని కాపాడుము. అభిషవ కర్తను రక్షింపుము. మాకు బహుధానములను ఇమ్ము.

    4. ఇంద్రా ! నీవు మా వెనుక ఉండి మారథమును రక్షింపుము. దానిని ముందుకు సాగనిమ్ము.

    5. శత్రుహంత ఇంద్రా ! ఇప్పుడు నీ వెందుకు మిన్నకున్నావు. రథములలో మా రథమును ప్రథానము చేయుము. మేము కోరిన అన్నము నీ వద్ద ఉన్నది.

    6. ఇంద్రా ! మా  అన్నాభిలాషి రథమును రక్షింపుము. మమ్ము యుద్ధమున అన్ని  విధముల  విజయవంతులను చేయుట నీ కర్తవ్యమగును.

    7. ఇంద్రా ! నీవు బలపడుము. నీవు నగర  సముడవు. మంగళమయ స్తుతి సమయము ననుసరించి నీ వద్దకు చేరును. నీవు యజ్ఞసంపాదకుడవు.

    8. నిందల పాలగు వ్యక్తి మావద్దకు రావద్దు. విశాల దిశలందున్న ధనము మాది కావలెను. శత్రువు నష్టపోవలెను.

    9. అమర దేవతలారా ! ఏకద్యుఋషి మిమ్ములను మీ భార్యలను వర్ధిల్లచేయును. సంతృప్తిచెందించును. మాకు విశేష ధనమును ఇమ్ము. కర్మధన ఇంద్రుడు ప్రాతఃకాలమే విచ్చేయవలెను.

    (శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత ఆరవ అష్టకము ఎనిమిదివ మండలమున ఎనిమిదవ అనువాకము సమాప్తము)

                తొమ్మిదవ అనువాకము         అరువది తొమ్మిదవ సూక్తము   
             ఋషి - కణ్వపుత్ర కుసేదనుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - గాయత్రి.

    1. ఇంద్రా ! నీ చేతులు గొప్పవి. నీవు మాకిచ్చుటకు - స్తుత్యము, విచిత్రము, గ్రహణయోగ్యమగు ధనమును కుడిచేత పట్టుకొనుము.

    2. ఇంద్రా ! నీవు బహుకర్మ, బాహుదాత, బహుధని, బహు రక్షణల వాడనని మాకు తెలియును.

    3. శూర ఇంద్రా ! నీవు ధనము కోరినంత - భయంకర వృషభ సములైన దేవతలుగాని మానవులుగాని నిన్ను బాధించలేరు.

    4. మానవులారా ! రండి. ఇంద్రుని స్తుతించండి. అతడు స్వయం  ప్రకాశకధనములకు అధిపతి. ఇతర ధనికుల వలె అతడు ధనముద్వారా బాధించరాదు.

    5. ఇంద్రా ! నీ  స్తుతిని ప్రశంసింపుము. మేము దానిని గానము చేతుము. నీవు సామవేదస్తుతులను వినుము. ధన యుక్తడవై మమ్ము అనుగ్రహించుము.

    6. ఇంద్రా ! మా కొరకు విచ్చేయుము. రెండు చేతులతో దానము చేయుము. మమ్ము ధనమునుంచి విడదీయకుము.

    7. ఇంద్రా ! నీవు ధనము వద్దకు వెళ్లుము. శత్రు విజేత  ఇంద్రా ! మానవులలో దానశూన్యులగువారి ధనమును కొనిరమ్ము.

    8. ఇంద్రా ! విప్రులు భజించు ధనము, నీ వద్దనున్న ధనమును - మ్మెఉ కోరినపుడు మాకు ఇమ్ము.

    9. ఇంద్రా! నీ అన్నము త్వరగా మా వద్దకు రావలెను. అది అందరికి ప్రసన్నదాయకము. అనేక ఆశలు పెట్టుకున్న మా స్తోతలు నిన్ను వెంటనే స్తుతింతురు.

    (శ్రీమదాంధ్రవచన ఋగ్వేదసంహిత ఎనిమిదవ మండలము ఆరవ అష్టకము అయిదవ అధ్యాయము సమాప్తము)

        ఓం నతామినన్తిమాయనో నధీరావ్రతా దేవానాం ప్రథమా ధ్రవాణి
        నరోదసీ అద్రుహ వేద్యాభర్న పర్వతానినమే స్థివాంసః

               ఆరవ అధ్యాయము         డెబ్బది ఒకటవ సూక్తము
              ఋషి - కాణ్వకుసేదుడు దేవత - ఇంద్రుడు ఛందస్సు గాయత్రి

    ఓం ఆప్రదవపరానతో ద్వావతశ్చ వృత్రహన్ మధ్వః ప్రతి ప్రభర్మణి

    1. వృత్రఘ్న ఇంద్రా! యజ్ఞపు  మదకర సోమము కొరకు దూరస్థానమునుండియు, సమీపస్థానము నుండియు విచ్చేయుము.

    2. త్వరగా మత్తు కలిగించు సోమము అభిషుతమైనది. రమ్ము స్వీకరింపుము. మత్తుడవగుము. సేవింపుము.

    3. సోమరూప అన్నముద్వారా మత్తుడవగుము. వృత్రుణి వధించిన కోపము శమించవలెను. నీ హృదయమునకు సోమము సుఖము కలిగించవలెను.

    4. శత్రుశూన్య ఇంద్రా! నీవు ద్యులోకస్థ దేవతల సహితుడవై ప్రకాశించువాడవు. దగ్గర ఉన్న యజ్ఞమునకు ఉక్థమంత్రముల ద్వారా పిలువ బడినావు. కావున త్వరగా విచ్చేయుము. 




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.