Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    5. ఇంద్రా ! ఈ  సోమము శిలలతో సిద్ధమైనది. వాలు, మున్నగునవి కలుపుబడినవి. నీ ఆనందమునకుగాను అగ్నిలో హుతము చేయబడుచున్నవి.

    6. ఇంద్రా !నా ఆహ్వానము వినుము. మేము అభిషవించిన నవ్యమిత సోమపానము చేయుము. వివిధరీతుల తృప్తినందుము.

    7. ఇంద్రా ! నీవు ఈశ్వరుడవు. అభిషుత సోమము చమసచ పాత్రలందున్నది సేవించుము.

    8. నీటిలో చంద్రునివలె చములో సోమము కనిపించుచున్నది. నీవు ఈశ్వరుడవు దీనిని సేవింపుము.

    9. గాయత్రి శ్యేనపక్షిరూపము ధరించినది. అంతరిక్షమున సోమరక్షక గంధర్వులను ఓడించినది. ఆ సోమమును ఈ రెండు ఫవనములకు తెచ్చినది నీవు ఈశ్వరుడవు. ఆసోమమును సేవించుము.
   
                                డెబ్బది రెండవ సూక్తము
    ఋషి - కాణ్వకుసేదునుడు, దేవత - విశ్వదేవతలు, ఛందస్సు -గాయత్రి.

    1. దేవతలారా ! మీరు కోరికలు తీర్చువారు. మమ్ము పాలించండి. మీ మహా రక్షణలు కలుగ చేయమని ప్రార్థించుచున్నాము.

    2. మిత్ర, వరుణ, ఆర్యమ దేవతలు సదా మాకు సహాయకులు కావలెను. వారు శోభన స్తుతివంతులు. మమ్ము వర్ధిల్లచేయువారు.

    3. సత్యనేత దేవతలారా !నావలో నీటిని దాటించినట్లు విశాలము, అనంతమగు శత్రుసేననుండి మమ్ము దాటించండి.

    4. మేము పూజనీయ, ధనము కొరకు ప్రార్థించుచున్నాము. వరుణ, ఆర్యమలారా! మాకు  పూజనీయ ధనము కలిగించండి.

    5. దేవతలారా ! మీరు మిక్కిలి జ్ఞానవంతులు. శత్రుసంహారకులు పూజ్యధనమునకు ప్రభువులు. ఆదిత్యులారా ! పాపసంబంధ ధనము మావద్దకు చేరరాదు.

    6. దేవతలారా !మీరు  ఉదారదాతలు. మీరు ఇంట ఉన్నను, మార్గమందున్నను -  హవ్యవర్ధనమునకు - మిమ్మే ఆహ్వానిస్తాము.

    7. ఇంద్ర, విష్ణు, మరుత, అశ్వినులారా! ఒకేజాతి వారిలో మా వద్దకు మాత్రమేరండి.

    8. ఆవిధముగా మీరు వచ్చినంత మేము మిమ్ము  ఎల్లరకు ప్రకటింతుము. అనంతరము మీరు మాతృగర్భము నుండి ఇద్దరిద్దరు జన్మించిన విధము, మీ బంధుత్వము ప్రకటించెదము.

    9. మీరు దానశీలురు. మీలో ఇంద్రుడు శ్రేష్టుడు. మీరు దీప్తియుక్తులు. మీరు యజ్ఞమున నిలువండి. మిమ్ము నేను స్తుతిస్తాను.
       
                                  డెబ్బది మూడవ సూక్తము
            ఋషి - కవిపుత్ర ఉశసుడు దేవత - అగ్ని ఛందస్సు - గాయత్రి

    1. అగ్ని ప్రియతమ అతిధి మిత్రుని వలె ప్రియుడు. రథమువలె ధనము దహించువాడు. మీ కొరకు అగ్నిని నేను స్తుతిస్తాను.

    2. దేవతలు అగ్నిని - విశేష జ్ఞానవంతునివలె - రెండు ప్రకారములుగా స్థాపించినారు. అట్టి అగ్నిని నేను స్తుతిస్తాను.

    (జ్ఞానవంతునకు గృహకర్మము యజ్ఞకర్మము ఉభయములు విహితము. అగ్ని రెండు విధములుగా భూమియందును అంతరిక్షమునందు స్థాపించబడినాడు.)

    3. తరుణ తమ అగ్నీ హవ్యదాతకు సంబంధించి మనుష్యులను  పాలింపుము. స్తుతులు వినుము. మా సంతానమును స్వయముగా రక్షించుము.

    4. బలపుత్ర , అగ్నీ !నీవు అందరు కోరువాడవు. శత్రువులముందునకు చేరువాడవు. నిన్నునేను ఏస్తుతులతో, ఎట్లు స్తుతించగలను?

    5. బలపుత్ర అగ్నీ ! యజమానుల మనసులకు అనుకూలముగా మేమునీకు హవ్యము ఎట్లు ఇవ్వగలము? ఈ నమస్కృతిని నేను ఎప్పుడు ఉచ్చరించగలను?

    6. నీవే - మా కొరకు - మాస్తుతులను అన్నింటిని ఉత్తమ గృహవంతము, ధనవంతము, అన్నవంతము చేయుము.

    7. గార్హపత్య అగ్నీ! నీవు ఇప్పుడు ఎవని కర్మను సఫలీకృతము హేయుచున్నావు? నీ  స్తుతులు ధనప్రదములు.

    8. యజమానులు తమ గృహములందు - చక్కని బుద్ధిమంతుడు, సుకృతి, యుద్ధమందు అగ్రగామి - అగ్నిని  పూజింతురు.

    9. అగ్నీ! పటిష్ట రక్షణలతో తన గృహమున ఉండువాడు, శత్రువులు ఓడించలేనివాడు, శత్రువులను ఓడించువాడు పుత్ర, పౌత్రసహితుడై వర్ధిల్లును.

   
                                  డెబ్బది నాలుగవ సూక్తము
    ఋషి - అంగిరస కృష్ణుడు , దేవత - అశ్వినులు, ఛందస్సు - గాయత్రి.

    1. నాసత్య అశ్విద్వయమా ! మా ఆహ్వానము వినండి. మాదక సోమపానమునకు మా యజ్ఞమునకు విచ్చేయండి.

    2. అశ్విద్వయమా ! మదకర సోమపానమునకు నా ఆహ్వానము వినండి. నా స్తోత్రమును ఆలకించండి.

    3. అన్నవంతులు, ధనవంతులగు అశ్వినులారా ! మదకర సోమపానమునకు ఈ కృష్ణ ఋషి - మిమ్ము పిలుచుచున్నాడు.

    4. నేతలారా ! స్తోత్రపారాయణపరుడు, స్తోత కృష్ణుని ఆహ్వానమునకు ఈ కృష్ణుని ఆహ్వనమును సోమపానము కొరకు వినండి.
   
    5. నేతలారా! మాదక సోమపానము కొరకు - విస్రస్తోత కృష్ణునకు గృహప్రదానము చేయండి.

    6. అశ్విద్వయమా! ఈ విధముగనే స్తోత మరియు హవ్యదాత గృహమునకు సోమపానమునకు విచ్చేయండి.

    7. వర్షించు ధనిక అశ్విద్వయమా ! సోమపానమునకు గట్టిరథమున అశ్వములను పూన్చండి. 
   
    8. అశ్విద్వయమా ! మూడు బంధురములు, మూడు మూలల రథమున - మాదక సొమము సేవించుటకు విచ్చేయండి.

    9. నాసత్యద్వయమా ! మాదక సోమపానమునకు గాను నా స్తుతివచనములవైపు వేగముగా విచ్చేయండి.

   
                                  డెబ్బది ఆయిదవ సూక్తము
 ఋషి - కృష్ణపుత్రుడు విశ్వకుడు, దేవత - అశ్వినులు, ఛందస్సు - బృహతి.

    1. అశ్వినులారా! మీరు దర్శనీయులు, వైద్యులు. సుఖవంతులు. మీరు దక్షుని స్తుతిసమయమున ఉన్నారు. విశ్వకుడనను నేను మిమ్ము సంతానము కొరకు ఆహ్వానిస్తున్నాను. మన బంధుత్వమును వేరు చేయకండి. గుఱ్ఱముల  కళ్లెము  సడలించండి.

    2. అశ్వీద్వయమా ! విమాన ఋషి పూర్వకాలమున మిమ్ము ఎట్లు ప్రార్థించినాడోగాని అతనిని ధనవంతుని చేయుటకు మనసులందు నిశ్చయించినారు. విశ్వకుడు మిమ్ము అట్లే ఆహ్వానించుచున్నాడు. మన బంధుత్వము విడువకండి.  గుఱ్ఱములు కళ్లెములు సడలించండి.

    3. అనేకులను పాలించు అశ్విద్వయమా ! నా పుత్రుడగు విష్ణువాపుని ధనాభిలాషను తీర్చుటకుగాను అతనికి ధన వృద్ధిని ప్రసాదించినారు. అట్టి మిమ్ము - సంతానము కొరకు విశ్వకుడు ఆహ్వానించుచున్నాడు. మన బంధుత్వము విడువకండి, గుఱ్ఱముల కళ్లెములు సడలించండి.

    4. అశ్విద్వయమా ! మీరు వీరులు. ధన భోజ్యులు. అభిషుత సోమయుక్తులు. దూరమున ఉన్న విష్ణువువంటి మిమ్ము ఆహ్వానించుచున్నాము. తండ్రివి  వలె విష్ణువాపుని స్తుతులు సహితము అత్యంత పూర్ణములు. మనబంధుత్వము విడవకండి.

    5. అశ్విద్వయమా! సత్యమూలముననే సూర్యుడు తన కిరణములను - సాయంత్రము ఉపసంహరించును. సత్యపుశృంగము పైననే  సూర్యుడు తన కిరణములను - సాయంత్రము ఉపసంహరించును. సత్యపుశృంగము పైననే సూర్యుడు తనకిరణములను - ఉదయమున. విస్తరించును. సత్యముగా సూర్యుడు సేనలు గల శత్రువులను ఓడించును. మన బంధుత్వము విడవకండి.

   
                                     డెబ్బది ఆరవ సూక్తము
                  ఋషి - అంగిరస కృష్ణుడు లేక వాపిష్ఠద్యుమ్నీకుడు దేవత -
                                 అశ్వినులు ఛందస్సు - బృహతి


    1. అశ్విద్వయమా! ద్యుమ్నీక  ఋషి మీ స్తోత. వానకాలమున బావుల నీరువలె మీరు విచ్చేయండి. ఈ స్తోత ద్యుతిమంతమగు  యజ్ఞమున మదకర అభిషుత సోమమును అభిలషించువాడు. గౌరమృగము జలాశయములందు నీరు త్రావినట్లు - అభిషుత సోమపానము చేయండి.

    2. అశ్వినులారా ! చషకమందున్న రసవంతసోమమును ఆస్వాదించండి. యజ్ఞమందు ఆసేనులు కండి. మానవ గృహాములందు ఉన్మత్తులై, హవ్యము సహితముగ సోమము స్వీకరించండి.

    3. అశ్విద్వయమా ! యజమాని మిమ్ము సకల రక్షణలతో ఆహ్వానించుచున్నాడు. కుశలు పరచి, సదా హవిని  సేవించు యజమాని ఇంటికి ప్రాతఃకాలముననే చేరుకొనండి.

    4. అశ్విద్వయమా ! రసవంతసోమపానము చేయండి. తదుపరి సుందర కుశలమీద ఆసీనులుకండి. అనంతరము ప్రవృద్ధులై మా స్తుతులవైపు జలాశయమునకు గౌరమృగములవలె విచ్చేయండి.

    5. అశ్వినులారా ! మీరు వెంటనే స్నిగ్థరూప అశ్వములతో విచ్చేయండి. దర్శనీయులు, సువర్ణ రథవంతులు, జలపాలకులు, యజ్ఞవర్థకులగు అశ్వినులారా ! సోమపానము చేయండి.

    6. అశ్వినులారా! మీరు సుగమనులు, వివిధ కర్మలవారు. మేము స్తోతలము, విప్రులము. అన్నలాభము కొరకు మిమ్ము ఆహ్వానించుచున్నాము. మా స్తుతిరూప ఆహ్వానము వినండి త్వరత్వరగా విచ్చేయండి.

                                  డెబ్బది ఏడవ  సూక్తము
       ఋషి - గౌతమనోధసుడు దేవత - ఇంద్రుడు ఛందస్సు - ప్రగాథ

    1. ఇంద్రుడు దర్శనీయుడు. దుఃఖినివారకుడు. సోమపాన ఉన్మత్తుడు. పగటిపూట గోశాలలో గోవులు తమదూడలను పిలిచినట్లు - మేము ఇంద్రుని స్తుతించి ఆహ్వానించుచున్నాము.

    2. ఇంద్రుడు దీప్తికి నివాసస్థానము. స్వర్గవాసి. ఉత్తమదాత. పర్వతమంతటి బలవంతుడు. అనేకుల పాలకుడు. మాకు బలిష్టులగు పుత్రాదులను, వందల, వేల ధన గోయుక్త అన్నము ప్రసాదించుమని ఇంద్రుని యాచించుచున్నాము.

    3. ఇంద్రా ! ఉన్నత, సుదృఢ పర్వతములు సహితము నిన్ను  బాధింపజాలవు. నీవు నావంటి స్తోతకు ధనమునివ్వదలతువు. దానిని ఎంతటి వాడను నష్టపరుపజాలడు.

    4. ఇంద్రా! నీ  స్వబలము, కర్మలతో నీవు శత్రువులను నాశము చేతువు. ఈ స్తోతదేవతలను పూజించువాడు. నీవు నీ కర్మబలమున సకల వస్తువులను జయించగలవు. ఈ స్తోత తన రక్షణ కొరకు - నిన్ను పూజించుచున్నాడు. ఇంద్రా! గౌతములు నిన్ను ఆవిర్భవింపచేసినారు.

    5. ఇంద్రా ! ద్యులోక పర్యంతమునకు నీవే ప్రధానుడవు. నీ బలమున పార్థివలోకమును పాలించగలవు. నీవు  మాకు అన్నము ప్రసాదించుము.

    6. ధనద ఇంద్రా ! నీవు హవ్యదాతకు ఇచ్చు ధనమును బాధించగలవాడు లేడు. నీవు ధనప్రేరకుడవు, దానశీలుడవు అగుము. ధనప్రాప్తికొరకు మేము చేయు స్తుతులను వినుము.

   
                                   డెబ్బది ఎనిమిదవ సూక్తము
  ఋషి - అంగిరస  నృమేధ, పురుమేధులు దేవత - ఇంద్రుడు ఛందస్సు - 1,
                         2, ప్రగాథ - 5,6, అనుష్టుప్ -7 బృహతి.


    1. యజ్ఞవర్థక విశ్వేదేవరలు ఈ గానమున - దీప్తుడు నిరంతర జాగృతుడగు -జ్యోతి సూర్యుని - కల్పించినారు. మరుత్తులారా ! ఇంద్రుని కొరకు పాపవినాశకము విశాలమగు గానములు పాడండి.

    2. స్తోత్రశూన్యుల వినాశకుడగు ఇంద్రుడు శత్రుహింసను దూరము చేసినాడు. అప్పుడు ఇంద్రుడు యశస్వియు, తేజస్వియు అయినాడు. విశాల దీప్తివంత, మరుద్యుక్త ఇంద్రా! దేవతలు నీ స్నేహము కోరినారు. నిన్ను స్వీకరించినారు.

    3. ఇంద్రుడు మహామహుడు. మరుత్తులారా ! ఇంద్రుని స్తోత్రములు ఉచ్చరించండి. వృత్రఘ్న, శతక్రతు ఇంద్రుడు నూరు గణుపుల వజ్రమున వృత్రుని హతమార్చినాడు.

    4. ఇంద్రా! నీవు శత్రువధకు ప్రసిద్ధుడవు. నీ వద్ద చాలా అన్నము ఉన్నది. నీవు సుదృఢ మనస్కుడవై మాకు అన్నము ప్రసాదించుము. జలము మాకు మాతృస్వరూపము. ఆ జలము అనేక ప్రదేశములందు ప్రవహించవలెను. జలములను నిరోధించు వృత్రుని నాశము. సర్వభూతజాలములను జయించుము.

    5. ఇంద్రా ! నీ ధనము అపూర్వము. వృత్రవధ కొరకు నీవు అవతరించినపుడు పృథ్విని స్థిరపరచినావు - ద్యులోకమును నిలిపినావు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.