Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2



    9. అగ్ని లోహిత, శుక్ల, కృష్ణ మూడురంగులవాడు. అతడు వేగవంతుడై శిఖలతో యజ్ఞములకు వెళ్లును. హోమసంపాదక అద్వద్యులు అతనిని ఆజ్యానదులతో పూజింతురు.

    10. అగ్ని మహావీరుడు ఉపరిచక్రయుక్తుడు. దీప్తిసంపన్నుడు. నిమ్నముఖ ద్వారవంతుడు. అక్షయుడు. రక్షకుడు. అధ్వర్వుల అవనతులై అగ్నిని సిక్తము చేయుదురు.
   
    11. అధ్వర్యులు ఆదరణీయులు. వారు రక్షకుడగు అగ్ని దరికి చేరుదురు. విసర్జన సమయమున అగ్నిని విశాల పాత్రమున మధువుతో సిక్తము చేయుదురు.

    12. గోవులారా ! పాలు ఎక్కువ అవసరమైనపుడు - మంత్రము ద్వారా పితుకవలసి వచ్చినపుడు - అప్పుడు మహావీరుడుగా  అగ్ని వద్దకు వెళ్లండి. అగ్ని చెవులురెండింటిలో ఒకటి బంగారపుది. మరొకటి వెండిది.

    13. అధ్వర్యులారా! పాలుపిండినంత - ద్యావాపృథ్వులను ఆశ్రయించినవియు, మిశ్రణయోగ్యములగు పాలను సేవనచేయండి. తదుపరి మేకపాలతో అగ్నిని స్థాపించండి.

    14. గోవులు తమకు నివాసదాతయిన అగ్నిని తెలుసుకున్నవి. పిల్లలు తల్లిని కలిసినట్లు గోవులు తమ బంధువగు అగ్నిని కలుసుకొనును.

    15. జ్వాలలతో భక్షించు అగ్ని యొక్క అన్నము - అగ్నిని ఇంద్రుని పోషించును. అంతరిక్షమునకు ఉపకారము చేయును. ఇంద్రాగ్నులకు అన్నము సమర్పించండి.

    16. గమనశీలవాయువు. చంచలచరణయుక్త వచనము, సూర్యుని ఏడు కిరణముల ద్వారా వర్థిల్లిన అన్నమును, రసమును అధ్వర్యులు గ్రహింతురు.

    17. మిత్రావరుణులారా ! సూర్యోదయ సమయమున సూర్యుడు సొమము స్వీకరించును అతడు మాకు హితకరుడు - వైద్యుడు.

    18. హర్యతృషి హవ్యస్థాపనకు స్థానము ఏర్పరచినాడు. అగ్ని అక్కడి నుండియే తన శిఖలతో ద్యులోకమున వ్యాపించును.

   
                                 అరువది రెండవ సూక్తము
       ఋషి - ఆత్రేయసప్తవధ్రి దేవత - అశ్వినులు ఛందస్సు -గాయత్రి
   
    1. అశ్వినులారా ! నేను యజ్ఞాభిలాషిని. నా కొరకు. ఉదయించండి. మీ రక్షణ మా దరికి చేరవలెను.

    2. అశ్వినులారా ! నిమేషము కన్న వేగవంతమగు రథమున విచ్చేయండి. "అన్తిషధ్భూతువామవః" మీ రక్షణ మా దరికి చేరవలెను.

    3. అశ్వినులారా ! అత్రిని అగ్నిలో పడత్రోసినాడు. మీరు జలముతో అతని మంటలను ఆర్పండి. "అన్తిషధ్భూతువామవః"

    4. మీరు ఎచట ఉన్నారు? ఎచటికి ఏగుదురు? శ్యేనపక్షివలె ఎచట వాలుదురు? "అన్తిషధ్భూతువామవః"

    5. మీరు ఎప్పుడు, ఏచోట మా ఆహ్వానమును ఆలకింతురో మేము  ఎరుగము. "అన్తిషధ్భూతువామవః"

    6. అశ్వినులు అత్యంత ఆహ్వానయోగ్యులు. నేను వారివద్దకు, వారి దగ్గరి బంధువుల వద్దకు వెళ్లెదను. "అన్తిషధ్భూతువామవః"

    7. అశ్వినులారా! అత్రిని మంటలనుండి రక్షించుటకు మీరు రక్షక గృహము నిర్మించినారు. "అన్తిషధ్భూతువామవః"

    8. అశ్వినులారా ! అత్రిమమనోహరస్తోత. అతనిని అగ్గి మంటలనుండి తప్పించండి. "అన్తిషధ్భూతువామవః"

    9. మహర్షి సప్తవధ్రి నిన్ను స్తుతించినాడు. అగ్నిజ్వాలను మంజూషనుండి బయటికి తీసినాడు. మరల అందులోనే పరుండ పెట్టినాడు. "అన్తిషధ్భూతువామవః"

    10. వృష్టిప్రదులు, ధనికులగు అశ్వినులారా ! మా ఆహ్వానము వినండి. విచ్చేయండి. "అన్తిషధ్భూతువామవః"

    11. అశ్వినులారా ! మీరు ఎంతో ప్రాచీనులు. మిమ్ము మాటిమాటికి పిలువా వలెనా? "అన్తిషధ్భూతువామవః"

    12. అశ్వినులారా ! మీ ఉభయుల ఉత్పత్తి స్థానము ఒకటే. బంధువులుకూడా సమానులె. "అన్తిషధ్భూతువామవః"
   
    13. అశ్వినులారా! మీ రథము ద్యావాపృథ్విలందును, సమస్తలోకములందును సంచరించును. "అన్తిషధ్భూతువామవః"

    14. అశ్వినులారా ! అపరిమిత గోవులు అశ్వములతో మా వద్దకు విచ్చేయండి. "అన్తిషధ్భూతువామవః"

    15. అశ్వినులారా ! వేలగోవుల, అశ్వములతో మాత్రమే. మమ్ము సరిపెట్టవద్దు "అన్తిషధ్భూతువామవః"

    16. అశ్వినులారా ! వేలగోవులు, అశ్వములతో మాత్రమే మమ్ము సరిపెట్ట వద్దు "అన్తిషధ్భూతువామవః"

    17. రంపపువాడు చెట్టును కోసినట్లు - అత్యంత దీప్తినంత సూర్యుడు చీకట్లను నివారించును. నేను అశ్వినులను ఆహ్వానించుచున్నాను. "అన్తిషధ్భూతువామవః"

    18. ధర్షక సప్తవధ్రీ ! నీవు పెట్టెలో బంధింపబడి ఉంటివి. తదుపరి దానిని నగరమును వలె కాల్చివేసినావు. "అన్తిషధ్భూతువామవః"

    (నల్లపేటిక అంధకారమునకు వ్యాధులకు సంకేతము. అశ్వినుల అనుగ్రహమున ఋషిదానినుండి బయట పడినాడు. అవి మరల తలెత్తకుండునట్లు తగులపెట్టినాడు. నగరమును కాల్చినపుడు దానిగుర్తులు సహితము మిగులవు అట్లు భస్మము చేసినాడని)
              
                              అరువది మూడవ సూక్తము
    ఋషి - గోపవనుడు దేవత - అగ్ని ఛందస్సు - అనుష్టుప్ - గాయత్రి
   
    1. ఋత్విక్కులు, యజమానులారా ! మీరు అన్నభిలాషులు. సకల జనుల అతిధి, బహుజన ప్రియుడు అగ్నిని స్తుతులతో సేవించండి. నేను మీ సుఖములకుగాను మన నీయ స్తోత్రములతో గూఢవచనములను ఉచ్చరిస్తాను.

    2. అగ్ని కొరకు నేతితో హోమము చేయబడును  ఆద్రవ్యము దానము చేయునపుడు అగ్నిని స్తుతించి ప్రశంసింతురు.

    3. అగ్నిని స్తోతలు ప్రశంసింతురు. అగ్ని జాతధని యజ్ఞమునందు సమర్పించిన హవిని ద్యులోకమునకు చేర్చువాడు.

    4. అగ్ని తనజ్వాలలతో ఋక్షపుత్రుని, మహశృతర్వుని వర్థిల్ల చేసినాడు. అతడు పాపులనాశకుడు. మానవులకు హితకరుడు. అగ్నిగుణముల అగ్ని వద్ద నేను ఉపస్థితుడనైనాను.

    5. అగ్ని అమరుడు  జాతధని స్తవనీయుడు అంధకారమును దూరము చేయువాడు. అగ్నికొరకు ఘృతముతో హవనము చేయుదురు.

    6. బాధలుగలవారు యజ్ఞము చేస్తారు. స్రుక్సం యతముచేసి హవ్యముతో అగ్నిని స్తుతిస్తారు.

    7. దృష్టుడు, శోభనజన్ముడు, బుద్ధిమంతుడు, దర్శనీయుడగు అగ్నిని మేముస్తుతించుచున్నాము.

    8. అగ్నీ! మేము చేసిన స్తుతి సుఖావహము. అధిక అన్నవంతము. నీకు ప్రియమైనది. ఆస్తుతితో నీవు చక్కగా స్తుతుడవగుము - వర్థిల్లుము.

    9. ఆస్తుతి అన్నవంతము. యుద్ధము నందు ఆ అన్నము వలసినంత అన్నము వర్ధిల్లవలెను.

    10. అగ్ని స్వబలమున శత్రువు అన్నమును మరియు స్తుత్యధనమును హింసించును అట్టి రథపూరకుడగు అగ్నిని - గతిపరాయణ అశ్వమును వలెను, సత్పితి ఇంద్రునివలెను మానవులు పూజింతురు.

     11. అగ్నీ ! గోరవన ఋషి స్తుతివలన నీవు అన్దాతవు అయినావు. నీవు సర్వత్ర సంచరించువాడవు. శోధకుడవు. నీవు గోరోవముని ఆహ్వానమును ఆలకించుము.

    12. భాదలపాలయినప్పటికి జనులు - అన్నప్రాప్తికొరకు - నిన్నేస్తుతిస్తారు. నీవు యుద్ధమున జాగృతుడ వగుము. "సబోధివృత్ర తూర్యే"

    13. శ్రుతర్వప్రభువు శత్రుగర్వధ్వంసకుడు. ఋక్షపుత్రుడు. అతడు ఋషినగు నన్ను పిలిచినాడు. అతడు నాకు ఇచ్చిన రోమవంతములగు నాలుగు అశ్వముల రోమ వంతమస్తకములను నా చేతులతో కడుగుచున్నాను.

    14. శ్రుతర్వరాజు ఎంతో అన్నవంతుడు. అతడునాకు ఇచ్చిన అశ్వములు వేగవంతములై, రథమునతగిలి - అశ్వనులు పంపిన నాలుగు నావలు 'తుగ్ర' పుత్ర 'భుజ్యు' ని మోసినరీతి - అన్నమును మోయును.

    15. గొప్పదానవగు పురుష్ణేనదీ ! సత్యము పలుకు చున్నాను:-

    "శ్రుతర్వుడు అత్యంత బలవంతుడు. అతను చేసినన్ని అశ్వదానములు మరొకడు చేయజాలడు"


                                   అరువది నాలుగవ సూక్తము
        ఋషి - అంగిరస విరూపుడు దేవత - అగ్ని ఛందస్సు - గాయత్రి

    1. అగ్నీ! నీవు సారథి వంటివాడవు. రథమునకు చురుకైన గుఱ్ఱములను కట్టుము. మేము హోతలము. నీవు ప్రధానుడవై కూర్చుండుము.

    2. దేవా! నీవు దేవతల మమ్ము "విద్వత్ శ్రేష్టులను" అని పరిచయము చేయుము. వరణీయములగు మా ధనములను నిజము చేయుము.

    3. అగ్నీ! నీవు తరుణ తముడవు. బలపుత్రుడవు. ఆమాతుడవు సత్యవంతుడవు. యజ్ఞయోగ్యుడవు.

    4. ఈ అగ్ని నూర్ల, వేల విధముల అన్నములకు స్వామి శిరోమణి, కవి, ధనపతి.

    5. గమనశీల అగ్నీ! ఋభువులు రథనేమిని తెచ్చినట్లు - నీవు ఒకేచోటకి పిలిచినా  దేవతలకూడి - దగ్గరలోనున్న యజ్ఞమునకు విచ్చేయుము.

    6. విశిష్టరూపముగల ఋషీ ! నిత్యవాక్యములతో తృప్తుడును, అభీష్టవరదుడగు అగ్నిని స్తుతించుము.

    7. గోవుల కొరకు మేము విశాలనేత్రలగు అగ్ని జ్వాలలతో - ఏ పణిని వధింతుము?

    8. మేము దేవతల పరిచారకులము. పాలిచ్చు గోవులను విడువరు. గోవులు దూడలను విడువవు. అట్లే అగ్ని మమ్ము విడువరాదు.

    9. సముద్ర తరంగములు నౌకను బాధించవు. అట్లే శత్రువు దుష్ట బుద్ధి మమ్ము బాధించరాదు.

    10. అగ్నీ ! మానవులు బలప్రాప్తికిగాను నీకు నమస్కరింతురు. నీవు నీ బలమున శత్రుసంహారము చేయుము.

    11. అగ్నీ ! గోవులను అన్వేషించుటకు మాకు శేషాధనమును ప్రసాదించుము. నీవు  వృద్ధిచేయువాడవు మమ్ము వర్థిల్లచేయుము.

    12. బరువులు మోయువానివలె నీవు యుద్ధమున మమ్ము వదలకుము. శత్రవులు ఈ  ధనమును భిన్నా భిన్నము  చేయచున్నారు. ఆధనమును మా కొరకు జయించుము.

    13. అగ్నీ! బాధలుస్తుతిహీనులను భయపెట్టవలెను. మా బలమును పెంచుము. వేగమును పెంచుము.

    14. నమస్కరించి కర్మద్వారా సేవించువారి వద్దకు విశేషముగా అగ్ని వెళ్లుచుండును.

    15. శత్రుసేనలకు దూరముగా మాసేనకు అభిముఖముగా నిలుపుము. మా సేనామధ్యమున నేను ఉన్నాను. సేనలను రక్షింపుము.

    16. అగ్నీ ! నీవు  పాలకుడవు నీ రక్షణలు పూర్వమువలెనే భద్రములు. అడిమాకు తెలియును. ఇప్పుడు నీ సుఖమునకు మేము ప్రార్థించుచున్నాము.

   
                                అరువది అయిదవ సూక్తము
           ఋషి - కాణ్వాకురుసుతి దేవత - ఇంద్రుడు ఛందస్సు - గాయత్రి

    1. శత్రుచ్ఛేదనమునాకుగాను నేను ఇంద్రుని పిలుచుచున్నాను. అతడు బలవంతుడు. అందరికిస్వామి మరుత్తులవాడు.

    2. ఈ ఇంద్రుడే మరుత్తులసాయమున వృత్రుని శిరమును శతపర్వ వజ్రమున ఖండించినాడు.

    3. ఇంద్రుడు ఎదిగినాడు మరుత్తులతో కలసినాడు. వృత్రుని హతమార్చినాడు. సముద్రమున జలమును కలిగించినాడు.

    4. మరుత్తులతో కలసినాడు. సోమపానము కొరకు స్వర్గమును గెలిచినాడు. అదిగో అతడే ఇంద్రుడు.

    5. ఇంద్రుడు మరుద్యుక్తుడు ఋజీషవంతుడు. సోమస్మయుక్తుడు. ఓజస్వి మహానుడు మేము ఇంద్రుని స్తుతిస్తాము - పిలుస్తాము.

    6. మరుద్యుక్త ఇంద్రుని - సోమపానమునకు - ప్రాచిన స్తోత్రములతో ఆహ్వానిస్తాము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.