Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    10. ఉచ్చిష్ట సోమవంతుడవగు ఇంద్రా ! నీవు అందరకు వరణీయుడవు. మాకు ప్రభూత ధనము ప్రసాదించుము. జీవించుటకు శత శరత్తులను ఇమ్ము. బహువీర పుత్రులను ఇమ్ము.

    11. ఇంద్రా ! నీవు అన్న సంపాదకుడవు. యజ్ఞమున ఉత్సాహమున ప్రవృద్దుడవగుదువు. ధనవంతుడవు. ప్రభూత అయిశ్వర్యశాలివి. నేతృశ్రేష్ఠుడవు. స్తుతిశ్రవణ కర్తవు. ఉగ్రుడవు. యుద్ధమున శత్రునాశకుడవు ధనవిజేతవు. ఆశ్రయప్రాప్తికొఱకు మేము నిన్ను ఆహ్వానించుచున్నాము.

                                ముప్పది ఏడవ సూక్తము

 ఋషి-విశ్వామిత్రుడు, దేవత - ఇంద్రుడు ఛందస్సు -11 అనుష్టుప్, మిగిలినవి గాయత్రి

    1. ఇంద్రా ! వృత్రవినాశకబల లబ్దికొఱకును శత్రుసేనను పరాభవించుటకును నిన్ను మేము ప్రవర్తితుని చేయుచున్నాము.

    2. శతక్రతూ ఇంద్రా ! స్తోతలు నీ మనస్సును, నేత్రములను ప్రసన్నముచేసి మాముందు నిన్ను ప్రేరితుని చేయవలెను.

    3. శతక్రతూ ఇంద్రా ! స్వాభిమాని శత్రువును పరాభవించు యుద్ధమున మేము సకల స్తుతులతో నీ నామ సంకీర్తనము చేసెదము.

    4. ఇంద్రుడు సర్వస్తుతి యోగ్యుడు. అపార తేజోవంతుడు. మానవులకు స్వామి. మేము ఇంద్రుని స్తుతింతుము.

    5. ఇంద్రుడు వృత్రహంత. యుద్ధమందు ధనము సాధించువాడు. బహుజనుల ఆహూతుడు. అట్టి ఇంద్రుని మేము ఆహ్వానించుచున్నాము.

    6. శతక్రతు ఇంద్రా ! యుద్ధమున నీవు శత్రువుల పరాభవ కర్తవు. వృత్రనాశనమునకుగాను నిన్ను మేము ప్రార్థించుచున్నాము.

    7. ఇంద్రా ! ధనమున, యుద్ధమున వీరినిచయమున మాకు ప్రతిస్పర్థలయిన శత్రువులను పరాజితులను చేయుము.

    8. శతక్రతూ ! మా ఆశ్రయ లాభమునకుగాను అత్యంత బలవంతము, దీప్తియుక్తము, స్వప్ననివారకమగు సోమమును పానము చేయుము.

    9. శతక్రతూ! పంచజనులందు ఉన్న ఇంద్రియములన్నియు నీవిగానే మేము భావింతుము.

    10. ఇంద్రా ! ప్రభూత అన్నము నీవద్దకు చేరవలెను. శత్రువుల దుర్ధర్ష అన్నము మాకు ప్రసాదించుము. మేము నీ ఉత్కృష్ట బలమును వర్థిల్ల చేయుదుము.

    11. శుక్ర ఇంద్రా ! సమీపమునుంచిగాని దూరమునుంచిగాని మావద్దకు విచ్చేయుము. వజ్రవంతుడవగు ఇంద్రా ! నీ ఉత్కృష్ట స్థానము నుండియే ఈ యజ్ఞమునకు విచ్చేయుము.

                           ముప్పది ఎనిమిదవ సూక్తము

        ఋషి - విశ్వామిత్రుడు దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. స్తోతలారా ! త్వష్టవలె ఇంద్రుని స్తుతులను జాగృతము చేయుడు. ఉత్కృష్టము, భారవాహి, దృతగామి అశ్వమువలె నేను కర్మనిరతుడనై ఇంద్రుని ప్రియకార్య విషయమున ఆలోచింతును. మేధావినగు నేను స్వర్గము చేరిన కవులను చూడగోరుచున్నాను.

    2. మనోసమయమనము, పుణ్యకార్యముల ద్వారా స్వర్గమును నిర్మించినవారు గురువులు. ఇంద్రా ! కవుల జన్మమును గురించి ఆ గురువులను అడుగుము. ఇప్పుడు ఈ యజ్ఞమున రచించిన స్తుతులు వృద్ధి చెంది మనసువలె వేగవంతములు అయినవి.

    3. కవులు భూలోకమునందు అంతటను తమ నిగూఢకార్యములద్వారా ద్యావాపృథ్వులను తమ బలప్రాప్తికొఱకు అలంకృతము చేసినారు. వారు మూలతత్త్వముల ద్వారా భూలోక స్వర్గలోకముల కొలతలు వేసినారు. వారు పరస్పరము కలసిన, విశాలములయిన మహా ద్యావా పృథ్వులను సంగతము చేసినారు. ద్యావాపృథ్వులమధ్య అంతరిక్షమును స్థాపించినారు.

    4. కవులందఱు రథస్థితుడయిన ఇంద్రుని విభూషితుని చేసినారు. స్వభావమున దీప్తిమంతుడగు ఇంద్రుడు మరింత దీప్తిమంతుడు అయినాడు. అభీష్టవర్షి అసుర ఇంద్రునికీర్తి అద్భుతము. విశ్వరూపము ధరించిన ఇంద్రుడు అమృతమందు అవస్థితుడు అయినాడు.

    ("అస్యతి ప్రేరణయతి సర్వానంతర్యామితయేత్ససురః" సర్వాంతర్యాములను ప్రేరేపించువాడు అసురుడని శాయణుడు. ఇంద్రుని అసురుడు అన్నందున వ్యాఖ్యానము అవసరము అయినది)

    5. అభీష్ట వర్షి, సనాతనుడు, సర్వశ్రేష్ఠుడగు ఇంద్రుడు జలములను సృష్టించినాడు. ఈ ప్రభూత జలము అతని దాహమును ఆర్పినది. స్వర్గ పౌత్ర స్వరూపుడు, శోభాయమానుడగు ఇంద్రుడు, వరుణుడు ద్యుతిమంతుడగు యజమాని స్తుతులను గ్రహించవలెను. మాకు లాభకారియగు ధనమును ప్రసాదించవలెను.

    6. ఇంద్రా ! వరుణరాజా ! వ్యాపకము, సంపూర్ణమగు సవన త్రయమును ఈ యజ్ఞమున అలంకరించుడు. ఇంద్రా నీవు యజ్ఞమునకు వెళ్లినావు. నేను యజ్ఞమున వాయువువలె కేశసంపదగల గంధర్వులను చూచినాను.

    7. యజమానులు అభీష్ట ప్రదాత ఇంద్రుని కొఱకు భోగయోగ్య హవ్యమునకు గోవులను పిదుకుదురు. వారికి అనేక పేర్లున్నవి. వారు నవీన అసుర బలమును ధరించినారు. మాయలను వికసింప చేసినారు. వానిని అన్నింటిని తమ తమ రూపములతో ఇంద్రునకు సమర్పించినారు.

    8. సూర్యుని స్వర్ణమయకాంతికి హద్దులు ఏర్పరచినవాడు లేడు. ఈ కాంతికి కారణభూతుడు ఎవడు? అతడు ఉత్తమ స్తుతులచే కీర్తించబడును. తల్లి సంతానమును ఆలింగనము చేసికొన్నట్లు అతడు సర్వవ్యాపక ద్యావాపృథ్వులను ఆలింగనము చేసికొనును.

    9. ఇంద్ర వరుణలారా ! మీరు ఇరువురు ప్రాచీన స్తోతలకు శుభములు కలిగించుడు. వారికి స్వర్గీయ మంగళ స్వరూప శ్రేయస్సులు ప్రదానము చేయగలరు. మమ్ము నలుదిశలనుండి రక్షించుడు. ఇంద్రునివాణి సర్వ అభయ ప్రదము. ఇంద్రుడు స్థిరుడు. మాయావులందరు ఇంద్రుని నానావిధ కీర్తులను దర్శింతురు.

    10. ఇంద్రా ! నీవు అన్న లాభ కర్తవు. యజ్ఞమున ఉత్సాహవంతుడవయి ప్రవృద్దుడవు అగుదువు. ధనవంతుడవు. ప్రభూత ఐశ్వర్యవంతుడవు. నేతృ శ్రేష్ఠుడవు. స్తుతిశ్రవణ కర్తవు. ఉగ్రుడవు. యుద్ధమున శత్రు సంహారకుడవు. ధనవిజేతవు. ఆశ్రయ ప్రాప్తికొఱకు మేము నిన్ను ఆహ్వానించుచున్నాము.

      (శ్రీ ఆంధ్రవచన ఋగ్వేద సంహితము మూడవ అష్టకము మూడవ మండలమున
                            మూడవ అనువాకము సమాప్తము)

    నాలుగవ అనువాకము             ముప్పది తొమ్మిదవ సూక్తము

        ఋషి - విశ్వామిత్రుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రా ! నీవు విశ్వపతివి. హృదయము ఉచ్ఛరించిన, స్తోతలు సంపాదించిన స్తోత్రము నిన్ను చేరును. ఈ స్తుతి నిన్ను జాగృతము చేయును. యజ్ఞమున పఠించబడును. ఈ స్తుతిని నేనే సృష్టించినాను. అది నీవు గ్రహించుము.

    2. ఇంద్రా ! ఈ స్తుతి సూర్యునికన్న ముందు ఆవిర్భవించినది. ఇది యజ్ఞమున ఉచ్చరింపబడునది. నిన్ను జాగృతము చేయునది. శుభంకరమగు ఈ స్తుతి శుభ్ర వస్త్రము ధరించి మా పూర్వులవద్ద నుంచి వచ్చినది. ఇది సనాతనము.

    3. అశ్వినులకు తల్లి జన్మనిచ్చినది. వారిని ప్రశంసించుటకు నా జిహ్వాగ్రము నర్తించుచున్నది. అంధకార నాశకమగు దివారంభమున ఆగతులగు అశ్వినులు జన్మతోనే స్తుతిలో కలిసినారు.

    4. ఇంద్రా ! మా పితరులు గోధనమునకై యుద్ధము చేసినారు. దానిని నిందించువారు భువిలోన లేరు. మహిమ, కీర్తిగల ఇంద్రుడు అంగిరులకు సమృద్ధి గోబృందములను ప్రదానము చేసినారు.

    5. ఇంద్రుడు అంగిరులకు సఖుడు. అతడు గోధనమును వెదుకుటకు బయలుదేరినాడు. అప్పుడు అంగిరులతో కూడి అంధకారమున దాగిన సూర్యుని చూడగలిగినాడు.

    6. ఇంద్రుడు తొల్లిటి పాలిచ్చు ఆవులమీద మధువు చల్లినాడు. తదుపరి పాదములు, ఖురముల యుక్తమగు ధనము తెచ్చినాడు. ఇంద్రుడు ఉదార హృదయుడు. అతడు గుహామధ్యమునకు చేరిన అంతరిక్షమున దాగిన మాయావుల కుడిచేయి పట్టినాడు.

    7. రాత్రినుండియే జన్మించిన ఇంద్రుడు జ్యోతిని ధరించినాడు. మేము పాపములకు దూరముగా భయరహిత స్థానమున నివసించెదము. సోమపాయి, సోమవర్ధనుడు ఇంద్రుడు స్తోత్రకారుని ఈ స్తుతిని గ్రహించవలెను.

    8. యజ్ఞమునకుగాను సూర్యుడు ద్యావాపృథ్వులను ప్రకాశవంతము చేయవలెను. మేము ప్రభూత పాపములకు దూరముగా ఉందుము. వసువులారా ! మీరు స్తుతులకు ప్రసన్నులు అగుదురు. సమృద్ధ ధనమును దానశీలురగు మానవులకు ప్రసాదించండి.

    9. ఇంద్రా ! నీవు అన్న ప్రాప్తి కర్తవు. యుద్ధమునందలి ఉత్సాహమున ప్రవృద్దుడవగుదువు. ధనవంతుడవు. ప్రభూత ఐశ్వర్యవంతుడవు. నేతృశ్రేష్ఠుడవు. స్తుతిశ్రవణ కర్తవు. ఉగ్రుడవు. సంగ్రామమున శత్రునాశకుడవు. ధనవిజేతవు. ఆశ్రయ ప్రాప్తికొఱకు మేము నిన్ను ఆహ్వానించుచున్నాము.

       (శ్రీ ఆంధ్రవచన ఋగ్వేద సంహితము మూడవ అష్టకము మూడవ మండలమున
                               రెండవ అధ్యాయము సమాప్తము)

    మూడవ అధ్యాయము             నలుబదవ సూక్తము

        ఋషి - విశ్వామిత్రుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - గాయత్రి

    1. ఇంద్రా ! నీవు అభీష్ట పూరకుడవు. అభిషుత సోమపానము కొఱకు నిన్ను ఆహ్వానించుచున్నాము. మాదకము, అన్న మిశ్రితమగు సోమమును నీవు పానము చేయుము.   

    2. ఇంద్రా ! నీవు బహుజన స్తుతుడవు. ఇది అభిషుత సోమము. బుద్ధి వర్ధకము. దీనిని సేవించగోరుము. తృప్తికారకమగు ఈ సోమముతో ఉదరము నింపుము.

    3. ఇంద్రా ! నీవు స్తోతవ్యుడవు. మరుత్పథివి. యజనీయ దేవతలందరితో ఈ హవియుక్తమగు యజ్ఞమునకు విచ్చేయుము. దీనిని వర్థిల్ల చేయుము.

    4. ఇంద్రా ! నీవు సత్పతివి. మేము ఆహ్లాదకరము. దీప్తము, అభిషుత సోమము సమర్పించుచున్నాము. అది నీ జఠరమున ప్రవేశించుచున్నది. దానిని ధరించుము.

    5. ఇంద్రా ! ఇది అభిషుత సోమము. అందరు అభిలషించునది. దీనిని నీవు నీ జఠరమున ధరించుము. దీప్తమగు ఈ సోమరసమంతయు నీతోపాటు ద్యులోకమున ఉండును.

    6. ఇంద్రా ! నీవు స్తోత్ర ప్రియుడవు. మాదక సోమధారతో నీవు ప్రసన్నుడగుదువు. మా అభిమత సోమమును సేవించుము. నీవు వృద్ధి చెందించిన అన్నమే మాకు లభించును.

    7. దేవయాజకుల ద్యుతిమంతము, క్షయరహితమగు సోమాది సంపూర్ణ హవిస్సు ఇంద్రుని చేరును. సోమపానము చేసిన ఇంద్రుడు వర్థిల్లును.

    8. ఇంద్రా ! నీవు వృత్రహంతవు. అతి దగ్గర ఉన్నను అతి దూరమున ఉన్నను మావైపునకు విచ్చేయుము. మా ఈ స్తుతివాణిని గ్రహించుము.

    9. ఇంద్రా ! నీవు అత్యంత దూరప్రదేశమునుండియు, అతి దగ్గరిదేశమునుండియు, మధ్యదేశమునుండియు ఆహూతుడవు అగుదువు. అట్లయినను సోమపానమునకుగాను ఈ యజ్ఞమునకు విచ్చేయుము.

                          నలుబది ఒకటవ సూక్తము

        ఋషి - విశ్వామిత్రుడు దేవత - ఇంద్రుడు, ఛందస్సు - గాయత్రి.

    1. వజ్రధారి ఇంద్రా ! హోతలు నిన్ను ఆహ్వానించుచున్నారు. మా యజ్ఞమునకు విచ్చేయుము. హర్యశ్వములు మీద త్వరగా సోమపానమునకు విచ్చేయుము.

    2. ఇంద్రా ! మా యజ్ఞమున ఋత్విక్కులు హోతలు నిన్ను ఆహ్వానించుటకు ఆసీనులయి ఉన్నారు. దర్భలు పరస్పరము కలిపి పరచబడినవి. ప్రాతస్సవనమున ప్రస్తరము మున్నగునవి సిద్ధము చేయబడినవి. కావున నీవు సోమపానమునకు విచ్చేయుము.

    3. స్తుతి లబ్దిగల ఇంద్రా ! మేము నిన్ను స్తుతించుచున్నాము. కావున ఈ యజ్ఞ సంబంధ కుశలమీద ఆసీనుడవగుము. మేము సమర్పించు పురోడాశమును ఆరగింపుము.

    4. ఇంద్రా ! నీవు స్తుతిపాత్రుడవు. వృత్రహంతవు. ఈ యజ్ఞమునందలి మూడు సవనములందలి స్తోత్రగానములను వినుము. రమింపుము.

    5. ఇంద్రుడు మహా సోమపాయి. బలపతి. ఆవుదూడనువలె స్తుతులన్నియు ఇంద్రుని నాకును.

    6. ఇంద్రా ! ప్రభూత ధనదానము కొఱకు సోమము ద్వారా నీ శరీరమును సంతోషపరచుము. స్తోతవగు నన్ను మాత్రము నిందించకుము.

    7. ఇంద్రా ! మేము నీ భక్తులము. హవియుక్తులమయి నిన్ను స్తుతింతుము. నీవు ఆశ్రయ ప్రదాతవు. నీవు మా హవిని స్వీకరింపుము. మమ్ము రక్షింపుము.

    8. ఇంద్రా ! నీవు హర్యశ్వ ప్రియుడవు. మాకన్న దూరదేశమున రథపు అశ్వములను విప్పకుము. మాదరికి చేరుము. సోమవంతుడవగు ఇంద్రా ! ఈ యజ్ఞమున సంతుష్టుడవగుము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.