Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
అప్పుడు ధౌమ్య, ధర్మరాజాదులు, బ్రాహ్మణులు భీముని కీర్తించినారు. ఆ విధముగా పాండవులు కామ్యకవనమున ప్రవేశించినారు.
దుర్యోధనాదులు ఈ కథ విన్నారు. వారు భయపడినారు. వారి గుండెలు దడదడలాడినవి. పాండవుల మీదికి దాడి ప్రయత్నమును అప్పటికి విరమించుకున్నారు.
ఆలోచనామృతము
1. ఒక దుర్మార్గము, ఒక దుష్టత్వము ఒక్కొక్కసారి మానవజాతి ఆత్మను ఆక్రోశింప చేయును. ధర్మమునకు కట్టుబడి అడవులకు పోయిన పాండవుల మీదికి దండెత్త దలచినాడు దుర్యోధనుడు. ఈ దుర్మార్గమును సాగనీయరాదనుకున్నారు వ్యాస, మైత్రేయ, విదురులు. వారికి నైతిక బలము తప్ప రాజకీయ బలము లేదు. తమకు తోచినంత, తాము చేయగలిగినంత చేసినారు.
2. వ్యాసుడు భరత వంశమును నిలిపినవాడు. ధృతరాష్ట్రునకు తండ్రి. అతడు సూచించినది నయమార్గము, సాత్వికమార్గము. దుర్యోధనుని ధర్మజుని వద్ద ఉంచిన సన్మార్గము అవలంబించవచ్చును అని. ఆ విషయమును ధృతరాష్ట్రుడు చెప్పలేనన్నాడు. చెప్పుటకు వ్యాసునకు నమస్కరించలేదు.
దుష్టబుద్ధులకు సాత్వికమార్గము సరిపోదు.
3. మైత్రేయుడు పాండవుల పరాక్రమమును గురించి వివరించి, పాండవులతో స్నేహముగా ఉండవలసినది అని చెప్పినాడు. దుర్యోధనుడు మైత్రేయుని మాటలు పెడచెవిన పెట్టినాడు పరిహసించినాడు. శాపమునకు కొద్దిగా జంకినాడు.
రాజకీయ దుర్మదాంధులకు అందునను గెలుపు గర్వము తలకెక్కిన వారికి మహాత్ములు చెప్పిన నీతులు చెవికెక్కవు. "ప్రబల గర్వవిదూషితుల్ ప్రభువులెన్న" అన్నాడు భర్తృహరి.
4. విదురుడు కిమ్మీరుని వృత్తాంతము చెప్పి భీముని బలపరాక్రమములను వివరించినాడు. అప్పుడు దుర్యోధనుడు తన తలంపు విరమించుకున్నాడు.
ఎదుటివాడు బలవంతుడు. తనకు గెలుపుసాధ్యము కాకపోవచ్చును అన్నపుడుగాని మదాంధుడు మానడు.
5. ఇవి వ్యాస దేవుని రాజకీయ పరిజ్ఞానమునకు సంకేతములు. నాటికిని, నేటికిని మౌలికముగా రాజకీయ మనస్తత్వమున మార్పురాలేదు. ఇటువంటి సంఘటన ఈ మధ్యన ఒకటి జరిగినది.
6. 1982 సెప్టెంబరులో ఇజ్రాయిల్ దేశము లెబనాన్ లోనికి చొచ్చుకొనిపోయి అమాయకులయిన శరణార్థులను ఊచకోత కోసినది. ప్రపంచమందలి నాగరక దేశములన్నియు ఇజ్రాయిల్ దుష్టచర్యను ఖండించినవి. లెబనాన్ నుండి సైనికులను ఉపసంహరించమని భద్రతా సమితి ఇజ్రాయిల్ ను కోరినది. ఇజ్రాయిల్ పెడచెవిన పెట్టినది.
అమెరికా ఇజ్రాయిల్ ను బెదిరించినది. అప్పుడు ఇజ్రాయిల్ తన సేనలను ఉపసంహరించుకున్నది.
వ్యాస మహర్షి విశ్వజనీనమయిన నిత్య సత్యములను భారతమున పొందుపరచినాడు.
సాల్వుని వృత్తాంతము
దుర్యోధనాదులు పాండవులను అడవులకు పంపినారని విన్నారు. పాంచాల, యాదవ, భోజ, అంధకులు. అందురును దుర్యోధనుని నిందించినారు. యాదవులను వెంట పెట్టుకొని శ్రీకృష్ణుడు, పాంచాలురను వెంట పెట్టుకొని ధృష్టద్యుమ్నాదులు కామ్యక వనమునకు వచ్చినారు. శ్రీకృష్ణుడు పాండవులను రాజసూయ వైభవమున చూచినాడు. ఇప్పుడు అడవులందు వారి దీనావస్థను చూచినాడు. అతనిలో కోపము ప్రజ్వరిల్లినది. గుండె మండినది. సకల యాదవ పాంచాలురను ఉద్దేశించి అన్నాడు:-
"యాదవ పాంచాల వీరులారా! చూచినారా పాండవుల స్థితి! దుర్యోధనాదులు కుట్ర చేసి, మోసము, కపటోపాయమున పాండవుల రాజ్యమును అపహరించినారు. పాండవులను అడవులకు తోలినారు. కౌరవులు క్షమించరాని అపరాధము చేసినారు. మనము కౌరవుల మీదకు దండెత్తి కర్ణ, శకుని, దుర్యోధన దుశ్శాసనుల సహితముగా సర్వులను వధించి పీనుగు పెంటలు చేతము. రాక్షస, భూత, కాకి, గృధ్రాదులకు విందు చేతము" అని పిడుగులు కురిపించినాడు. ప్రళయకాల రుద్రునివలె భయంకరుడయి కనిపించినాడు.
అర్జునుడు అది చూచినాడు. ప్రమాదము జరుగనున్నదని గ్రహించినాడు. శ్రీకృష్ణుని కోపమును చల్లార్చినాడు. శాంతింప చేసినాడు. శ్రీకృష్ణుని స్తుతించినాడు:-
"మహాత్మా! శ్రీకృష్ణా! నీవు సర్వలోక పూజ్యుడవు. ఈశ్వరుడవు. అనాది పురుషుడవు. సమస్త భూతములు నీ యందే పుట్టుచున్నవి. నిలుచుచున్నవి. నశించుచున్నవి. నీవు పూర్వము గంధమాదన పర్వతమున కందమూలములు భక్షించుచు పదివేల సంవత్సరములు తపస్సు చేసినావు.పుష్కరమందు జలమును మాత్రము ఆహారముగాగొని పదకొండు వేల సంవత్సరములు తపము చేసినావు. ప్రభాసమున ఏక పాదమున నిలిచి అనేక వేల సంవత్సరములు ఘోరతపము చేసినావు బదరీవనమందు వాయువును మాత్రము భక్షించి, ఏక పాదమందు నిలిచి, రెండు చేతులు పైకెత్తి అనేక వేల సంవత్సరములు తపము చేసినావు. సరస్వతీ చక్రమందు కృష్ణాజినము ధరించి, కృశించిన శరీరముతో పన్నెండు సంవత్సరములు తపము చేసినావు.
నీవు చైత్రరథమున మహా యజ్ఞములు చేసినావు. ఒక్కొక్క యజ్ఞమున నూరేసి లక్షల బంగారమును దక్షిణలుగా ఇచ్చినావు. నీవే యజ్ఞ పురుషుడవు. తపోయజ్ఞములందు తేజోవంతుడవు. నీవు సకల దైత్య రాక్షసులను సంహరించి, దేవేంద్రుని రాజ్యమున ప్రతిష్ఠించినావు. నీవే సమస్త భువనములకు ప్రభువువు. నీవే త్రివిక్రముడవు. వామనుడవు.
"శ్రీకృష్ణా! నీవు సర్వశక్తిమంతుడవు. శిశుపాలాది దుర్మార్గులను వధించుటకు అవతరించిన నారాయణుడవు. అసత్యము, మదము, మాత్సర్యము, క్రోధము, దుర్వికారము మున్నగు దుర్గుణములు నీయందున లేవు. నీవు మహాగుణవంతుడవు" అని చేతులు జోడించి ప్రార్థించిన అర్జుననకు శ్రీకృష్ణుడు ఉపదేశించినాడు:-
"అర్జునా! నీవు నరుడు అను మహామునివి. నేను నారాయణుడను. మనము ఇద్దరము శక్తిమంతులము. నీకును, నాకును భేదములేదు. నీవే నేను. నేనే నీవు. నీకు ఇష్టుడగు వాడు నాకు ఇష్టుడు అగును. నీకు శత్రువు అగువాడు నాకు శత్రువు అగును. ఇది సత్యము. ఇది నిత్యము. దీనికి భేదమురాదు. దీనికి లోపము రాదు".
ఈ విధముగా శ్రీకృష్ణార్జునుల స్నేహసంభాషణ జరిగినది. వారిని చూచి, వారి సంభాషణలు విని అక్కడ కూడిన సకల రాజన్యులు సంతోషించినారు. శ్రీకృష్ణార్జునులు సకల రాజులతో మంతనములు ఆడుచున్నారు.





