Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
రెండోరోజు బువాహుసేనీ అన్న అలీ బక్ష్ మిఠాయి బుట్టతో సహా గోహర్ మిర్జా ను వెంట బెట్టుకొని బువాహుసేనీ ఇంటికి వచ్చాడు. బుహహుసేనీ మిఠాయి పంచి కుర్రాణ్ణి మౌల్వీ సాహెబ్ దగ్గర కూర్చుండబెట్టింది.
గోహర్ మిర్జా నన్నే ఎక్కువ ఏడిపించేవాడు. మౌల్వీ గారు ఎంత తిట్టినా కొట్టినా కొంటెతనం మానలేదు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఆఖరుకు మా ఇద్దరికీ సంధి జరిగింది. అంటే నేను సతాయింపుకు అలవాటు పడిపోయానని అర్ధం.
గోహర్ మిర్జా వయసులో నాకంటే ఒకటి రెండు సంవత్సరాలు పెద్ద కావచ్చును. అప్పటికి నాకు పదమూడేళ్ళు, అతనికి పద్నాలుగు, పదిహేనేళ్ళూ ఉండవచ్చు. నాకు గోహర్ మిర్జా సతాయింపు ఒకవిధంగా మధురంగా తోచేది. ధ్వని ఎంతో బాగుండేది. పాటకత్తే సంతానం కావడాన లయ స్వతసిద్దంగా వచ్చేసింది. కంఠం ఎత్తాడంటే వినేవారు బొమ్మలు కావాల్సిందే. నాకేమో లయ , స్వరం వచ్చిందేగా , మౌల్వీ గారు బళ్ళో లేనప్పుడు జల్సా! నేను పాడేదాన్ని అతడు తాళం వేసేవాడు. ఒక్కొక్కప్పుడు అతడు పాడితే నేను తాళం వేసేదాన్ని. గోహర్ మిర్జా పాటంటే వేశ్యలు పడి చచ్చేవారు. ప్రతిగదికీ పిలుచుకునేవాళ్ళు. అతనితో నేనుండటం తప్పనిసరి. నేను లేకుంటే సంగీతం రాణించేది కాదు.
అందరినీ మించి అతనంటే అమీర్ పడిచచ్చేది.
మిర్జాగారూ! మీకు అమీర్ జాన్ గురుండవచ్చు.
"అమీర్ జాన్ అప్పుడు ముప్తఖరుద్దౌలా కొలువులో ఉండేది. ఆమె దర్పం వికసిస్తున్న యవ్వనం , చంపకం లాంటి చాయ , అమాయకత్వం, మోహింపచేసే అందం , ఆ ఉలుకు, ఆ కులుకు , వంకర చూపులు, నాజూకైన చేతులు, కాళ్ళు , భగవంతుడు అందాన్ని మూసలో పోసి తయారు చేశాడనుకొండి."
రుస్వా : నేను చూచేవరకు ఆవిడ అందం హరించి పోయింది. ఆరేసిన బట్టలా ఉండేది. చూడలేనంత వింత వికారం వచ్చేసింది.
ఉమ్రావ్: ఎక్కడ చూచారు?
రుస్వా : వాళ్ళ ఇంట్లోనే, ఆ గది ముందు "షాహ్ సాహెబ్" వేయి పూసల జపమాల పట్టుకొని నించుని ఉండేవారు. ఎవరైనా కనిపిస్తే సలామ్ చేసేవారు. ఎన్నడూ ఎవరితోనూ మాట్లాడి ఎరుగరు.
ఉమ్రావ్ : అర్ధమైంది. ఆ షాహ్ గారు ఆవిడ ప్రేమికుల్లో ఒకరు.
రుస్వా: మేమిద్దరమూ మిత్రులం.
రుస్వా : ఒక వైద్యుడుండేవాడు. అతడంటే ఆవిడకు ప్రాణం.
ఉమ్రావ్ : ఎవరా వైద్యుడు ?
రుస్వా : చెప్పినా మీకు తెలియకుంటే ఏం ప్రయోజనం ?
ఉమ్రావ్ : చెప్పగలిగితే చెప్పండి. తెలుసుకుంటాను.
రుస్వా : ఆ చేక్కణపు పని .....
ఉమ్రావ్ : బాగా తెలుసు. ఆవిడే అమీర్ జాన్. ఆ రోజుల్లో ఆవిడ వైభవం చూడాలి. ఆవిడను కనీసం ఒక్కసారి చూడాలని జనం తహతహలాడేవారు. ఆషామాషీ గాండ్ల విషయం ఇలా ఉంచి పెద్ద పెద్దవాళ్ళ విన్నపాలు సహితం మన్నించేది కాదు. దర్పమూ అలాంటిదే. వెంట నలుగురు దాసీలు. ఒకతే వక్కాకుల పెట్టె, మరోకతే ఉమ్మి గిన్నె, వేరోకతే విసనకర్ర పుచ్చుకొని సవారీ (పల్లకి) వెంటపరిగెత్తుతుండేవారు.
గోహర్ మిర్జా పాటంటే ప్రాణం అమీర్ జాన్ కు. ఆవిడకు సంగీతం రాదు కాని వినడమంటే మహాసరదా.
గోహర్ మిర్జా చిన్ననాటి నుండి వేశ్యల ఆటబొమ్మ. అతడంటే పడి చచ్చేవారు. ముద్దొచ్చేవాడు. చామనచాయ , ముక్కూ ముఖం చక్కగా ఉండేవి. పైగా విలసపురుషుడు. హాస్య ప్రియుడు. కొంటెతనం.....
రుస్వా : ఎందుకుండదూ? పుట్టిందేవరి కడుపున?
ఉమ్రావ్ : అయితే బన్నూను కూడా చూచారా?
రుస్వా : (చిరునవ్వునవ్వి) అలాగే అనుకోండి.
ఉమ్రావ్ : మిర్జాగారూ ! మీ హాస్యానికి చాటంటూ ఉందా?
రుస్వా : మీరు బయలు చేశారుగా!
ఉమ్రావ్ : సరి, అయితే నా కధ కాసేపు కట్టిపెట్టి హాస్యం మాట్లాడుకొందాం.
రుస్వా : హాస్యానికి రాత్రంతా మిగిలి ఉంది. మీ కధ చెప్పండి ముందు.
ఉమ్రావ్ : అచ్చా, వినండి.
ఉదయం నించి పదకొండు గంటల దాకా మల్వీగారి దగ్గరి నుండి కదిలే ధైర్యం ఉండేది కాదు ఎవరికీ. ఆ తరువాత మౌల్వీగారు భోజనానికి వెళ్ళేవారు. అప్పుడు విశ్రాంతి. మేము ఒక్కొక్క గదికి వెళ్ళేవాళ్ళం. ఈరోజు అమీర్ జాన్ గది. రేపు జాఫ్రీ గది. ఎల్లుండి బబ్బన్ గది. ఎక్కడి కెళ్ళినా కావలసినంత మర్యాద. పండ్లు, మిఠాయిలు, హుక్కా పాన్.
రుస్వా : అయితే మీరు చిన్నప్పటి నుంచే హుక్కా పీల్చే వారా ?
ఉమ్రావ్ : జీహఁ గోహర్ మిర్జాను చూచి నాకూ బుద్ది పుట్టింది. "షాబియా " వాడేదాన్ని . తరువాత 'నగోడి" అలవాటైంది.
రుస్వా : గోహర్ మిర్జా మహాశయుడు" చండూ " కూడా త్రాగేవాడు. మీకు అందులో కూడా ప్రవేశం ......?
ఉమ్రావ్ : భగవంతుడు నేటి వరకు దాని నుండి రక్షించాడు. నిజం, నల్లమందు తోడు. త్రాగను. అది కూడా ఈమధ్యనే ప్రారంభించాను. పూజ్యమైన "కర్బలాకు వెళ్ళి వచ్చింతరవాత చచ్చే జలుబు చేసింది. ఊపిరాడని పడిశెం , వైద్యుడు నల్లమందు తినమన్నాడు.
రుస్వా : అదేం జలుబుకు మంచిదా?
ఉమ్రావ్ : ఆ మాట మరి చెప్పకండి.
రుస్వా : ఏమీ, అలావాటై పోయిందా?
ఉమ్రావ్ : చాలా కాలం నుంచి.
వలదు వలదని ఒట్టేసుకొంటి , కాని
కలనీ గుండె గూడులో కోటి కోర్కెలు !
లక్ష ఓట్లేయించుకొమ్ము, కాని
ఒక్క చషకం మధ్య మిప్పించి పొమ్ము!
రుస్వా : ఎంత చక్కని పద్యం! ఒట్లు పెట్టించడానికి నేనున్నాను. త్రాగడం, త్రాగకపోవడం మీ ఇష్టం.
ఉమ్రావ్ : తాము కూడా సేవిస్తే .
రుస్వా : తౌబౌ (పశ్చాత్తాపము చెంది లెంపలు వేసుకోవడం )
ఉమ్రావ్ : నీలిమబ్బు తారాడె,
మలయానిలం పారాడె,
మధురస్మృతుల గోల చెలరేగె లోలో !
రుస్వా : ఆ విషయం ఎత్తకండి . ఆవులింతలు వస్తున్నాయి.
ఉమ్రావ్ : సరే, పోనివ్వండి.
రుస్వా : హాస్యానికి కూడా ఆ విషయం ప్రస్తావించకండి.
ఉమ్రావ్ : జ్ఞాపకం వస్తే రానీ,
దాని జోలికి పోనే పోను!
రుస్వా : ఓహో హో ! ఉమ్రావ్ జాన్ ! బాగా చెప్పారు!
ఉమ్రావ్ : తస్లీం (స్వీకరించాం)
రుస్వా : ప్రేమికులిట పెనునిద్దుర సోలిరి చెలీ!
లాలా, గులాబులు గుర్తొస్తున్నయ్ పదేపదే!





