Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



                                                 ఓం                   
            శ్రీమదాంధ్ర కృష్ణ యజుర్వేదీయతైత్తిరీయ సంహిత
                                        చరమ భాగము    

        యస్య నిఃశ్వసితం వేదాః యోవేదేభ్య్కోఖిలం జగత్ |
        నిర్మమే తమహం వన్దే విద్యాతీర్థ మహేశ్వరమ్ ||


                                         మూడవ కాండము
                                        మొదటి ప్రపాఠకము
                                         మొదటి అనువాకము

    1. ప్రజాపతి ప్రజలను సృష్టించ దలచినాడు. తపస్సు చేసినాడు. అప్పుడు ఆ ప్రజాపతి సర్పములను సృష్టించినాడు.

    ప్రజాపతి ప్రజలను సృష్టించ దలచినాడు. తపస్సు చేసినాడు. ఆ ప్రజాపతి పక్షులను సృష్టించినాడు.

    ప్రజాపతి ప్రజలను సృష్టించ దలచినాడు. మూడవమారు తపస్సు చేసినాడు. అప్పుడు అతడు దీక్షగైకొనువాడు పఠించవలసిన మంత్రములను దర్శించినాడు. ఆ మంత్రములను ఉచ్ఛరించినాడు. అందువలన ప్రజాపతి ప్రజలను సృష్టించినాడు.

    (ఇది దీక్షిత వాద ప్రశంస. అది లేనపుడు సర్పములు, పక్షులు పుట్టినవి. దానితోనే ప్రజల సృష్టి జరిగినది.)     
    2. యజమాని తపస్సు చేయవలెను.దీక్షిత వాదమును చదువవలెను. అందువలన అతనికి నిశ్చయముగా సంతానము కలుగును.

    3. దీక్షవహించిన వాడు అమేధ్యమును చూచినచో అతనినుండి దీక్ష తొలగి పోవును. అతనికి పాపము కలుగును. తేజస్సు రాలిపోవును.

    "అబద్ధం మనో దరిద్రం చక్షుస్సూర్యోజ్యోతిషాగం శ్రేష్ఠో దీక్షే మామాహసీ" అనునది మంత్రము. మనస్సు అనియత మగుచున్నది. దృష్టి దీనమగుచున్నది. తేజస్సులందు సూర్యుడు శ్రేష్ఠుడు. దీక్షా! నన్ను విడువకుము అనునది మంత్రార్థము.

    అందువలన దీక్షితుని నుండి దీక్షతొలగదు. పాపము కలుగదు. తేజస్సు తరగదు.

    4. దీక్షితుని ఎదుట వర్షము కురిసినప్పుడు ఆ వర్షజలము దీక్షితుని ఓజస్సును, బలమును, దీక్షను, తపస్సును నశింప చేయును. కావున ఆ దోష నివారణకు 'ఉన్దతీ' రిత్యాది మంత్రములు పఠించవలెను. జలములారా! మీరు ఆర్ద్రత కలుగచేయువారు. నాకు దేహ బలమును, ఓజస్సును, తపస్సును కలిగించండి. నన్ను, నాదీక్షను, నా తపస్సును నశింపచేయకండి. అనునది మంత్రార్థము ఆ మంత్రము దీక్షితునకు బలాదికములు కలిగించును. వర్షజలము అతని దీక్షను, బలమును, ఓజస్సును నశింప చేయకుండును.

    5. దీక్షితునకు అగ్నియే దేవత అగును. దీక్షితుడు ప్రయాణము చేయునప్పుడు అగ్ని వెనుకబడినవాడు అగును. అప్పుడు దీక్షితుడు అగ్ని రహితుడు అగుచున్నాడు. అందువలన రాక్షసులు అతనిని వధించ సమర్థులు అగుదురు. ఆ దోషనివారణమునకు 'భద్రాదభీత్యా'ది మంత్రములను పఠించవలెను.

    రథమా! మా ఇంటినుండి దేవయజన మార్గమున సాగుము. నీ ముందు బృహస్పతి నడువగలడు, అనునది మంత్రార్థము.

    దేవతలందు బృహస్పతి బ్రాహ్మణుడగును. దీక్షితుడు బృహస్పతిని అనుసరించి సాగవలెను. బృహస్పతి అతనిని గమ్యమునకు చేర్చగలడు.

    6. దీక్షితుడు యజ్ఞశాల చేరును. అప్పుడు 'ఏదమగన్మే' త్యాది మంత్రములు చదువవలెను. పృథివి సంబంధమగు దేవయజన ప్రదేశమునకు వచ్చినాము, అని మంత్రార్థమగును. యజమాని పృథివి సంబంధమగు దేవ యజన స్థానమునకు కదా వచ్చినాడు.

    7. 'ఏదమగన్మే' కు ఉత్తరభాగము. 'ఇది పూర్వము విశ్వేదేవతలు సేవించిన యజనస్థానము అని చెప్పుచున్నది. కావున బ్రాహ్మణులే విశ్వేదేవతలై దేవయజనమును సేవించుచున్నారు.

    8. పూర్వోక్తమంత్రపు మూడవభాగము "ఋగ్యజుస్సామసారములు యజ్ఞమును చేరుచున్నవి" అని చెప్పినది. కావున యజమాని ఋగ్యజుస్సామ వేదములను యజ్ఞమునందు చేర్చినవాడు అగుచున్నాడు.

    9. ఆ మంత్రపు నాలుగవ భాగము 'ధనసమృద్ధి' అన్నసమృద్ధిచేత ఆనందింతుము అని వచించినది. అందువలన యజమాని ధన, అన్నసమృద్ధిని ఆశీస్సుగా కోరుకొనువాడు అగుచున్నాడు.

                                            రెండవ అనువాకము

    1. సోమరాజా! ఇదిగో ఈ ఎదుట విక్రయించబడునది లతారూపమగు నీ రూపము అయి ఉన్నది. దీనిని ఉదయ సవనమున గాయత్రీ ఛందస్సు సంస్కరించినది. ఈ విషయము గాయత్రి నీకు వివరించును గాత.

    ఈ లతారూపమును మధ్యాహ్నసవనమునందు త్రిష్టుప్ ఛందస్సు సంస్కరించినది. ఈ విషయమును గాయత్రి సోమ దేవతకు తెలియపరచును గాత.

    ఈ లతా రూపమును సాయం సవనమున జగతీ ఛందస్సు సంస్కరించినది. ఈ విషయమును గాయత్రి సోమ దేవతకు తెలియపరచును గాత.

    సోమరాజా! ఈ ఛందస్సుల అక్షరసంఖ్యచే ఉపమింప దగిన స్తోమసామ్రాజ్యమున కేగుము, అను నా మాటను గాయత్రీదేవి సోమదేవతకు ఎరింగించును గాత.

    2. సోమరాజును సామ్రాజ్యమున కంపి -సోమలతను కోను నట్టి యజమాని తనవారి మధ్య సామ్రాజ్యమును పొందుచున్నాడు.

    ఛందస్సులు సోమరాజునకు సామ్రాజ్యములు అగును కదా!

    3. సోమమును కొనుటకు ముందే పూర్వము చెప్పిన గాయత్రికి చెందిన నాలుగు మంత్రములు చదువవలెను. అట్లయిన సోమరాజును సామ్రాజ్యమున కంపి సోమలతను కొన్నవాడగును. మరియు సృక్, జుహు మున్నగునవి సామ్రాజ్యమునకు చేరును.

    4. తనూనప్త్రగ్ని ఆజ్యపు ప్రతిష్టను గ్రహించినవాడు ప్రతిష్ఠావంతుడగును.

    సోమరసము అగ్ని యందు ఆహుతి అగుచున్నది. ఋత్విజాదులు దానిని సేవించుచున్నారు. అట్లగుటచే దానికి ప్రతిష్ఠ కలుగుచున్నది. తనూనప్త్రగ్ని దేవతాక ఆజ్యము అగ్నియందు హుంతమగుట లేదు. ఋత్విజాదులు సేవించుట లేదు. అట్లగుటచే దానివలన ప్రతిష్ఠ కలుగుట ఎట్లు? అని వేదవిదులు ప్రశ్నించుచున్నారు.

    తానూన ప్త్రాజ్యము ప్రజాపతి యందు మనసుచే స్థాపించబడినదని విద్వాంసుడు సమాధానము చెప్పవలెను.

    5. 'ప్రజాపతౌ త్వా మనసి జుహోమి' తానూనప్త్రాజ్యమా! నిన్ను ప్రజాపతి యందు మనసుచే హోమము చేయుచున్నాను - అని యజమాని తానూనప్త్రాజ్యమును మూడు మారులు వాసన చూడవలెను. అదియే తానూనప్త్రాజ్య ప్రతిష్ఠ. అది గ్రహించిన యజమాని నిశ్చయముగా ప్రతిష్ఠావంతుడగును.

    6. అధ్వర్యుని ప్రతిష్ఠను తెలిసి కొనిన యజమాని నిశ్చయముగ ప్రతిష్ఠావంతుడగును.

    అధ్వర్యుడు ఏ ప్రదేశమున ఉండి కదలక హోమము చేయవలెను అనుకొనునో అచటనే ఉండి, ఆ విషయమును ఇతరులకు తెలియ పరచవలెను. అదియే అధ్వర్యుని ప్రతిష్ఠ యగును. ఈ విషయము నెరింగిన యజమాని నిశ్చయముగా ప్రతిష్ఠావంతుడగును.   

    7. అధ్వర్యుడు ఆ విధముగా ప్రకటించిన ప్రదేశమునుంచి తొలగి మరొక చోటునుండి హోమము చేయరాదు. అట్లు చేసిన అతని ప్రతిష్ఠ రాలిపోవును. కావున అధ్వర్యుడు ఆ ప్రదేశమునందే ఉండి ప్రతిష్ఠకై హోమము చేయవలెను.

    8. అధ్వర్యుని 'స్వమ్' తెలిసి కొనిన యజమానికి నిశ్చయముగా సొమ్ము కలుగుచున్నది. అధ్వర్యుని యొక్క వాయుదేవతాకమగు స్రుక్కు, చమసమే అతని 'స్వమ్' అగును. అధ్వర్యుని వాయుదేవతాక 'స్వమ్' చేతి యందుంచక ఆశ్రావణము చేయరాదు. అందువలన అతడు 'స్వమ్ము' ను కోల్పోయినవాడగును. కావున 'స్వమ్' ను చేతపట్టియే ఆశ్రావణము చేయవలెను. అప్పుడు అధ్వర్యుడు 'స్వమ్' ను కోల్పోయినవాడు కాకుండును.

    9. యజమాని సోమమును ప్రతిష్ఠింపక స్తోత్రమును ఉపాకరణము చేయరాదు. ఆ విధముగా చేసిన సోమము అప్రతిష్ఠితమగును. స్తోమము ప్రతిష్ఠలేనిది అగును. ఉక్థములు ప్రతిష్ఠింపనివి అగును. యజమాని ప్రతిష్ఠలేని వాడగును. అధ్వర్యుడు ప్రతిష్ఠ లేనివాడు అగును.

    సోమమునకు వాయుదేవతాకములగు చమసాది పాత్రలు ప్రతిష్ఠ యగును. స్తోమమునకు సోమము ప్రతిష్ఠ యగును. ఉక్థలకు స్తోమము ప్రతిష్ఠ అగును.

    కావున చమసమును చేతబట్టికాని, పాత్రను గ్రహించికాని ఉపాకరణము చేయవలెను. అందువలన అతడు సోమమును ప్రతిష్ఠించిన వాడు అగుచున్నాడు. స్తోమమును, ఉక్థములను ప్రతిష్ఠించిన వాడగుచున్నాడు. యజమాని ప్రతిష్ఠితుడు అగుచున్నాడు.

                                         మూడవ అనువాకము

    1. యజ్ఞము చేయువాడు గోవును ఇచ్చి సోమమును కరీదు చేయును. అట్లు ఇచ్చిన గోవు క్రయణి అగును. సోమక్రయణిని యజ్ఞశాల వద్ద నడిపింతురు. అది ఆరు అడుగులు మీరి ఏడవ అడుగు వేసినచోట ఘృతముచే హోమము చేయుదురు. నేతితో తడిసిన అడుగునందలి ధూళి 'పాంసువు' అగును.

    అచటినుండి హవిర్ధానములను చేరవేయు శకటములు యజ్ఞముఖముగా సాగవలెను. అందువలన యజ్ఞము చక్కగా నిర్వహించినట్లగును.

    ఆ శకటములు తూర్పుముఖముగా నడచినపుడు సోమక్రయణి పాదపాంసువు చేత బండి అక్షమును పూయవలెను. అప్పుడు యజ్ఞముఖమునందే యజ్ఞమును విస్తరిల్ల చేసినట్లగును.

    2. అగ్నిని తూర్పుదిక్కుగా తీసికొని రావలెను. యజమాని భార్యను పడమటి దిక్కుగా తీసికొని రావలెను. క్రమముగా శకటములు మున్నగు వానిని తేవలెను. అందువలన పాత ఆహవనీయ స్థానము రిక్తమగును.

    ఆ రిక్తత అగ్ని మనసును బాధించును. అగ్ని అందును గురించి ఆలోచించును. క్రోధమున రుద్రుడు అగును. అట్లయి యజమాని ప్రజలను, పశువులను హతమార్చువాడు అగుచున్నాడు. కావున అగ్నిషోమీయ పశువును 'ఆప్రీ' సంజ్ఞకములైన ప్రయాజ యాజ్యలచే సంతోషపరచవలెను. అట్టి పశువును ఉత్తరము వైపు తీసికొని పోవలెను. తదుపరి పశుశ్రవణ కారియైన అగ్నిని హరించవలెను. అప్పుడు అధ్వర్యుడు గార్హపత్యాగ్నిని భాగయుక్తునిగా చేసిన వాడు అగును.

    3. యజమాని ఆహవనీయ స్వరూపుడు. కావున ఆవహనీయము నుండి పశుశ్రవణార్థమైన అగ్నిని తీసికొని పోయినచో యజమానిని కించ పరచినట్లగును. కావున అగ్ని అట్లే ఉండవలెను. లేదా మధనము చేసి పశుశ్రవణమునకై అగ్నిని పుట్టించవలెను.

    4. పశువు యొక్క అవదానమునకు నష్టము కలిగినచో వానిని లెక్కించి ఆజ్యమును అవదానము చేయవలెను. అదియే ఆ దోషనివృత్తికి ప్రాయశ్చిత్తమగును.

    (పశువు దేహము యొక్క అవయవములను అగ్ని యందు హోమము చేయుట "అవదానము" అనబడును. పశువు యొక్క వపాదులను వండుట "శ్రవణము".)




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.