Home » Dr Dasaradhi Rangacharya » Sukla Yajurveda Samhitha



                        జ్ఞాననందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం |
                      ఆధారస్సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మమే ||

                                   ముప్పది ఆరవ అధ్యాయము

1.    ఋచం వాచం ప్రపద్యే మనో యజుః ప్రపద్యే సామ ప్రపద్యే చక్షుః
    శ్రోత్రం ప్రపద్యే|
    వాగోజః సహౌజో మయి ప్రాణాపానౌ||

    ఋగ్రూపము వాణిని చేరుచున్నది. మనోరూపము యజుస్సును చేరుచున్నది. సామరూపము ప్రాణమును చేరుచున్నది. చక్షువులు, శ్రోత్రమును చేరుచున్నవి. నాకు వాక్కు, శత్రువును సహించుబలము, వీర్యము, ప్రాణాపానములు లభించవలెను.

    2. నా యొక్క చక్షువులు, హృదయమందున్న రంధ్రములను బృహస్పతి పూరించవలెను. "శంనో భవతు భువనస్యయాప్పతిః" జగముల స్వామి నాకు శుభములు సమకూర్చవలెను.

    3. భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి|
    ధియో యోనః ప్రచోదయాత్||
    అర్థమునకు 3-5 చూడండి.

    4. ఇంద్రుడు విచిత్రుడు. నిరంతరం వర్షకుడు. అతడు ఏ స్తుతులకు ప్రసన్నుడగును? తన రక్షణల సహితుడై మాకు మిత్రుడు ఎట్లగును? ఎట్టి అతి సుందర స్తుతులు విని అతడు మాకు రక్షకుడగును?

    5. ఇంద్రా! మత్తునిచ్చు పదార్థములందు ఏది అత్యంత మాదకమగును? ఏ సోమ రసము నిన్ను ఉన్మత్తుని చేయును? ఏ బలమున నీవు అత్యంత శక్తివంతుడవగుదువు? శత్రు ధన విభేదనము చేసితెత్తువు?

    6. ఇంద్రా! మా మిత్రులగు స్తోతలను నీ యొక్క నూర్లకొలది రక్షలతో ఎప్పుడు రక్షింతువు?

    7.అభీష్ట వర్షక ఇంద్రా! ఏ రక్షణలచే నీవు మమ్ము ఆనందింపచేయుదువు? ఏ స్తుతులకు ప్రసన్నుడవై స్తోతల కొరకు ధనము నింపి తెచ్చెదవు?

    8. ఇంద్రో విశ్వస్య రాజతి - రాజగును. శంనో అస్తు ద్విపదే - రెండు కాళ్ళ జీవులకు శుభము కలుగును గాథ. శం చతుష్పదే.

    (శం అనగా శుభము, సుఖము. దీనిని తరువాత వచ్చు మంత్రములకు అన్వయించుకొనుడు)

    9. శంనో మిత్రః శం వరుణః శంనో భవత్యర్యమా|
    శం న ఇన్ద్రో బృహస్పతిః శం నో విష్ణు రురుక్రమః||

    10. శంనో వాతః పవతాం శం నస్తపతు సూర్యః|
    శం న కనిక్రదద్దేవః పర్జన్యో అభివర్షతు||
   
    11. మాకు పగళ్లు సుఖదములు కావలెను. రాత్రులు సుఖదములు కావలెను. ఇంద్రాగ్నులు స్వరక్షణలచే సుఖప్రదులు కావలెను. హవిస్సులు అందుకున్న ఇంద్రవరుణులు మాకు శుభప్రదులు కావలెను. అన్న ప్రాపక యజ్ఞమున ఇంద్ర - పూషలు మాకు శుభప్రదులు కావలెను. ఇంద్ర సోములు మాకు సుఖజీవనము ప్రసాదించవలెను.

    12. అభీష్ట సిద్ధికిని, త్రాగుటకును, ద్యుతిమంత జలము మాకు సుఖప్రదమగును గాత. జలములు మాకు సుఖము కలుగునట్లు ప్రవహించును గాత.

    13. భూమీ! నీవు మా కొరకు సుఖ స్వరూపవగుము. కంటకరహితవగుము. నివసింపచేయు దానవగుము. "యచ్ఛానః శర్మ సప్రధాః" మాకు ఎన్నో సుఖములను ప్రదానము చేయుము.

    14. జలము సుఖదము. మాకు వర్చస్సు కలిగించుటకు గాను జలమునకు బలములు కలుగవలెను.

    15. జలమా! నీ యొక్క సారము ఎంతో సుఖకరము. వాత్సల్యముగల తల్లులు పిల్లలకు చన్నిచ్చినట్లు - జలమా! నీ సారమున మమ్ము భాగస్వాములను చేయుము.

    (జలమును చనుబాలతో పోల్చుచున్నాడు.)

    16. జలమా! యజ్ఞ గృహమునకు నీవు అనుకూలవు అయినరీతి మాకు నీవు ప్రభూత ప్రమాణమున లభింపుము. మమ్ము పావనములను చేయుము.
   
    17. ద్యౌః శాన్తి రన్తరిక్షంశాన్తిః పృథ్వివీశాన్తి
    రాపఃశాన్తి రోషధయః శాన్తి|
    వనస్పతయః శాన్తి ర్విశ్వేదేవాః శాన్తి ర్బ్రహ్మ శాన్తి
    సర్వమ్ శాన్తిః శాన్తి రేవశాన్తిః సామాశాన్తిరేధి||
   
    దేవతల పేర్లు శాంతి మాత్రమే ఉన్నందున అర్థము వ్రాయుటలేదు.

    అన్నింటికి శాంతి శాంతికే శాంతి. అది మాకు సమస్త శాంతులు కలిగించును గాత.

    (ఇన్ని శాంతించినపుడే మానవాళికి శాంతి. ఏ ఒక్కదానికి అశాంతి ఏర్పడినను, మానవ జీవితము అల్లకల్లోలము అగును. వరదలు, తుఫానులు, భూకంపము వంటివి ఆయా దేవతల అశాంతికి చిహ్నములు)

    18. మహా వీర ఘటమా! నీవు నా దేహమును పటిష్ఠము చేయుము. సర్వభూతములు నన్ను మిత్ర దృష్టిచే చూడవలెను. నేను సహితము సర్వ భూతములను మిత్ర దృష్టిచే చూడవలెను. "మిత్రస్యచక్షుషా సమీక్షామహే" ఉభయులను పరస్పరము స్నేహ దృష్టి కలిగియుందుము గాత.

    19. మహావీర ఘటమా! నీవు నన్ను దృఢ పరుచుము. మేము నీ కృపాదృష్టియందే జీవింతుము. నీ  కృపాదృష్టియందే వర్ధిల్లుదుము.

    20. నమస్తే రసహరణశీల జ్యోతీ! నమస్తే జ్వాలామయీ!
   
    అగ్నీ! నీ జ్వాలలు శత్రువులను మాత్రమే తపింపచేయవలెను. పావకా! మా కొరకు మాత్రము నీవు కళ్యాణకారివి అగుము.

    21. మెరుపునకు నమస్సు. ఉరుమునకు నమస్సు. మాకు సుఖశాంతులు కలిగించదలచిన వారందరికి నమస్సు.

    22. ఎవరి వలన మాకు భయముండునని నీవు గ్రహింతువో వారి వలన మమ్ము నిర్భయులను చేయుము. శం నః కురు. మాకు సుఖములు కలిగించుము. ప్రజాభ్యో అభయం. మా సంతానమును నిర్భయులను చేయుము. మా పశువులకు భయము లేకుండ చేయుము.

    23. సుమిత్రియాన ఆప ఓషధయః సన్తు దుర్మిత్రియా
    స్తస్మైసన్తు య్కోన్మాన్ధ్వేష్టి యంచ వయం ద్విష్మః
    అర్థమునకు 35-12 చూడండి.

    24. తచ్ఛక్షుర్దేవహితం పురస్తాచ్ఛుక్రముచ్చరత్|
    పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం శ్రుణుయామ శరదః శతం. ప్రబ్రనామ శరదః శతం. మదీనా శ్యామ శరదః శతం భూయశ్చ శరదః శతాత్||

    దేవతలచే నియమించబడిన సర్వచక్షువగు సూర్యుడు తూర్పున ఉదయించుచున్నాడు.

    మేము నూరు శరత్తులు దర్శింతుము గాత. నూరు శరత్తులు జీవింతుము గాత. నూరు శరత్తులు వినుచుందుము గాత. నూరు శరత్తులు చక్కగా మాట్లాడుదుము గాత. నూరు శరత్తులు దీనులము కాకుందుము గాత. నూరేండ్లు దాటి మరింత జీవింతుము గాత.

    (నూరేళ్లు జీవించుటకు మాత్రము కాదు. అవయవములన్ని బాగుండి దైన్యము లేక జీవించవలెనని ఆశించుచున్నాడు. అట్టి జీవితము మరింత సాగునని)

       
                                   దాశరథి రంగాచార్య విరచిత
                    శ్రీమదాంధ్రవచన శుక్లయజుర్వేద సంహిత యందలి
                   శాంతిపాఠార్థమను ముప్పది ఆరవ అధ్యాయము సమాప్తము.
                                      "శాంతిః సామా శాన్తిరేధి"




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.