Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
3. గోవులు దేవతల జన్మస్థానమునకు -ఆదిత్యుల అందమైన చోటునకు పోగలవు. వాటి పాలతో నూతులు నిండును. అవి మూడు వనములందు ఇంద్రునకు సోమము మిశ్రమము చేయును.
4. ఇంద్రుడు గోవులకు స్వామి. యజ్ఞపుత్రుడు.సాధుజనుల పాలకుడు. యజ్ఞపు లక్ష్యమును ఎరిగినవాడు స్తుతిబంధనములతో ఇంద్రుని పూజించండి.
5. హర్యశ్వములు దీప్తయుక్తములై ఇంద్రుని కుశలమీద విడువవలెను, మేము కుశస్థిత ఇంద్రుని స్తుతించెదము.
6. ఇంద్రుడు - దగ్గర ఉన్న సోమమును - నలువైపులనుండి అందుకొని చూచినప్పుడు గోవులు సోమమున కలుపవలసిన పాడిపదార్థములను సమకూర్చును.
7. ఇంద్రుడు, నేను సూర్యుని స్థానమునకు చేరినాము. అప్పుడు మిత్రుడగు ఆదిత్యుని ఇరువది ఒక్క స్థానములందు మధుర సోమరసపానము చేసినాము. కలుసుకున్నాము.
(12మాసములు + 6రుతువులు + 3లోకములు = 21
8. అధ్వర్యులారా ! మీరు ఇంద్రుని పూజించండి. విశేషరూపమున పూజించండి. ప్రియమేధవంశస్థులారా ! పురభంజనుని పుత్రులు పూజించురీతి ఇంద్రుని పూజించండి.
9. రణభేరి భయంకరముగ నినదించుచున్నది. 'గోధ' వాద్యము మ్రోగుచున్నది. పింగళవర్ణపు వింటి నారి ధ్వనించుచున్నది. అందువలన ఇంద్రుని స్తుతించండి.
10. శుభ్రములు, సుందరప్రవాహనదులు ప్రవృద్ధములైనపుడు - అప్పుడు ఇంద్రుని పానమునకుగాను ప్రవృర్థ సోమము అందించండి.
11. ఇంద్రుడు సోమపానము చేసినాడు. అగ్నిసహితము సోమము సేవించినాడు. విశ్వదేవతలెల్లరు తృప్తులైనారు.
ఈ గృహమున వరుణుడు నివసించవలెను. తల్లి ఆవు తన బిడ్డకొరకు కేకవేసినట్లు ఉక్థలతో వరుణుని సేవింతుము.
12. వరుణా !నీవు మంచి దేవతవు - కిరణములు సూర్యుని ముందు పరుగులిడినట్లు నీ తాలువులందు గంగమున్నగు సప్తనదులు పరుగులిడును.
13. ఇంద్రుడు - వివిధగామి, రథసంయుక్త - అశ్వములను హవిర్ధాత యజమాని వైపు నడిపించును. ఇంద్రుడు యజ్ఞసందర్భమున అందరకునేత అగును.
14. ఇంద్రుడు యుద్ధనిరోధక శత్రువును లంఘించిసాగును. తనను ద్వేషించు సకల శత్రువులను దాటసాగును. కమనీయుడు, ఉత్కృష్ణుడగు ఇంద్రుడు మాటతోకొట్టి మేఘమును బ్రద్దలు చేయును.
15. చంటిబిడ్డ తండ్రివడిలో వలె - ఇంద్రుడు క్రొత్త రథమును అధిష్ఠించును. తల్లిదండ్రుల ముందు ఇంద్రుడు అటునిటు తిరుగు మహామృగము వంటివాడగును. బహుకర్మ ఇంద్రుడు మేఘమును వర్షింప చేయును.
16. ఇంద్రుడు సుందర హనువులవాడు. రథస్వామి. అతడు - స్వచ్ఛందగామి అతడు దీప్త, బహుపాద, హిరణ్మయ, నిష్పప, రథమును అథిరోహించవలెను. తదుపరి మనము ఇరువురము కలుసుకుందము.
17. ఈ విధముగా దీప్తుడు, విరాజమానుడగు ఇంద్రుని అనవంతులు సేవింతురు. తదుపరి స్తుతులు సాగును - హవ్యదానము కొరకు ఇంద్రుని చేరును. అట్టితరి సుస్థాపిత ధనము లభించును.
18. ప్రియమేధ గోత్రజులకు ఇంద్రాదుల ప్రాచీన స్థానములు ప్రాప్తించినవి. ప్రియమేధులు ప్రధాన ప్రదానమునకుగాను కుశలు పరచినారు. హవ్యములు అమర్చినారు.
(ఆంధ్రవచన ఋగ్వేదసంహిత ఆరవ అష్టకము ఏడవ మండలమున ఏడవ అనువాకము సమాప్తము)
ఎనిమిదవ అనువాకము ఏబదితొమ్మిదవ సూక్తము
ఋషి - అంగిరస పురుహన్ముడు దేవత - ఇంద్రుడు ఛందస్సు -
బృహతి 13, 14, 16 ఉష్టిక్
1. ఎవడు మనుష్యులకురాజగునో, ఎవడు రథముపై పయనించునో, ఎవని గమనమును బాధింపరాదో, ఎవడు సకల సేనల ఉద్ధారకుడో అట్టి జ్యేష్ఠుడు, వృత్రఘ్నుడగు ఇంద్రుని స్తుతిస్తాను.
2. పురుహన్మృషీ ! నీ రక్షణకుగాను ఇంద్రుని పూజింపుము. నిన్ను పాలించువాడు ఇంద్రుడు. అతని స్వభావము రెండు విధములది - ఉగ్రము, అనుగ్రము. ఇంద్రుడు తన చేత దర్శనీయ వజ్రము ధరించును. ఆ వజ్రము ఆకాశమున వెలుగు సూర్యసమానము.
3. ఇంద్రుడు సర్వదా వృద్ధిశీలుడు. అందరకు స్తుతియోగ్యుడు. మహామహుడు. ఇతరులను పరిభవించువాడు. అట్టి ఇంద్రుని యజ్ఞముద్వారా అనుకూలము చేసికొన్నవ్యక్తియే కర్మలతో ప్రఖ్యాతుడగును. అన్యుడు కాలేడు.
4. అన్యులకు అసహనీయుడు, ఉగ్రుడు, శత్రుసేనల విజేత ఇంద్రుని నేను స్తుతిస్తాను. ఇంద్రుడు జన్మించినంత - విశాలములు, అత్యంత వేగవంతములగు గోవులు అతనిని స్తుతించినవి. ద్యులోకము స్తుతించినది పృథ్వి స్తుతించినది.
5. ఇంద్రా! వంద ద్యులోకములు ఒక్కటైనను నీకు సరితూగవు. వంద భూలోకములయనను నీకు సరిరావు. వంద మంది సూర్యులైనను నిన్ను ప్రకాశింపచేయజాలరు. ఈ లోకమునందలి సృష్టిసాంతము, ద్యావాపృథ్వులు నీకు హద్దులు కాలేవు.
6. ఇంద్రుడు అభీష్టవరదుడు. అతిబలశాలి ధనికుడు వజ్ర, ఇంద్రా! నీవు నీ మహాజలమును సర్వత్ర వ్యాపింప చేసినావు. మాగోవుల నిమిత్తము మమ్ము వివిధరక్షణలతో కాపాడుము.
7. శ్వేతవర్ణ అశ్వద్వయమున రథమునకు కట్టిన వాని కొరకే ఇంద్రుడు హర్యశ్వములను రథమున పూన్చును. దేవశూన్యునకు పూర్తి అన్నము లభించదు.
8. ఋత్విక్కులారా ! మీరు గొప్పవారు. దానము కొరకని పూజ్య ఇంద్రుని - అందరు కలసి - పూజించండి. జలప్రాప్తికి ఇంద్రుని ఆహ్వానించ వలెను. నిన్ను స్థల ప్రాప్తికి సహితము ఇంద్రుని ఆహ్వానించ వలెను. నిన్ను స్థల ప్రాప్తికి సహితము ఇంద్రుని ఆహ్వానించ వలెను. యుద్దమునందును ఇంద్రుని ఆహ్వానించ వలెను.
9. వాసదాత, శూర ఇంద్రా ! నీవు మాకు మహాధనము లభించునట్లు జాగృతులను చేయుము. శూర, ధనిక ఇంద్రా! మహాధనము, మహత్తర కీర్తి కలిగించుటకు ఉద్యమించుము.
10. ఇంద్రా ! నీవు యజ్ఞాభిలాషివి. నిన్ను నిందించు వాని ధనమును అపహరించి, ప్రసన్నుడవగుదువు. రక్షించుటకుగాను మమ్ము తొడల మధ్యదాచుకొనుము. శత్రువులను వధించుము. అస్త్రములతో దస్యులను హతమార్చుము.
11. ఇంద్రా ! పర్వతములు నీకు మిత్రులు. అవి - అన్య రూపధారులను. అమానుషులను, యజ్ఞశూన్యులను, దేవ ద్వేషులను స్వర్గమునుంచి క్రిందకు త్రోయును. అవి దస్యులను మృత్యువు చేతికి పట్టించును.
12.ఓ ఇంద్రా ! మాకు ఇచ్చుటకు లాజలతో సమానములగు గోవులను అందుకొనుము. నీవు మమ్ము అభిలషింతువు. మరింత అభిలషించుము. మరింతగ్రహించుము.
13. మిత్రులారా ! ఇంద్ర సంబంధ కార్యములను తలపెట్టండి. శత్రుహింసక ఇంద్రుని మేమెట్టు స్తుతించగలము? ఇంద్రుడు ప్రేరకుడు. శత్రుభక్షకుడు. అతడు ఎన్నటికి తలవంచడు.
14. అందరకు పూజనీయుడవగు ఇంద్రా! అనేకమంది ఋషులు, హవ్యదాతలు నిన్ను స్తుతింతురు. నీవు ఒక్కక్కరికి, ఒక్కొక్కరీతిగా, స్తోతలకు దూడలుగల అనేక ఆవులను ఇస్తావు.
15. ఆ ఇంద్రుడు హింసకయుద్ధమున గెలచిన ఆవులను, దూడలను చెవులు పట్టుకొని, నీరు త్రాపుటకు గొర్రెల కాపరి గొర్రెలనువలె - మా వద్దకు తేవలెను.
అరువదవ సూక్తము
ఋషి - సుదీతి పురుమీహుడు దేవత - అగ్ని ఛందస్సు -
1-9 గాయత్రి 10-16 బృహతి
1. దానశూన్యులనుండి లభించిన మహాధనమున మమ్ము పాలింపుము. శత్రువు బారినుండి రక్షింపుము.
2. ప్రియజన్మ అగ్నీ ! పురుష సంబంధ క్రోధము నిన్ను బాధింపజాలదు నీవు రేయవాడవు కదా ! (దివాచరాఃఖలు పురుషాః అతోదివా తన హానిర్నా స్తీతిభావః మానవులు దివాచరులు. అగ్ని రాత్రించరుడు - రేయిలో మరింతవెలుగువాడు. కావున మానవులు అగ్నికి హాని కలిగించజాలరని తాత్పర్యము.)
3. అగ్నీ! నీవు బలపుత్రుడవు ప్రశస్త తేజోవంతుడవు. సకల దేవతలతో కలసి అందరికి వరణీయధనము ప్రసాదించుము.
4.అగ్నీ ! నీవు పాలించునట్టి హవిర్దాతను - దాతలు కానవారలును, ధనికులును వేరు చేయజాలరు.
5. అగ్నీ !నీవు విప్రుడవు. ధనలాభమునకుగాను. నీవు యజ్ఞప్రేరణ కలిగించిన వ్యక్తి నీ రక్షణలవలన గోవులు గలవాడగును.
6. అగ్నీ! నీవు హవ్యదాత వ్యక్తి కొరకు బహువీగ్య యుక్తధనమును ప్రసాదించుము. మమ్ము వాసయోగ్యధనము ముందుకు పంపుము.
7. జాతధన అగ్నీ! మమ్ము రక్షింపుము. అనిష్టము కోరువారు. హింసాప్రవృత్తిగల మానవులకు మమ్ము వప్పగించకుము.
8. అగ్నీ! నీవు ద్యుతుమంతుడువు. దేవశూన్య వ్యక్తులెవ్వరును నిన్ను ధనదానము నుండి నిలుపజాలరు.
9.బలపత్ర, మిత్ర, నివాసప్రద అగ్నీ! మేము నీ స్తోతలము. నీవు మాకు మహాధనమును ప్రసాదించుము.
10. మాస్తుతులు - దహించు జ్వాలలు కలవాడును - దర్శనీయుడగు -అగ్నిని చేరవలెను. సకల యజ్ఞములు హవిద్యుక్తములై, విశేషధనవంతుడు, అనేకులు స్తుతించు అగ్నివైపు మరల వలెను.
11. అగ్ని బలపుత్రుడు జాతధని వరణేయుడు సమస్త స్తుతులు అగ్నివైపు సాగవలెను. అగ్ని అమరుడు. మానవులందు ఉండువాడు అగ్ని - మానవులకు హోమసంపాదకుడు, జాలాకారకుడు - ఉభయప్రకారముల వాడగును.
12. యజమానులారా !మీ దేవయజ్ఞము కొరకు అగ్నిని నేనుస్తుతిస్తాను. యజ్ఞప్రారంభామున అగ్నిని స్తుతిస్తాను. కర్మకాలమున అగ్నిని ప్రథముగా స్తుతిస్తాను. బంధుత్వము కలిగినపుడు అగ్నిని స్తుతిస్తాను. క్షేత్ర ప్రాప్తి కలిగినంత అగ్నిని స్తుతిస్తాను.
13. మేము అగ్నికి మిత్రులము. అగ్ని స్వీకరణీయ ధనములకు ప్రభువు. అగ్ని మాకు అన్నము ప్రసాదించ వలెను. నివాసదాత, అంగపాలక అగ్నిని - మా పుత్ర, హోత్రులకు విశేష ధనము నిమ్మని ప్రార్థించుచున్నాము.
14. పురుమీహ్లా ! రక్షణ కొరకు మంత్రములతో అగ్నిని స్తుతించుము. అగ్ని జ్వాలలు దాహకములు. ధనము కొరకు అగ్నిని స్తుతించుము. ఇతర యజమానులుకూడ అగ్నిని స్తుతింతురు. "సందీతి" కొరకు గృహము యాచించుము.
(ఇవి సుదీతి పురుమీహ్లునితో అన్నమాటలు)
15. శత్రువులను వేరు చేయుముని మేము అగ్నిని స్తుతిస్తాము. సుఖము, అభయము కొరకు అగ్నిని స్తుతిస్తాము. అగ్ని సకల ప్రజావళికి రాజువంటివాడు. అతడు ఋషులకు వాసదాతయు, ఆహ్వానయోగ్యుడగును.
అరువది ఒకటవసూక్తము
ఋషి - ప్రాగథపుత్ర హర్యతుడు దేవత - అగ్ని ఛందస్సు - గాయత్రి
1. అధ్వద్యులారా ! త్వరగా హవ్యము సమర్పించండి. అగ్ని విచ్చేసినాడు. అధ్వద్యులు మరల యజ్ఞమును సేవింతురు. వారికి హవ్యము అర్పించుట తెలియును.
2. అగ్నితో యజమానికి స్నేహమున్నది. అతడు - సంస్థాపాకహోత, వంకరజ్వాలల అగ్ని వద్ద కూర్చుంటాడు.
3. యజమాని మనోరధ సిద్ధికొరకు - అతడు తన ప్రజ్ఞా బలమున రుద్రాగనిని తనముందు స్థాపించుకొన దలచును. అతడు స్తుతులతో అగ్నిని గ్రహించును.
4. అన్నదాత అగ్ని ధనుస్సుతో అంతరిక్షమును తపింప చేయును. అరణ్యములను కాల్చును. ఉదకమును దాహించును. పాషాణములను పేల్చుము. మేఘమును వధించును.
5. అగ్ని దూడవలె చపలుడు. శ్వేతవర్ణుడు. అగ్నిని జగములందు నిరోధించువారులేరు. అగ్ని స్తోతలను కోరును.
6. ఈ అగ్ని మహిమలు కలవాడు. అశ్వసంపన్నుడు ప్రకాండ యోజనపరుడు. అగ్ని రధపు రజ్ఞువగును.
(అంతరిక్షరథమును అదుపులో ఉంచునని అర్థము)
7. ధ్వనించు సింధునదీ తీరమున ఏడుగురు ఋత్విక్కులు జలసేకరణ చేయుచున్నారు. వీరిలో ఇద్దరు పరస్తాత అధ్వద్యులు, పోగ మిగతా అయిదుగురిని ఆదేశించుచున్నారు.
(అయదుగురు 1. యజమాని 2. బ్రహ్మ 3. హోత 4. అగ్నీధ్ర 5.స్తోతలు)
8. సేవకుడగుయజమాని దోసిల్లొగ్గి ఇంద్రుని యాచించినాడు. అప్పుడు ఇంద్రుడు ఆకాశమందలి మేఘముచే - మూడు ప్రకారముల కిరణమూలమున - వర్షము కురిపించినాడు.





