Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    7. ఇంద్రుడు అహిని హతమార్చినాడు. అది అతని సాహసము. ఇంద్రుని సాహస కార్యమును సదా కీర్తించవలెను. ఇంద్రుడు నలువైపుల నిలిచిన అవరోధక జనులను వజ్రమున నష్టపరచినాడు. గమనాభిలాషి జలములను తెచ్చినాడు.

    8. స్తోతా ! నీ స్తుతివాక్య వచనాభిలాషను విస్మరించకుము. రానున్న యజ్ఞదినములలో మంత్రములు రచింపుము. మమ్ము సేవింపుము. మేము ఉభయ నదులము. నీకు నమస్కరించుచున్నాము. పురుషునివలె వాదప్రతివాదములు చేయకుము. ప్రగల్భములు పలుకకుము.

    9. భగినీ భూతమగు నదీద్వయమా ! నేను విశ్వామిత్రుడను, స్తుతించుచున్నాను. ఆలకించండి. నేను దూరదేశము నుండి రథము అశ్వములతో వచ్చెదను. నేను దాటగలుగునట్లు మీరు తగ్గుడు.

    నదీద్వయమా ! స్తోత్రవంతమగు జలముతో రథచక్రముల క్రింది నుండి సాగండి.

    10. స్తోతా ! మేము ఉభయ నదులము మీ మాటలు విన్నాము. నీవు దూరము నుండి వచ్చినావు. కావున రథశకటములతో సాగుము. పుత్రునకు చనుబాలిచ్చుటకు తల్లి-పురుషుని కౌగిలించుకొనుటకు యువతి అవనతులయినట్లు మేము నీ కొఱకు అవనతులము అగుదుము.

    (నదులు తల్లివలెను ప్రియురాలివలెను పలుకుచున్నవి.)

    11. నదీద్వయమా ! మేము భరత కులజాతులము. మిమ్ము దాటగలము. మమ్ము ఇంద్రుడు ప్రేరేపించినాడు. మీరు అనుమతించినారు. అందువలన నేను విశ్వామిత్రుడను సర్వత్ర మిమ్ము స్తుతింతును. మీరు యజ్ఞార్హులు అగుదురు.

    12. గోధనాభిలాషులగు భరతవంశీయులు నదులను దాటినారు. కవులు నదులను సుందరముగ వర్ణింతురు. స్తుతింతురు. మీరు నదులు అన్నకారిణులు. ధనసమన్వితలు. చిన్నచిన్న నదులను తృప్తిచెందించుడు, వానిని పూరించుడు. వేగవతులయి సాగిపొండు.

    13. నదీద్వయమా ! మీ తరంగ ప్రవాహము కీలద్వయము క్రిందినుంచి పారవలెను. రజ్జువులను తాకకుండ ప్రవహించవలెను. పాపశూన్యలు, కళ్యాణకారిణులు, ఆనంద ప్రదాయినులగు విపాశా, శుతుద్రి నదులారా ! మీరు ఇప్పుడు పొంగవద్దు.

    ఆలోచనామృతము

    1. ప్రకృతి కవిని స్పందింప చేయును. పరవశింప చేయును.

    పొంగిన నదిని చూచి గుండె పొంగని కవి ఉండడు. పూసి-పారు నదిని మించిన అందము అరుదు. అది గుండెలను గంతులు వేయించును.

    విశ్వామిత్రుని గుండె గంతులు వేసినది. అందుకే ఈ సూత్ర మంత్రగానము.

    విశ్వామిత్ర నదుల సంభాషణ సుందరము. రమణీయము. అనుభవైక వేద్యము.

    ఇది నది దాటుటకు సంబంధించిన వృత్తాంతము. నదిని దాటుటకు అటునిటు మేకులు పాతి తాటితో వంతెన నిర్మింతును. ఆ త్రాటిని తాకకుండునట్లును కీలద్వయము కిందినుంచి నదులు ప్రవహించవలెనని ప్రార్థన.

                            ముప్పది నాలుగవ సూక్తము

        ఋషి - విశ్వామిత్రుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రుడు పురభేది. మహిమాన్వితుడు. ధనశాలి. అతడు శత్రువును బాదినాడు. తేజస్సు పెంచుకున్నాడు. దస్యులను ఓడించినాడు. స్తోత్రములద్వారా ఆకృష్టుడు, వర్ధిత శరీరుడు, బహు అస్త్రధారి అగు ఇంద్రుడు ద్యావాపృథ్వులను పరిపూర్ణులను చేసినాడు.

    2. ఇంద్రా ! నీవు పూజనీయుడవు. బలవంతుడవు. నిన్ను అలంకరించినాము. అన్నము కొఱకుగాను, నీ ప్రేరణగల స్తుతులను ఉచ్చరించుచున్నాము. నీవు మానవులకు దేవతలకు అగ్రగామివి.

    3. ఇంద్రా ! నీ కార్యములు ప్రసిద్ధములు. నీవు వృత్రుని నిలువరించినావు. నీవు శత్రు నివారకుడవు. విశేష రూపమున మాయావులను వధించినావు. నీవు శత్రువధాభిలాషివి. అడవులందు దాగిన స్కంధహినీ శత్రువులను వధించినావు. అతడు రాత్రులు దాటగా గోవులను ఆవిష్కరించినాడు.

    (రాత్రీణామసురా క్రాంతత్వే అని శాయణుడు. రాత్రులు అసురులు ఆక్రమించినవి అగుటవలన రాత్రిదాటగా గోవులను ఆవిష్కరించినాడు)

    4. ఇంద్రుడు స్వర్గదాత. అతడు దినమును సృష్టించినాడు. యుద్ధాభిలాషులగు అంగిరులతో కలిసినాడు. పరకీయ సేనను పరాస్తము చేసినాడు. మానవుల కొఱకు పగటికి పతాకప్రాయమగు సూర్యుని ప్రదీప్తుని చేసినాడు. మహా యుద్ధమునకు జ్యోతిని ప్రకటించినాడు. "కేతుమహ్నామవిన్దజ్జ్యోతిర్బృహతేరణాయ"

    5. ఇంద్రుడు బహుధన గ్రహణము చేసినాడు. బాధాకర వర్ధమాన శత్రుసేన మధ్యమున ఆసీనుడు అయినాడు. ఇంద్రుడు స్తోతల కొఱకుగాను ఉషను చైతన్యవంతము చేసినాడు. శుక్రవర్ణ తేజమును వర్థిల్ల చేసినాడు.

    6. ఇంద్రుడు మహామహుడు. ఉపాసకులు అతని సత్కార్యములను ప్రశంసింతురు. ఇంద్రుడు స్వబలమున బలాధికులను పిండికొట్టినాడు. పరాభవ కర్త జయాసంపన్నుడు తనమాయతో అసురులను చూర్ణము చేసినాడు.

    7. ఇంద్రుడు దేవతలకు భర్త, మానవులకు ధనప్రదాత. అతడు మహాయుద్ధమున ఎంతో ధనము సాధించినాడు. దానిని స్తోతలకు దానము చేసినాడు. మేదావులగు స్తోతలు యజమాని గృహమున మంత్రముల ద్వారా ఇంద్రుని కీర్తిని ప్రశంసింతురు.

    8. ఇంద్రుడు సర్వజిత్తు. వరణీయుడు. జలప్రదుడు. స్వర్గము, స్వర్గ జలములకు స్వామి, స్తోతలు ఇంద్రుని ఆనందమునే భావించెదరు. ఇంద్రుడు పృథ్విని, అంతరిక్షమును, స్వర్గమును దానము చేసినాడు.

    9. ఇంద్రుడు అశ్వములను దానము చేసినాడు. సూర్యుని దానము చేసినాడు. అనేక జనులకు అనుభవయోగ్యములగు గోధనమును దానము చేసినాడు. సువర్ణమయ ధనమును దానము చేసినాడు. దస్యులను వధించినాడు. ఆర్య వర్ణులను రక్షించినాడు.

    "దస్యూన్పారర్యార్య వర్ణమావత్"

    ("ఆర్యముత్తమం వర్ణాత్రైవర్ణికం ప్రావత్") అని శాయణుడు త్రివర్ణులు బ్రాహ్మణ, క్షత్రియ వైశ్యులు కావచ్చును. స్పష్టము చేయలేదు.

    10. ఇంద్రుడు ఓషధులను దానము చేసినాడు. దినములను ప్రసాదించినాడు. వనస్పతులను, అంతరిక్షమును ప్రదానము చేసినాడు. అతడు మేఘములను భిన్నము చేసినాడు. విరోధులను వధించినాడు. యుద్ధము చేయుటకు ముందుకు వచ్చిన వారిని హతమార్చినాడు.

    11. ఇంద్రా ! నీవు అన్న సంపాదకుడవు. యుద్ధమందు ఉత్సాహమున ప్రవర్ధకుడవు. ప్రభూత ఐశ్వర్యవంతుడవు. శత్రునాశకుడవు. ధన విజేతవు. ఆశ్రయప్రాప్తికొరకు మేము నిన్ను ఆహ్వానించుచున్నాము.

                        ముప్పది అయిదవ సూక్తము

         ఋషి - విశ్వామిత్రుడు, దేవత-ఇంద్రుడు, ఛందస్సు-త్రిష్టుప్.

    1. హరినామకములగు రెండు అశ్వములు రథమున పూన్చబడును. వాయువులు నియుతనామకములగు తమ అశ్వములకై వేచియుందురు. అట్లే ఇంద్రా ! నీవును నీ అశ్వములు కొఱకు క్షణము నిరీక్షించి మా వద్దకు విచ్చేయుము. మేము స్వాహా శబ్దము ఉచ్చరించి నీ ఆనందము కొఱకు సోమము సమర్పింతుము. నీవు సోమపానము చేయుము.

    2. ఇంద్రుడు అనేక లోకముల ఆహుతుడు. అతడు త్వరగా సాగవలెను. అందుకు ద్రుతగాములగు అశ్వద్వయమును రథమునకు కట్టెదము. విథిపూర్వకముగ అనుష్టించబడు ఈ యజ్ఞమునకు అశ్వద్వయముఇంద్రుని తీసికొని రావలయును.

    3. ఇంద్రా ! నీవు అన్నవంతుడవు. అభీష్టవరదుడవు. వీర్యవంతములు, శత్రుభయకారకులగు నీ అశ్వద్వయమును మా వద్దకు తెమ్ము. నీవు ఈ యజమానిని రక్షింపుము. రక్తవర్ణ హర్యశ్వములను ఈ దేవయజనమున యేయుటకు విడువము, నీవు సమాన రూపములు కలిగి ఉపయుక్తములను యవధాన్యమును భక్షింపుము.

    4. ఇంద్రా ! నీ అశ్వద్వయము మంత్రమువలన రథమునకు పూనును. అవి యుద్ధమున సమాన ప్రతిష్ఠ కలవి. వానిని రథమునకు మొదలు మేము మంత్రముల ద్వారా కట్టుదుము. ఇంద్రా నీవు విద్వాంసుడవు. నీవు గుర్తింపుము. సుదృఢము, సుఖప్రదమగు రథమును ఆరోహింపుము. సోమము వద్దకు విచ్చేయుము.

    5. ఇంద్రా ! వీర్యవంతములు, కమనీయ పృష్టవంతములగు నీ అశ్వద్వయమును ఇతర యజమానులు సంతోష పరచెదరు. మేము అభిషుత సోమమున నిన్ను తృప్తినొందింతుము. నీవు అనేక యజమానులను అతిక్రమించి త్వరగా విచ్చేయుము.

    6. ఇంద్రా ! ఈ సోమము నీది. దీని ముందుకు రమ్ము. ప్రసన్నవదనమున ప్రభూత సోమమును సేవింపుము. ఈ యజ్ఞమున కుశలమీద ఆసీనుడవగుము. సోమమును జఠరమున ఉంచుము.

    7. ఇంద్రా నీది కుశాసనము. నీ కొఱకు దర్భలు పరచినాము. సోమము అభిషుతమై ఉన్నది. నీ అశ్వద్యయమునకు ధాన్యము సిద్ధముగా ఉన్నది. అనేకులు నిన్ను స్తుతింతురు. నీవు అభీష్టవర్షివి. నీవద్ద మరుత్తుల సేన ఉన్నది. నీ కొఱకు హవ్యము పుష్కలముగా ఉన్నది.

    8. ఇంద్రా ! అథ్వర్యుడు నీ కొఱకు ప్రస్తదము, జలమున ఈ సోమ దుగ్ధమును మధురస నిష్యందము చేసినారు. దర్శనీయుడవు, విద్వాంసుడవగు ఇంద్రా ! ప్రసన్నవదనుడవగుము. నీహితకర స్తుతిని వినుము. సోమపానము చేయుము.

    9. ఇంద్రా ! సోమపాన సమయమున నీవు మరుత్తులను సమ్మానింతువు. మరుత్తులు యుద్ధమున నీకు సహాయకులు అగుదురు. నిన్ను వర్థిల్ల చేయుదురు. ఆ మరుత్తులందరిని కూడి సోమపానాభిలాషివయి విచ్చేయుము. అగ్ని జిహ్వలద్వారా సోమపానము చేయుము.

    10. యజనీయ ఇంద్రా ! అగ్ని జిహ్వ ద్వారా అభిషుత సోమపానము చేయుము. అధ్వర్యు చేతితో సమర్పించిన సోమమును లేదా హోత అర్పించిన హవ్యమును సేవించుము.

    11. ఇంద్రా ! నీవు అన్న సంపాదకుడవు. యుద్ధమునందు ఉత్సాహమున ప్రవృద్దుడవు అగుదువు. నీవు ధనవంతుడవు. ప్రభూత ఐశ్వర్యవంతుడవు. నేతృశ్రేష్ఠుడవు. స్తుతిశ్రోతవు. సంగ్రామమున శత్రుహంతవు. ధన విజేతవు. ఆశ్రయప్రాప్తి కొఱకు మేము నిన్ను ఆహ్వానించుచున్నాము.

                              ముప్పది ఆరవ సూక్తము

  ఋషి-10 ఘోరర్షి, మిగిలినవి విశ్వామిత్రుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రా ! ధనదానమునకుగాను మరుత్తులతో కలిసి విచ్చేయుము. విశేషరూపమున అందించిన సోమమును గ్రహించుము. ఇంద్రుడు ఘనకార్యముల కారణముగా ప్రసిద్ధుడు. అతడు విశేష సోమాభిషవమున పుష్టికర హవ్యముద్వారా ప్రవర్ధమానుడు అగును.

    2. పూర్వము ఇంద్రునకు సమర్పించిన సోమము వలన అతడు కళాత్మకుడు, దీప్తిమంతుడు, ఘనుడు అయినాడు. ఇంద్రా ! మేము అందించిన సోమమును స్వీకరింపుము. స్వర్గాదులు ప్రసాదించు ఇంద్రా ! ప్రస్తరాభిషుత సోమమును పానము చేయుము.

    3. ఇంద్రా ! నీవు స్తుతియోగ్యుడవు. నీ కొఱకు ప్రాచీన, నవీన సోమములు అభిషవింపబడి ఉన్నవి. పానము చేయుము. పరిపుష్టుడవు అగుము. నీవు స్తుతి యోగ్యుడవు. నీవు ప్రాచీన సోమమును పానము చేసినట్లే ప్రస్తుతము నూతన సోమమును పానము చేయుము.

    4. ఇంద్రుడు అత్యంత శక్తిశాలి. సమర భూమియందు శత్రువుల విజేత. శత్రువుల ఆహ్వానకర్త. అట్టి ఇంద్రుని ఉగ్రబలము, దుర్ధర్ష తేజము సర్వత్ర విస్తరించుచున్నది. హర్యశ్వము ఇంద్రుని సోమరసమున హృష్టుని చేసినపుడు పృథ్వి, స్వర్గములు సహితము అతనిని భరింపజాలవు.

    5. ఇంద్రుడు బలవంతుడు. అభీష్టవర్షి. దాత. అతడు వీరికీర్తి కొఱకు ప్రవృద్ధుడు అయినాడు. అతడు స్తోత్రముతో కలిసి ఉన్నాడు. ఇంద్రుని గోవులన్నియు దుగ్ధవతులయి జన్మించినవి. ఇంద్రుని దానము గొప్పది. "దక్షిణా అస్యపూర్వీః"

    6. నదులు ప్రవాహము అనుసరించి దూరతీరాన ఉన్న సముద్రమువైపు పరుగులిడును. అవి రథములవలె సాగును. అట్లే వరణీయుడగు ఇంద్రుడు అంతరిక్షమునుండి అభిషుత సోమము కొఱకు పరిగెత్తి వచ్చును.

    7. సాగరసంగమాభిలాషులగు నదులు సముద్రమును నింపును. అట్లే అధ్వర్యుజనులు ఇంద్రుని కొఱకు అభిషుత సోమ సమార్జన చేయుదురు. చేతితో తీవను పిండుదురు. ప్రస్తరము ద్వారా ధారారూప మధుర సోమమును శోధింతురు.

    8. ఇంద్రుని ఉదరము తటాకము వంటిది. అదే సోమమునకు ఆధార భూమి. అతడు ఒకేసారి అనేక యజ్ఞములకు వ్యాపించగలడు. ఇంద్రుడు తొలుత ఆరగించదగిన సోమాదులను ఆరగించినాడు. తదుపరి వృత్రుని వధించినాడు. దేవతలకు భాగములు కల్పించినాడు.

    9. ఇంద్రా ! త్వరగా ధనమును ప్రసాదించుము. ఈ నీ ధనమును ఎవడు అడ్డగలడు? నీవు ధనాధిపతివని మాకు తెలియును. నీవద్ద ఉన్న పూజనీయ ధనమును మాకు ప్రసాదించుము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.